Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఏడు జోన్లు రెండు మల్టీజోన్లు

-ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ నిర్ణయం.. జోన్లకు ప్రముఖ ప్రాంతాల పేర్లు -గతంలో జరిగిన అన్యాయాల నుంచి విముక్తి -స్థానికులకు అధిక ప్రయోజనం -నేడు టీజీవో భవన్‌లో ఉద్యోగుల సమావేశం

కొత్తగా ఏర్పడబోయే జోన్లు.. వాటి పరిధిలోని జిల్లాలు

1. కాళేశ్వరం జోన్ (28,29,615 జనాభా):జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, పెద్దపల్లి 2. బాసర జోన్ (39,74,829 జనాభా): ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల 3. రాజన్న జోన్ (43,09,866 జనాభా): కరీంనగర్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, కామారెడ్డి, మెదక్ 4. భద్రాద్రి జోన్ (50,44,844 జనాభా): భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ 5. యాదాద్రి జోన్ (40,23,800 జనాభా): సూర్యాపేట, నల్లగొండ, యాదాద్రి భువనగిరి, జనగామ 6. చార్మినార్ జోన్ (1,03,57,289 జనాభా): హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి 7. జోగుళాంబ జోన్ (44,63,431 జనాభా): మహబూబ్‌నగర్, వనపర్తి, జోగుళాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్ మల్టీ జోన్లు.. 1.కాళేశ్వరం, బాసర, రాజన్న, భదాద్రి (1.61 కోట్ల జనాభా) 2.యాదాద్రి, చార్మినార్, జోగుళాంబ (1.88 కోట్ల జనాభా)

తెలంగాణ ప్రజలకు గతంలో జరిగిన అన్యాయాలు పునరావృతం కాకుండా రాష్ట్రంలో నూతన జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థల ఏర్పాటుపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయం తీసుకొన్నారు. ఇందుకు సంబంధించి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం కేసీఆర్.. గురువారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్షను నిర్వహించి జోన్లు, మల్టీజోన్ల వ్యవస్థలపై విస్తృతంగా చర్చించారు. తెలంగాణ ఉద్యోగులకు ప్రయోజనం చేకూరేలా, గతంలో జరిగిన అన్యాయాలు మళ్లీ జరగకుండా ఉండేందుకు రాష్ట్రంలో ఏడు జోన్లు, రెండు మల్టీజోన్లు ఉండేలా నిర్ణయం తీసుకొన్నట్లు సీఎం కేసీఆర్ వెల్లడించారు. జోన్లకు రాష్ట్రంలో చారిత్రక ప్రాముఖ్యం ఉన్న ప్రాంతాల పేర్లను ఖరారుచేశారు.

స్థానికులకే ఎక్కువ ప్రయోజనం రాష్ట్రంలో చిన్న జిల్లాలు ఏర్పాటు చేసుకొన్నందున ఆయా ప్రాంతాల్లోని స్థానికులకు ఎక్కువ ప్రయోజనం కలిగేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకొన్నదని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం, ఆ తర్వాత జిల్లాల పునర్విభజన జరుగడంతో జోన్ల వ్యవస్థను కూడా పునర్విభజించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలనుంచి వచ్చిన ప్రతిపాదనలపై సమీక్షించి, జోన్లు, మల్టీజోన్లను ఖరారుచేశారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి, సీనియర్ అధికారులు అజయ్‌మిశ్రా, నర్సింగ్‌రావు, శివశంకర్, అధర్‌సిన్హా, భూపాల్‌రెడ్డి, ఉద్యోగ సంఘాల నేతలు దేవీప్రసాద్, కారం రవీందర్‌రెడ్డి, ఎంపీలు వినోద్‌కుమార్, మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీనివాస్‌గౌడ్, రెడ్యానాయక్, ఆరూరి రమేశ్, వేముల ప్రశాంత్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, శంకర్‌నాయక్, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు పాల్గొన్నారు.

నేడు టీజీవో భవన్‌లో ఉద్యోగుల సమావేశం రాష్ట్రంలోని 31 జిల్లాలను వివిధ జోన్లు, మల్టీ జోన్లుగా విభజించిన అంశాన్ని ఉద్యోగులకు తెలుపడంతోపాటు ఇతర అంశాలను చర్చించడానికి శుక్రవారం టీజీవో భవన్‌లో ఉద్యోగుల సమావేశం జరుగనున్నది. ఇందులో అందరి అభిప్రాయాలను స్వీకరించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నివేదిస్తారు. అనంతరం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రభుత్వానికి నోట్ పంపుతారు. దీనిపై క్యాబినెట్ సమావేశం జరుగుతుంది. క్యాబినెట్ ఆమోదం లభించిన వెంటనే రాష్ట్రపతి ఆమోదంకోసం పంపిస్తారు. ఈ మొత్తం వ్యవహారాన్ని తానే స్వయంగా పర్యవేక్షించి, తెలంగాణలో కొత్త జోనల్, మల్టీ జోనల్ వ్యవస్థ అమల్లోకి వచ్చేలా చూస్తానని సీఎం కేసీఆర్ చెప్పారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.