గ్రామపంచాయతీల్లో పౌరసేవలు అందించేందుకు ఈ-పంచాయతీ వ్యవస్థను అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ప్రారంభించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. ఈ-పంచాయతీల ద్వారా గ్రామీణ ప్రజలకు ఈ-గవర్నెన్స్ ప్రతిఫలాలు అందుతాయన్నారు.
శుక్రవారం సచివాలయంలో పంచాయతీరాజ్, ఐటీ శాఖల ఉన్నతాధికారులతో ఈ-పంచాయతీల ఏర్పాటుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ పంచాయతీల ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయని అధికారులు వెల్లడించారు. మొదటి దశలో జనన,మరణ ధ్రువపత్రాల అందజేత వంటి పలు ప్రాథమిక పౌరసేవలను అందించనున్నామని మంత్రి తెలిపారు. వీటితోపాటు జాతీయ ఉపాధి హామీ పథకం, ఆసరా పింఛన్ల నగదు పంపిణీ వంటి సేవలను అందిస్తామన్నారు. ఇప్పటికే పలు బ్యాంకులతో చర్చిస్తున్నామని, బ్యాంకుల తరఫున బిజినెస్ కరస్పాండెంట్ల ఏర్పాటును సైతం ఈ-పంచాయతీల ద్వారా చేస్తూ బ్యాంకింగ్ సేవలను అందించాలనుకుంటున్నామని మంత్రి కేటీఆర్ వివరించారు. ఈ-పంచాయతీలకు ఇంటర్నెట్ బ్రాడ్‌బ్యాండ్, వీశాట్ వంటి సౌకర్యాల ఆధారంగా ఈ పంచాయతీలను నిర్వహించనున్నట్లు చెప్పారు.

పంచాయతీల నిర్వహణను విలేజ్ లెవల్ ఎంట్రపెన్యూర్స్(వీఎల్ఈ) ద్వారా నిర్వహిస్తామని, దీనికి సంబంధించి పలు గ్రామాల్లో డిగ్రీ అర్హత కలిగిన యువతులను ఎంపికచేసి వారి శిక్షణ పూర్తి చేశామని మంత్రి వెల్లడించారు. విలేజ్ లెవల్ ఎంట్రాపెన్యూర్స్ గా కేవలం మహిళలకే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాబోయే కొన్ని నెలల్లో అన్ని గ్రామాల్లో ఈ -పంచాయతీల ఏర్పాటును పూర్తి చేస్తామన్నారు. ఈ-పంచాయతీలకు సంబంధించిన సాప్ట్వేర్ టెస్టింగ్ పూర్తయినట్లు మంత్రి పేర్కొన్నారు. ఇందుకోసం ఐటీశాఖ ద్వారా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి శిక్షణ పూర్తి చేయాలని ఐటీ శాఖ అధికారులను ఆదేశించారు. ఇంటింటా ఇంటర్నెట్ ఇవ్వాలన్న ప్రభుత్వ సంకల్పం ప్రకారం.. వాటర్ గ్రిడ్ పనులతోపాటు ఫైబర్ కేబుల్ వేయాలని, ఇందుకోసం సాధ్యమైనంత త్వరగా పూర్తిస్థాయి డిజైన్‌తోపాటు అన్ని పనులూ పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, కమిషనర్ అనితా రాంచంద్రన్, సెర్ప్ సీఈవో ఏ మురళి, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.