-జిల్లాలో అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి 15-20 లక్షల ఎకరాలకు సాగునీరిస్తాం -పాలమూరు ఎత్తిపోతల పనుల పరిశీలనలో సీఎం కేసీఆర్ -పాలమూరు.. పాలుగారే ఊరు కావాలి -మొగులు చూడకుండా వ్యవసాయం చేయాలి -ప్రగతినిరోధక శక్తులవల్లే పాలమూరు ఆలస్యం -మొదటి దశలో కరివెన నింపే యోచన -తర్వాత ఉద్ధండాపూర్ లేదా లక్ష్మిదేవిపల్లి -ఏపీ సర్కార్‌తో వచ్చే భేటీలో గోదావరి-కృష్ణా అనుసంధానం కొలిక్కి -దానిపైనా చంద్రబాబు కుత్సితబుద్ధి: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

సంవత్సరంలోపు పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చెప్పారు. పాలమూరు జిల్లాలో మొత్తంగా 15-20 లక్షల ఎకరాలకు సాగునీరంది.. సస్యశ్యామలం అవుతుందని విశ్వాసం వ్యక్తంచేశారు. అన్ని ప్రాజెక్టులు పూర్తిచేసి.. పాలమూరును పాలుగారే ఊరుగా, పాలుగారే పాలమూరుగా తయారుచేస్తామని చెప్పారు. రంగారెడ్డి జిల్లా, మహబూబ్‌నగర్ జిల్లా, కొంత పాక్షికంగా దక్షిణ నల్లగొండ కావచ్చు. అదేవిధంగా నాగార్జునసాగర్ ద్వారా నల్లగొండ, ప్రస్తుత వికారాబాద్ జిల్లా.. ప్రస్తుత రంగారెడ్డి జిల్లా సస్యశ్యామలమయ్యే పరిస్థితి వస్తది అని సీఎం అన్నారు. కొందరు దుర్మార్గులు, కొన్ని ప్రగతి నిరోధకశక్తులు అడ్డుకోవటంవల్ల పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యమైందని చెప్పారు.
ఈ నేపథ్యంలో జిల్లాలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులైన కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, భీమా పథకాలను వెంటనే పూర్తిచేసి నీళ్లిచ్చామని, అక్కడ మంచి ఫలితం కూడా వచ్చిందని తెలిపారు. దాదాపు 1000 నుంచి 1500 వరకు చెరువులు నింపుకొనే కార్యక్రమం విజయవంతంగా జరుగుతున్నదని వివరించారు. ఇంకా సక్సెస్‌ఫుల్‌గా చేయనున్నామని తెలిపారు. గోదావరి, కృష్ణానదుల అనుసంధానానికి ఏపీ ప్రభుత్వం ముందుకు వచ్చిందని, వచ్చే సమావేశంలో ఈ అంశం ఒక కొలిక్కివచ్చే అవకాశం ఉన్నదని సీఎం వెల్లడించారు. గురువారం ఆయన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం నిర్మాణపనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఏదుల వద్ద మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి ఏమన్నారో.. ఆయన మాటల్లోనే..

