Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఏకపక్షంగా ఓట్లేయండి

-త్వరలోనే 111 జీవో ఎత్తేస్త
-జూన్ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం
-కొత్త మున్సిపల్ చట్టం కూడా తెస్తం
-ఈ రెండుశాఖల్లో లంచాల బాధలు పోవాలె
-రైతులకు వెబ్‌సైట్‌లోనే రుణాలుపొందే సదుపాయం: సీఎం కేసీఆర్
-కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే
-బాధలు పోవాలంటే గుణాత్మక మార్పురావాలె
-16 ఎంపీ సీట్లు గెలిస్తే దేశానికి మంచి దశ దిశ
-నా చాకిరేవుతో జాతీయ పార్టీలకు జ్ఞానోదయం
-కాంగ్రెస్, బీజేపీ మ్యానిఫెస్టోల్లో తెలంగాణ పథకాలు
-నీళ్లు, కరంటు సమర్థ వినియోగంపైనా హామీలు
-వికారాబాద్ బహిరంగసభలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలంతా ఏకపక్షంగా ఓట్లేసి టీఆర్‌ఎస్ అభ్యర్థులను అఖండ మెజార్టీతో గెలిపించాలని ముఖ్యమంత్రి, టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్‌రావు కోరారు. చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో 84 గ్రామాల ప్రజలను ఇబ్బంది పెడుతున్న 111 జీవోను రద్దుచేస్తామని హామీ ఇచ్చారు. రెవెన్యూ, మున్సిపల్ శాఖల్లో లంచాలిచ్చే బాధలు పోవాలన్న సీఎం.. ఇందుకోసం కొత్తగా రెవెన్యూ చట్టాన్ని, మున్సిపల్ చట్టాన్ని తీసుకురానున్నట్టు ప్రకటించారు. రైతులు లోన్ల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరం లేకుండా వెబ్‌సైట్ ద్వారానే రుణం పొందే సదుపాయం కల్పించనున్నట్టు చెప్పారు. గత కొన్ని రోజులుగా తాను చాకిరేవు పెడుతుండటంతో కాంగ్రెస్, బీజేపీలకు జ్ఞానోదయం అవుతున్నదన్న కేసీఆర్.. తాను చెప్పిన అం శాలతోపాటు.. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ పథకాలను ఆ రెండు జాతీయ పార్టీలు వాటి మ్యానిఫెస్టోల్లో పెట్టుకున్నాయని తెలిపారు. కేంద్రంలో రాబోయేది సంకీర్ణ ప్రభుత్వమేనని స్పష్టంచేశారు. కేంద్రంలో ఏర్పడే ఫెడరల్ ఫ్రంట్ ప్రభుత్వంలో టీఆర్‌ఎస్ పెద్ద పాత్ర పోషించాలంటే రాష్ట్రంలో పదహారుకు పదహారు స్థానాల్లో గులాబీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. సోమవారం వికారాబాద్‌లో చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి డాక్టర్ రంజిత్‌రెడ్డికి మద్దతుగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే!

లక్ష మెజార్టీ ఇవ్వండి..
వికారాబాద్‌కి కొన్ని సమస్యలున్నయి. జిల్లాకావాలనే డిమాండ్ ఉండేది. ఎవరూ చేయలే. కేసీఆర్ సీఎం అయిన తర్వాతనే వికారాబాద్ జిల్లా అయిన విషయం మీకు తెలుసు. సాగునీరు కావాలె. కచ్చితంగా వికారాబాద్‌కి పాలమూరు ఎత్తిపోతల పథకం నుంచి లచ్చిందేవిపల్లి రిజర్వాయర్ పనులు జరుగుతున్నయి. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే బాధ్యత నాది. ఒకట్రెండు సంవత్సరాల్లోనే ఆ నీరిస్తం. ట్రిపుల్ వన్ జీవో ఎత్తేయాలని మా యాదయ్య నాతో రోజూ కొట్లాడుతుండు. చేవెళ్ల నియోజకవర్గంలో ఉండే, 111 జీవోతో ఇబ్బందిపడే 84 గ్రామాల అన్నదమ్ములకు చెప్తున్న.. ఇక్కడ టీఆర్‌ఎస్ గవర్నమెంట్ ఉంది. కట్టకట్టుకుని ఏకపక్షంగా ఓట్లేయండి.. చేవెళ్ల నియోజకవర్గం నుంచి లక్ష ఓట్ల మెజార్టీ రంజిత్‌రెడ్డికి ఇవ్వండి.. మీరెంత భారీ మెజార్టీ ఇస్తరో.. అంత తొందరగా నేను 111 జీవో ఎత్తేస్త. రంజిత్‌రెడ్డి నాయకత్వలో ఆ జీవోను రద్దు చేసుకోవాలి.

