Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఏడేండ్లలోనే 33 మెడికల్‌ కాలేజీలు

-వైద్యరంగంలో తెలంగాణ ఆగ్రస్థానం
-మాతాశిశు రక్షణలో ద్వితీయ స్థానం
-ఆశ వర్కర్లకు రాష్ట్రంలో ఎక్కువ జీతాలు
-చివరలో డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ రాష్ట్రాలు
-కాంగ్రెస్‌ పాలనలో వైద్యరంగం ఆస్తవ్యస్తం
-తెలంగాణకు రాహుల్‌ ఎందుకొస్తున్నారు?
-వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు
-జగిత్యాల, పెద్దపల్లిలో దవాఖాన, మాతాశిశు సంరక్షణ కేంద్రం ప్రారంభం

వైద్యరంగంలో తెలంగాణ అద్భుత ఫలితాలు సాధిస్తున్నదని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ అని ఊదరగొడుతున్న బీజేపీ పాలిత రాష్ట్రాలకంటే మన రాష్ట్రం ఎంతో ముందున్నదని, దేశంలోనే అగ్రస్థానంవైపు పయనిస్తున్నదని చెప్పారు. ‘స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత 75 ఏండ్లలో రాష్ట్రంలో 3 మెడికల్‌ కాలేజీలు ఏర్పాటు చేశారు. కానీ, కేసీఆర్‌ సర్కారు ఏడేండ్ల పాలనలో ఏకంగా 33 వైద్యకళాశాలలు ఏర్పాటు చేసింది. ఇదే మా పనితీరుకు నిదర్శనం’ అని ఉద్ఘాటించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో రూ.23 కోట్లతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రం, జనరల్‌ దవాఖానను.. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో వంద పడకల మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి బుధవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జగిత్యాలలో, పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగ సభల్లో మాట్లాడారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీ తెలంగాణ ఎందుకు వస్తున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

కాంగ్రెస్‌, బీజేపీ రాష్ట్రాల్లో వైద్యం అధ్వాన్నం
డబుల్‌ ఇంజిన్‌ గ్రోత్‌ అంటూ గొప్పలు చెప్పుకొనే బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్‌ వైద్యరంగంలో అట్టడుగు స్థానంలో ఉన్నదని మంత్రి హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీ సొంతరాష్ట్రం గుజరాత్‌లో ఆశ కార్యకర్తలకు రూ.4 వేలు, కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం రాజస్థాన్‌లో కేవలం రూ.3 వేలు భృతి ఇస్తున్నారని తెలిపారు. తెలంగాణలో మాత్రం రూ.1,500 నుంచి ఏకంగా రూ.9,500కు పెంచిన ఘనత టీఆర్‌ఎస్‌ సర్కారుదేనని స్పష్టంచేశారు. కరోనాకాలంలో అమలు చేసిన ఇంటింటి ఆరోగ్యసర్వే దేశానికే ఆదర్శంగా నిలిచిందని, దీనిని నీతి ఆయోగ్‌ సైతం ప్రశంసించిందని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సర్కారు దవాఖానల్లో 30 శాతం ప్రసవాలు జరిగేవని, కేసీఆర్‌ కిట్‌ స్కీంతో 56 శాతానికి పెరిగాయని వెల్లడించారు. జగిత్యాలలో 80 శాతం సిజేరియన్లు జరుగుతున్నాయని, సాధారణ ప్రసవాలను పెంచేందుకు వైద్యాధికారులు కృషి చేయాలని నిర్దేశించారు. సాధారణ ప్రసవాలు చేసేవారికి ప్రోత్సాహకాలు ఇచ్చే ఆలోచన చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో ఏర్పాటవుతున్న 33 మెడికల్‌ కాలేజీల్లో ఒక్కోదానికి అనుబంధంగా ఉండే దవాఖానలో 650 పడకలు అందుబాటులో ఉంటాయని, 150 మంది డాక్టర్లు పని చేస్తారని చెప్పారు. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో 700 ఎంబీబీఎస్‌ సీట్లు మాత్రమే ఉండేవని, ప్రస్తుతం 2,840 సీట్లు ఉన్నాయని తెలిపారు. మరో ఏడాదిన్నరలో ఇవి 5,420కి పెరుగుతాయని వివరించారు.

