Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఈ ఎన్నికలు ఆత్మగౌరవానికి పరీక్ష..

వరంగల్ ఉప ఎన్నికలు ఆత్మగౌరవానికి ప్రతీకని పంచాయతీరాజ్, ఐటీశాఖల మంత్రి కేటీఆర్ అభివర్ణించారు. పార్టీలో సభ్యత్వమే లేని వ్యక్తికి బీజేపీ, హైదరాబాద్ నుంచి దిగుమతి చేసుకున్న వ్యక్తికి కాంగ్రెస్ టికెట్లు ఇచ్చి వరంగల్ దళిత నేతలను అవమానించాయన్నారు. -రెండు పార్టీలు వరంగల్ దళిత బిడ్డలను అవమానించాయి -టీఆర్‌ఎస్‌లో కాంగ్రెస్ నేత ప్రతాప్ చేరిక సమావేశంలో మంత్రి కేటీఆర్ -అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్య ఎన్నికలివి: హరీశ్‌రావు -ఎల్లలు లేని రాష్ర్టాభివృద్ధే టీఆర్‌ఎస్ సర్కారు లక్ష్యం:డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి జగదీశ్‌రెడ్డి -బీజేపీకి అప్పు అభ్యర్థి.. కాంగ్రెస్‌కు అద్దె అభ్యర్థి: మంత్రి పోచారం -ఉప ఎన్నిక రెఫరెండమని ప్రధానితో చెప్పించగలరా? -కిషన్‌రెడ్డికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ సవాల్ -మెజార్టీ మాత్రమే తేలాల్సి ఉంది: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి -పత్తి మద్దతు ధరకోసం కేంద్రం మెడలు వంచుదాం: ఎంపీ వినోద్

KTR-election-campaign-in-warangal-05

స్టేషన్‌ఘన్‌పూర్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజారపు ప్రతాప్ ఆ పార్టీకి రాజీనామా చేసి శుక్రవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. హన్మకొండ నయీంనగర్‌లోని టీఆర్‌ఎస్ అర్బన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, భారీనీటిపారుదల శాఖమంత్రి హరీశ్‌రావు, మంత్రి కేటీఆర్‌లు రాజారపు ప్రతాప్‌కు గులాబీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు టీ రవీందర్‌రావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ బీజేపీ అభ్యర్థి పగిడిపాటి దేవయ్య 40 ఏండ్లకుపైగా విదేశాల్లో ఉన్నారు. పార్టీలో ప్రాథమిక సభ్యత్వం లేని ఆయనకు బీజేపీ టికెట్ ఇచ్చింది.

ఇన్నాళ్లుగా బీజేపీలో పనిచేస్తున్న సాధారణ కార్యకర్తలు, పేదలు నిరసన వ్యక్తంచేసినా పట్టించుకోలేదు. కాంగ్రెస్ మొదట ఒక అభ్యర్థిని బరిలోకి దింపింది. ఆయన ఇంట్లో జరిగిన ఒక విషాదఘటనతో రెండో కృష్ణుడిని హైదరాబాద్ నుంచి రప్పించింది. వరంగల్ లోక్‌సభ అభ్యర్థిగా టికెట్ ఆశించిన రాజారపు ప్రతాప్‌ను కాదని, గత ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిన సర్వే సత్యనారాయణకు టికెట్ ఇచ్చింది. రెండు పార్టీలు వరంగల్ బిడ్డల ఆత్మగౌరవాన్ని గాయపరిచాయి. సర్వేకు టికెట్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానానికి వరంగల్‌లో దళిత సైనికులు కనపడలేదా? 2014లో తిరస్కరించిన సర్వేను వరంగల్ ప్రజలపై రుద్దేప్రయత్నం కాంగ్రెస్ చేస్తున్నది. మల్కాజిగిరిలో చెల్లని రూపాయి ఇక్కడ ఎలా చెల్లుతుందా అని ప్రశ్నించారు.

