-ఇక సులువుగా భవన నిర్మాణ అనుమతులు -దరఖాస్తు చేసుకున్నాక 21 రోజుల్లోగా అనుమతి -పేదలు, మధ్యతరగతి ప్రజలకు తప్పనున్న తిప్పలు -దళారీ వ్యవస్థకు చెల్లుచీటీ.. మంత్రి కేటీఆర్ వెల్లడి

ఇంటి నిర్మాణ అనుమతులను సరళతరం చేసే టీఎస్‌బీపాస్ చట్టాన్ని రాష్ట్ర అసెంబ్లీ సోమవారం ఆమోదించింది. ఈ బిల్లును మున్సిపల్‌శాఖ మంత్రి కే తారకరామారావు ప్రవేశపెడుతూ దాని విశేషాలను, ప్రభుత్వ బాధ్యతలు, ప్రజలకు కలిగే ప్రయోజనాలు, అక్రమార్కులపై చర్యలు.. ఇలా బిల్లులో పొందుపరిచిన అన్ని విషయాల గురించి కూలంకషంగా వివరించారు. దేశంలోనే శరవేగంగా పట్టణీకరణ జరుగుతున్న రాష్ర్టాల్లో తెలంగాణ తొలి స్థానంలో ఉన్నదని, దాదాపు 42 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్నారని, అలాంటి పట్టణాల్లో సరైన మౌలిక వసతులు కల్పించేందుకు ఈ చట్టాన్ని తీసుకువస్తున్నామని తెలిపారు. ‘2019లోనే నూతన పురపాలక చట్టాన్ని ఈ సభలోనే తీసుకొచ్చాం. పౌరుడే కేంద్రంగా సమయపాలన పాటిస్తూ సేవలు అందించే లక్ష్యం పెట్టుకున్నాం. పట్టణ ప్రగతికి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించాం. అయితే, పట్టణ పౌరుడికి ఇబ్బందిగా మారిన సొంత ఇంటి నిర్మాణ అనుమతులను సరళతరం చేయటానికి 2015లోనే డెవలప్మెంట్ మేనేజ్మెంట్ పర్మిషన్ సిస్టం(డీఎంపీఎస్)ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దానికి చట్టబద్ధత లేకపోవటం, అధికారులకు విచక్షణ లేకపోవటం వంటి కారణాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అందుకే పారదర్శకత పెంచేందుకు స్వీయ ధ్రువీకరణ పత్రం(సెల్ఫ్ సర్టిఫికేషన్) విధానాన్ని తీసుకొస్తున్నాం’ అని కేటీఆర్ వెల్లడించారు. తెలంగాణ మున్సిపల్ చట్టం 2019, జీహెచ్ఎంసీ చట్టం భిన్నంగా ఉన్నాయని, వీటికి ఏకరూపం తీసుకురావాలన్న ఉద్దేశంతో ప్రస్తుతమున్న డీఎంపీఎస్ విధానానికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చేలా టీఎస్‌బీపాస్‌ను తెస్తున్నామని వివరించారు.
అనుమతుల్లో అవినీతికి చోటులేదు ఏ చట్టాన్ని రూపొందించినా అది ప్రజలకు నేరుగా ఉపయోగపడాలని సీఎం కేసీఆర్ ఎప్పుడూ చెప్తుంటారని, అందుకే.. అవినీతి రహితంగా, దళారి వ్యవస్థ లేకుండా ఈ చట్టాన్ని తీసుకొస్తున్నట్టు మంత్రి తెలిపారు. పేదవారిని దృష్టిలో పెట్టుకొని భవన నిర్మాణ అనుమతులు సులువుగా ఇవ్వాలన్నదే ఈ చట్ట ముఖ్యఉద్దేశమని వెల్లడించారు. గతంలో భవన నిర్మాణ అనుమతులకు నిర్దిష్టమైన కాలపరిమితి పెట్టలేదని, సమయపాలన లేకుండా అనుమతి ఇచ్చేవారని, అలాంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారం దొరుకుతుందని వివరించారు.
