తెలంగాణ రాష్ట్రంలో వర్ధిల్లిన ఒకనాటి గంగాజమునా తహెజీబ్ సంప్రదాయాన్ని తిరిగి తీసుకువద్దామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. ప్రజలందరి సహకారం, అల్లాహ్ దయతో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించుకుని అభివృద్ధిలో పురోగమిస్తున్నామని చెప్పారు. రాష్ర్టాభివృద్ధికి అందరూ సహకరించాలని ఈ భూమి తల్లి బిడ్డగా, మీ కొడుకుగా విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. ప్రభుత్వపరంగా తాము ఇప్పటిదాకా చేసింది చాలా తక్కువేనన్న కేసీఆర్, ముందుముందు ఇంకా ఎన్నో మంచి కార్యక్రమాలు చేపడతామని చెప్పారు.

-మీ అందరి బిడ్డని..అభివృద్ధిలో అందరి సాయం కావాలి -మంచి పనులు, మంచి కార్యాలతో సాగుదాం -గంగా జమునా తహెజీబ్ పాదుకొల్పుదాం -సామరస్యానికి ప్రతీక తెలంగాణ -ప్రపంచంలో ఇలాంటి ప్రదేశం మరొకటిలేదు -ఇతరులతో సమస్యలింకా పోలేదు -ఖుదా ఆశీర్వాదంతో వాటిని అధిగమిస్తాం -దావతే ఇఫ్తార్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ -రాష్ట్రవ్యాప్తంగా 195 మసీదుల్లో ఇఫ్తార్ విందు
కొందరు మన చెరుపును కోరుకుంటున్నారని అంటూ.. లక్షమంది మన చెడుకోరుకున్నా సరే.. భగవంతుడి అనుగ్రహం ప్రకారమే ఏదైనా జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పవిత్ర రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఆదివారం రాత్రి నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించిన దావతే ఇఫ్తార్(ఇఫ్తార్ విందు)కు హాజరైన సీఎం ముస్లిం సోదరులనుద్దేశించి ప్రసంగించారు. అస్వస్థతతో బాధపడుతున్నప్పటికీ విందుకు హాజరైన కేసీఆర్ రాష్ట్ర ముస్లింలందరికీ రంజాన్ పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ముస్లింలకు రాష్ట్ర ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని పేర్కొన్నారు
చేయాల్సింది ఎంతో ఉంది మై వతన్ కా బేటా హు. ఆప్ కా బేటా హు.. అంటూ ప్రసంగం ప్రారంభించిన కేసీఆర్ రాష్ర్టాభివృద్ధిలో సహకారం అందించాలని అర్థించారు. అందరూ సహకరిస్తే మంచి పనులు, పుణ్యకార్యాలతో ముందుకు సాగుతామన్నారు. ఇప్పటిదాకా ప్రజలకు తాము చేసింది తక్కువేనని, ముందు ముందు చాలా చాలా చేయాల్సి ఉందని పేర్కొన్నారు. విందుకు హాజరైన, మతపెద్దలు, ప్రముఖులకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఒకనాడు మతసామరస్యంలో ప్రపంచానికే ఆదర్శంగా నిలించిందని, గంగా జమున సంప్రదాయం, సంస్కృతికి ప్రతీక అని పలువురు మనను ప్రస్తుతించారని చెప్పారు. 1927లో జాతిపిత మహాత్మాగాంధీ హైదరాబాద్ సందర్శన సందర్భంగా వివేకవర్ధని కాలేజీలో ప్రసంగిస్తూ ఇక్కడి రాజులు, ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు ఎంతో బాగున్నాయని ప్రశంసించారని గుర్తుచేశారు.
సమాజంలో ఒకరికొకరు కలిసి మెలిసి సమైక్య భావాలతో మెలగడంలో ప్రపంచంలో తెలంగాణకు మించిన ప్రదేశం మరొకటి లేదని గాంధీ కొనియాడారని ఆన్నారు. ఇక్కడి ప్రజల గంగాజమున తహెజీబ్‌ను చూసి ఉత్తర భారతం నేర్చుకోవాల్సిన అవసరం ఉందని కూడా అభిప్రాయపడ్డారని చెప్పారు. ఇది మన అసలైన తెలంగాణ సంస్కృతి అని , మధ్యలో మనం కొంత సమయం వరకు వారి, వీరి చెప్పుడు మాటలు విని దారితప్పామన్నారు. ఇపుడు మన రాష్ట్రం వచ్చిందని, ఎన్నికల ముందు చేసిన వాగ్దానం ప్రకారం గంగా- జమునా తహెజీబ్‌ను తిరిగి తీసుకొస్తామని చెప్పారు.