టీఆర్‌ఎస్ అభ్యర్థి తొలి నుంచి ఉద్యమంలో పనిచేశారని, సాధారణ కార్యకర్తకు టికెట్ ఇవ్వడంతోపాటు ఎన్నికల ఖర్చుగా రూ.70లక్షల చెక్కును టీఆర్‌ఎస్ అందజేసిందని చెప్పారు. దయాకర్ భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్నదని, మొన్న ఢిల్లీలో అరవింద్ కేజ్రీవాల్, నిన్న బీహార్‌లో నితీశ్‌ష్‌కుమార్, తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిచి అధికారంలోకి రావడం నిదర్శనమన్నారు. కాంగ్రెస్ వైఖరిని నిరసిస్తూ రాజారపు ప్రతాప్ తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరడం అభినందనీయమన్నారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సైన్యం లేని సైన్యాధిపతని, ఆయన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికాదు ఉత్తకుమార్‌రెడ్డేనని ఎద్దేవాచేశారు. కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యేలు వినయభాస్కర్, టీ రాజయ్య, రెడ్యానాయక్, గొంగిడి సునీత పాల్గొన్నారు.

Harish-Rao-election-campaign-in-warangal-east04

అహంకారానికి, ఆత్మగౌరవానికి మధ్యే ఎన్నికలు: హరీశ్‌రావు ఉప ఎన్నికలో కాంగ్రెస్ నిర్ణయం పార్టీ శ్రేణుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. స్థానికులు టికెట్ ఆశించినా పట్టించుకోకుండా హైదరాబాద్‌కు చెందిన సర్వే సత్యనారాయణకు టికెట్ ఇచ్చింది. ఈ ఉప ఎన్నిక కాంగ్రెస్ అహంకారానికి, వరంగల్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్నవి. కోట్ల రూపాయలను చూసి దేవయ్యకు బీజేపీ టికెట్ ఇచ్చింది. స్థానిక నేతలు అభ్యర్థిత్వాన్ని ఆశించగా లెక్క చేయకుండా అమెరికా నుంచి దేవయ్యను దిగుమతి చేసుకున్నది. రెండు పార్టీల దిగుమతి అభ్యర్థులకు వరంగల్ ప్రజలు తగిన గుణపాఠం చెప్పబోతున్నారుఅని మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు.

ఉప ఎన్నికలు పేదోడికి..కోటీశ్వరుడికీ, కాంగ్రెస్ అహంకారానికి మధ్య జరుగుతున్నవిగా ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. రాజారపు ప్రతాప్ చేరిక సమావేశంలో, ఖిలావరంగల్‌లో రోడ్ షో, తొర్రూరు బహిరంగ సభల్లో హరీశ్‌రావు పాల్గొని ప్రసంగించారు. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ మంత్రి షబ్బీర్‌అలీలు టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రశ్నావళితో కూడిన బుక్‌లెట్‌ను విడుదల చేయటంపై తీవ్రంగా మండిపడ్డారు. 2009 ఎన్నికల మ్యానిఫెస్టోలో ఒక్క హామీని కూడా పదేండ్లపాలనలో కాంగ్రెస్ అమలుచేయలేదని ఆరోపించారు. ఐదేండ్లలో పూర్తి చేయాల్సిన మ్యానిఫెస్టోలో హామీల్లో 99 శాతం హామీలను టీఆర్‌ఎస్ 17 నెలల్లోనే అమలుచేసిందని చెప్పారు. పీవీ నర్సింహారావు, కాళోజీ నారాయణరావు, జయశంకర్ సార్‌ను కాంగ్రెస్ మరచిపోతే టీఆర్‌ఎస్ గౌరవించిందని చెప్పారు.

Jagadish-Reddy-election-campaign-in-Torrur002

కేంద్ర మాజీమంత్రి వెంకటస్వామి విగ్రహాన్ని హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని గుర్తుచేశారు. పదేండ్ల నుంచి వరంగల్ ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం ఊరించిన పోలీస్ కమిషనరేట్‌ను టీఆర్‌ఎస్సే ఏర్పాటు చేసిందన్నారు. కాకతీయ కళాతోరణాన్ని రాజముద్రలో చేర్చడం, చెరువుల పునరుద్ధరణ కార్యక్రమానికి మిషన్ కాకతీయ పేరు పెట్టడం ద్వారా వరంగల్‌కు ప్రభుత్వం గుర్తింపునిచ్చిందన్నారు. హైదరాబాద్ తర్వాత పబ్లిక్ స్కూల్‌ను వరంగల్ జిల్లాకు ప్రభుత్వం మంజూరుచేసిందని, ఇక్కడికి సైనిక్‌స్కూల్‌ను ఇచ్చిన ఘనత కూడా సీ ఎం కేసీఆర్‌దేనని చెప్పారు.

