Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఎన్నాళ్లో వేచిన ఉదయం

-21న కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం
-ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర, ఏపీ సీఎంలు
-ఫడ్నవీస్, జగన్‌లను స్వయంగా ఆహ్వానించనున్న సీఎం కేసీఆర్
-సాకారమవుతున్న అపర భగీరథుడి స్వప్నం
-మూడు బరాజ్‌లు, మూడు పంప్‌హౌస్‌లు
-ఆసియాలోనే అతిపెద్ద మోటర్లు
-కిలోమీటర్ల కొద్దీ సొరంగాలు.. కాల్వలు
-7,152 మెగావాట్ల విద్యుత్ వ్యవస్థ
-దేశంలోనే అసాధారణమైన ఎత్తిపోతల
-అత్యల్పసమయంలో అపూర్వమైన నిర్మాణం
-ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు
-ప్రస్తుత నీటి లభ్యత దృష్ట్యా 6 మోటర్ల వెట్న్
-గోదావరికి ఇన్‌ఫ్లో మొదలుకాగానే రోజుకు రెండు టీఎంసీల ఎత్తిపోత
-పంపింగ్‌కు విద్యుత్ ఏర్పాట్లు సిద్ధం: ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు

ఒక తపస్సు ఫలించబోతున్నది. అపర భగీరథుడి స్వప్నం సాకారమయ్యే క్షణం రానేవచ్చింది. దశాబ్దాల తరబడి నీటికోసం సాగిన రైతు నిరీక్షణ తీరిపోనున్న సమయం ఆసన్నమైంది. ఇంతకాలం సముద్రంలోకి వృథాగా పోయిన గోదారమ్మ మేడిగడ్డనుంచి వెనుకకు ఉరకలెత్తి వచ్చేందుకు సిద్ధమైంది. తెలంగాణ రైతు ఇంతకాలం పడిన వెతలు ఇక కనిపించవు. తలాపున పారుతున్న గోదారమ్మను మన బీళ్లకు తరలించి.. తెలంగాణను కోటి ఎకరాల మాగాణంచేయాలన్న ఆకాంక్షను.. మన భగీరథుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కేవలం రెండున్నరేండ్లలో నిజంచేసి చూపించారు. యావత్‌దేశం అబ్బురపడేలా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును సీఎం కేసీఆర్.. తెలంగాణ జాతికి సమర్పణంచేసే ఘట్టం ఆవిష్కారమవుతున్నది. ఈ నెల 21న ఈ మహత్తర ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో పాలుపంచుకోవడానికి ఎగువనున్న మహారాష్ట్ర, దిగువనున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా రావడం దేశ సాగునీటిరంగ చరిత్రలో అపూర్వమైన చారిత్రక సన్నివేశంగా నిలిచిపోనున్నది.

ఈ క్షణం కోసం ఎన్నేండ్ల ఎదురుచూపులు! తలాపున గోదారమ్మ పారుతున్నా.. పక్కనే ఉన్న పొలాలకు తడి అందని పరిస్థితి. బోర్లు వేస్తుంటే.. నీళ్లు పడకున్నా.. కనీసం పదును కనిపించినా చాలనుకున్న సందర్భాలు ఎన్నో! బోర్లల్లో ఒక్కచుక్క కూడా అందక.. వానలకోసం మబ్బులవైపు చూస్తూనే ఉసురు పోయిన ఘటనలు ఎన్నో! బోర్లు.. కరంటు.. తెలంగాణ అన్నదాతల పాలిటి యమపాశాలయినాయి. నియతిలేని పాలకులకు ఎన్నడూ కండ్లల్లో తడారిపోయిన తెలంగాణ రైతు కనిపించలేదు. ఉద్యమనాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో మలిదశ ఉద్యమం మొదలైన తర్వాత తప్పదన్నట్టుగా ఉమ్మడి పాలకులు ఉత్తుత్తిగా వేసిన ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు శంకుస్థాపన రాయి ఎక్కడున్నదో కూడా తెలియదు. కానీ.. తెలంగాణ సాధించిన ఉద్యమనేతే.. రాష్ట్ర పాలకుడై గోదారమ్మను తెలంగాణ పొలాలకు తరలించేందుకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు.. అతి తక్కువ సమయంలో నిర్మాణం పూర్తిచేసుకొని.. ప్రారంభానికి సిద్ధమైంది. తెలంగాణ వస్తే ఏమైతది అన్నవాళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టు నిటారుగ నిలబడి నినదిస్తున్నది.. ఇదిగో తెలంగాణమని!