రైతులు లంచాలిచ్చే బాధలు పోవాలె
వికారాబాద్‌లో ఖబరస్థాన్, ఈద్గాలకు కొంత స్థలాలు కావాలనే డిమాండ్ ఉన్నది. అది చిన్నపని. తప్పకుండా చేద్దాం. ఎలక్షన్ కోడ్ ఎత్తేయగానే వికారాబాద్ జిల్లాను చార్మినార్ జోన్‌లో కలుపుతం. వికారాబాద్‌కు తాగునీరు వస్తుంది. మిషన్ భగీరథ కంప్లీట్ అవుతుంది. రైతులకు చాలా బాధలున్నయి. ఆ బాధలు దూరంచేసే నిర్ణయం తీసుకున్నం. లంచాలిచ్చే బాధలు పోవాలె. వంద శాతం జూన్ తర్వాత కొత్త రెవెన్యూ చట్టం తెస్తం. పూర్తి యజమాన్య బాధ్యత.. కంక్లూజివ్ టైటిల్ ఇచ్చే ప్రయత్నం జరుగుతుంది. రెండునెలలు ఓపిక పట్టండి. ఎవరికీ లంచాలివ్వకండి. మీ సమస్యలు దూరం చేసే బాధ్యత నాది. స్వయంగా జిల్లాకు వచ్చి అవసరమైతే రెండుమూడు రోజులుండి.. మీ పట్టా భూములు, పోడు భూములు.. అన్నీ పరిష్కరించే బాధ్యత తీసుకుంట.

కొత్త మున్సిపల్ చట్టం తెస్తున్నం
కొత్త పంచాయతీరాజ్ చట్టం తెచ్చుకున్నం. పంచాయతీరాజ్‌లో కూడా అడ్డగోలుగా ఉన్న లంచాలు బంద్ కావాలె. ఇష్టమున్నట్లు లేఅవుట్లు ఇచ్చే, ప్రజల్ని పట్టిపీడించే దందాలు బంద్‌కావాలె. కొత్తచట్టం పటిష్టంగా తెచ్చినం. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు కూడా జరుపుకోబోతున్నం. మున్సిపాలిటీల్లో ఉన్న అవినీతి కూడా సమూలంగా పోవాలె. అందుకోసం పటిష్టమైన చట్టాన్ని తెస్తున్నం. పంచాయతీరాజ్, మున్సిపాలిటీలో, రెవెన్యూశాఖల్లో ప్రజలు నిత్యం దోపిడీకి గురయ్యే దరిద్ర అవస్థ ఉన్నది. ఇదంతా నిర్మూలన కావాలె. అందరు అధికారులు లంచం తీసుకుంటున్నరని నేను అనడంలేదు. ప్రజలను దుర్మార్గంగా పట్టిపీడించేవారినే అంటున్న. షికాయితులు వేలకువేలు వస్తున్నయి. డాక్టర్ శ్రీనివాస్ అని భువనగిరి నుంచి నాకు ఒక ఎస్‌ఎంఎస్ చేశారు. రెండు కార్యాలయాలకు వెళ్లాను.. రెండుచోట్లా రూ.30 వేల చొప్పున లంచం తీసుకున్నరు. లంచం ఇవ్వకపోతే నా పని చేయం అన్నరు. దిక్కులేక లంచమిచ్చిన.