కొండగట్టులో హరీశ్‌రావు పూజలు
బుధవారం ఉదయం మంత్రి హరీశ్‌రావు దంపతులు కొండగట్టు ఆంజనేయస్వామికి, నూకపెల్లిలోని సరస్వతి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని నర్సింగ్‌ కాలేజీ, మెడికల్‌ కాలేజీ తాత్కాలిక భవనాన్ని పరిశీలించారు. అంతకుముందు ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌కుమార్‌ ఇంట్లో జిల్లాలోని గైనకాలజిస్టులతో సమావేశం నిర్వహించి గర్భిణిలకు సాధారణ ప్రసవాలే చేయాలని సూచించారు. ఈ కార్యక్రమాల్లో జగిత్యాల జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ దావ వసంత, పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌, ఎమ్మెల్యేలు సంజయ్‌ కుమార్‌, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సుంకె రవి శంకర్‌, దాసరి మనోహర్‌రెడ్డి, కోరుకంటి చందర్‌, ఎమ్మెల్సీలు టీ భానుప్రసాదరావు, ఎల్‌ రమణ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ చైర్మన్‌ ఎర్రోళ్ల శ్రీనివాస్‌, ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఎంఈ రమేశ్‌రెడ్డి, జగిత్యాల జిల్లా కలెక్టర్‌ గుగులోత్‌ రవి, అదనపు కలెక్టర్‌ శ్రీలత, మహిళా కమిషన్‌ సభ్యులు కటారి రేవతిరావు, జగిత్యాల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ బోగ శ్రావణి, పెద్దపల్లి మున్సిపల్‌ చైర్మన్‌ దాసరి మమతారెడ్డి, మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రాహుల్‌ గాంధీ ఎందుకొస్తున్నారు?
కాంగ్రెస్‌ నేత రాహుల్‌గాంధీకి తెలంగాణలో ఏం పని అని మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ ద్రోహి చంద్రబాబుతో పొత్తుపెట్టుకున్న చరిత్ర కాంగ్రెస్‌దని విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టే నీచమైన స్థితికి కాంగ్రెస్‌ దిగజారిందని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌కు రాహుల్‌ అధ్యక్షుడయ్యాక ఆ పార్టీ ప్రాంతీయ పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. రాహుల్‌ ఎక్కడికి వెళ్తే అక్కడ కాంగ్రెస్‌ పార్టీకి ఓటమి తప్పదని అన్నారు. ‘తెలంగాణలో ఇచ్చినట్టు కాంగ్రెస్‌ పాలిత మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌, రాజస్థాన్‌లో ఉచిత విద్యుత్తు ఇస్తున్నారా? తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరా చేస్తుంటే, ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కరెంటు కోతలతో ప్రజలు సతమతమవుతున్నారు. రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలన్నీ భర్తీ చేస్తున్నాం. మరి కేంద్రంలో ఖాళీగా ఉన్న 2.40 లక్షల ఉద్యోగాల సంగతేంటి? వాటిని ఎప్పుడు భర్తీ చేస్తారో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ పాలనలో కరీంనగర్‌ జిల్లాలో డయాలసిస్‌ సెంటర్‌ను ఎందుకు ఏర్పాటు చేయలేదో రాష్ట్రానికి వస్తున్న రాహుల్‌గాంధీని ప్రశ్నించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రతి అంశంపై మాట్లాడే కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కరీంనగర్‌కు ఎందుకు మెడికల్‌ కాలేజీలు రాలేదో చెప్తారా? అని ప్రశ్నించారు. మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ..పేదల చెంతకు వైద్యాన్ని చేర్చిన ఘనత సీఎం కేసీఆర్‌కు మాత్రమే దక్కుతుందని అన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.