కృష్ణా-గోదావరి అనుసంధానంతో అద్భుతాలు గోదావరి, కృష్ణానదుల అనుసంధానంతో శ్రీశైలాన్ని గోదావరి జలాలతో నింపుకొందామని ఏపీ ముఖ్యమంత్రి, ఆ రాష్ట్ర ఉన్నతాధికారుల బృందం సహృదయంతో నిర్దిష్టమైన ప్రతిపాదనలతో వచ్చారు. ఈసారి అదృష్టం కలిసొచ్చి కృష్ణకు పెద్దఎత్తున నీళ్లు వచ్చాయి. కొన్ని సందర్భాల్లో అసలే రావడంలేదు. కాబట్టి మేం కూడా అంగీకరించాం. చర్చలు సఫలమైతే చాలా అద్భుతాలు చూడబోతున్నాం. బ్రహ్మాండమైన ఫలితాలు వస్తాయి. శ్రీశైలం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లా, కొంత దక్షిణ నల్లగొండ కావచ్చు.. అదేవిధంగా నాగార్జునసాగర్ ద్వారా నల్లగొండ కావచ్చు.. పైన ఉన్నటువంటి వికారాబాద్ జిల్లా, రంగారెడ్డి జిల్లా మొత్తం అంతా సస్యశ్యామలమయ్యే పరిస్థితి వస్తది. రైతులు ఎదురుచూసే పరిస్థితి రాదు. గత సమైక్య పాలకుల అసమర్థ, తెలివితక్కువ విధానాలవల్ల తెలంగాణకు నష్టం కలిగింది. స్కీం బీ కోరకపోవడం ఒకటి. మంచినీళ్లకు కూడా కర్ణాటకను బతిమిలాడాల్సి వచ్చింది. అదంతా అధిగమించాలంటే గోదావరిని కృష్ణకు అనుసంధానం చేసుకోవడం ఉత్తమ మార్గం. దానికి ఏపీ కూడా సిద్ధంగా ఉన్నది. బహుశా వచ్చే సమావేశంలో కొలిక్కి వచ్చే ఆస్కారం ఉంటది.
ఏపీలో కూడా కుత్సిత మనస్తత్వం ఉన్న మాజీ సీఎం చంద్రబాబులాంటివారు ఉన్నారు. ఆయనకు ఏం గుణం ఉన్నదో ఇతరులకూ అదే గుణం ఉన్నదనుకుంటున్నరు. సంకుచితంగా, కుత్సితంగా, నీచంగా ఆలోచించేవారికే చంద్రబాబులాంటి ఆలోచనలు వస్తయి. అనుసంధానంపై మేం ఇద్దరు ముఖ్యమంత్రులం ఒక అభిప్రాయానికి వచ్చినం. భవిష్యత్‌లో బాగుపడేదే పాలమూరు, నల్లగొండ, వికారాబాద్ జిల్లాలు. హైదరాబాద్ తాగునీటి సమస్య దూరమైతది. చాలా సమస్యలు శాశ్వతంగా దూరమైతయి. గతంలో ఇదే చంద్రబాబు బాబ్లీ, పరవాడ ప్రాజెక్టులపై గొడవపడి సాధించింది ఏమిటి? గుండు సున్నా! మేం వెళ్లి ఒప్పందం చేసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. 570 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం తెలంగాణకు సంపూర్ణంగా లభిస్తున్నది. చంద్రబాబు, ఇంకా ఎవరైనా కుత్సితబుద్ధితో ఆలోచించేవారికి ఒకటే చెప్తున్నా.. రేపు ఆంధ్రా, తెలంగాణ కృష్ణా, గోదావరి అనుసంధానం చేసి నీళ్లు తీసుకోవాలనుకున్నప్పుడు తగురీతిలో ఒప్పందాలు చేసుకుంటం. సుహృద్భావ పూర్వకంగా చర్చలదశలో ముందుకు పోతున్నం. నాకు కూడా కల ఉన్నది. అసాధ్యమేమీకాదు. ఇప్పుడు కూడా కొందరు తెలివిలేని సన్నాసులు మేమేమీ చేయలేదు.. మీరుకూడా ఏమీ చేయొద్దు అనే పద్ధతిలో మాట్లాడుతున్నరు.
ఆరునూరైనా ఉచిత విద్యుత్ సరఫరా సమైక్యపాలనలో జీవన విధ్వంసం జరిగి.. తెలంగాణ రైతాంగం చాలా ఘోరాలకు గురైంది. ఆత్మహత్యలు చేసుకునే స్థితికి దిగజారింది. మాకొక నిర్దిష్టమైన అభిప్రాయం ఉన్నది. చాలా స్పష్టంగా చెప్పిఉన్నాం. తెలంగాణలో ప్రతిరైతు అప్పులో కూరుకొనిపోయి ఉన్నడు. వాళ్లు బాగుపడాలంటే ఇంకా ఐదారు.. ఏడెనిమిదేండ్లపాటు వాళ్లకు నగదు నిల్వలు, సొంత పెట్టుబడి సమకూరేవరకు ఆరునూరైనా కరంట్ సరఫరాచేస్తం. నీటితీరువా రద్దుచేసినం. ఎత్తిపోతల పథకాలకు కరంట్ బిల్లులు ఇంతగనమా? అని మాట్లాడుతున్నరు. రూ.5 వేల కోట్లు కాదు.. రూ.15 వేల కోట్లు అయినా ఖర్చు పెట్టి రైతాంగానికి నీళ్లిస్తం. రైతుల అప్పులు తీరి, వాళ్ల బ్యాంకులో నాలుగు లక్షలో, ఐదు లక్షలో జమ అయితే పెట్టుబడికోసం అప్పుల చేసే దుస్థితి పోతది. ఆ స్థితి రావాలనేది మా పంతం. ఇది మా పార్టీ, మా ప్రభుత్వ సిద్ధాంతం.

