Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఏదీ భరోసా?

-ఆత్మనిర్భర్‌ ప్యాకేజీతో ఒనగూరిందేమిటి?
-కార్పస్‌ ఫండ్‌ స్కీం మార్గదర్శకాలు ఏవి?
-ఏమాత్రం ఆకర్షణీయంగా లేని ఆర్థిక ప్యాకేజీ
-బడా కంపెనీలకే దానితో ప్రయోజనాలు
-ఎంఎస్‌ఎంఈ రంగానికి చేయూతనివ్వాలి
-పరిశ్రమలకు భారీ ఆర్థిక గ్రాంట్‌ను ఇవ్వాలి
-నిర్మలాసీతారామన్‌కు మంత్రి కేటీఆర్‌ లేఖ

కరోనా సంక్షోభ సమయంలో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సహాయం అందించడానికి కేంద్రం ప్రకటించిన ఆత్మనిర్భర్‌ సహాయ ప్యాకేజీ ఎలాంటి భరోసాను ఇవ్వలేకపోతున్నదని ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కరోనాకు ప్రభావితమైన రంగాలను ఆదుకోవడానికి ప్రధానమంత్రి రూ.20 లక్షల కోట్లతో ప్రకటించిన ఆత్మనిర్భర్‌ ప్యాకేజీ ఆకర్షణీయంగా లేదని తెలిపారు. ఇన్నోవేటివ్‌ ఎంఎస్‌ఎంఈల కోసం ప్రకటించిన ‘కార్పస్‌ ఫండ్‌ స్కీమ్‌’ మార్గదర్శకాలు ఇంతవరకు విడుదల కాకపోవడం పట్ల మంత్రి విచారం వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితులలో ఆత్మనిర్భర్‌ ప్యాకేజీని పునర్నిర్వచించాలని డిమాండ్‌చేశారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌కు లేఖ రాశారు.

కేటీఆర్‌ లేఖలోని ముఖ్యాంశాలు
ఆత్మనిర్భర్‌ ప్యాకేజీని ప్రకటించి ఒక సంవత్సరం పైగా కావస్తున్నది. తెలంగాణ రాష్ట్ర తయారీరంగానికి వెన్నెముకగా నిలుస్తున్న సూక్ష్మ మధ్యతరహా పరిశ్రమలకు ఈ ప్యాకేజీ ద్వారా లబ్ధి చేకూర్చేందుకు తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రిగా నేను గట్టి ప్రయత్నంచేస్తూ వచ్చాను. కరోనా సంక్షోభం ద్వారా ప్రభావితమైన ఇక్కడి సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమలకు మీరు ప్రకటించిన ప్యాకేజీలో ఆకర్షణీయ అంశాలు అత్యంత తక్కువగా ఉన్నాయని తెలిపేందుకు చింతిస్తున్నా ను. రాష్ట్రంలో ఉన్న 80%పైగా ఎంఎస్‌ఎంఈలు లాక్‌డౌన్‌ క్రమంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, 25% పైగా ఎంఎస్‌ఎంఈలు తమ రాబడులను పూర్తిగా కోల్పోవడం జరిగింది. మీరు ప్రకటించిన ప్యాకేజీలో ప్రధానంగా ఎంఎస్‌ఎంఈలకు సంబంధించిన ‘గ్యారంటీడ్‌ ఎమర్జెన్సీ క్రెడిట్‌ లైన్‌ స్కీం’ కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ పథకం మార్గదర్శకాలలోప్రత్యేక ఆకర్షణ ఏమీలేదని తెలంగాణలోని ఎంఎస్‌ఎంఈలు భావిస్తున్నాయి. ఈ పథకంద్వారా లబ్ధి పొందేందుకు అత్యంత సంక్లిష్టమైన ప్రక్రియను రూపొందించారు. దీంతో ఎంఎస్‌ఎంఈలు అనేక వ్యయ ప్రయాసలకు గురవుతున్నాయి.. ఒక్కో యూనిట్‌ ఒక్కో విధమైన సవాలును ఎదుర్కొంటున్న ప్రస్తుత పరిస్థితులలో అన్ని ఎంఎస్‌ఎంఈలకు ఒకే రకమైన పథకం ద్వారా అవసరాలు తీరే అవకాశంలేదు. కరోనా వల్ల కలిగిన నష్టాలను భరించేలా ఒక భారీ ఆర్థిక గ్రాంట్‌ ఇవ్వడం ద్వారా ఎంఎస్‌ఎంఈలను ఆదుకోవచ్చని భావిస్తున్నాను. సంవత్సరానికి పైగా సంక్షోభంలో ఉన్న ఎంఎస్‌ఎంఈలు ఈ రోజుకి కూడా సప్లై చైన్‌ డిస్ట్రిబ్యూషన్‌, తీవ్రమైన లేబర్‌ కొరతతో కష్టాలుపడుతున్నాయి. మరికొన్ని ఎంఎస్‌ఎంఈలు మారిన కస్టమర్ల ప్రాధాన్యాల సమస్యను ఎదుర్కొంటున్నాయన్న విషయాన్ని మీరు సైతం అంగీకరిస్తారని భావిస్తున్నాను.