మీరు పాపులర్ ముఖ్యమంత్రి. ఇంతపెద్ద కేసీఆర్ ఉండికూడా దీన్ని నివారణ చేయలేవా? నీకు చేతకాదా? అని నాకు ఎస్‌ఎంఎస్ పెట్టాడు. నేను సిగ్గుతో తలదించుకున్న. ఆ తర్వాత చర్చపెట్టి ఆలోచన చేసి, అవినీతి ఇంత విచ్చలవిడిగా ఉండటానికి లేదని కఠిననిర్ణయం తీసుకున్నం. మున్సిపాలిటీ శాఖల్లో, పంచాయతీరాజ్, రెవెన్యూ శాఖల్లో ప్రజలకు రిలీఫ్ వచ్చేలా కొత్త చట్టాలు తెస్తున్నం. కొద్దిరోజులే ఓపిక పట్టండి. ఆ తర్వాత బ్రహ్మాండంగా పరిస్థితులు ఉంటయి. సర్టిఫికెట్లు ఇవ్వడానికి కూడా లంచం ఇవ్వాలి! ఎస్సీగా పుడితే సచ్చిపోయేదాకా ఎస్సీగనే ఉంటడు. ప్రతి సంవత్సరానికి ఒకసారి సర్టిఫికెట్ ఎందుకు? దానిలో ఇబ్బందులు, బాధలు పోవాలి. రైతులు బ్యాంకు లోన్లకు బ్యాంకుల చుట్టూ తిరిగే అవసరంలేకుండా వెబ్‌సైట్ ద్వారానే లోనువచ్చే ఏర్పాటుచేస్తున్నం.

16 ఎంపీ సీట్లు గెలిస్తే దేశానికి మంచి దశ దిశ
ఆర్థికంగా మన పరిస్థితి బాగున్నది. ఇటీవలే అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించారు. అన్ని సమస్యలను పరిష్కారం చేసుకుందాం. దేశం గురించి కూడా ఆలోచన చేయాలి. దేశం విషయంలో కూడా పాత్ర వహించాలంటే కచ్చితంగా 16 సీట్లకు 16 టీఆర్‌ఎస్ గెలవాలి. గెలిస్తే మంచి దిశ.. మంచి దిక్కు.. మంచి పద్ధతి చూపించే అవకాశం మనకు వస్తది. మనం కేంద్రాన్ని చాలా అడిగినం. వంకర టింకర చెప్పారు తప్ప చేయలేదు. చాలావిషయాల్లో దేశం వెనుకపడి ఉన్నది. చాలా హీనస్థితిలో ఉన్నది. ప్రజల ప్రాథమిక అవసరాలు కూడా తీరలేదు. కరంటు, నీళ్లు ఉన్నా వాడుకునే తెలివిలేదు. తాగునీళ్లకు, సాగునీళ్లకు దేశం బాధపడుతున్నది.

అందరికీ విద్య, వైద్యం లేదు. రైతులకు రక్షణ లేదు. సగం దేశం చీకట్లో ఉంటది. ఈ బాధలన్నీ పోవాలె. రైతులకు గిట్టుబాటు ధరలు రావాలె. అదంతా జరుగాలంటే కేంద్రంలో గుణాత్మకమైన మార్పురావాలె. వికారాబాద్ గడ్డ మీద చెప్తున్న.. దేశంలో రాబోయేది, కేంద్రంలో ఏర్పడబోయేది సంకీర్ణ ప్రభుత్వమే. ఇందులో అనుమానమే లేదు. బీజేపీకి 150లోపే వస్తున్నయి, కాంగ్రెస్‌కు వందలోపే వస్తయి. కాబట్టి ప్రాంతీయ పార్టీలదే పెత్తనం. మనది కొత్త రాష్ట్రం. మనకు ఒక జాతీయ ప్రాజెక్టు రావాలె. మన హక్కులు నెరవేరాలె. మనకు మంచి జరుగాలె. ఇవన్నీ జరుగాలంటే మన పాత్ర ఢిల్లీలో ఉజ్వలంగా ఉండాలె. 16 మంది ఎంపీలను గెలిపించాలి. ఫెడరల్ ఫ్రంట్‌లో మన పాత్ర పెద్దగా ఉండాలి.

