-ప్రభుత్వం చెప్పిన పంటలే వేయాలి -రైతులు తమ తలరాత తామే మార్చుకోవాలి -సొంతగా పెట్టుబడి పెట్టుకొనే శక్తి రావాలి -పంటలన్నీ బ్రహ్మాండంగా అమ్ముడుపోవాలి -అన్నదాతలను పైకి తేవడమే ప్రభుత్వ లక్ష్యం -త్వరలో టీవీ ద్వారా రైతులతో ముఖాముఖి -నాణ్యమైన పత్తికి మనమే కేరాఫ్ -70 లక్షల ఎకరాల్లో దాన్నే పండిద్దాం -వానకాలంలో మక్కల బదులు కంది -చెప్పిన పంట వేస్తేనే రైతుబంధు వర్తింపు -మీడియాతో ముఖ్యమంత్రి కేసీఆర్ -తెలంగాణ వ్యవసాయ రంగంలో నవశకానికి రాష్ట్ర ప్రభుత్వం నాందిపలికింది. -అరుదైన నేలల సమాహారంగా.. అన్నిరకాల పంటలు పండటానికి అనువైన ప్రాంతంగా ఉన్న తెలంగాణను.. రానున్న రోజుల్లో అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు ప్రారంభించింది.

నారు వేసే దగ్గర్నుంచి.. పంట అమ్ముకోవడం దాకా అన్నదాతకు ప్రతి అడుగులో మార్గదర్శనంచేస్తూ.. ఎక్కడ ఏ పంట వేస్తే రైతు లాభాల బాట పడుతరో సూచిస్తూ.. రైతులను సంపన్నులను చేయాలని కార్యాచరణ ప్రారంభించింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌తోపాటు, మంత్రులు, అధికారులు గత కొంతకాలంగా రాష్ర్టానికి సంబంధించి ఒక సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపకల్పనచేసే దిశగా మేధోమధనం చేశారు.
సోమవారం ఉదయం జిల్లాలవారీగా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేసిన సీఎం కేసీఆర్.. సాయంత్రం జరిగిన మంత్రిమండలి సమావేశంలో చర్చించిన అనంతరం పలు నిర్ణయాలను ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిచేయడమే లక్ష్యంగా ప్రభుత్వం తీసుకొంటున్న నిర్ణయాలకు రైతులు కూడా సహకరించాలని పిలుపునిచ్చారు.
తెలంగాణ చాలా అద్భుతమైన వ్యవసాయిక రాష్ట్రంగా అవతరించడానికి పుష్కలమైన అవకాశాలున్నాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. రాష్ట్రంలో పండించిన పంటలన్నీ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయి రైతులకు అద్భుతమైన ధరలు లభించే పద్ధతి రావాలని.. ఇందుకోసం రైతులు శాస్త్రీయ దృక్పథంతో ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ మార్గదర్శనంలో నడిచి అద్భుత ఫలితాలను సాధించాలని కోరారు. రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో వ్యవసాయం, పంటల మార్పిడి తదితర అంశాలపై సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్.. జిల్లా కలెక్టర్ల స్థాయి నుంచి కిందిస్థాయి అధికారుల వరకు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. అనంతరం జరిగిన క్యాబినెట్ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకొన్నారు. ఆ తర్వాత మీడియా సమావేశంలో క్యాబినెట్ నిర్ణయాలను సీఎం కేసీఆర్ వెల్లడించారు. మీడియాతో సీఎం ప్రసంగం ఆయన మాటల్లోనే..
