Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఏడేండ్లలో విశ్వనగరి

-హైదరాబాద్‌లో సిగ్నల్ ఫ్రీ రోడ్ల కోసం 23 వేల కోట్లతో ప్రణాళికలు -111 కిలోమీటర్ల మేర కారిడార్లు, స్కైవేలు,ఫ్లై ఓవర్లు -ఇప్పటికే రూ.3200 కోట్లతో ముమ్మరంగా పనులు -మరో రూ.3 వేల కోట్ల పనులకు త్వరలో టెండర్లు -నాలుగు దశల్లో ఎస్సార్డీపీ ఫలాలు -తొలి ఫలితం అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్ -నిరంతర విద్యుత్ సీఎం కార్యదక్షతకు నిదర్శనం -అండర్‌పాస్ ప్రారంభోత్సవంలో మున్సిపల్ మంత్రి కేటీఆర్ -2018…ఎగ్జిక్యూషన్ ఇయర్‌గా అభివర్ణన -426 కోట్లతో వీఎస్టీ నుంచి ఇందిరాపార్క్ వరకు స్టీల్ బ్రిడ్జి -శిల్పారామం మార్గంలో సైబర్ టవర్ వద్ద -రూ.2227 కోట్లతో స్కైవే వెయ్యి కోట్లతో ఉప్పల్-నారపల్లి -ఎక్స్‌ప్రెస్‌వేకు త్వరలో శంకుస్థాపన -ఎన్‌హెచ్‌ఏఐ సమన్వయంతో పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వే విస్తరణ

నగరంలోని రహదారులను సిగ్నల్ ఫ్రీగా తీర్చిదిద్దేందుకు రూ.23వేల కోట్ల వ్యయంతో వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి పథకం (ఎస్సార్డీపీ) చేపట్టామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కే తారక రామారావు చెప్పారు. దీనికింద 111 కిలోమీటర్ల పొడవున ఫ్లై ఓవర్లు, స్కైవేలు, కారిడార్లు నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధంచేశామని తెలిపారు. మొదటి దశలో 3200కోట్లతో 19చోట్ల పనులు చేపట్టగా, అయ్యప్ప సొసైటీ అండర్‌పాస్ పూర్తితో మొదటి ఫలం అందుకుంటున్నామన్నారు. మిగిలినచోట్ల పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్న కేటీఆర్.. ఈ సంవత్సరాన్ని ఎగ్జిక్యూషన్ ఇయర్‌గా అభివర్ణించారు. ఇదికాకుండా రూ.2900 కోట్లతో కొత్త మార్గాలను ప్రతిపాదించామని తెలిపారు. ఎస్సార్డీపీలో భాగంగా అయ్యప్ప సొసైటీ జంక్షన్‌లో రూ.44.30కోట్లతో నిర్మించిన అండర్‌పాస్‌ను మంత్రి కేటీఆర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దీనిని 12నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ తొమ్మిది నెలల్లోనే పూర్తిచేశామన్నారు. ఇందుకు కృషిచేసిన ఇంజినీరింగ్ అధికారులను మంత్రి అభినందించారు.

ఈ ఏడాది కొన్ని, వచ్చే ఏడాది మరికొన్నిఫ్లై ఓవర్లు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. ఇందులో మైండ్‌స్పేస్ జంక్షన్ అండర్‌పాస్ ఈ ఏడాది మార్చికల్లా రాకపోకలు ప్రారంభిస్తుందన్నారు. అదే జంక్షన్‌లో ఫ్లై ఓవర్లు జూన్‌లో, ఎల్బీనగర్ చింతలకుంట అండర్‌పాస్ మార్చినాటికి పూర్తిచేస్తామన్నారు. కామినేని జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్ జూన్‌నాటికి, రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్లు సెప్టెంబర్‌లో, బయో డైవర్సిటీవద్ద ఫ్లై ఓవర్లు మార్చి 2019కల్లా పూర్తి అవుతాయని మంత్రి వెల్లడించారు. మొత్తమ్మీద వచ్చే ఆరేడేండ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరం స్థాయికి చేర్చుతామని ఉద్ఘాటించారు. ఇవాంకాట్రంప్ పర్యటన కోసమే హైదరాబాద్‌లో రోడ్లను బాగు చేస్తున్నారని ఇటీవల వచ్చిన ఆరోపణల్లో నిజం లేదని కేటీఆర్ అన్నారు. నగరంలో రోడ్ల సుందరీకరణ పనులను అంతకుముందే చేపట్టామని గుర్తుచేశారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి బాటలో నడిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తున్నదని కేటీఆర్ అన్నారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు పెద్దఎత్తున మౌలిక సదుపాయాలను అభివృద్ధిచేస్తున్నామన్నారు. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా ఎస్సార్డీపీని చేపట్టినట్టు చెప్పారు. రూ.23వేల కోట్లతో నాలుగు దశల్లో దీన్ని పూర్తిచేయాలని ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు.