వికారాబాద్ కా హవా..
వికారాబాద్ కా హవా.. లాఖో మరీజో కా దవా అని కొంతకాలం క్రితం దేశం మొత్తంమీద ఓ పెద్ద సామెత ఉండేది. తెలంగాణ రాష్ట్రానికే ఊటీలాంటి ప్రదేశం వికారాబాద్, అనంతగిరి కొండలు. 1985లో ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ప్రాంతానికొచ్చి గుట్టపైనున్న గెస్ట్‌హౌస్‌లో ఉంటే.. అద్భుతమైన ఔషధ మొక్కల నుంచి మంచి గాలి వచ్చేది. పోవాలనిపించేది కాదు. అంతగొప్ప ప్రదేశం. దీన్నంతా చెడగొట్టినారు. ఆ పూర్వవైభవం తిరిగిరావాలి. దానికోసం ప్రయత్నాలు ప్రారంభమైనయి. ఈ ప్రాంతం గొప్పదనాన్ని గుర్తించిన నిజాంరాజు టీబీ దవాఖాన ఇక్కడే పెట్టాడు. దాన్ని మళ్లీ పునర్నిర్మించే ప్రయత్నాలు మొదలయ్యాయి.

తెలంగాణలోనే సాధ్యమైంది
తెలంగాణ వచ్చేటపుడు చాలామంది శాపాలు పెట్టిండ్రు. ఆ పుణ్యాత్ముడు ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రోజూ నన్ను తిడుతుండు. ఒక ముఖ్యమంత్రి అయితే కరంటు రాదు.. నీళ్లు రావు అని కట్టె పట్టుకుని మాట్లాడిండు. మిమ్మల్ని ఒకటే కోరుతున్న. ఐదేండ్ల క్రితం కరంటు గతి ఎట్లుండే? ఇప్పుడెట్ల ఉంది? ఎప్పుడొస్తదో.. ఎప్పుడు పోతదో తెలియదు. కాలిపోయే మోటర్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లు. చాలా బాధలుపడినం. కరంటు పెట్టటానికి రాత్రిపూట బావుల దగ్గరకుపోయి పాములు, తేళ్లు కుడితే చనిపోయేవారం. ఈరోజు కరంటు ఉంటే వార్త కాదు.. పోతే వార్త. ఇయ్యాల ఇండియాలో 29 రాష్ట్రాలుంటే.. తెలంగాణలో మాత్రమే తలసరి విద్యుత్తు వినియోగం ఎక్కువ ఉందని ఎలక్ట్రిసిటీ అథారిటీ ఆఫ్ ఇండియా సర్టిఫికెట్ ఇచ్చింది. ఐదేండ్ల క్రితం ఆగమాగంగా ఉన్న తెలంగాణ.. ఆనాడు సమైక్య సీఎంలు కట్టె పట్టుకుని కారుచీకటి అవుతుందని చెప్పిన తెలంగాణ.. ఐదేండ్లలో వెలుగుజిలుగులతో నిండటమేకాదు.. దేశంలోనే నంబర్ వన్ పవర్ కన్జ్యూమ్ చేసే రాష్ట్రంగా ఎదిగింది.

