Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఏమియ్యకుండ ఎట్లొస్తవ్‌?

మనది సమాఖ్య స్ఫూర్తి కలిగిన గణతంత్ర రాజ్యం. కానీ కేంద్రం పక్షపాతంతో వ్యవహరిస్తున్నది. దేశానికి పన్నుల రూపంలో దండిగా ఆదాయం అందిస్తున్న తెలంగాణపై అడుగడుగునా వివక్ష చూపిస్తున్నది. ఇదేమీ తనకు పట్టనట్లుగా ప్రధాని మోదీ రామగుండం వస్తున్నారు. తమకు ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేదో సమాధానం చెప్పాకే మోదీ ఈ రాష్ట్రంలో అడుగు పెట్టాలని తెలంగాణ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కర్తవ్యాలను, బాధ్యతలను భారత రాజ్యాంగం స్పష్టంగా పేర్కొన్నది. కేంద్రం, రాష్ట్రాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్లాలని హితవు పలికింది. అంటే కేంద్రం కుటుంబ పెద్ద పాత్ర పోషించాలి. కానీ ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కారు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. చంటి పిల్లాడిలా సాకాల్సిన తెలంగాణను కేంద్రం ముప్పు తిప్పలు పెడుతోంది. తెలుగు రాష్ర్టాల విభజన సమస్యలను ఓ కొలిక్కి తెచ్చి కొత్త రాష్ట్రమైన తెలంగాణకు బాసటగా నిలుద్దామనే సోయి దేశ ప్రధానికి లేకుండా పోయింది. కేంద్రానికి అత్యధికంగా పన్నుల ద్వారా ఆదాయం అందిస్తున్నది తెలంగాణ రాష్ట్రం.

కానీ అదనంగా ఇవ్వాల్సిన నిధుల సంగతి దేవుడెరుగు..హక్కుగా రావాల్సి న నిధులను కూడా కేంద్రం ఇవ్వడం లేదు. అభివృద్ధి విషయంలో రాష్ర్టాన్ని పట్టించుకోని కేంద్రం.. రాజకీయాలు చేసేందుకు మాత్రం పరుగెత్తుకుని వస్తున్నది. భారీగా అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయాల్సిన ప్రధాని ఏడాది క్రితమే ఉత్పత్తి మొదలైన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని ‘ప్రారంభించడానికి’ వస్తున్నారు. కోట్ల రూపాయలతో ఎమ్మెల్యేలను కొనేందుకు ప్రయత్నాలు చేసి అడ్డంగా దొరికిపోయిన పార్టీ ఇప్పుడు ప్రజల దృష్టి మరల్చేందుకు ఫ్యాక్టరీని జాతికి అంకితం ఇస్తున్నదని రాజకీయ విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ప్రధాని అన్నాక ఎక్కడికైనా రావచ్చు.. కానీ తెలంగాణకు ఏ మేలు చేయకుండా, ఏమీ ఇవ్వకుండా ఎందుకొస్తున్నారని రాష్ట్ర ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

నిధులు, ఉద్యోగాలు ఎక్కడ?
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ మంచి నీళ్లిస్తోంది. ఈ పథకానికి నిధులిస్తామని ప్రారంభోత్సవానికి విచ్చేసిన నరేంద్ర మోదీ చెప్పారు. రూ.19 వేల కోట్లు ఇవ్వాలని నీతి ఆయోగ్‌ కూడా సిఫారసు చేసింది. కానీ ఇప్పటి వరకు పైసా ఇచ్చింది లేదు. రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. మరి మాకు ఉద్యోగాలు ఎప్పుడిస్తారని తెలంగాణ యువత అడుగుతున్నది. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు మాట ఉత్తదే అయ్యింది. యూనివర్సిటీల్లో కామన్‌ ఎంట్రన్స్‌ పెట్టి విద్యార్థులకు భారం తగ్గించాలని తెలంగాణ సర్కారు బిల్లు తీసుకొస్తే.. మీ చెప్పు చేతల్లో ఉన్న గవర్నర్‌ దాన్ని తొక్కి పెట్టారు. మీరు దానికి వంత పాడతారు. మా పిల్లల భవిష్యత్తును అంధకారం చేస్తున్న మీరు ఏ ముఖం పెట్టుకుని తెలంగాణలో అడుగు పెడతారని ఆ పిల్లల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు.

