Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఎర్రవల్లి, నర్సన్నపేట ఆదర్శంగా నిలవాలి

కులమతాలకతీతంగా ప్రజలు ఐక్యమత్యంగా ఉండి అనుకున్నది సాధించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తాను దత్తత తీసుకున్న మెదక్ జిల్లా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలను ఆయన ఆదివారం సందర్శించారు. ఇటీవల రెండు గ్రామాల్లో కంటి వైద్య శిబిరాలను నిర్వహించిన విషయం తెలిసిందే. పరీక్షల అనంతరం 1100 మందికి అద్దాలు అవసరమని వైద్యులు పేర్కొన్నారు. అద్దాల పంపిణీకి నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యం ముందుకువచ్చింది. ఈ సందర్భంగా రెండు గ్రామాల్లో నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సభల్లో కంటి అద్దాలను సీఎం పంపిణీ చేశారు. నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్‌రావు, పత్రిక డైరెక్టర్ గండ్ర మోహన్‌రావు, ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.

CM KCR addressing in Erravelli village of Medak district (3)

-ఇండ్ల నిర్మాణం చిన్నపని.. ఆర్థికంగా స్థిరపడటం పెద్దపని.. కమతాల ఏకీకరణ జరగాలి -నిరుద్యోగ యువకులకు ట్రాక్టర్లు అందిస్తాం.. ప్రతి ఎకరాకు డ్రిప్ సౌకర్యం కల్పిస్తాం – ఎర్రవల్లిలో ఉగాదిలోగా డబుల్‌బెడ్‌రూం ఇండ్లు: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో కండ్లద్దాలు పంపిణీ.. సంస్థ యాజమాన్యాన్ని అభినందించిన సీఎం

అద్దాల పంపిణీకి ముందుకు వచ్చిన సంస్థ యాజమాన్యాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందించి, సీఎండీ, ఎడిటర్‌ను సన్మానించారు. ఈ సందర్భంగా జరిగిన సభల్లో సీఎం ప్రసంగించారు. ఎర్రవల్లి, నర్సన్నపేటలు తెలంగాణలోని పది జిల్లాలకు పాఠం నేర్పాలని అన్నారు. అన్నింట్లో ఈ గ్రామాలు ఆదర్శంగా నిలవాలని, సీఎంగా తాను అండగా ఉన్నానని చెప్పారు. గ్రామస్థులు ఐక్యంగా ఉండి అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని కోరారు. ఇంకా సీఎం ఏమన్నారంటే..

ఇంకా ఒకటో తరగతిలోనే ఉన్నాం గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలని లక్ష్యం పెట్టుకున్నాం. గ్రామస్థులంతా ఐక్యంగా ఆ గమ్యాన్ని చేరాలనుకున్నాం. మన ప్రయత్నంలో ఇప్పుడు ఒకటో తరగతిలోనే ఉన్నాం. ఈ ప్రయాణం చాలా దూరం పోవాల్సి ఉంటుంది. ఎర్రవల్లిలో ఇప్పుడు జరిగింది.. జరుగుతున్నది చాలా తక్కువ. గ్రామమంతా బాగు చేసుకుందామనుకున్నాం. ఇందుకు ప్రణాళిక సిద్ధమైపోయింది. గ్రామంలో కొత్త ఇండ్ల నిర్మాణంకోసం పాత ఇండ్లను కూల్చి వేస్తున్నాం. దీంతో ఉండటానికి గ్రామస్థులకు ఇబ్బందులు ఏర్పడతాయి. అందుకే తాత్కాలిక షెడ్ల ఏర్పాటుకు జిల్లా కలెక్టర్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇండ్ల నిర్మాణానికి టెండర్ల్లు పిలిచారు. నిర్మాణ ప్రక్రియ త్వరలోనే మొదలవుతుంది. ఇంటింటికీ నల్లా, అన్ని వీధుల్లో హైదరాబాద్ తరహాలో మోరీలు ఉంటాయి. ఇండ్ల నిర్మాణం పూర్తికాగానే ఉగాది దగ్గరలో కొత్త ఇండ్లలోకి చేరిపోవాలే. గ్రామంలో శావా తీసి, పండుగ వాతావరణంలో కొత్త ఇండ్లలోకి అందరూ ఒకేరోజు పోవాలి. అసలు ఇండ్ల నిర్మాణం చిన్న పని. బతుకుదెరువు పని పెద్దది. అందులో వ్యవసాయం పని ఇంకా చాలా పెద్దది. వ్యవసాయం ఎలా చేయాలి? ఎలాంటి పద్ధతులు అవలంబించాలి? అనేది ముఖ్యం. ఇప్పటికే ఎర్రవల్లికి శాస్త్రవేత్తలు వచ్చిపోయారు. రెండు గ్రామాల్లో తిరిగి ఏ పంటలకు ఏ భూములు అనువుగా ఉన్నాయో పరీక్షల ద్వారా ధ్రువీకరణకు వచ్చారు. ఈ రెండు గ్రామాలను విత్తనోత్పత్తి గ్రామాలుగా తీర్చిదిద్దుతున్నాం.

కావేరీ విత్తన కంపెనీకి గ్రామాలను సీడ్ ప్రొడక్ట్‌కోసం ఇచ్చాం. ఆ కంపెనీ వాళ్లే విత్తనాలు ఇస్తారు. పండించిన పంటను కొనుగోలు చేస్తారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండది. కంపెనీ ప్రతినిధులు చెప్పింది విని సాగు మెళకువలు నేర్చుకోవాలి. ప్రధానంగా గ్రామంలో కమతాల ఏకీకరణ జరగాలి. గ్రామంలో ఒకే రైతుకు వివిధ చోట్ల భూములున్నాయి. అక్కడో ఎకరా, మరో చోట రెండెకరాలు ఉంటే కుదరదు. అలాంటి భూములు రద్దు చేసుకుని ఒకే చోటకు రావాల్సి. అందుకు రైతులంతా ముందుకు రావాలె. ఎకరా ఉన్న చోట వదులుకుని రెండుకరాలున్నచోటనే పక్కన ఎకరాను కలుపుకోవాలి.