విప్లవాత్మక సంస్కరణ ఇది ఒక విప్లవాత్మక సంస్కరణ అని, కొత్త చట్టం హైదరాబాద్ సహా రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలకు వర్తిస్తుందని కేటీఆర్ పేర్కొన్నారు. దీని ప్రకారం.. 75 గజాలు ఇంటి స్థలం ఉన్న పేదలు ఎలాంటి అనుమతులు తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. అదేవిధంగా 75 గజాల నుంచి 600 గజాల వరకు ఇల్లు కట్టుకునే మధ్యతరగతి ప్రజలు తక్షణ అనుమతి తీసుకోవచ్చన్నారు. దీనివల్ల 85 శాతానికిపైగా దరఖాస్తులు త్వరగా పరిష్కారమవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. ‘ఒక వేళ 600 గజాలకుపైగా స్థలంలో కట్టే భవనానికి అనుమతి అవసరం ఉంటే, లేవుట్ అనుమతి అవసరం ఉన్నా టీఎస్ ఐపాస్ చట్టం మాదిరి 21 రోజుల్లో అన్ని అనుమతులు ఇచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఒకవేళ 21 రోజుల్లో అనుమతులు ఇవ్వకపోతే 22వ రోజు డీమ్డ్ అప్రూవల్ అనే విధానాన్ని తెస్తున్నట్టు తెలిపారు. దరఖాస్తుల్లో లోపాలుంటే మొదటి పది రోజుల్లోనే ఆ దరఖాస్తులను తిరస్కరించే అధికారం మున్సిపాలిటీలకు ఉంటుందని స్పష్టంచేశారు. ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ కూడా 15 రోజుల్లోనే ఇచ్చేలా చట్టంలో రూపకల్పన చేశామన్నారు. అంటే.. 75 గజాల స్థలం ఉంటే అనుమతులు అవసరం లేదని, కేవలం రిజిస్ట్రేషన్ మాత్రమే అవసరం ఉంటుందన్నారు. 75 నుంచి 600 గజాల వరకు ఉంటే తక్షణ అనుమతి, తక్షణ స్వీయ ధ్రువీకరణ పత్రం అవసరం ఉంటుందన్నారు.
నోటీసు లేకుండానే కూల్చివేత చట్టాన్ని దుర్వినియోగం చేయకుండా తక్షణ అనుమతి పత్రంపై కొన్ని షరతులకు లోబడి రాజముద్ర వేయనున్నట్టు మంత్రి కేటీఆర్ చెప్పారు. తప్పు చేసేవారిపై చర్యలు తీసుకునే వెసులుబాటు ప్రభుత్వానికి ఉంటుందని వివరించారు. ఉదాహరణకు ఏదైనా ప్రభుత్వ స్థలంలో ఇన్స్టంట్ పర్మిషన్ అని తీసుకుని ప్రభుత్వ స్థలాన్ని దుర్వినియోగం చేసినా, ఇతరుల స్థలాన్ని దుర్వినియోగం చేసినా ఎలాంటి నోటీసు లేకుండానే భవనాన్ని కూలగొట్టే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర స్థాయిలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఆధ్వర్యంలో ఒక చేజింగ్ కమిటీ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో మరో చేజింగ్ కమిటీ, సెల్ ఉంటుందని.. ఇవి ఏవైనా ఇబ్బందులు, చికాకులు ఎదురైతే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, పరిష్కారం చూపుతాయని వివరించారు. భవన నిర్మాణానికి అనుమతి ఇచ్చే క్రమంలో జియో ట్యాగింగ్ చేస్తామని.. తప్పు చేస్తే అధికారులను కూడా శిక్షిస్తామని మంత్రి స్పష్టం చేశారు.
