– ఆంధ్రోళ్ల 60 ఏండ్ల దోపిడీ వల్లే విద్యుత్ కష్టాలు – అప్పుడు ప్రశ్నించనోళ్లు.. ఇప్పడు విమర్శించడం సరికాదు – కష్టాలు రావొద్దనే పక్కరాష్ర్టాల నుంచి విద్యుత్ కొనుగోళ్లు – భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడి – ఒక్క నీటిచుక్కనూ వదులుకోం: మంత్రి జగదీశ్‌రెడ్డి
ఆరు దశాబ్దాలుగా నాగార్జునసాగర్‌లో తెలంగాణకు చెందాల్సిన న్యాయమైన నీటి కేటాయింపులను కూడా సీమాంధ్ర నేతలు కృష్ణాడెల్టాకు అక్రమంగా తరలించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక సాగర్ డెడ్‌స్టోరేజీలో ఉన్నప్పటికీ డెల్టాతో పాటు తెలంగాణలోని ఎడమకాల్వకూ నీరివ్వాలని కృష్ణాబోర్డుపై ఒత్తిడి తెస్తే నీరు విడుదల చేసింది.
తెలంగాణ రాష్ట్రంలో ఇది మరో విజయం అని భారీ నీటిపారుదల శాఖ మంత్రి పేర్కొన్నారు. బుధవారం సాగర్ ఎడమకాల్వకు విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి సంప్రదాయబద్ధంగా పూజలు చేసి నీటిని విడుదల చేశారు. మొదట 400 క్యూసెక్కులు విడుదల చేయగా, సాయంత్రం వరకు 4వేల క్యూసెక్కులకు పెంచారు. తర్వాత విజయవిహార్‌లో విలేకరుల సమావేశంలో హరీశ్‌రావు మాట్లాడారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు 40 టీఎంసీల నీటితో 3.2 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తామని, ఇన్‌ఫ్లో పెరిగితే రెండోజోన్కూ విడుదల చేస్తామన్నారు. ఏఎమ్మార్పీ కింద 92 చెరువులు నింపడానికి 3 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు.
ఆంధ్రోళ్లు 60 ఏండ్లు దోచుకెళ్తుంటే ప్రశ్నించలేదేం?: తమది ప్రజలు మెచ్చిన ప్రభుత్వమని, కేసీఆర్ వల్లే న్యాయం జరుగుతుందని ఆలోచించే ప్రజలు తీర్పునిచ్చారని హరీశ్‌రావు చెప్పారు. ఆంధ్రోళ్లు 60 ఏండ్లు దోచుకెళ్లినా పట్టించుకోని ఇక్కడి నేతలు, 60 రోజులైనా గడవని ప్రభుత్వ తీరును ఎలా విమర్శిస్తారని ప్రశ్నించారు. అవసరం లేని రాయలసీమలో థర్మల్ పవర్ స్టేషన్‌ను విస్తరిస్తుంటే ఎందుకు మౌనం దాల్చారు. ఆర్టీపీపీ, వీటీపీఎస్‌లో 700 మెగావాట్ల విద్యుత్ ఆపింది ఆంధ్రా ప్రభుత్వం కాదా? వాళ్ల కుట్రల వల్లే ఇప్పుడు రాష్ట్రంలో కోతలు విధించాల్సి వస్తున్నది.
తెలంగాణలో ఉంటూ ఆంధ్రా రాష్ర్టానికి వత్తాసు పలకడం సరికాదు అని టీడీపీ, కాంగ్రెస్ నేతలకు చురకలంటించారు. మోడీప్రభుత్వం రాష్ర్టానికి ఎంత మేలు చేసిందో కిషన్‌రెడ్డికి తెల్వదా? అది మరిచి టీఆర్ఎస్పై విమర్శలు చేయడం సరికాదన్నారు. విద్యుత్ ఇబ్బందులు రావొద్దనే పక్క రాష్ర్టాల నుంచి కొనుగోలు చేయాలని, సోలార్‌పవర్ పాంట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఇష్టారాజ్యం: మంత్రి జగదీశ్‌రెడ్డి రాష్ట్రం ఏర్పడితే ఏం జరుగుతుందనే దానికి నిదర్శనమే నేడు ఎడమకాల్వకు నీరు విడుదల చేయడమని విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. వలసపాలకులు ఇష్టారాజ్యంగా వ్యవహరించి, ఎడమకాల్వను ఎండబెట్టి కుడికాల్వకు నీరు తీసుకుపోయారన్నారు. ఆంధ్రోళ్లు ఎన్ని కుట్రలు పన్నినా రావాల్సిన ఒక్క చుక్కనూ వదులుకోబోమన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వేముల వీరేశం, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, గాదరి కిషోర్, భాస్కర్‌రావు, జెడ్పీ చైర్మన్ బాలునాయక్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు నరేందర్‌రెడ్డి, సీనియర్ నేత నోముల నర్సింహాయ్య పాల్గొన్నారు. అంతకు ముందు నీటిని విడుదల చేయడానికి వస్తున్న మంత్రులకు పెదవూర వద్ద స్థానిక టీఆర్ఎస్ నాయకుడు విజయభాస్కర్‌రెడ్డి నాయకత్వంలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో స్వాగతం పలికారు.