CM KCR addressing in Erravelli village of Medak district (6)

ఇలాచేస్తే 50 ఎకరాల్లో ఒకేచోట సాగుచేయడంద్వారా రైతులు కలిసి పనిచేసుకునే అవకాశం దొరుకుతుంది. కమతాల ఏకీకరణకు ఎలాంటి చార్జీలు లేకుండా ప్రభుత్వమే రిజిస్ట్రేషన్లు చేస్తుంది. రెండు గ్రామాల్లో ఎన్ని బోర్లు ఉన్నాయి? ఇంకా బోర్లు లేని రైతులు ఎంతమందో గుర్తిస్తున్నాం. అందరికీ బోర్లు తవ్వించి, మోటర్లు ఇప్పిస్తాం. ప్రతి ఎకరాలో డ్రిప్ సాగుఏర్పాటు చేయిస్తాం. అందుకు రైతులు ఐక్యం ఉండాలి. నీది.. నాదీ అనుకోకుండా అందరి భూముల్లో డ్రిప్ ఏర్పాటు చేసుకునేవరకు ఒకరికి ఒకరు తోడుగా ఉండాలి. గ్రామాల్లో నిరుద్యోగులైన వివిధ కులాల యువకులకు 30వరకు ట్రాక్టర్లను ఇప్పిస్తాం. ఆ యువకులే ట్రాక్టర్లద్వారా గ్రామాల్లోని భూములను దున్నాల్సి ఉంటుంది. గ్రామస్థులు ఐక్యంగా ఉండాలి. కులం, జాతి అనే అభిప్రాయం ఎవరికీ ఉండొద్దు. ఊర్లో ఎవరూ ఉపవాసముండొద్దు. ఒక్క ఇల్లు నామోషిగా ఉన్నా. ఊరికే మంచిది కాదు. అందరూ క్రమపద్ధతిలో కష్టపడితే ఊరు ఆదర్శమవుతుంది.

ఆరోగ్య సమస్యలపై అప్రమత్తంగా ఉండాలి ఆరోగ్యసమస్యలపై ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలి. రెండు గ్రామాల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఇప్పటికే కంటి వైద్య శిబిరాలు నిర్వహించాం. రెండు గ్రామాల్లో 1100 మందికి ఇప్పుడు అద్దాలు అందిస్తున్నాం. క్యాటరాక్ట్ ఆపరేషన్ ఉచితంగానే చేయిస్తాం. మరో మూడు రోజుల్లో రెండు గ్రామాల్లో యశోదా హాస్పిటల్స్ యాజమాన్యం మెగా వైద్య శిబిరం నిర్వహించడానికి ముందుకు వచ్చింది. ఆ రోజు గ్రామస్థులంతా పరీక్షలు చేయించుకోవాలి. మరో ఆరునెలల తరువాత మళ్లీ పరీక్షలు చేయించుకోవాలి. ఎర్రవల్లిలో ఆరోగ్యం, ఊరు, పరిశుభ్రత, పంటలు పండించే విధానం ఇలా ఏది తీసుకున్నా ప్రత్యేకత కనిపించాలె. ఉమ్మడిగా అందరం ఒకటైతే కులమతాలను పక్కన బెట్టి ఐక్యంగా ఉంటే అనుకున్నది సాధిస్తాం. ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల ప్రజలే మొత్తం తెలంగాణకు పాఠాలు నేర్పాలె. అందుకే ఈ గ్రామాల వెంట పడుతున్నా. తెలంగాణ ప్రజలు రెండు గ్రామాలను చూసిపోవడానికి రావాలె. ఆదర్శంలో రెండు గ్రామాలు పోటీ పడాలె.

మణికొండ కుటుంబానికి సీఎం పలుకరింపు మాజీ జెడ్పీ చైర్మన్ మణికొండ లక్ష్మీకాంతారావు తల్లి చంద్రమ్మ దశదిన కర్మ సందర్భంగా ఆదివారం ప్రజ్ఞాపూర్‌లోని వారి స్వగృహంలో జరిగిన కార్యక్రమంలో సీఎం కేసీఆర్ పాల్గొని ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాంతారావు, నర్సింగరావు, వేదకుమార్, విజయ్‌కుమార్, అశోక్‌కుమార్ తదితరులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నమస్తే తెలంగాణకు ప్రత్యేక అభినందనలు ఎర్రవల్లి, నర్సన్నపేటలో కంటి అద్దాల పంపిణీకి ముందుకు వచ్చిన నమస్తే తెలంగాణ దినపత్రిక యాజమాన్యాన్ని కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. సీఎండీ దామోదర్‌రావు, ఎడిటర్ కట్టా శేఖర్‌రెడ్డిలను శాలువా కప్పి సన్మానించారు. ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు ఇతరులకు స్ఫూర్తిగా నిలుస్తాయని సీఎం పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌తో పాటు దామోదర్‌రావు, శేఖర్‌రెడ్డి గ్రామస్థులకు కంటి అద్దాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రాస్, జేసీ వెంకట్రాంరెడ్డి, గడా ఓఎస్డీ హన్మంతరావు, స్థానిక సర్పంచ్‌లు తదితరులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.