చక్కటి నేలల తెలంగాణ తెలంగాణలో చాలా అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా అవతరించడానికి పుష్కలమైన అవకాశాలున్నాయి. ఇక్కడ చక్కటి నేలలున్నాయి. ఇంత టిపికల్ ల్యాండ్ మిక్స్ ప్రపంచంలోనే అరుదుగా ఉన్నది. అందువల్లనే ఇక్రిశాట్ అంతర్జాతీయ పరిశోధన సంస్థ పటాన్‌చెరులో ఏర్పడింది. ఇక్రిశాట్ పటాన్‌చెరులో రావడానికి ఏకైక కారణం టిపికల్ ల్యాండ్ మిక్స్. ఇక్కడ నల్లరేగడి నేలలున్నాయి. ఎర్ర నేలలు, ఇసుక నేలలు, తేలికపాటి నేలలు, క్షార నేలలున్నాయి. మనకు వాతావరణ, పర్యావరణ సమశీతోష్ణ వలయం ఉన్నది. అంటే ట్రాపికల్ వెదర్. వాతావరణ మండలం, పర్యావరణ మండలాలు రెండూ అనుకూలంగా ఉన్నాయి. ఎక్స్‌ట్రీమ్ చల్లగా ఉండదు. ఎక్స్‌ట్రీమ్ టెంపరేచర్స్ ఉండవు. అన్నిరకాల పంటలు పండటానికి అనుకూలమైన వాతావరణం మనదగ్గర ఉన్నది. అదేవిధంగా వర్షపాతం కనిష్ఠంగా 700 మిల్లీ మీటర్లు గరిష్ఠంగా 1100 మిల్లీమీటర్లు ఉన్నది. సగటున 900 మిల్లీమీటర్లు రెయిన్‌ఫాల్ నమోదవుతుంది. ఎట్ల చూసినా, అన్ని రకాల పం టలకు అనుకూలమైన వాతావరణం ఉన్నది. అందుకే, తెలంగాణ పంటల ఉత్పత్తిలో చరిత్ర సృష్టిస్తున్నది.

అనేక రాష్ట్రాల రికార్డును బద్దలు కొడుతున్నది. సొంత రికార్డులను చెరిపేస్తూ.. ఇతర రాష్ట్రాల రికార్డులను బద్దలుకొడుతూ పురోగమిస్తున్నది. దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టే అటువంటి పరిస్థితికి ఎదుగుతుంది. ఈ ఏడాది అద్భుతమైన పంటలు పండినయ్. వీటికితోడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కూడా చాలావరకూ పూర్తవుతున్నాయి. వాటి ఫలితాలు మనం చూస్తున్నాం. వరదలు, తుఫానులు, బలమైన ఈదురుగాలులు ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు కూడా తెలంగాణలో చాలా తక్కువగా ఉన్నయి. అన్ని రకాలుగా వృత్తి నైపుణ్యం కలిగిన రైతులు కూడా పుష్కలంగా తెలంగాణలో ఉన్నరు. ఈవెన్ గ్రేప్ గార్డెన్స్‌లో ఒకప్పుడు మనం అగ్రగామిగా ఉన్నాం. అనఫ్‌షాయి అనే ఒక వెరైటీ హైదరాబాద్ సిగ్నేచర్ ఫ్రూట్‌గా ఉండేది. ఇప్పుడు.. మామిడి పండ్లలో హిమాయత్ పసంద్ అనేది తెలంగాణ రాష్ట్రానికే పరిమితం. తెలంగాణకే ప్రత్యేకం. సిగ్నేచర్ ఫ్రూట్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంత అద్భుతంగా, అటువంటి పండ్లు కూడా మన దగ్గర పండుతయ్.
నియంత్రిత విధానంలో వ్యవసాయం రైతాంగం ఒక నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాల్సిన అవసరమున్నది. గవర్నమెంట్ గత నెల రోజులుగా నాతో సహా వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి, పౌరసరఫరాల మంత్రి గంగుల కమలాకర్ పరిశోధన చేస్తున్నం. అనేక సమావేశాలు నిర్వహించినం. రైస్ మిల్లర్లతో కావొచ్చు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో కావొచ్చు.. వైస్ చాన్సలర్లు, వ్యాపారసంస్థలతో సమావేశాలు నిర్వహించాం. తెలంగాణలో అద్భుతమైన పత్తి పండుతుందని శాస్త్రవేత్తలు, అధికారులతో నిర్వహించిన సమావేశాల్లో తేలింది. మన దగ్గర పండే పత్తి అంతర్జాతీయ ప్రమాణాలతో ఉన్నది. దేశంలో ది బెస్ట్ కాటన్ తెలంగాణతోపాటు కేవలం విదర్భలో మాత్రమే పండుతుంది. తిర్పూరు నుంచి నిపుణులు స్వామినాథన్ వచ్చి పరిశ్రమలమంత్రితో మాట్లాడారు. చాలా అద్భుతమైన పత్తి పంట పండిస్తున్నారని చెప్పారు. ఇంకొంచెం నాణ్యత కోసం పరిశోధిస్తే ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన పత్తిని పండిస్తారన్నారు. అందుకే పత్తి పంటలో కొంచెం నాణ్యత పెంచితే మంచి భవిష్యత్తు ఉంటుంది. విదర్భ, తెలంగాణల్లో పండే పత్తి స్టాపుల్‌లెంత్ (పొడువు పింజ) అతి ఎక్కువగా ఉంటున్నందున దానికి మంచి పేరున్నది.