వాళ్లు మనుషులా దరిద్రులా? ఇదే పాలమూరు జిల్లాలో సన్నాసులు ఉన్నరు. వాళ్లను చూస్తే నవ్వాలో ఏడ్వాల్నో అర్థంకాదు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జూరాల నుంచి నీళ్లు తీసుకోవాల్సి ఉండే అని మాట్లాడుతరు. వాళ్లు మనుషులా? దరిద్రులా? ఈ జిల్లాల ఎట్ల పుట్టిండ్రు? భగవంతుడు వాళ్లకు ఎట్ల జన్మ ఇచ్చిండో అర్థంకాలే. జూరాల ప్రాజెక్టులో యూజబుల్ వాటర్ ఆరు టీఎంసీలే. దానిమీద నెట్టెంపాడు, జూరాల సొంత ఆయకట్టు 1.04 లక్షల ఎకరాలు అఫీషియల్. మొత్తం 1.15- 1.20 లక్షల ఎకరాల వరకు జూరాల సొంత ఆయకట్టు ఉంటది. భీమాకింద 2.03 లక్షల ఎకరాలు, నెట్టెంపాడు కింద 2 లక్షలు, కోయిల్‌సాగర్ కింద 52 వేలు, కొత్తగా ప్రతిపాదించిన గట్టు మీద 33 వేల ఎకరాలు, అదేవిధంగా మిషన్ భగీరథ కింద తీసుకునే నీళ్లు 3.87 టీఎంసీలు. వాడుకోవాల్సిన నీళ్లు, పెట్టిన ఖర్చులకు, చేపట్టిన ప్రాజెక్టులకు 71.1 టీఎంసీలు జూరాల నుంచి వాడితే తప్ప మనం బతుకలేని పరిస్థితి. జూరాల రెండు మూడేండ్లుగా ఎండిపోతున్నది.
రామన్‌పాడు ఎండిపోతది. ఏం చేయాలి? ఏటా కర్ణాటకను బతిమాలుకొని ఒక టీఎంసీనో, అర టీఎంసీనో తేవడం అంతా చూస్తున్నారు. ఇంత దుస్థితి జూరాలలో ఉంటే ఇంకా అమోఘమైన తెలివితేటలున్న చవటలు.. పాలమూరు ఎత్తిపోతలకు జూరాలనుంచి తెచ్చుకోవాలని మాట్లాడుతరు. శ్రీశైలం పొటెన్షియల్ పాయింటు. అక్కడ 200 టీఎంసీల స్టాకు ఉంటది. వాస్తవంగా 300 టీఎంసీల ప్రాజెక్టు. కానీ సిల్ట్ వల్ల 200 టీఎంసీలు అయింది. ఇప్పుడు ఒకపూట వెనకోముందో గోదావరికి శ్రీశైలం అనుసంధానం కాబోతున్నది. సంకల్ప శుద్ధి, చిత్తశుద్ధి ఉంటే కచ్చితంగా జరుగుతది. అప్పుడు జూరాల గతి ఏంకావాలి? శ్రీశైలానికి నీళ్లు వచ్చినా జూరాలలో నీళ్లు ఉండవు. నారాయణపేట నియోజకవర్గానికి సాగునీరిచ్చే పాలమూరు ఎత్తిపోతల కాల్వను పెద్దది చేసి, దాన్ని భీమా ద్వారా సంఘంబండ రిజర్వాయర్‌లో వేసి అక్కడి నుంచి వాగుద్వారా జూరాలకు కూడా నీళ్లు ఇవ్వాలి. లేకపోతే జూరాల ఆయకట్టు బతకది. నెట్టెంపాడుకు, భీమాకు నీళ్లురావు. తాగడానికి కూడా ఉండవు. ఇవన్నీ కావాలంటే సమగ్రమైన విధానం అవలంబించాలి.