రైతులకు 24 గంటలు ఉచితంగా కరంటు ఇచ్చే రాష్ట్రం దేశంలో తెలంగాణ ఒక్కటే. మన పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌లో ఇవ్వరు. ప్రధాని సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో కూడా ఇవ్వరు. ఇవన్నీ మీ కండ్ల ముందున్నయి. అల్టిమేట్‌గా మనం ఆలోచించిందేంది! పప్పో, పులుసో.. పేదవాళ్లు కచ్చితంగా కడుపునిండా తినాలె. బిర్యానీ లేకపోయినా మంచిదే కానీ ఎవ్వళ్లూ బాధపడకూడదు. రెండువందలున్న ఆసరా పింఛన్లు వెయ్యి రూపాయలు చేసుకున్నం. మే నెల నుంచి పెన్షన్లు 2000 ఇస్తం. వికలాంగులకిచ్చే పెన్షన్ 1500 బదులు 3000 ఇస్తం. డబుల్ బెడ్‌రూం ఇండ్లు కడుతున్నం. ఈసారి బడ్జెట్లో డబ్బులు పెట్టుకున్నం.. సొంత జాగా ఉన్నవారికీ డబ్బు సాయంచేయాలని అనుకున్నం.

త్వరలో తెలంగాణ హెల్త్ స్టేటస్
చరిత్రలో ఎప్పుడైనా అనుకున్నమా? గవర్నమెంటే కంటివెలుగు ప్రోగ్రాం పెట్టి.. గ్రామాల్లో డాక్టర్లే ఇంటికొచ్చి.. ప్రతి మనిషిని పరీక్షించి అవసరమైతే కండ్లద్దాలు ఇచ్చే కార్యక్రమం ఇండియాలో ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నదా? రాబోయే రోజుల్లో పండ్ల డాక్టర్లు, ముక్కు, చెవి డాక్టర్లు కూడా మీ ఊళ్లకొస్తరు. ఎవరికే బాధ ఉన్నా చెక్‌చేస్తరు. ఆ తర్వాత పాథలాజికల్ టీం వచ్చి.. ప్రతివాళ్ల రక్తనమూనాలు సేకరించి.. షుగర్, బీపీ ఎంత ఉందో మొత్తం లెక్కలు తీసి, మీ ఫొటోలు కూడా తీసుకుని.. కంప్యూటరైజ్ చేసి.. హండ్రెడ్ పర్సంట్ ప్రతి వ్యక్తితోపాటు తెలంగాణ రాష్ట్ర హెల్త్ స్టేటస్ తయారుచేస్తరు.

అందరు మంచిగా బతకాలి
మనకు కులంలేదు.. మతంలేదు. అన్నివర్గాల ప్రజలు బతుకాలి. ప్రధానమంత్రిస్థాయి వ్యక్తులొచ్చి హిందువులు, ముస్లింలని మాట్లాడవచ్చునా? అందరూ కలిసి బతుకొద్దా? బతుకుతలేమా? ఈ దేశాన్ని విడదీసి ఎటు తీసుకపోతరు? ఈ దుర్మార్గాలు ఆగిపోవాలి. దేశాన్ని విభజించి పాలించే దుర్మార్గకూటమి మంచిదికాదు. గంగా జమున తెహజీబ్ లాగా అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని కులాల ప్రజలు కశ్మీర్‌నుంచి కన్యాకుమారిదాకా కలిసిమెలిసి బతుకుతున్నం. దేశం సంపద పెరుగబోతున్నది. అందరూ మంచిగా బతకాలి. అందరికీ ఉపాధి అవకాశాలు ఉండాలె. అందిరికీ ఉద్యోగాలు దొరుకాలె. అందరికి విద్య, వైద్యం దొరుకాలని మనం ప్రయత్నంచేయాలి.