తెలంగాణ ప్రాంతపు పాత సువాసనలను తిరిగి తప్పకుండా పునరుద్ధరిస్తామన్నారు. రంజాన్ పర్వదినాలను పురస్కరించుకుని ఈసారి లక్షా 95వేల మంది నిరుపేదలకు బట్టలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని 195 మసీదులలో ఆదివారం ప్రభుత్వం తరఫున దావతే ఇఫ్తార్ ఏర్పాటు చేశామని చెప్పారు. మన పూర్వ సంప్రదాయాలు, సంస్కృతిని తిరిగి పాదుకొల్పే దిశగా ఇది చిన్న ప్రయత్నమని కేసీఆర్ అన్నారు. రాబోయే రోజుల్లో ఇదే సంప్రదాయాన్ని పాటిస్తూ ముందుకు నడవాల్సిన అవసరం ఉందన్నారు. ఇతరులతో సమస్యలున్నాయి..
తెలంగాణ రాష్ర్టానికి సంబంధించి ఇతరులతో ఇంకా అనేక సమస్యలు ఉన్నాయని కేసీఆర్ అన్నారు. మనం నష్టపోవాలని కోరుకునే వాళ్లు ఉన్నారని అన్నారు. అయితే ఖుదా ఆశీర్వాదంతో అన్నీ అధిగమిస్తామని తెలిపారు. ముద్దయి లాఖ్ బురా చాహె తో క్యాహోగా- జో హోగా మంజూరే ఖుదా హోగా (లక్ష మంది మనకు చెడు జరగాలని కోరుకున్నా ఏమవుతుంది?.. ఖుదా అనుగ్రహం ప్రకారమే ఏదైనా జరుగుతుంది) అని ఉర్దూ సూక్తిని ఆయన ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలో విద్యుత్ సమస్య తీవ్రంగా ఉండేదని, ఇప్పుడు దాని పూర్తి బందోబస్తు అయిపోయిందని అన్నారు.
భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కోతలు అంటూ ఇక ఉండవని సీఎం స్పష్టం చేశారు. సాగునీటి విషయంలో సమైక్య పాలనలో అన్యాయానికి గురయ్యామని ఆ సమస్య ఇప్పటికీ కొనసాగుతున్నదని చెప్పారు. జల్ద్‌సే జల్ద్ (సాధ్యమైనంత త్వరగా) ఆ సమస్యను కూడా అధిగమిస్తామని, ధీమా వ్యక్తం చేశారు. రైతులకోసం మంచి ప్రణాళికలు, పథకాలను ప్రభుత్వం సిద్ధం చేస్తున్నదని, వాటన్నింటినీ త్వరలోనే అమలులోకి తెస్తామని సీఎం ప్రకటించారు.
సుప్రసిద్ధ జామే నిజామియా ఇస్లామిక్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్స్‌లర్ ముఫ్తీ ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ రంజాన్ ప్రపంచానికి మానవత్వ సందేశాన్నిచ్చేది.. నిరుపేదల్లో సుఖ సంతోషాలు, వెలుగులు నింపేది అని వివరించారు. పేదవాడి గురించి ఆలోచన చేయాలని రంజాన్ హితవు చెబుతున్నదని, అందువల్ల ఈ పవిత్ర మాసంలో మనకు తోచిన సహాయం చేసి పేదవారిని ఆదుకోవాలని ఉద్బోధించారు. ఖలీల్ అహ్మద్ ఇఫ్తార్‌కు ముందు ప్రత్యేక దువా చేశారు. ఆ తర్వాత ముస్లింలు ఖర్జ్జూర పండ్లు, ఇతర పండ్లు, ఫలహారాలతో ఉపవాస దీక్షను విరమించారు. సీఎం కేసీఆర్ మౌలానా ముఫ్తీ ఖలీల్ అహ్మద్‌కు ఖర్జూరం అందించి ఇఫ్తార్ చేయించారు.
పలువురు ప్రముఖులు హాజరు నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో నిర్వహించిన ఇఫ్తార్ విందుకు పలువురు ముస్లిం మత ప్రముఖులు, రాజకీయ నేతలు, ఆయా రంగాల ప్రముఖులు హాజరయ్యారు. కేంద్రమంత్రి, బీజేపీ నాయకుడు బండారు దత్తాత్రేయ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, ఎంబీటీ నాయకుడు అమ్జదుల్లాఖాన్, ఇరాన్‌కాన్సులేట్ జనరల్ హసన్ నూరేయిన్, టర్కీ కాన్సులేట్ జనరల్ ఉమర్ ఓగ్లు, అమెరికా-ఇండియా తొలి పౌరసత్వం పొందిన ఇఫ్తెఖార్ షరీఫ్, జమాతే ఇస్లామి రాష్ట్ర అధ్యక్షుడు హామెద్ మహ్మద్ ఖాన్, దక్కనే ఒలేమాయే హింద్ అధ్యక్షుడు మౌలానా ఖుబుల్ పాషా షుత్తారి, మక్కామసీదు ఇమామ్ హాఫెజ్ మహ్మద్ ఉస్మాన్, మౌలానా అస్రార్ అహ్మద్, మౌలానా ముర్తుజా పాషా, సయ్యద్ సందానీ అలీ ఖాద్రీ,
నాంపల్లి దర్గా ముతవల్లీ ఫైసల్ అలీషా, గయాసుద్దీన్ బాబుఖాన్, రాష్ట్ర శాసనమండలి చైర్మన్ కే స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహారెడ్డి, టీఆర్‌ఎస్ ఎంపీలు డాక్టర్ కే కేశవరావు, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ప్రభుత్వ సలహాదారు విద్యాసాగర్‌రావు, మజ్లిస్ ఎమ్మెల్యే అహ్మద్ బలాల, ఎమ్మెల్సీ అమీనుల్ జాఫ్రీ, ఎమ్మెల్సీలు సలీం, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, నామినెటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్‌శర్మ, హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్లు మహేందర్‌రెడ్డి, సీవీ ఆనంద్, జీహెచ్‌ఎంసీ ప్రత్యేక అధికారి సోమేశ్‌కుమార్,
పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి రేమండ్ పీటర్, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, డైరెక్టర్ ఎంజె అక్బర్, తెలంగాణ హజ్ కమిటీ ప్రత్యేక అధికారి ప్రొఫెసర్ ఎస్‌ఎ షుకూర్ తదితరులు విందుకు హాజరైనవారిలో ఉన్నారు. కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, సీపీఎం నుంచి నేతలెవరూ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌కు తెలుగు భాషలో ప్రచురించిన ఖురాన్ గ్రంథాన్ని అందజేశారు. ఏసీబీ డీజీ, రంజాన్ ఏర్పాట్ల పర్యవేక్షణ టాస్క్‌ఫోర్స్ కమిటీ చైర్మన్ ఏకే ఖాన్ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

బట్టలు పంపిణీ చేసిన కేసీఆర్ ఇఫ్తార్ విందు అనంతరం సీఎం కేసీఆర్ కొందరు పేద ముస్లింలకు ప్రభుత్వం తరఫున రంజాన్ కానుకగా దుస్తులను అందజేశారు. రాష్ట్రంలో లక్షా 95 వేల నిరుపేద ముస్లింలకు ఒక్కొక్క కుటుంబానికి రూ. 500 విలువ చేసే దుస్తులను రంజాన్ గిఫ్ట్‌గా ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దానిలో భాగంగా ఈ నెల 15, 16 తేదీల్లో ఆ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఆదివారం ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
అనీసుర్ గుర్బా అనాథాశ్రయం పిల్లలకు నిజాం కాలేజ్ గ్రౌండ్‌లో ఇఫ్తార్ విందులో ప్రత్యేకంగా వేదిక ఏర్పాటు చేసి, భోజనాలు అందజేశారు. సీఎం వారితోపాటు కొందరు నిరుపేద మహిళలకు రంజాన్ కానుకలను అందజేశారు. విందులో పలువు ముస్లింసోదరుల వద్దకు వెళ్ళి పలుకరించారు. అనంతరం ముఖ్యమంత్రి బంజారాహిల్స్‌లోని మదీనా మసీదు ఎదురుగా మైదానంలో ఇఫ్తార్ విందులో పాల్గొని 200 మంది పేదలకు రంజాన్ కానుకలు అందజేశారు.
రాష్ట్రంలో 195 మసీదుల వద్ద సర్కార్ ఇఫ్తార్ రంజాన్ పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని 195 మసీదుల వద్ద ఆదివారం ఇఫ్తార్ విందు ఇచ్చారు. జీహెచ్‌ఎంసీ పరిధిలోని 103 మసీదులు, తెలంగాణ జిల్లాల్లో 95 మసీదుల వద్ద ప్రభుత్వం వెయ్యి మందికి చొప్పున ఇఫ్తార్ విందును ఏర్పాటు చేసింది. ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో మసీదుల వద్ద ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి.
హామీలను త్వరలోనే నెరవేరుస్తాం -ముస్లింల సంక్షేమానికి అనేక పథకాలు రూపొందించాం -బంజారాహిల్స్ ఇఫ్తార్ విందులో సీఎం కేసీఆర్ ముస్లింల సంక్షేమం కోసం ఇచ్చిన హామీలన్నింటినీ త్వరలోనే నెరవేరుస్తామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రంజాన్ పర్వదినాలను పురస్కరించుకొని ప్రభుత్వం తరపున ముస్లింలకు ఇచ్చిన ఇఫ్తార్ విందులో భాగంగా బంజారాహిల్స్ రోడ్ నం.10లోని జహీరానగర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. తెలంగాణలోని ముస్లింలను గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడంతో వారు అన్నిరంగాల్లోనూ వెనుకబడ్డారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముస్లింల సంక్షేమం కోసం అనేక పథకాలు రూపొందించామని తెలిపారు.
పేద ముస్లిం కుటుంబాల్లో ఆడపిల్లల వివాహాల కోసం షాదీ ముబారక్ పథకం, ముస్లింల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించామన్నారు. రంజాన్ సందర్భంగా పేద ముస్లింలకు కానుకను అందజేయడంతోపాటు అన్ని ప్రాంతాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేశామని, ఇందుకోసం ఒక్కో మసీదు వద్ద విందుకు రూ 2లక్షలు మంజూరు చేశామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కే కేశవరావు, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, పలువురు ప్రముఖులు, స్థానికులు పాల్గొన్నారు.