తొలి దశలో కరివెన వరకు నీళ్లు గోదావరి ప్రాజెక్టులు కొలిక్కి వచ్చినయి. కాళేశ్వరం దాదాపు పూర్తయింది. మిడ్‌మానేరు 14 టీఎంసీలతో నిండుతా ఉన్నది. కంటిన్యూగా గంగ పొంగుతున్నది. అదే పరిస్థితి పాలమూరు జిల్లాలో కూడా రావాలే. ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులే కాకుండా పాలమూరు ఎత్తిపోతల పథకం కచ్చితంగా ఒకనెల వెనకోముందో వచ్చే వర్షాకాలం నాటికి తీసుకురావాలనే సంకల్పంతో ఈ రోజు ఇక్కడికి వచ్చిన. తొందరపాటు ఏమీలేదు. రాజకీయాల్లేవు. ఫస్ట్ ఫేజ్‌లో కరివెన వరకు నీళ్లు తీసుకొచ్చి నింపే ఆలోచనలో ఉన్నం. ఆ తర్వాత ఉద్ధండాపూర్ కానీ, లక్ష్మిదేవిపల్లి కానీ, అదేవిధంగా వికారాబాద్ జిల్లాకు పోయే నీళ్లుకానీ ఇచ్చే ఆలోచన చేస్తున్నం. రూ.10 వేల కోట్లు అప్పుతెచ్చినం. బడ్జెట్‌లో కొంత సమకూర్చినం. వచ్చే బడ్జెట్‌లో కొంత సమకూరుస్తాం. రెండు ఫేజ్‌లలో సమగ్ర లక్ష్యాన్ని రాబోయే రెండేండ్లలో సాధించాలి.

పాలమూరును ఎండబెట్టినారు.. సమైక్యపాలనలో పాలమూరును ఎండబెట్టినారు. బొంబాయి బస్సుల నిలయం చేశారు. ఘోరమైన పరిస్థితులుండేవి. కరువు, వలసల జిల్లా కింద దెబ్బకొట్టినారు. ఉత్తర తెలంగాణ ఆరిపోయింది. దేశంలోనే ఎక్కడలేనన్ని పంపుసెట్లు! అధికారికంగానే 24 లక్షలు, అనధికారికంగా మరో 3, 4 లక్షల పంపుసెట్లు ఉంటయి. తెలంగాణ రైతాంగం ఒక్కొక్క పంపుసెట్టు, ఒక్కొక్క బోరు కోసం రూ.25 వేల నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చుపెట్టారు. 800-900 ఫీట్లు లోపలికి వేస్తే తప్ప నీళ్లురాని దుస్థితికి కారకులు ఇదే కాంగ్రెస్ నాయకులు. పాలమూరు వలసల జిల్లా కావడానికి కారకులు ఎవరు? ఇయ్యాల మళ్లీ వాళ్లే మాట్లాడుతున్నరు. చాలా ఘోరం, చాలా బాధ, జాలి కూడా కలుగతది. వాళ్లకు నీళ్ల పరిమాణాల మీద, భౌగోళిక, కాంటూరు అంశాలమీద పరిజ్ఞానం లేదు. నోటికి వచ్చినట్లు మాట్లాడే దుర్మార్గమైన పద్ధతి.