బహు జనుల బాధలు ఎప్పుడు తీరుస్తరు?
మాది అన్ని వర్గాల పార్టీ అని, అందరి సంక్షేమమే లక్ష్యమని మీరు మాటలు చెబుతుంటారు. మరి రిజర్వేషన్ల విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసినా మీరెందుకు స్పందించడం లేదు? బీజేపీ అధికారంలోకి వస్తే వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని 2014లో హామీ ఇచ్చారు. ఇప్పటికి మీరు అధికారంలోకి వచ్చి దాదాపుగా 8 ఏండ్లు పూర్తవుతోంది. కనీసం దాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ వచ్చి మీకు వినతి పత్రం ఇచ్చినా మీరు పట్టించుకోలేదు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మాలలు, మాదిగల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకుంటున్నారు. ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ఓట్లేయించుకుంటున్నారు తప్ప బీసీల ఎ, బి, సి, డి వర్గీకరణ సంగతి మాత్రం తేల్చడం లేదు. బీసీ బిడ్డనని ప్రచారం చేసుకునే మీరు.. ఎందుకు బీసీల సంక్షేమాన్ని పట్టించుకోరు. చాలా రాష్ట్రాలు బీసీ జన గణనకు ముందుకొచ్చినా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది?

నీళ్ల వాటాలపై నికృష్ట రాజకీయాలు
రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి వాటాల అంశాన్ని నాన్చుతున్నది మీరు కాదా? వివాదాన్ని పరిష్కరించుకునేందుకు మా రాష్ట్ర ప్రభుత్వం ఓ మెట్టు దిగినా.. మీ స్వార్థ రాజకీయాల కోసం నీటి వాటాలు తేల్చకుండా ఎనిమిదేళ్లుగా తిప్పలు పెడుతున్నది మీరు కాదా? సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో నేడు చివరి ఆయకట్టు వరకు నీరు చేరుతోంది. పాత ఆయకట్టు స్థిరీకరణ జరుగుతోంది. దీంతో అత్యధికంగా ఆహారధాన్యాల ఉత్పత్తి జరుగుతోంది. మరి ఇంత ఘనత సాధించినా మా ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వడానికి వచ్చిన ఇబ్బందేంటని తెలంగాణ రైతన్నలు మిమ్మల్ని అడుగుతున్నారు. తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనే విషయంలోనూ మీ పార్టీ నాయకులతో రాజకీయం చేయిస్తారు. బొగ్గు గనులను మీ కార్పొరేటు మిత్రులకు కట్టబెట్టి కార్మికుల పొట్ట గొట్టాలని చూస్తున్నారు. విద్యుత్‌ రంగాన్ని ప్రైవేటు పరం చేయాలని కుట్రలు పన్నుతున్నారు. చేనేతపై జీఎస్టీ విధించి నేతన్నల బతుకులపై మోయలేని భారం మోపారు.

మీరు హామీ ఇచ్చినవి.. మేం అడిగినవి.. ఏ ఒక్కటైనా అమలు చేశారా? అసలు ప్రజా సంక్షేమం గురించి పట్టించుకునే ఆలోచన మీకు ఏ కోశానైనా ఉందా? తెలంగాణ గడ్డ మీద అడుగుపెట్టే ముందు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పండి. లేకపోతే తెలంగాణ ప్రజలు మీకు బుద్ధి చెప్పడం ఖాయం.

గుజరాత్‌కు చిన్న ఆపదొచ్చినా వేల కోట్లు గుమ్మరిస్తారు. వరదలొచ్చి మేం అల్లాడినప్పుడు మాత్రం మీ కళ్లు మూసుకుపోతాయి. మా అన్నదాతల పంటలు దెబ్బ తింటే పైసా ఇచ్చేందుకు మీకు మనసు రాదు. నిధులడిగితే నీళ్లు నములుతారు. మా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిన మీరు..ఇప్పుడెందుకు వస్తున్నారని తెలంగాణ సమాజం అడుగుతోంది. తెలంగాణలోనే కాదు దేశమంతటా మీ పాలనపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారు.

(వ్యాసకర్త: టీఎస్ రెడ్కో చైర్మన్)
వై.సతీష్‌ రెడ్డి

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.