Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఎక్కడికక్కడ సమస్యలను గుర్తించండి

స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో అధికారులు ఎక్కడికక్కడే సమస్యలను గుర్తించాలని, అత్యవసరమైనవాటిని వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. కార్యక్రమంపై ప్రజల్లో చైతన్యం కలిగించాలని సూచించారు. సోమవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని ప్రజల సమస్యలపై యూనిట్ ఆఫీసర్లతో సీఎం సమీక్ష నిర్వహించారు. మెట్టుగూడలోని క్యాంపు కార్యాలయంలో వివిధ కాలనీల బాధ్యులైన ఐఏఎస్, ఐపీస్, ఐఎఫ్‌ఎస్ అధికారులు, నోడల్ ఆఫీసర్లతో నిర్వహించిన ఈ సమీక్షలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి అడిగి తెలుసుకున్నారు.

KCR interacts with public in swachh hyderabad

-అత్యవసరమైనవాటిని వెంటనే పరిష్కరించండి -స్వచ్ఛ హైదరాబాద్‌పై ప్రజలను చైతన్యవంతం చేయండి -సికింద్రాబాద్ నియోజకవర్గ అధికారులతో సీఎం కేసీఆర్ సమస్యల పరిష్కారానికి సలహాలు, సూచనలు ఇచ్చి వాటిని పరిష్కరించే దిశగా ఎలా ముందుకు పోవాలో తెలియజేశారు. చాలా ప్రాంతాల్లో ఇరుకిరుకు ఇండ్లు, మురికివాడలు ఉన్నాయని, కనీస వసతులు లేవని, తాగునీరు లేక అల్లాడుతున్నారని, రోడ్లు, డ్రైనేజీ, సొంతిల్లు సమస్యను అధికశాతం ప్రజలు ఎదుర్కొంటున్నారని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఎరుకల బస్తీలోని ఫ్యాక్టరీ దుర్వాసన వెదజల్లుతున్నదని చెప్పగా.. వెంటనే దానిని బ్యాన్ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్‌ను సీఎం ఆదేశించారు. ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వాటిని ఉంచకూడదని అన్నారు.

అడ్డగుట్ట యూనిట్‌కు చెందిన ఐపీఎస్ అధికారి ప్రమోద్‌కుమార్ మాట్లాడుతూ.. అడ్డగుట్ట, అమ్జద్‌నగర్ నాలాలన్నీ కబ్జాలకు గురయ్యాయని, ఒక ప్రైవేట్ ల్యాండ్‌లో దాదాపు 100 లారీల చెత్త పేరుకుపోయిందని తెలిపారు. దీంతో వాటిని కూడా క్లీన్ చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కాగా హనుమాన్‌నగర్, గోకుల్‌నగర్ ప్రాంతాల్లో అధికశాతం ప్రజలకు సొంతిళ్లు లేవని, అద్దె ఇంట్లో ఉంటూ కాలం వెళ్లదీస్తున్నట్లు చెప్పారని ఐఏఎస్ అధికారి అనితా రామచంద్రన్ అన్నారు. ఎరుకల బస్తీలో కెమికల్ ఫ్యాక్టరీ ఉన్నదని, దీంతో కాలనీ మొత్తం భరించలేని దుర్గంధం వ్యాపిస్తున్నదని ఉప్పర్‌బస్తీ, మిర్యాల్‌గడ్డ బస్తీ బాధ్యులైన ఐఎఫ్‌ఎస్ అధికారి క్షతిజ తెలిపారు.వాటర్ కూడా సరైన సమయంలో వస్తలేదని ఫిర్యాదు చేశారని చెప్పారు.. దీంతో ముఖ్యమంత్రి తీవ్రంగా స్పందించారు. వెంటనే ఆ ఫ్యాక్టరీని బ్యాన్ చేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించారు.

రాత్రి 10 తర్వాత, ఉదయం 3 గంటలకు నీళ్లు వస్తే ఏం ప్రయోజనం అని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం అన్నారు. లాలాపేట. పోచమ్మటెంపుల్ ఏరియా సమస్యలను యూనిట్ ఆఫీసర్, ఐఏఎస్ అధికారి సునీతా మొహంతి, విజయ్‌పురికాలనీ, సౌత్ లాలాగూడ సమస్యలను ఐఎఫ్‌ఎస్ అధికారి సువర్ణ వివరించారు. బౌద్ధ్దనగర్, అంబర్‌నగర్ ప్రజల ఇబ్బందులను అబ్దుల్ అజీం తెలుపగా బూత్ బంగ్లా, రైల్వేపార్క్ ప్రాంతాల సమస్యలను శ్రీనివాస్ వివరించారు.

మహ్మద్‌గూడ, బాపన్‌బస్తీ బాధ్యుడు ఐఎఫ్‌ఎస్ అధికారి చంద్రశేఖర్‌రెడ్డి, మెట్టుగూడ బాధ్యుడు ఐపీఎస్ అధికారి రవీందర్ తనకు అప్పగించిన ప్రాంతాలపై సీఎం కేసీఆర్‌కు తెలిపారు. ఇక పార్శీగుట్ట బాధ్యుడు సుధీర్‌బాబు మాట్లాడుతూ.. పార్శీగుట్ట చుట్టూ వాకింగ్ వే నిర్మాణాన్ని స్థానికులు కోరుతున్నారని అన్నారు.. బీడీ కార్మికులను గుర్తించే పనిలో ఉన్నట్లు చెప్పారు.. ఫుట్‌పాత్‌ల నిర్మాణం, కమ్యూనిటీహాల్, లైబ్రరీలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారని అన్నారు.

వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్త తీసుకోవాలి స్వచ్ఛ ఉద్యోగులకు సీఎం సూచన స్వచ్ఛ హైదరాబాద్‌లో పాల్గొనే ఉద్యోగులు అనారోగ్యానికి గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం కే చంద్రశేఖరరావు సూచించారు. ఎండకాలం అయినందున వడదెబ్బకు గురికాకుండా జాగ్రత్తపడాలి. ఎక్కువ ఎండ లేని సమయాల్లోనే బస్తీల్లో తిరగాలి.

సగటు ఉష్ణోగ్రత 40 డిగ్రీలపైనే ఉంటున్నది. మంగళవారం పగటిపూట 43 డిగ్రీలకు ఉష్ణోగ్రత చేరుకునే అవకాశం ఉంది. కావున ఉద్యోగులు ఉదయం 10 గంటల నుంచి 10.30 గంటలలోపే విధులు నిర్వర్తించాలి. సాయంత్రం ఐదుగంటల తర్వాతనే మళ్లీ బస్తీలకు వెళ్లాలి అని సూచించారు. ఎండ బాగా ఉన్నప్పుడు ప్రజలు కూడా బయటకు రారనే విషయాన్ని ఉద్యోగులు దృష్టిలో పెట్టుకోవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉద్యోగులు ఆరోగ్యం కాపాడుకోవడం కూడా ముఖ్యమని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.