చారిత్రాత్మక సన్నివేశం
రాష్ట్రంలోని దాదాపు 13 జిల్లాల్లో సుమారు 40 లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవం పోసేందుకు నిర్మించిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రారంభానికి సిద్ధమైంది. జూన్ 21న ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖర్‌రావు ఈ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు. కన్నెపల్లి పంపుహౌస్‌లో నీటి ఎత్తిపోతలకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టనున్నారు. తెలంగాణకు ఎగువన ఉన్న మహారాష్ట్ర, దిగువన ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఈ మహత్తర కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రానుండటం అద్భుతమైన చారిత్రక ఘట్టంగా చెప్పుకోవచ్చు. గోదావరి బేసిన్‌లోని కీలక పొరుగు రాష్ర్టాలైన ఏపీ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులను సీఎం కేసీఆర్ ఆహ్వానిస్తున్నారు. బుధవారం మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌తో ముఖ్యమంత్రి కేసీఆర్ ఫోన్‌లో మాట్లాడి.. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభానికి రావాలని కోరగా ఆయన సానుకూలంగా స్పందించారు. దీంతో త్వరలోనే ముంబై వెళ్లి ఫడ్నవీస్‌ను స్వయంగా ఆహ్వానించాలని, అదేవిధంగా విజయవాడ వెళ్లి ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని ఆహ్వానించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రాజకీయాలకు అతీతంగా ఒక నదీ బేసిన్‌లోని ఎగువ, దిగువ రాష్ర్టాల ముఖ్యమంత్రులు ఒక ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రావడమనేది బహుశా దేశచరిత్రలో ఇదే తొలిసారి అని సాగునీటిరంగ నిపుణులు అంటున్నారు.

ప్రారంభోత్సవానికి భారీ ఏర్పాట్లు
కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రభుత్వం భారీఎత్తున ఏర్పాట్లు చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయిలో రీడిజైన్‌చేసి, రెండున్నరేండ్ల రికార్డు సమయంలోనే ప్రాజెక్టు ద్వారా నీటిని విడుదలచేస్తున్న దరిమిలా కార్యక్రమాన్ని పండుగలా జరిపేందుకు కసరత్తు మొదలైంది. ఈ నెల 21న అధికారికంగా కన్నెపల్లి పంపుహౌస్‌లోని మోటర్ల వెట్న్ ప్రారంభం కానున్నది. ప్రస్తుతం ఎగువనుంచి ఇన్‌ఫ్లోలు లేకపోవడంతో ఒకేసారి మోటర్లను నడిపేందుకు ఆస్కారం లేకుండాపోయింది. గోదావరికి ఇన్‌ఫ్లోలు మొదలైన తర్వాత జూలైలో అన్ని మోటర్లు నడుస్తాయి. ప్రస్తుతం కన్నెపల్లి పంపుహౌస్ వద్ద గోదావరిలోకి 500 క్యూసెక్కులలోపు మాత్రమే వరద వస్తున్నట్లుగా ఇంజినీర్లు తెలిపారు. ఈ క్రమం లో రోజుకు రెండు మోటర్లను అరగంట చొప్పు న నడిపేందుకు సాంకేతికంగా వీలుపడుతుందని చెప్తున్నారు. ఈ నెల 21న రెండు మోటర్లకు వెట్న్ నిర్వహిస్తారని, ఒక్క మోటర్‌ను అరగంట పరీక్షించే క్రమంలో 0.004 టీఎంసీలు అంటే 10.80 కోట్ల లీటర్ల గోదావరిజలాల్ని ఎత్తిపోయవచ్చని ఇంజినీర్లు తెలిపారు.

జూలైలో రోజుకు రెండు టీఎంసీలు
గోదావరికి పూర్తిస్థాయి వరద మొదలైన తర్వాత జూలైలో రోజుకు రెండు టీఎంసీల చొప్పున గోదావరిజలాల్ని ఎత్తిపోసేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. ఈలోగా ప్రాణహిత నుంచి వరద కూడా పెద్దఎత్తున మొదలయ్యే అవకాశమున్నది. కన్నెపల్లి పంపుహౌస్‌లో 11 మోటర్లు కూడా సిద్ధం కానున్నాయి. ఈ నేపథ్యంలో కన్నెపల్లి నుంచి రోజుకు రెండు టీఎంసీల నీటిని ఎత్తిపోసి.. ఆపై అన్నారం, సుందిల్ల పంపుహౌస్‌ల్లోని మోటర్ల ద్వారా కూడా జలాల ఎత్తి పోత మొదలుపెట్టేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. సుందిల్ల నుంచి ఎల్లంపల్లి జలాశయంలోకి నీటిని ఎత్తిపోసి.. ఆపై నందిమేడారం, కీలకమైన రామడుగు పంపుహౌస్‌లోని 139 మెగావాట్ల సామర్థ్యమున్న బాహుబలి మోటరు ద్వారా జలాల తరలింపును చేపడ్తారు. అక్కడినుంచి గోదావరి జలాల్ని ఒక టీఎంసీని మిడ్‌మానేరు.. మరో టీఎంసీని పునర్జీవ పథకం ద్వారా శ్రీరాం సాగర్ జలాశయంలోకి తరలించాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే నీటిపారుదలశాఖకు దిశానిర్దేశంచేశారు.