రంజిత్‌రెడ్డి చాలా పెద్ద ఉద్యమకారుడు
చేవెళ్ల అభ్యర్థి రంజిత్‌రెడ్డి చాలా పెద్ద ఉద్యమకారుడు. 2001 నుంచే టీఆర్‌ఎస్‌కు అండదండగా ఉంటూ ఉద్యమం కొంచెం కిందిమీద ఉన్నా.. అన్నా భయపడకండి.. మేం ఉన్నం అని తనతోపాటు అనేకమంది మిత్రులను తీసుకువచ్చి మద్దతు ఇచ్చిన వ్యక్తి. ఆయన ఏనాడూ పదవి అడుగలేదు. ఈసారి పార్లమెంట్‌కు పోతా, చేవెళ్ల నియోజకవర్గానికి సేవచేస్త.. నాకు ఈ ప్రాంతంతో అనుబంధం ఉన్నది.. అంటే ఇక్కడినుంచి పోటీచేయిస్తున్నం. విద్యావంతుడు. ఆయనకు చాలా డబ్బు ఉన్నది. స్వార్థంకోసం, రాజకీయాలకోసం, సంపాదించుకోవడానికో రావడంలేదు. పదిమందికి అన్నంపెట్టేస్థాయిలో ఉన్నడు. మీకు, చేవెళ్ల నియోజకవర్గానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతడు. మీ సేవలో ఉంటడు. కారు గుర్తుకు ఓటువేసి రంజిత్‌రెడ్డిని దీవించండి. రంజిత్‌రెడ్డి అనర్గళంగా అన్ని భాషలు మాట్లాడగలుగుతాడు. పార్లమెంట్‌లో తెలంగాణ, చేవెళ్ల ఎంపీగా ఉండటానికి ఆయనకు అన్ని అర్హతలు ఉన్నయి. అద్భుతమైన క్యారెక్టర్ ఉన్నది. అలాంటి నాయకుడిని గెలిపించండి. వచ్చేసారి మీరే డబుల్ మెజార్టీతో గెలిపించుకుంటరు.

నరేంద్రమోదీ, కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడల్లా అడ్డగోలు మాటలు మాట్లాడిపోతున్నరు. కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలు ప్రకటించాయి. నాకు చాలా గర్వంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక స్కీంలు రెండు పార్టీలు కాపీకొట్టినయి. మన పథకాలను వాళ్ల మ్యానిఫెస్టోల్లో పెట్టారు. రైతుబంధును కాపీకొట్టిండ్రు. బీజేపీ, కాంగ్రెస్.. రెండు పార్టీలకు కూడా జ్ఞానోదయం అవుతున్నది.
– కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు, ముఖ్యమంత్రి

జాతీయ పార్టీల మ్యానిఫెస్టోల్లో మన పథకాలు
నరేంద్రమోదీ, కాంగ్రెస్ నాయకులు ఇక్కడికి వచ్చినప్పుడల్లా అడ్డగోలు మాటలు మాట్లాడిపోతున్నరు. కాంగ్రెస్, బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలు ప్రకటించాయి. నాకు చాలా గర్వంగా ఉన్నది. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక స్కీంలు రెండు పార్టీలు కాపీకొట్టినయి. మన పథకాలను వాళ్ల మ్యానిఫెస్టోల్లో పెట్టారు. రైతుబంధును కాపీకొట్టిండ్రు. బీజేపీ, కాంగ్రెస్.. రెండు పార్టీలకు కూడా జ్ఞానోదయం అవుతున్నది. రాష్ట్రాలకు అధికారాలు బదిలీచేస్తామని కాంగ్రెస్ చెప్తున్నది. విద్య, వైద్యం తదితర శాఖల అధికారాలను రాష్ట్రాలకు ఇస్తామని చెప్తున్నరు. నదీ జలాలను వాడటంలేదని అంటే.. నదీజలాలను వాడుతామని, సమర్థంగా వినియోగిస్తామని బీజేపీ చెప్తున్నది. దేశంలో విద్యుత్ వినియోగం కూడా చేస్తమని, ట్రక్కు వేగం పెంచుతామని చెప్తున్నరు. ఫ్రీ కారిడార్‌లు వేస్తమని అంటున్నరు. ఇవన్నీ కూడా ప్రతిరోజూ నేను చాకిరేవు పెడుతున్నవే.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.