జూరాలకు కూడా పాలమూరు నీళ్లు జూరాల ప్రాజెక్టుకు కూడా పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారానే నీళ్లు సప్లిమెంట్ చేయాల్సి ఉన్నది. కర్ణాటకను బతిమాలుకొనే దుస్థితి లేకుండా ఆలోచన చేసినం. పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల నీళ్లు నినాదం విజయవంతం కావడమే కాదు.. అదనంగా 3, 4 లక్షల ఎకరాలకు నీళ్లు.. మొత్తంగా 15-20 లక్షల ఎకరాల మధ్య పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా పంటలతో తులతూగే జిల్లాగా వచ్చే సంవత్సరం నుంచి మారే అవకాశముంటది. కాళేశ్వరం ప్రాజెక్టు చేస్తమని చెప్తే ఎవనికీ నమ్మకంలేదు. అయ్యేపనా.. సచ్చేపనా? అని మాట్లాడినారు. ఇప్పుడు సచ్చినోడు ఎవరో బతికినోడు ఎవరో అందరికీ తెలుసు. పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కావచ్చు, పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సెంట్రల్ వాటర్ కమిషన్ కావచ్చు.. ఇదొక అద్భుతం, మ్యాన్ మేడ్ మార్వెల్ అని వేయినోళ్ల ప్రశంసిస్తున్నరు. అమెరికాలోని న్యూయర్క్ టైమ్‌స్వ్కేర్‌లో మన కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చూపిస్తున్నరు. ఇది జీర్ణంకాని సన్నాసులు.. ఇక్కడ కాళేశ్వరం నీళ్లు పక్కపంటి దూకుతుంటే ప్రాణహితల పోయి డ్రామాలు చేస్తున్నరు.
పాలమూరు ప్రజలను గుండెలో పెట్టుకుంటాం పాలమూరు ప్రజలు మమ్ముల్ని గుండెల పెట్టుకున్నరు. 14కు 13 అసెంబ్లీ సీట్లు, రెండింటికి రెండు ఎంపీ సీట్లు, ఐదింటికి ఐదు జిల్లా పరిషత్తులను గెలిపించారు. రేపు అన్ని మున్సిపాలిటీలు గెలిపిస్తరని మాకు తెలుసు. ఉన్న మరొక్క ఎమ్మెల్యే కూడా ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు నచ్చి టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇంత ఏకపక్షంగా ఈ జిల్లా మమ్ముల్ని గుండెలో పెట్టుకున్నది కాబట్టి వందశాతం పాలమూరును గుండెలో పెట్టుకుంటం. ఇది తెలంగాణ.. అవసరమైతే కుర్చీ వేసుకొని పాలమూరు ప్రాజెక్టు కట్టిస్త అని 2014 గద్వాల సభలో చెప్పిన. అట్లనే ఆన్‌గోయింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేసినం. మిగిలినవి కూడా వందశాతం నెరవేర్చి ఈ జిల్లాలో 15-20 లక్షల ఎకరాలకు నీళ్లిస్తం. వికారాబాద్, రంగారెడ్డి జిల్లాలకు బ్రహ్మాండంగా నీళ్లు వస్తయి. కేసీఆర్ అన్నడు అంటే వందశాతం జరిగి తీరుతది. మిషన్ భగీరథను కూడా అయితదా… పోతదా అన్నరు.
ఇప్పుడంతా కండ్లప్పగించి చూస్తున్నరు. పాలమూరు ప్రజలకు సేవచేసి వారి రుణాన్ని తప్పకుండా తీర్చుకుంటామని ముఖ్యమంత్రిగా హామీ ఇస్తున్న. హైదరాబాద్‌లో విలువైన భూములు అమ్మకానికి పెట్టినం. ఆ డబ్బు చాలావరకు పాలమూరు ఎత్తిపోతల పథకానికే వాడుతం. ఎక్కడా లోపంరాకుండా, ఒక్కరోజు కూడా ఆగకుండా పాలమూరు ప్రాజెక్టు వేగం పుంజుకుంటది. మూడు షిఫ్ట్‌లల్లో పనిచేస్తం. రోజుకు రెండుమూడు గంటలు మినహా యుద్ధంలా చేస్తం. ప్రతి 10-15 రోజులకు ఒకసారి నేను కూడా వచ్చే ప్రయత్నం చేస్త. పూర్తిస్థాయిలో ప్రాజెక్టులను విజయవంతంచేసి పాలమూరు పాలుగారే ఊరుగా, పాలుగారే పాలమూరుగా తయారుచేస్తం. బంగారంలాంటి భూములున్నయి. కష్టపడి పనిచేసే రైతాంగం ఉన్నది. అద్భుతమైన ఫలితాలు రాబోతాయి. మేము కలలుకన్న పాలమూరు వందకు వందశాతం కండ్లచూస్తం. కల్వకుర్తి, పాలమూరు రెండూ కలిపి 15-20 లక్షల ఎకరాల మధ్య ఎట్ల తీసురావాలనే ఆలోచన జరుగుతున్నది.