వేగంగా బ్యాంకులోన్లు ‘భవన నిర్మాణం కోసం ఒక వ్యక్తి దరఖాస్తు చేస్తే 2వ రోజు వారికి నేరుగా రాజముద్ర వేసి, ప్రభుత్వ ముద్రతో టీపీవో, మున్సిపల్ కమిషనర్ సంతకంతో అటోమేటిక్ రిైప్లె వస్తుంది. బ్యాంకు లోన్ తీసుకోవటానికి, ఇతర ఆర్థిక సంస్థల నుంచి లోన్లు పొందటానికి ఈ రాజముద్రను చూపెడితే సరిపోతుంది’ అని కేటీఆర్ తెలిపారు. డీమ్డ్ క్లాజు గురించి వివరిస్తూ.. ప్రభుత్వం ఏ చట్టం చేసినా సేవింగ్ క్లాజు ఉంటుందన్నారు. 21 రోజుల్లో అనుమతి రాక 22వ రోజు డీమ్డ్ అప్రూవల్ వచ్చినా, అధికారులు దురుద్దేశంతో అప్రూవల్ ఇచ్చినా తప్పకుండా సేవింగ్ క్లాజ్ ఉంటుదన్నారు. భూములు రిజిస్ట్రేషన్ చేసేప్పుడు తప్పుగా ఉంటే ఆ రిజిస్ట్రేషన్లను రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుందని మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా, ‘వాట్ తెలంగాణ డస్ టుడే.. ద ఇండియా డస్ ఇట్ టుమారో’ అని ఒక మిత్రుడు సుధీర్ రెడ్డి అన్నారని, ఇది ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితమైందని కేటీఆర్ కుండబద్దలు కొట్టారు. గత ఆరేండ్లలో ఒక రిఫార్మర్‌గా, పర్ఫార్మర్గా, ట్రాన్స్‌ఫార్మర్‌గా సీఎం కేసీఆర్ పేరు తెచ్చుకున్నారని.. ఇప్పుడు విప్లవాత్మక చట్టాలతో వివిధ వర్గాల ప్రజలకు మేలు చేస్తున్నారని కేటీఆర్ కొనియాడారు.
పట్టణ ప్రగతికి మెట్టు -విప్లవాత్మక సంస్కరణలతో టీఎస్ బీపాస్ -పేద, మధ్యతరగతికి మేలు చేసే చట్టమిది -పౌరసేవల్లో విప్లవాత్మకమైన టీఎస్ బీపాస్ బిల్లుకు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. ఈ బిల్లు చట్టంగా మారిన వెంటనే పట్టణప్రాంతాల్లో మెరుగైన సేవలు అందుబాటులోకి రానున్నాయి. దరఖాస్తు చేసుకున్న 21 రోజుల్లోనే భవన నిర్మాణ అనుమతి పత్రం జారీ చేయటం ఈ చట్ట ప్రధాన ఉద్దేశం. టీఎస్ బీపాస్‌తో పేద, మధ్యతరగతి ప్రజల్లోని 95 శాతం మందికి మేలు జరగనున్నది.