మూడు వేల కోట్ల పనులకు టెండర్లు.. రూ.2900 కోట్లతో కొత్త మార్గాలను ప్రతిపాదించామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇందులో భాగంగా ఆర్టీసీ చౌరస్తా వద్ద 426 కోట్లతో వీఎస్టీ నుంచి ఇందిరాపార్క్ వరకు స్టీల్ బ్రిడ్జ్ ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. శిల్పారామం మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలిగించేందుకు సైబర్ టవర్ వద్ద రూ.2227 కోట్లతో స్కైవే నిర్మించాలని ప్రతిపాదించినట్టు చెప్పారు. రైతిబౌలి నుంచి నానల్‌నగర్ వరకు రూ.175కోట్లతో చేపట్టిన ఫ్లై ఓవర్లు డిసెంబర్ 2019కల్లా, అంబర్‌పేట ఛే నంబర్ చౌరస్తావద్ద రూ.270కోట్లతో ఫ్లై ఓవర్లు ను సెప్టెంబర్ 2019కల్లా పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. అన్నీ కలిపి కొత్తగా సుమారు రూ.3వేల కోట్ల విలువైన పనులకు త్వరలో టెండర్ల ప్రక్రియ చేపడుతామన్నారు. జూబ్లీ బస్టాండ్-రాజీవ్ రహదారి వయా అల్వాల్, తిరుమలగిరితోపాటు.. ప్యాట్నీ-బోయిన్‌పల్లి మార్గాల్లో ఎక్స్‌ప్రెస్‌వేల నిర్మాణానికి ప్రాజెక్టు నివేదికలు, నిధులు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. వీటికి రక్షణశాఖనుంచి స్థలాలు సేకరించాల్సి ఉందని, దీనికోసం అవసరమైన నష్టపరిహారం చెల్లించేందుకు కూడా సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ప్రస్తుతం కేంద్రంతో ఉత్తరప్రత్యుత్తరాల ప్రక్రియ కొనసాగుతున్నదని, అక్కడినుంచి అనుమతులు వచ్చిన వెంటనే పనులు చేపడుతామని కేటీఆర్ చెప్పారు. వీటి నిర్మాణంతో ఆ ప్రాంతంలోని ప్రధాన రహదారులపై ట్రాఫిక్ గణనీయంగా తగ్గుతుందన్నారు. వీటితోపాటు ఉప్పల్-నారపల్లి ఎక్స్‌ప్రెస్‌వేను రూ.1000కోట్లతో జాతీయ రహదారుల శాఖ (ఎన్‌హెచ్‌ఏఐ)తో సంయుక్తంగా చేపడుతున్నట్టు తెలిపారు. త్వరలోనే దీనికి శంకుస్థాపన చేస్తామన్నారు. పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్‌వేను కూడా ఎన్‌హెచ్‌ఏఐ సమన్వయంతో విస్తరించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీగా నగరం… హైదరాబాద్‌లోని రోడ్లను అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో మెరుగుపరుస్తామని మంత్రి కేటీఆర్ హామీఇచ్చారు. ఇందులో భాగంగా రూ.950 కోట్లతో రెండుదశల్లో పనులు జరుగుతాయన్నారు. మరమ్మతులతోపాటు పునరుద్ధరణ పనులు చేపట్టనున్నట్టు చెప్పారు. నగరంలోని పేదలకోసం లక్ష డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లు నిర్మిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. నిధులకోసం మున్సిపల్ బాండ్లను జారీచేస్తామని తెలిపారు. తెలంగాణ వస్తే కరెంటు ఉండదన్నారు. ఇప్పుడు దేశంలో ఎక్కడాలేని విధంగా వ్యవసాయానికి సైతం 24గంటల నిరంతర విద్యుత్ అందిస్తున్న ఏకైక రాష్ట్రంగా ఎదిగాం. ఇదీ ముఖ్యమంత్రి కార్యదక్షతకు నిదర్శనం అని కేటీఆర్ చెప్పారు. వచ్చే ఆరేడేండ్లలో హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తంచేశారు. భౌగోళిక, చారిత్రక, సాంస్కృతిక అనుకూలతలు మన నగర సొంతమన్నారు. ఫలితంగా మూడేండ్లుగా నగరానికి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ సిటీగా ఖ్యాతి లభిస్తున్నదన్నారు. ముంబై తరువాత హైదరాబాద్ నగరాన్ని బహిరంగ మలమూత్ర విసర్జనరహిత నగరంగా స్వచ్ఛభారత్ మిష న్ గుర్తించడంపై కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు. ఈ స్ఫూర్తితో ఇంకా ఉధృతంగా, ఉత్సాహంగా ముందుకు సాగాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, నగర మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జీహెచ్‌ఎంసీ కమిషనర్ బీ జనార్దన్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పనులు నిర్వహిస్తున్న ఇంజినీరింగ్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులు, పెయింటింగ్ వేసిన కళాకారులను హోం మంత్రి శాలువాలతో సన్మానించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.