కార్పస్‌ ఫండ్ స్కీమ్‌ మార్గదర్శకాలు ఇవ్వాలి
ఆత్మనిర్భర్‌ భారత్‌ ప్యాకేజీలో రుణభారంతో సతమతమవుతున్న ఎంఎస్‌ఎంఈ యూనిట్లు, ఇన్నోవేటివ్‌ ఎంఎస్‌ఎంఈల కోసం మరో రెండు పథకాలు ప్రకటించారు. దురదృష్టవశాత్తు, అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం తెలంగాణలోనే కాకుండా, దేశంలో ఎక్కడా ఈ పథకాలు ప్రారంభమైన పరిస్థితి కనిపించడం లేదు. రుణభారంతో సతమతమవుతున్న ఎంఎస్‌ఎంఈల కోసం ప్రకటించిన ‘సబార్డినెట్‌ డెబ్ట్‌’ స్కీం.. అత్యంత తక్కువ రుణమొత్తాన్ని అందిస్తున్నది. ఎంఎస్‌ఎంఈల వయబిలిటీపైన స్పష్టతలేని పరిస్థితుల్లో మీరిచ్చే అత్యంత తక్కువ రుణమొత్తం.. ఎంఎస్‌ఎంఈల అవసరాలకి ఏమాత్రం సరిపోవడం లేదు. ఇన్నోవేటివ్‌ ఎంఎస్‌ఎంఈల కోసం ప్రకటించిన కార్పస్‌ ఫండ్‌ స్కీమ్‌ మార్గదర్శకాలు కూడా విడుదలకాలేదు. వీటిని వెంటనే విడుదలచేయాలి.

బడా కంపెనీలకే అండ
ఆత్మనిర్భర్‌ ప్యాకేజీలో భాగంగా కీలక రంగాలకు ప్రకటించిన ప్రొడక్షన్‌ లింక్‌డ్‌ ఇన్సెంటివ్‌ స్కీమ్‌ పథకం ద్వారా దేశంలోని ఎంఎస్‌ఎంఈలపై పెద్దఎత్తున సానుకూల ప్రభావం చూపే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుత పథకం బడా కంపెనీలకు మాత్రమే ప్రయోజనాలు చేకూర్చేలా ఉన్నది. దేశీయ ఎంఎస్‌ఎంఈలతో కూడిన ఒక సప్లై చైన్‌ ఏర్పాటుచేయాలని భారీ తయారీ కంపెనీలకు ఒక నిబంధన రూపొందించడం ద్వారా పీఎల్‌ఐ ప్రయోజనాలను ఎంఎస్‌ఎంఈలతో పంచుకొనేలా ఈ కార్యక్రమం మార్గదర్శకాలను మార్చవలసిన అవసరమున్నది. గతేడాది మీరు ప్రకటించిన ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీలో ఎన్నో పరిమితులు, ఇబ్బందులు ఉన్నప్పటికీ, కరోనా సంక్షోభకాలం స్వల్పకాలమే ఉంటుందని, ఈ కాలానికి మీరు ప్రకటించిన ప్యాకేజీ సరిపోతుందని ఆశించాం. ప్రస్తుతం ఉన్న కరోనా రెండోదశను సైతం దాటి కొనసాగుతున్నది. త్వరలోనే మూడోదశ వచ్చే అవకాశమున్న నేపథ్యంలో, ప్రస్తుత ఆత్మ నిర్భర్‌ ప్యాకేజీని మరోసారి పునర్నిర్వచించడం ద్వారా కరోనా వల్ల అత్యధికంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ఎంఎస్‌ఎంఈ రంగానికి చేయూతనిచ్చే అవకాశం కలుగుతుంది. ఈ దిశగా కేంద్రం చర్యలు తీసుకొంటుందని, కేంద్రంచేసే ప్రయత్నాలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. ఈ ప్యాకేజీ విషయంలో మా ఇబ్బందులను పరిగణలోకి తీసుకొని, రాష్ట్రాల అంచనాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకొంటుందని ఆశిస్తున్నాను.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.