గోదావరి తీరాన ఎత్తిపోత..
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన నందిమేడారం పంపుహౌస్‌లో ఇప్పటికే పలు మోటర్ల వెట్న్‌న్రు అధికారులు విజయవంతంగా పూర్తిచేశారు. 124.4 మెగావాట్ల సామర్థ్యమున్న మూడు మోటర్ల ద్వారా నీరు విడుదలచేసి పరీక్షించారు. ఇదే క్రమంలో తాజాగా గోదావరితీరాన.. కాళేశ్వరం ప్రాజెక్టుకు ముఖద్వారమైన మేడిగడ్డ బరాజ్ ఫోర్‌షోర్ నుంచి అధికారికంగా నీటివిడుదల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. 16.17 టీఎంసీల నీటినిల్వ సామర్థ్యంతో నిర్మించిన మేడి గడ్డ బరాజ్ ఫోర్‌షోర్ నుంచి నీటిని ఎత్తి పోసేందుకు కన్నెపల్లి పంపుహౌస్‌ను నిర్మించారు. ఇందులో పదకొండు మోటర్ల ద్వారా రోజుకు రెండు టీఎంసీల గోదావరిజలాల్ని ఎత్తిపోయనున్నారు. ఇందులో భాగంగా ఇప్పటివరకు తొమ్మిది మోటర్లు సిద్ధమవగా.. మరో రెండింటి పనులు పురోగతిలో ఉన్నాయి. నెలాఖరుకు ఇవికూడా పూర్తికానున్నట్లు అధికారులు తెలిపారు. గోదావరికి ఇంకా ఇన్‌ఫ్లోలు మొదలు కాకపోవడంతో ప్రస్తుతం కన్నెపల్లి వద్ద నీటి లభ్యత తక్కువగా ఉన్నది. దీంతో 21న జరగనున్న ప్రారంభోత్సవంలో భాగంగా ఆరు మోటర్ల నుంచి నీటిని ఎత్తిపోస్తారు.

విద్యుత్ వ్యవస్థ సిద్ధం: ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు
హైదరాబాద్ నమస్తే తెలంగాణ: కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి ఈ నెల 21న ప్రారంభోత్సవం చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినందున, నీటిని ఎత్తిపోయడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లుచేసినట్లు ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ప్రకటించారు. గోదావరినుంచి 2 టీఎంసీల నీటిని ఎత్తి జలాశయాలకు తరలించడానికి 4,992.47 మెగావాట్ల విద్యుత్తు అవసరం అవుతుందని అంచనావేసినట్లు వివరించారు. కొన్ని రిజర్వాయర్ల పనులు, లిఫ్టుల పనులింకా జరుగుతున్నందున ఈ ఏడాది నికరంగా 4,700 మెగావాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉన్నదని, ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేశామని తెలిపారు. వచ్చేఏడాది నుంచి మూడు టీఎంసీల నీరు ఎత్తిపోయాలని నిర్ణయించినందున మరో 2,160 మెగావాట్లు అదనంగా అవసరమని చెప్పారు. మొత్తంగా 7,152 మెగావాట్ల విద్యుత్తును అందించడానికి సిద్ధమవుతున్నట్లు తెలిపారు. రూ.2,890 కోట్ల వ్యయంతో కాళేశ్వరం ప్రాజెక్టు కోసం విద్యుత్ వ్యవస్థను ఏర్పాటుచేసినట్లు వెల్లడించారు.