టీఎస్ బీపాస్ ప్రత్యేకతలివీ.. -టీఎస్ బీపాస్‌తో నగరాలు, పట్టణాల్లో భవన నిర్మాణాల అనుమతి సులభంగా జరుగుతుంది. స్వీయ ధ్రువీకరణతోనే తక్షణ అనుమతులు ఇస్తారు. 75 చదరపు గజాలలోపు స్థలంలో ఏడు మీటర్ల ఎత్తు వరకు నిర్మించే నివాస భవనాలకు ఎలాంటి అనుమతులు అవసరం లేదు. నామమాత్రంగా ఒక్క రూపాయి చెల్లించి భవన నిర్మాణ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందవచ్చు. -75 చదరపు గజాల నుంచి 239 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో ఏడు మీటర్ల ఎత్తు వరకు (జీ ప్లస్ 1) నివాస భవనాలకు తక్షణ అనుమతి ఇస్తారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోగానే అనుమతి వస్తుంది. 239 చదరపు గజాల నుంచి 598 చదరపు గజాల విస్తీర్ణంలోని ప్లాట్లలో పది మీటర్ల ఎత్తు వరకు (జీ ప్లస్ 2) వరకు నివాస భవన నిర్మాణాలకు స్వీయ ధ్రువీకరణ(సెల్ఫ్ సర్టిఫికేషన్) ఆధారంగా అనుమతులు ఇస్తారు. ఈ భవనాల నిర్మాణం పూర్తయ్యాక ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ పొందాల్సి ఉంటుంది. -598 చదరపు గజాల కన్నా ఎక్కువ విస్తీర్ణం, జీ ప్లస్ 2 కంటే ఎక్కువ అంతస్తులు ఉండే ప్లాట్లలో, నివాసేతర భవనాలకు సింగిల్ విండో పద్ధతిలో టీఎస్ బీపాస్ అనుమతులు ఇస్తారు. ఎన్వోసీ కోసం ఇతర శాఖలను సంప్రదించాల్సిన అవసరం ఉండదు. దరఖాస్తులను పరిశీలించి 21 రోజుల్లో అనుమతులు జారీ చేస్తారు. -ఏదైనా కారణంతో ఆ గడువులోపు అనుమతులు రాకుంటే దరఖాస్తుదారుడు అనుమతి వచ్చినట్లుగానే భావించాల్సి ఉంటుంది. 22వ రోజు ఆన్లైన్లో అనుమతి పత్రం పొందవచ్చు. -239 చదరపు గజాల కంటే ఎక్కువ, 598 చదరపు గజాల విస్తీర్ణం కలిగి 10 మీటర్ల ఎత్తుతో నిర్మించే నివాస భవనాలకు సదరు యజమాని ఇచ్చే స్వీయ ధ్రువీకరణ ఆధారంగా 15 రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ జారీ చేస్తారు. అలాగే నివాసేతర భవనాలకు ఆర్కిటెక్ట్‌తో అటెస్ట్ చేయించిన స్వీయ ధ్రువీకరణ ఆధారంగా 15 రోజుల్లో ఆక్యుపెన్సీ సర్టిఫికెట్‌ను ఇస్తారు. -స్వీయ ధ్రువీకరణ ఆధారంగా జారీచేసిన అన్ని అనుమతులకు తదుపరి తనిఖీ జరుగుతుంది. వాస్తవాలను తప్పుగా పేర్కొని నిర్మాణాన్ని చేసినట్టు తేలితే నోటీసు ఇవ్వకుండానే జరిమానా విధించడం, భవనాన్ని కూలగొట్టడం, స్వాధీనం చేసుకోవడం, సీల్ చేయడం వంటి చర్యలు తీసుకుంటారు. -స్వీయ ధ్రువీకరణ ఆధారంగా తాత్కాలిక లేఅవుట్ ప్లాన్ అనుమతిని ఆన్లైన్లో 21 రోజులలో జారీ చేస్తారు. లే అవుట్ పూర్తిచేసిన తర్వాత లైసెన్స్ కలిగిన సాంకేతిక సిబ్బందితో అటెస్ట్ చేయించి, జిల్లా కమిటీలు పరిశీలించాక లేఅవుట్ తుది అనుమతులను జారీ చేస్తారు. మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ల వద్ద తనఖా రూపంలో పెట్టిన ప్లాట్లను లేఅవుట్ తుది అనుమతి ఇచ్చిన 21 రోజుల తర్వాత విడుదల చేస్తారు. -అనధికార నిర్మాణాలు, లేఅవుట్ల గుర్తింపు, నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయిలో ప్రత్యేక టాస్క్‌ఫోర్స్ బృందాన్ని ప్రభుత్వం నియమిస్తుంది. అనుమతి పొందిన ప్లాన్‌కు అనుగుణంగా లేని నిర్మాణాలను ఎలాంటి నోటీసు లేకుండా కూల్చివేసేలా చర్యలు తీసుకుంటుంది. అనుమతులు తీసుకోకుండా భూమిని అభివృద్ధిచేసిన డెవలపర్‌కు ఆ భూమి విలువలో 25 శాతం జరిమానా విధిస్తారు.