మిత్రుడు నిరంజన్‌రెడ్డి గుడిపల్లి గట్టు ఎత్తు పెంచుకోవచ్చని చెప్పినారు. ఇక్కడనే 10 టీఎంసీలు పెంచుకోవచ్చు. జొన్నలబోడు కూడా పెంచుకోవచ్చుననే ప్రతిపాదనలు ఉన్నయి. సిస్టర్న్ లెవల్, పంప్ లెవల్ సరిపోవడంలేదు. ఒకటిరెండు రిజర్వాయర్లు తెచ్చినట్లయితే మనకు చాలా లాభం జరుగతది. గోదావరి- కృష్ణా అనుసంధానం కల నిజమైతే శ్రీశైలం ఎప్పుడూ నిండుగా ఉంటది కాబట్టి మనకు ఆ బాధ లేకుండాపోతది. దీన్ని ఆలోచిద్దాం. రాబోయే నెల ఆంధ్రతో మనకు ఏం సంబంధం జరుగుతుందో చూద్దాం. ఒకవేళ నింపేపని అయితే పుష్కలమైన నీరు గోదావరిలో ఉన్నది. కాబట్టి మనం మొగులుకు ముఖం చూడకుండా (మహబూబ్‌నగర్ జిల్లాలో మెడం అంటరు) వ్యవసాయం చేసే పరిస్థితి పాలమూరుకు త్వరలోనే వస్తది.

కృష్ణా – గోదావరి అనుసంధానంపై మేం ఇద్దరు ముఖ్యమంత్రులం ఒక అభిప్రాయానికి వచ్చినం. భవిష్యత్‌లో బాగుపడేదే పాలమూరు, నల్లగొండ, వికారాబాద్ జిల్లాలు. హైదరాబాద్ తాగునీటి సమస్య దూరమైతది. చాలా సమస్యలు శాశ్వతంగా దూరమైతయి. గతంలో ఇదే చంద్రబాబు బాబ్లీ, పరవాడ ప్రాజెక్టులపై గొడవపడి సాధించింది ఏమిటి? గుండు సున్నా! మేం వెళ్లి ఒప్పందం చేసుకుంటే కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయింది. 570 టీఎంసీల నీళ్లు తీసుకునే అవకాశం తెలంగాణకు సంపూర్ణంగా లభిస్తున్నది. చంద్రబాబు, ఇంకా ఎవరైనా కుత్సితబుద్ధితో ఆలోచించేవారికి ఒకటే చెప్తున్నా.. రేపు ఆంధ్రా, తెలంగాణ కృష్ణా, గోదావరి అనుసంధానం చేసి నీళ్లు తీసుకోవాలనుకున్నప్పుడు తగురీతిలో ఒప్పందాలు చేసుకుంటం. సుహృద్భావ పూర్వకంగా చర్చలదశలో ముందుకు పోతున్నం. – సీఎం కేసీఆర్
పాలమూరు జిల్లాలో ప్రతి నియోజకవర్గానికి లక్ష ఎకరాల నీళ్లు నినాదం విజయవంతం కావడమే కాదు.. అదనంగా 3, 4 లక్షల ఎకరాలకు నీళ్లు.. మొత్తంగా 15-20 లక్షల ఎకరాల మధ్య పాలమూరు జిల్లా సస్యశ్యామలంగా పంటలతో తులతూగే జిల్లాగా వచ్చే సంవత్సరం నుంచి మారే అవకాశముంటది. – సీఎం కేసీఆర్