వరంగల్‌లో హెల్త్ యూనివర్సిటీ, టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాజీపేటలో వ్యాగన్ పరిశ్రమ కోసం దేవాదాయశాఖ కు రూ.23 కోట్లు చెల్లించి 53 ఎకరాల భూమిని రైల్వేశాఖకు అప్పగించించామన్నారు. కాంగ్రెస్ పదేండ్ల పాలనలో వరంగల్ జిల్లాకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. కార్యక్రమాల్లో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ బోడికకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే కొండా సురేఖ, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు, వరంగల్ అర్బన్ జిల్లా అధ్యక్షుడు నన్నపునేని నరేందర్, అచ్చ విద్యాసాగర్, ఎర్రబెల్లి ప్రదీప్‌రావు పాల్గొన్నారు.

ప్రతిపక్షాల దిమ్మతిరగాలి: డిప్యూటీ సీఎం కడియం, మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రతిపక్ష పార్టీల దిమ్మ తిరిగేలా వరంగల్ ఉప ఎన్నికలో ప్రజలు తీర్పును ఇవ్వాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, విద్యుత్‌శాఖ జగదీశ్‌రెడ్డి కోరారు. శుక్రవారం పాలకుర్తి ఇన్‌చార్జి సుధాకర్‌రావు అధ్యక్షతన రాయపర్తిలో జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన కడియం, జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ అన్నివర్గాలకు సంక్షేమ ఫలాలు అందించాలన్న లక్ష్యంతోనే సీఎం కేసీఆర్, మంత్రివర్గం పనిచేస్తున్నదని చెప్పారు. ఎల్లలు లేని అభివృద్ధి ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉద్యమంలో కలసిరాని, బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములుకాని ప్రతిపక్షాలకు ఓట్లు అడిగే హక్కులేదన్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ మనసున్న మారాజని, ఉప ఎన్నికల్లో దయాకర్‌ను ఎంపీగా గెలిపించి కానుకగా ఇవ్వాలని కోరారు. ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, వేముల వీరేశం, మాజీ ఎమ్మెల్యేలు సుధాకర్‌రావు, సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ ప్రజలను ప్రలోభపెట్టడానికి వస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలు ఓటుతో చెంప ఛెళ్లుమనే తీర్పు ఇవ్వాలని కోరారు. టీడీపీ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు నాటకాలాడటంలో ఆరితేరాడని, ఆయన మాటలను నమ్మితే భంగపడకతప్పదని హెచ్చరించారు. అనంతరం మండలంలోని 23 గ్రామాలు, 74 తండాలకు చెందిన పలుపార్టీల కార్యకర్తలు మంత్రుల సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

రైతులపై కిషన్‌రెడ్డిది మొసలికన్నీరు: మంత్రి పోచారం ఉప ఎన్నికలో ప్రతిపక్ష పార్టీల పరిస్థితి గందరగోళంగా ఉంది. బీజేపీకి అప్పు అభ్యర్థి దొరికితే, కాంగ్రెస్‌కుఅద్దె అభ్యర్థి దొరికాడు. ఎప్పటి నుంచో ఉద్యమంలో ఉన్న టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ మాత్రం ప్రజలకు అందుబాటులో ఉంటారు. భారీ మెజార్టీతో గెలిపించాలి అని వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం మంథని ఎమ్మెల్యే పుట్ట మధుతో కలిసి భూపాలపల్లి మండలంలోని అటవీగ్రామాలైన నాగారం, ఆజంనగర్, దూదేకులపల్లి, దీక్షకుంట, పంబాపూర్, గొల్లబుద్దారం, రాంపూర్, కమలాపురంలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 60 ఏండ్లలో టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు ప్రజల కోసం ఏం చేశాయో చెప్పి ఓట్లు అడగాలని సవాల్ విసిరారు. పంటలకు మద్దతు ధర కల్పించాలని సీఎం కేసీఆర్ నేతృత్వంలో పలుమార్లు కేంద్రానికి లేఖలు రాసినా స్పందించలేదన్నారు. కేంద్రం నిర్లక్ష్యంతోనే రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తున్నదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్‌రెడ్డి మాత్రం రైతుల సమస్యలపై మొసలి కన్నీరు కారుస్తున్నారని, పరిష్కారం కోసం ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం కూడా చేయలేదని మండిపడ్డారు.

ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా సీఎం కేసీఆర్ పాలన: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి సీఎం కేసీఆర్ సాధిస్తున్న అద్భుత ప్రగతిని చూసి దేశంలోని ఇతర రాష్ర్టాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చెప్పారు. శుక్రవారం వరంగల్ జిల్లా లింగాలఘనపురం మండలం పటేలుగూడెం, నవాబుపేట, వడిచర్ల, కొత్తపల్లి, నేలపోగుల, కుందారంలో ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గొంగిడి సునీత, రాజయ్య, ఎంపీ అభ్యర్థి పసునూరి దయాకర్‌తో ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రగతి సాధిస్తామని కేసీఆర్ ఆనాడే చెప్పారని, 17 నెలల్లోనూ అన్నివర్గాలు లబ్ధిపొందేలా పాలిస్తున్నారని చెప్పారు. టీఆర్‌ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ విజయం ఎప్పుడో ఖాయమైందని, మెజార్టీ మాత్రమే తేలాల్సి ఉందన్నారు.

ప్రతిపక్షాలవి డ్రామా కంపెనీ వేషాలు ప్రతి పక్షపార్టీల నాయకులవి డ్రామా కంపెనీ వేషాలని, వారికి ప్రజల మధ్యకు వెళ్లే దమ్ములేదని వా ణిజ్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవాచేశారు. శుక్రవారం హన్మకొండలో ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి ధైర్యముంటే ప్రధానితో వరంగల్ ఉపఎన్నిక రెఫరెండమేనని చెప్పించాలని సవాల్ విసిరారు. 45 ఏండ్లు కాంగ్రెస్, 17 ఏండ్లు టీడీపీలు రాష్ట్రాన్ని ఏలినా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. దేశవ్యాప్తంగా రైతు ఆత్మహత్యలు జరుగుతున్నా, ప్రతిపక్షాలు మాత్రం రాష్ట్రప్రభుత్వంపై కుట్ర రాజకీయాలు చేస్తున్నాయన్నారు.

రైతులను ఆదుకోవడానికి రూ.6 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వడానికి సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారని గుర్తుచేశారు. ఆత్మహత్యలు నివారించడానికి ఇప్పటికే ప్రభుత్వం విద్యుత్ సమస్యను అధిగమించిందన్నారు. ప్రతిపక్షాల కుట్రలు తిప్పి కొట్టి పసునూరి దయాకర్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తన రాజీనామా అంశం కోర్టు, స్పీకర్ పరిధిలో ఉందని విలేకరులడిగిన ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

బీజేపీ తీరుతో రైతుల ఆత్మహత్యలు: ఎంపీ వినోద్ గత ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం పత్తి రైతులకు మద్దతు ధర కల్పించడంలో కేంద్రం విఫలమైంది.. పోరాటాలతో కేంద్రం మెడలు వంచి మద్దతు ధర సాధించుకుంటామని కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. శుక్రవారం వర్ధన్నపేట మండలం సింగారంలో ఎమ్మెల్యే అరూరి రమేశ్‌తో కలిసి ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. గత ఎన్నికల మ్యానిఫెస్టోలో పత్తి క్వింటాల్‌కు రూ.5వేలు చెల్లిస్తామని చెప్పిన బీజేపీ, అధికారంలోకి వచ్చాక కేవలం రూ.50 పెంచి రూ.4100 చెల్లించడంతో దేశవ్యాప్తంగా రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

రాష్ట్ర బీజేపీ నేతలు, మిత్రపక్షమైన టీడీపీ నేతలు కేంద్రాన్ని నిలదీయకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిందించేందుకు ప్రయత్నించడం విడ్డూరంగా ఉందన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్ పత్తికి రూ.500 బోనస్ చెల్లిస్తున్నదని బీజేపీ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని, రైతులు నమ్మవద్దని కోరారు. ప్రజోపయోగ కార్యక్రమాలు చేపడుతున్న టీఆర్‌ఎస్‌కు మద్దతుగా నిలిచేందుకు 21న ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థికి ఓటెయ్యాలని కోరారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.