15 డెడికేటెడ్ సబ్‌స్టేష్లన్లను నిర్మించి, వివిధ క్యాటగిరీల్లో 80 పంపులు బిగించామని తెలిపారు. గతంలో కేవలం 30 మెగావాట్ల విద్యుత్ పంపులు వాడిన చరిత్ర మాత్రమే తెలంగాణలో ఉన్నదని, కానీ సముద్రమట్టానికి 618 మీటర్లకు పైగా ఎత్తుకు పంపింగ్‌చేసి, తెలంగాణ బీళ్లకు నదీజలాలను మళ్లించే బృహత్కార్యానికి విద్యుత్ సంస్థలు పూనుకొన్నాయని ప్రభాకర్‌రావు చెప్పారు. రైతులకు సాగునీరు అందించే అతిపెద్ద క్రతువులో విద్యుత్‌శాఖది కీలకపాత్ర అని, దీన్ని విజయవంతం చేయడానికి ఉద్యోగులు శక్తివంచన లేకుండా కృషిచేయాలన్నారు. కోటికి పైగా ఎకరాలకు సాగునీరు అందించాలనే గొప్ప లక్ష్యంతో సీఎం కేసీఆర్ ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారని, వీటిద్వారా అనుకున్న విధంగా నీటిని ఎత్తిపోసే బాధ్యత విద్యుత్ ఉద్యోగులపై ఉందన్నారు. నిర్ణీత గడువులోగా విద్యుత్ వ్యవస్థను ఏర్పాటుచేసిన స్ఫూర్తితోనే, లిఫ్టులను కూడా ఎలాంటి ఆటంకాల్లేకుండా నిర్వహించి సమర్థతను చాటుకోవాలని ఉద్యోగులను కోరారు.

40 లక్షల ఎకరాల ఆయకట్టుకు జీవం
కిలోమీటర్లకొద్దీ పొడవైన సొరంగాలు.. ఆసియాలోనే అతిపెద్దవైన మోటర్లు.. లోతైన సర్జ్‌పూల్స్.. మూడు బరాజ్‌లు.. మూడు పంప్‌హౌస్‌లు.. వీటన్నింటితో నదీగర్భంలోనే రివర్స్ పంపింగ్ విధానం! ఒకటా రెండా.. కాళేశ్వరం ప్రత్యేకతలు అన్నీఇన్నీ కావు. పదమూడు జిల్లాలు.. దాదాపు 40 లక్షల ఎకరాల ఆయకట్టు.. సమృద్ధిగా నీరు.. ఇప్పుడు తడారిపోయిన రైతు కండ్లల్లో మళ్లీ నీరు ఉబికివస్తున్నది.. ఆనందబాష్పమై! సాగునీటి ప్రాజెక్టుల రీడిజైనింగ్‌లో భాగంగా సీఎం కేసీఆర్ ఈ పథకానికి రూపకల్పన చేయగా.. 2016 జూన్‌లో నిర్మాణపనులు మొదలయ్యాయి. అదేసమయంలో మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం కూడా పూర్తవడంతో పనులు శరవేగంగా ముందుకుసాగాయి. ముఖ్యంగా దేశంలో ఏ సాగునీటి ప్రాజెక్టు కూడా సాధించనిరీతిలో.. కేంద్ర జలసంఘం నుంచి ఏకంగా పది కీలకమైన అనుమతుల్ని ఏడాదిలోపే సాధించడం ఈ ప్రాజెక్టు విశిష్టత. సాధారణంగా ఒక ప్రాజెక్టు రూపకల్పన నుంచి నీటి విడుదల వరకు కనీసంగా దశాబ్దం వరకు సమయం పడుతుంది. కానీ అందుకు భిన్నంగా కాళేశ్వరం ప్రాజెక్టును కేవలం రెండున్నరేండ్ల్లలోనే సాకారం చేయడమనేది దేశ సాగునీటిరంగ చరిత్రలోనే ఒక రికార్డు. ప్రధానంగా ప్రాజెక్టులో అత్యంత కీలకమైన మేడిగడ్డ బరాజ్ నిర్మాణంలో భాగంగా జరిగిన కాంక్రీట్ పనులు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి. మూడు షిఫ్టుల్లో రేయింబవళ్లు సిబ్బంది పనిచేయడం.. సెలవులు, పండుగలంటూ లేకుండా ఇంజినీర్లు పర్యవేక్షించడం.. సీఎం కేసీఆర్ సైతం ఆన్‌లైన్ ద్వారా ఎప్పటికప్పుడు పనులను పరిశీలించడంతోపాటు నిధులలేమి లేకుండా ఆర్థికసంస్థల ద్వారా అవసరమైన రుణాలు సాధించి కనీసం ఒక్కనిమిషం కూడా పనులు ఆగకుండా నిర్మాణానికి అడ్డంకులు లేకుండాచేశారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.