Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఈటలది అధికార దుర్వినియోగం

రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతరావు

మాజీ మంత్రి ఈటల రాజేందర్‌ అసైన్డ్‌ భూములను తెలిసీ కొనడం ముమ్మాటికీ తప్పేనని రాజ్యసభ సభ్యుడు కెప్టెన్‌ లక్ష్మీకాంతారావు అన్నారు. బుధవారం కరీంనగర్‌ జిల్లా హుజూరాబాద్‌ మండలంలోని సింగాపూర్‌ గెస్ట్‌హౌస్‌లో లక్ష్మీకాంతారావు మీడియాతో మాట్లాడారు. పదవులు అడ్డుపెట్టుకొని ఈటల అధికార దుర్వినియోగం చేయడం సమంజసమేనా అని ప్రశ్నించారు. అసైన్డ్‌ భూములను కొనడమే కాకుండా.. ప్రభుత్వం కొనడం లేదా? అని ప్రశ్నించడం ఆయనకే చెల్లిందని మండిపడ్డారు. 66 ఎకరాల అసైన్డ్‌ భూమిని ఒక మంత్రిగా కొనుగోలు చేయడంలో ఆంతర్యమేమిటన్నారు. ఈ విషయంపై బాధితులు కేసీఆర్‌కు ఫిర్యాదు చేస్తే స్పందించడం తప్పెలా అవుతుందని నిలదీశారు.

కమలాపూర్‌ పునర్విభజనలో హుజూరాబాద్‌గా ఏర్పడగా ఈటల కోసం తాను హుస్నాబాద్‌కు వెళ్లానని గుర్తుచేశారు. ఉద్యమం మొదటి రోజుల్లో ఈటల కృషి ఏమీ లేదని, అప్పటికే ఉవ్వెత్తున లేస్తున్న ఉద్యమంలో కమలాపూర్‌లో పోటీ చేసి గెలుపొందాడని చెప్పారు. బీసీ వర్గాల నేతగా ఈటలకు సీఎం కేసీఆర్‌ ఫ్లోర్‌లీడర్‌, ఆర్థిక, పౌర సరఫరాలు, వైద్యారోగ్య శాఖ వంటి పదవులను ఇస్తే.. సీఎం పైనే అసంతృప్తి వెళ్లగక్కడం సరైన పద్ధతికాదని హితవు పలికారు. దేశంలోనే ఎక్కడా లేనివిధంగా బడుగు బలహీన వర్గాల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుండగా, వాటిని బహిరంగంగానే విమర్శించడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. తన రాజకీయ భవిష్యత్తు కోసం నియోజకవర్గంలో ఉద్యమ నాయకులను ఎవరినీ ఈటల ఎదగనీయలేదని ఆరోపించారు.

పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించి హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపాలిటీల్లో చైర్మన్లపై ఈటల అవిశ్వాస తీర్మానాలను ప్రోత్సహించారని లక్ష్మీకాంతరావు విమర్శించారు. పార్టీలో ఉన్నవారిని అణగదొక్కడమే కాకుండా, బయటివారిని ప్రోత్సహించారని మండిపడ్డారు. ఏదైనా కార్యక్రమం జరిగినప్పుడు పార్టీలో, ప్రభుత్వంలో ఉన్నత స్థానాల్లో ఉన్నవారి ఫొటోలు ఫ్లెక్సీల్లో పెట్టవద్దని హెచ్చరించేవారని దుయ్యబట్టారు. హుజూరాబాద్‌లో క్లబ్‌ స్థలాన్ని ఆక్రమించేందుకు ఈటల ప్రయత్నించారని కెప్టెన్‌ ఆరోపించారు. మొదటి నుంచీ ఈటలకు సీఎం కేసీఆర్‌ అధిక ప్రాధాన్యం ఇస్తే, ఆయన మాత్రం పార్టీని చీల్చేందుకు కుట్రపన్నారని మండిపడ్డారు.

ప్రభుత్వంలోని మంత్రులు, ఎంపీలు అసంతృప్తితో ఉన్నారని ప్రచారం చేయడం దారుణమని, అందులో ఎంత మాత్రం వాస్తవం లేదని అన్నారు. హుస్నాబాద్‌ రెవెన్యూ డివిజన్‌గా ఏర్పడితే దానిని గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేయించి, హుజూరాబాద్‌ను డివిజన్‌గా చేయడం రాజకీయ కుట్ర కాదా అని ప్రశ్నించారు. ఎంపీపీగా సరోజినీదేవిపై అవిశ్వాసం పెడితే దానిపై ఎందుకు ఏమీ మాట్లాడలేదని నిలదీశారు. రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులకు తన రాజకీయ స్వలాభాపేక్ష కోసం ఈటల అణగదొక్కారని ధ్వజమెత్తారు. హుజూరాబాద్‌, జమ్మికుంట మున్సిపల్‌కు గతంలో, మొన్న జరిగిన ఎన్నికల్లో తన స్వార్థం కోసం ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్లకు పదవులను కట్టబెట్టారన్నారు. ఈటల మంత్రి పదవులు వచ్చిన తర్వాత ప్రజల కోసం కాకుండా తన అధికారాన్ని కాపాడుకోవడం కోసం పాకులాడాడని దుయ్యబట్టారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.