1.35 కోట్ల ఎకరాల్లో పంటల సాగు గతేడాది వానకాలం, యాసంగిలో కలిపి 1.23 కోట్ల ఎకరాల్లో రకరకాల పంటలు వచ్చాయి. కాళేశ్వరం వగైరా నీళ్లు రావడంతోపాటు వర్షాలు కూడా మంచిగా ఉంటాయని చెప్తున్నందున ఇంకో 10 లక్షల ఎకరాల విస్తీర్ణం పెరుగుతుందని ప్రభుత్వం భావిస్తున్నది. 1.33 కోట్ల ఎకరాల నుంచి 1.35 కోట్ల ఎకరాల విస్తీర్ణం వరకు సాగును తీసుకుపోయే అవకాశమున్నందున రైతులు ప్రభుత్వ సూచనలు పాటించాలి. ఈ సంవత్సరం ఏ పంటలు వేయాలి? ఎట్ల వేయాలనేది వీడియో కాన్ఫరెన్స్‌లో వివరించి, ఆదేశాలు జారీచేసినం. నియంత్రిత విధానంలో సాగుచేసేందుకు రైతులు ముందుకొచ్చి సహకరించాలి. ఇష్టమొచ్చిన పంట వేసి, అందరం ఒకే రకమైన పంటవేసి ఆగమాగం అయ్యే బదులు మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంటలు వేసి మంచి ధరలు పొందడమనేది తెలివైనవారి పని. రైతుల పక్షాన ప్రభుత్వమే ముందడుగు వేసి, సూచనలిస్తున్నందున రైతులు కచ్చితంగా ఈ నిబంధనలు పాటించాలి.
70 లక్షల ఎకరాల్లో పత్తి ఈసారి రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి పంటను పండించాలి. గతేడాది 53 లక్షల ఎకరాల్లో పత్తి పండింది. ఇంకో 16-17 లక్షల ఎకరాలు పెరగడమనేది తేలికైన పని. అందుకే పత్తి వేసే రైతుకు నేను భరోసా ఇస్తున్నా. ఒకటి మన రకం బాగున్నది, మన పత్తికి డిమాండున్నది. గతంలో వర్షాధార పంట ఎక్కువగా వేసినం. కానీ ఈసారి సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఎక్కువగా వస్తున్నయి, భూగర్భ జలాలు కూడా గణనీయంగా పెరిగినయి. అందుకే ప్రాజెక్టుల నీళ్ల కింద పత్తి పంట వేయండి. బోర్ల కింద కూడా పత్తి పంట వేయండి. మొక్కజొన్న వేసినా, వరి చేను వేసినా వానకాలంలో ఎకరాకు 25-26 క్వింటాళ్లకు మించి పండదు. ఖర్చులు పోను రూ.20 వేలకు మించి రైతులకు ఆదాయం రాదు. వరి మొత్తం వేయొద్దని కాదు గానీ ఏ రకం వేస్తే బాగుంటుందనేది ప్రభుత్వమే చెప్తుంది. పత్తి చేను పెంచుదాం. రైతులు లాభాలు ఆర్జించి, ధనవంతులు కావాలనేది ప్రభుత్వ ఉద్దేశం. 70 లక్షల ఎకరాల్లో పత్తి పంటలు వేద్దాం. 40 లక్షల ఎకరాల్లో వరి చేను వేద్దాం. గతేడాది కూడా 40 లక్షల ఎకరాల్లో వేసినం. సులువుగా అమ్ముడుపోయే వరి రకాలనే వేయాలని ప్రభుత్వం చెప్తున్నందున వాటినే వేయాలి. శాస్త్రవేత్తలు, అధికారులు అందరూ కలిసి డిమాండున్న మంచి రకాలను కనిపెట్టినందున వాటినివేయాలి.
