-చంద్రబాబు, జగన్‌పై మండిపడ్డ మంత్రి హరీశ్‌రావు -నిబంధనలకు లోబడే నీటివాటా వాడుకుంటామని వెల్లడి

మన నీళ్లు మనమే వినియోగించుకోవాలని శుభమా అని కొబ్బరికాయ కొట్టి ప్రాజెక్టుల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తే, ఏపీ సీఎం చంద్రబాబు ఓర్వలేకపోతున్నాడు. అనుమతులు లేని ప్రాజెక్టులు కడుతున్నారని ఢిల్లీకి ఉత్తరం రాస్తా, సుప్రీంకోర్టుకు వెళ్తానంటూ ప్రగల్భాలు పలుకుతున్నాడు. అక్కడి ప్రతిపక్ష నేత జగన్ దీక్ష చేస్తానని ప్రకటిస్తున్నాడు. మీరుకాదు, మీ తాత జేజమ్మలు దిగొచ్చినా, ఎన్ని కుట్రలు పన్నినా ప్రాజెక్టుల నిర్మాణాలను ఆపలేరు అని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు.
బుధవారం వరంగల్ జిల్లా కొడకండ్ల మండలం ఏడునూతలలో బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పాలకుర్తి ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు అధ్యక్షతన నిర్వహించిన బహిరంగసభలో హరీశ్‌రావు ప్రసంగించారు. ఉమ్మడిరాష్ట్రంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు, వైఎస్సార్‌లు పోతిరెడ్డిపాడు, పులిచింతల, గాలేరునగరి, హంద్రినీవా వంటి అక్రమ ప్రాజెక్టులు నిర్మించి తెలంగాణను ఎండగట్టారన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ తెచ్చుకున్నామని, మనకు గట్టి నాయకుడు సీఎం కేసీఆర్ ఉన్నారని.. రెండున్నర ఏండ్లలో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఎస్సారెస్పీ ఆయకట్టుకు నీళ్లు అందిస్తామని ధీమా వ్యక్తం చేశారు. గోదావరిలో 940 టీఎంసీలు, కృష్ణాలో 366 టీఎంసీల నీటిని వాడుకునే హక్కు తెలంగాణకు ఉందని, నిబంధనలకు లోబడే ప్రాజెక్టులు నిర్మించుకుంటామన్నారు. కోటి ఎకరాలకు కాల్వల ద్వారా సాగునీరు ఇస్తామన్నారు. కాళేశ్వరం ద్వారా 20లక్షల ఎకరాలకు కాల్వల ద్వారా, 20లక్షల ఎకరాలకు స్థిరీకరణ ద్వారా నీటిని అందిస్తామన్నారు. ఎమ్మెల్యే ఎర్రబెల్లి సూచన మేరకు నియోజకవర్గంలో దేవాదుల, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల పరిధిలో కాల్వలకు అవకాశం ఉన్న చోట ఓటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు.
భూ సేకరణలో లంచం అడిగితే సస్పెండ్ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి వ్యవహరించని రీతిలో కేసీఆర్ రెవెన్యూ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై ప్రాజెక్టుల భూ సేకరణ విషయంలో స్పష్టత ఇచ్చారని, దీనికి అనుగుణంగానే జీవో 123 తీసుకొచ్చామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. దళారుల బారిన చిక్కి నిర్వాసితులు నష్టపోకుండా చూస్తున్నామన్నారు. భూసేకరణలో అధికారులు లంచాలు అడిగితే సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. ప్రాజెక్టుల నిర్మాణాలకు సంబంధించి భూసేకరణ వేగవంతం చేయాలని, గడువులోపు పరిహా రం అందజేయాలని ఆదేశించారు. సమావేశంలో ఎమ్మెల్సీ బీ.వెంకటేశ్వర్లు, మాజీ ఎమ్మెల్యే ఎన్ సుధాకర్‌రావు, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కెళ్లపల్లి రవీందర్రావు తదితరులు పాల్గొన్నారు.