Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఏకకాలంలో 119 బీసీ గురుకులాలు ప్రారంభం

-రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించిన మంత్రులు, ఎమ్మెల్యేలు
-281కి చేరిన బీసీ గురుకులాల సంఖ్య
-మొత్తంగా 92,340 మందికి చదువుకునే అవకాశం
-ఆనందంలో విద్యార్థుల తల్లిదండ్రులు

రాష్ట్రంలో సోమవారం గురుకుల పాఠశాలల ప్రారంభోత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. సీఎం కేసీఆర్ ఆకాంక్షలకు అనుగుణంగా బీసీ విద్యార్థుల కోసం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 119 మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల విద్యాలయాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఇందులో బాలురకు 63, బాలికలకు 56 గురుకులాలను కేటాయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్‌పర్సన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, అధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొనడంతో పండుగ వాతావరణం ఏర్పడింది. ఏకకాలంలో 119 బీసీ గురుకులాలు ప్రారంభం కావడంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈసందర్భంగా విద్యార్థులకు నోట్‌బుక్స్, స్కూల్ బ్యాగులు, ఇతర సామగ్రి అందజేశారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో కేవలం 19 గురుకులాలు మాత్రమే ఉండగా తెలంగాణ వచ్చిన వెంటనే 24 గురుకులాలను టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ తరువాత 2017-18 విద్యా సంవత్సరంలో 119 బీసీ గురుకులాలను ఒకేసారి ప్రారంభించగా, తాజాగా 2019-20 విద్యాసంవత్సరానికి గాను 119 నియోజకవర్గాల్లో ప్రారంభించడం విశేషం. మొత్తంగా రాష్ట్రవ్యాప్తంగా 281 బీసీ గురుకుల విద్యాలయాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిలో 92,340 మంది విద్యార్థులు చదువుకునే అవకాశం దక్కింది.

గ్రేటర్ హైదరాబాద్‌లో..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ముషీరాబాద్, జూబ్ల్లీహిల్స్, గోషామహల్ నియోజకవర్గాలకు సంబంధించిన మూడు బీసీ గురుకులాలను మన్సూరాబాద్‌లో ఒకేచోట సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, హోం మంత్రి మహమూద్ అలీ, సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు.

గురుకులాల్లో నాణ్యమైన విద్య: ఈటల
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో బాలుర గురుకుల పాఠశాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పిన గురుకుల పాఠశాలల్లో నాణ్యమైన విద్యను బోధిస్తున్నారని తెలిపారు. వనపర్తి జిల్లా వనపర్తి మండలం నాగవరంలో బాలుర గురుకుల పాఠశాలను ప్రారంభించిన సందర్భంగా వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ.. కేజీ నుంచి పీజీ విద్యను అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం గురుకుల వ్యవస్థను పటిష్ట పరుస్తున్నదన్నారు.

బంగారు బాటలు వేసేలా సర్కార్ చదువు..
సూర్యాపేట జిల్లా ఆత్మకూర్.ఎస్ మండల కేంద్రానికి మంజూరైన పాఠశాలను చివ్వెంల మండల కేంద్రంలో, మరోటి హుజూర్‌నగర్ నియోజకవర్గ కేంద్రంలో ఏర్పాటు చేసిన బీసీ గురుకులాలను రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌తో కలిసి విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ప్రభుత్వ విద్యను అందిస్తున్నామన్నా రు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలెక్టర్ రామ్మోహన్‌రావుతో కలిసి బీసీ బాలికల గురుకులాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని, బీసీలు విద్యాపరంగా మరింత అభివృద్ధి సాధించడానికి ప్రభు త్వం నియోజకవర్గానికి ఒకటి చొప్పున బీసీ గురుకులాలను ఏర్పాటు చేసిందన్నారు.

కార్పొరేట్‌కు దీటుగా గురుకులాలు: ఎర్రబెల్లి
పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వరంగల్ అర్బన్ జిల్లా మామునూరులో ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్‌తో కలిసి, జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌లో ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యతో కలిసి, పాలకుర్తి నియోజకవర్గంలోని కొడకండ్ల మండలం గిర్నితండా (మొండ్రాయి) వద్ద గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణలో కార్పొరేట్ విద్యకు దీటుగా గురుకుల పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యను పూర్తిగా భ్రష్టుపట్టించిన వాళ్లు ప్రభుత్వాన్ని విమర్శించడం సిగ్గుచేటని మండిపడ్డారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో ధర్మపురి నియోజకవర్గానికి కేటాయించిన గురుకులాన్ని సంక్షే మ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలోని రెండో బైపాస్ రహదారిలో బాలుర పాఠశాలను ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌బాబుతో కలిసి మంత్రి కొప్పుల ప్రారంభించారు. ఈ సందర్భంగా కొప్పుల మాట్లాడుతూ.. రాష్ట్రంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలో గొప్ప విద్యాయజ్ఞం కొనసాగుతున్నదన్నారు.

సకల వసతులతో సర్కారు విద్య..
మహబూబ్‌నగర్ జిల్లా ధర్మాపూర్‌లో బీసీ గురుకుల పాఠశాలను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో పౌష్ఠికాహారంతోపాటు ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, సన్నబియ్యంతో భో జనం వంటి ఎన్నో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పిస్తున్నట్టు చెప్పారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో బీసీ గురుకుల బాలికల పాఠశాలను దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అల్లోల మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న నాణ్యమైన విద్యతో ప్రైవేటు పాఠశాలలకు స్వస్తి పలికి గురుకులాల్లో చేరుతున్నారన్నారు. మేడ్చల్ జిల్లా కీసర మండలం బోగారంలోని తిరుమల ఇంజినీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన మేడ్చల్, కుత్బుల్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గాల గురుకుల పాఠశాలలను ఎమ్మెల్యే కేపీ వివేకానంద్‌తో కలిసి కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. గురుకులంలో నాణ్యమైన విద్య, ఇతర సౌకర్యాల కోసం ఒక్కో విద్యార్థికి ప్రభుత్వం ఏటా రూ.1.20 లక్షలు వెచ్చిస్తున్నదన్నారు. సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, హుస్నాబాద్‌లో ఏర్పాటు చేసిన గురుకులాలను కలెక్టర్ వెంకట్రామ్‌రెడ్డితో కలిసి సిద్దిపేట జెడ్పీ చైర్‌పర్సన్ రోజాశర్మ ప్రారంభించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.