యాసంగిలోనే మక్క సాగు వానకాలంలో మక్కజొన్న వెయ్యొద్దని చెప్తున్నాం. దాని బదులు కంది గానీ పత్తి గానీ వేయాలి. మక్కజొన్న 25 క్వింటాళ్ల కంటే ఎక్కువ రాదు. కానీ కంది, పత్తి వేస్తే ఎక్కువ లాభం వస్తుంది. మక్కజొన్న వేస్తే కొనేవారు లేరు. మన రాష్ట్రం మీద నియంత్రణ పెట్టుకోవచ్చుగానీ ఇతర రాష్ర్టాల మీద మనం నియంత్రణ పెట్టలేం. పక్కన ఉన్న ఛత్తీస్‌గఢ్, బీహార్, మహారాష్ట్ర నుంచి మక్కజొన్నను రూ.1000-1100 కే ఇస్తమంటున్నరు. ఈ క్రమంలో మద్దతు ధర రూ.1760 రాదు. ఈ సంవత్సరం కరోనా ఉన్నందున ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని మక్కజొన్న మొత్తం కొన్నాం. ప్రభుత్వం వ్యాపారసంస్థ కానందున ప్రతి సంవత్సరం కొనలేదు. రైతులు ఇబ్బందులు పడొద్దు. మన రాష్ట్రంలో మక్కజొన్న వినియోగం 25 లక్షల టన్నుల వరకు ఉంటుంది. పౌల్ట్రీ ఫామ్‌లు, స్టార్చ్ ఫ్యాక్టరీలలో దీని వినియోగమున్నది. అందుకే వానకాలంలో మక్కజొన్న వేయడానికి వీలులేదు. యాసంగిలో మక్కజొన్న వేసుకుందాం. యాసంగిలో వేస్తే ఎకరాకు 35-40 క్వింటాళ్ల వరకు పండుతుంది. ఎక్కువ దిగుబడి వస్తున్నందున రైతుకు లాభం కూడా ఎక్కువ వస్తుంది. యాసంగిలో మక్కజొన్న ఎంత పండించాలనేది ప్రభుత్వం చెప్తుంది. 15 లక్షల ఎకరాల్లో కందిపంట వేద్దాం. గతంలో ఆరేడు లక్షల ఎకరాల వరకు వేసినరు. ఈసారి 15 లక్షల ఎకరాల వరకు పోదాం. కందికి మంచి డిమాండున్నది. కంది మొత్తం ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని నేను హామీ ఇస్తున్నా. 15 లక్షల ఎకరాల్లో కంది పంటవేస్తే.. గంట కూడా ఆలస్యం కాకుండా ప్రభుత్వమే మద్దతుధర ఇచ్చి కొంటుంది. సంతోషంగా కంది పంట వేసుకోవచ్చు. ప్రభుత్వానికి కూడా డబ్బు తిరిగి వస్తున్నందున.. కంది పంట వేయాలని రైతాంగాన్ని కోరుతున్నా.
నిరభ్యంతరంగా ఇతర పంటలు రాష్ట్రంలో 70 లక్షల ఎకరాల్లో పత్తి, 40 లక్షల ఎకరాల్లో వరి, 15 లక్షల ఎకరాల్లో కంది.. ఇలా మొత్తం సాగు విస్తీర్ణం 1.25 కోట్ల ఎకరాలు అవుతుంది. ఇవి కాకుండా స్వతహాగా వేసే పంటలు కొన్ని ఉంటయి. రెండు లక్షల ఎకరాల్లో కూరగాయలు వేసుకోవచ్చు. నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల, కేసముద్రం ప్రాంతాల్లో పసుపు పండిస్తరు. 1.25 లక్షల ఎకరాల్లో వేసుకోవచ్చు. డోర్నకల్, మహబూబాబాద్, నర్సంపేట, ఇతర ప్రాంతాల్లో ఎండు మిర్చి వేస్తరు. వాళ్లు కూడా రెండున్నర లక్షల ఎకరాల్లో వేసుకోవచ్చు. సోయాబిన్ పంటను కూడా ఆదిలాబాద్, నిజామాబాద్ ప్రాంతాల్లో 3 లక్షల నుంచి 3.50 లక్షల ఎకరాల్లో వేస్తరు. వాళ్లు కూడా ఇబ్బంది లేకుండా వేసుకోవచ్చు. ఇప్పటికే ఉన్న మామిడి, బత్తాయి, ఇతర పండ్ల తోటలు నిరభ్యంతరంగా సాగు చేసుకోవచ్చు.
ఆహారశుద్ధికి ఎస్‌ఈజెడ్ తెలంగాణను అభ్యుదయ వ్యవసాయిక రాష్ట్రంగా తీర్చిదిద్దడానికే ఈ బాటలన్ని వేసుకొంటున్నాం. దేశంలో ఎక్కడలేని విధంగా ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను తీసుకొస్తున్నాం. ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్‌ఈజడ్‌లను తీసుకవస్తున్నాం. ప్రతి నియోజకవర్గానికి ఒక కోల్డ్ స్టోరేజీ ఏర్పాటుచేస్తున్నాం. 40 లక్షల నూతన గోడౌన్లతోపాటు కోల్డ్ స్టోరేజీల కోసం స్థలాలను సేకరిస్తున్నాం. భూ సేకరణ కూడా 90 శాతం పూర్తయింది.
రైతుల తలరాత రైతులే రాసుకోవాలి అమ్మబోతే అడివి కొనబోతే కొరివి అనే సామెత ఉన్నది. దీనిని మార్చాలి. రైతుల తలరాత రైతులే రాసుకోవాలి. ఏవ్వడో వచ్చి మనకు సాయం చేయడు. తెలంగాణలో రైతు రాజ్యం నడుస్తున్నది. రైతులను పైకి తేవడానికి రాష్ట్ర ప్రభుత్వం కంకణబద్ధమై ఉన్నది. తెలంగాణ రైతులకు అప్పులు ఉండవద్దు. సొంతంగా పెట్టుబడులు పెట్టుకునే శక్తి రావాలి. గొప్పగా ముందుకు పోవాలి. ప్రభుత్వం సూచించే పంటలను పండించాలి. లాభాలు పొందాలని రైతు సోదరులను కోరుతున్న. రెండు మూడు రోజుల తరువాత ఒక న్యూస్ చానల్‌లో రైతులతో ఒక ముఖాముఖి పెట్టుకొని నేను కూర్చుంటాను. గంటల తరబడి వారికి చెప్తాను. అన్ని విషయాలు వివరిస్తా. మీరు అయోమయం కావద్దు. శాసనసభ్యులు, ఆయా జిల్లాల మంత్రులు వారివారి జిల్లాల్లో సమావేశాలు ఏర్పాటుచేసుకోవాలని సూచించాను. రైతుబంధు సమితులన్నీ యాక్టివేట్ అవుతున్నాయి.
రైతుబంధు కోల్పోవద్దు ప్రభుత్వం చెప్పిన మేరకు పంటలు వేసే వారందరికీ రైతుబంధు నిరాటంకంగా ఇస్తం. కానీ ప్రభుత్వం చెప్పింది వేయకుండా వేరే పంట వేస్తే వాళ్లకు రైతుబంధు రాదు. వాళ్ల కోసం చేస్తున్న నియంత్రణే ఇది. వరి వెయ్యొద్దని అంటలేం. ఎవరి ఇష్టమొచ్చినట్లు వాళ్లు వేస్తే నష్టపోతారు. మార్కెట్లో మంచి డిమాండున్న పంటలను గుర్తించి ప్రభుత్వమే చెప్తున్నందున రైతులు వాటిని వేస్తే లాభం వస్తది. పంటలు హాట్‌కేకుల్లా అమ్ముడుపోతయి. అర్హుడైన ప్రతి రైతు రైతుబంధు సదుపాయం పొందాలని ప్రభుత్వం కోరుకుంటున్నది. ఇంతకుముందు వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రులు, జిల్లా కలెక్టర్లకు చెప్పినం. నియంత్రిత పద్ధతిలో జిల్లాలో వ్యవసాయాన్ని చేయించి.. ఏ ఒక్క రైతు కూడా రైతుబంధు పొందకుండా ఉండొద్దు, ఇది కలెక్టర్లకు మధ్య పోటీ అని చెప్పినం. రైతులకు నచ్చజెప్పి ప్రభుత్వం చెప్పిన పంటలు వేసి రైతుబంధు పొందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించినం. అదేప్రకారం డబ్బులు కూడా మంజూరు చేస్తున్నం. ఇప్పటికే వ్యవసాయ శాఖ రూ.2 వేల కోట్లు విడుదలచేసింది. నివేదికలు తెప్పించుకొని డబ్బులు ఇస్తున్నందున ప్రభుత్వంచెప్పిన ప్రకారం రైతులు ముందుకుపోవాలి.
తెలంగాణ సోనాకు అంతర్జాతీయ డిమాండ్ అంతర్జాతీయ మార్కెట్లో పోటీపడి మన ధాన్యం అమ్ముడుపోవాలి. అంటే బియ్యం గింజ సైజు 6.3 మిల్లీ మీటర్లకు మించి ఉంటే అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంటుంది. మన దగ్గర అంత సైజు వస్తలేదు. అందుకే ఈసారి వ్యవసాయ విశ్వవిద్యాలయానికి ఒక మాండేట్ ఇచ్చినం. 6.5 మిల్లీ మీటర్లకు మించి ఉండే వంగడాలను సృష్టించి ఇవ్వాలని చెప్పినం. ఉదాహరణకు తెలంగాణ సోనా అనేది తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు సాధించిన గొప్ప విజయం. ఈ రకానికి అంతర్జాతీయస్థాయిలో మంచి డిమాండ్ ఉన్నది. ఇందులో షుగర్ పరిమాణం తక్కువగా ఉన్నదని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చినరు. అంతర్జాతీయ, అమెరికా జర్నల్స్‌లో ప్రచురించారు. షుగర్ ఫ్రీలెస్ వెరైటీ ఎక్కడుందంటే తెలంగాణ సోనా రూపంలో తెలంగాణలోనే ఉన్నది. తెలంగాణ సోనారకం హాట్‌కేక్‌లా అమ్ముడుపోతున్నందున ఈసారి పది లక్షల ఎకరాల్లో వేయాలని చెప్పినం. రేపటికి ఇంకా విస్తీర్ణాన్ని పెంచుతం. రెండు, మూడు రోజుల్లో జిల్లా కలెక్టర్లు, జిల్లా రైతుబంధు అధ్యక్షులు, జిల్లా వ్యవసాయాధికారులతో హైదరాబాద్‌లో సమావేశాన్ని ఏర్పాటుచేయబోతున్న. ప్రతి జిల్లాకు జిల్లా అగ్రికల్చర్ కార్డు ఇస్తరు. ఏ జిల్లాలో, ఏ పంట ఎంత వేయాలనేది మంత్రులు, అధికారులు నిర్ణయిస్తున్నరు. వర్క్‌షాప్ రెండు రోజులు జరుగుతుంది. అన్ని జిల్లాలకు అన్ని పంటలు కేటాయిస్తరు. గతంలో పత్తి పంట ఎక్కువ ఎక్కడ వేసినరు, వరి ఎక్కడ వేసినరు అనే వివరాలతో మ్యాపింగ్ ఉంది. దాని ఆధారంగానే ఈసారి ఏం వేయాలో చెప్తరు.
తెలంగాణలోనే వ్యవసాయ ప్రోత్సాహకాలు రాష్ట్రం అవతరించిన తర్వాత ఇండియన్ హిస్టరీలో, ఏ రాష్ట్రం కూడా అమలు చేయనటువంటి రైతు ప్రోత్సాహక, రైతు సహాయకచర్యలు తెలంగాణలో అమలు జరుగుతున్నయి. వాటన్నింటినీ కేంద్రం కానీ, ఇతర రాష్ట్రాలు స్వీకరించి.. వాళ్ల కార్యక్రమాలుగా అమలు చేస్తా ఉన్నయి. అందులో ప్రధానమైంది రైతుబంధు. ఇది ఏ రాష్ట్రంలోనూ లేదు. ఒక ఒడిశా రాష్ట్రం చేసింది. వాళ్లు కూడా మనం ఇచ్చినంత డబ్బులు ఇవ్వడంలేదు. కేంద్రం మనకు ఇచ్చింది చాలా తక్కువ. అట్లనే రైతుబీమా కోసం మొట్టమొదటిసారి కట్టినప్పుడు రూ.700 కోట్లు కాగా ఈసారి రూ.1100 కోట్లు పైచిలుకు కట్టినం. గుంట భూమి ఉన్న రైతు చనిపోయినా, వారం తిరగకుండా ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబం ఖాతాలో చేరిపోతున్నాయి. ఇది ఇండియాలో, ప్రపంచంలోనే లేదు. ఒక్క తెలంగాణలోనే ఉన్నది. 24 గంటలు ఉచిత విద్యుత్తు సరఫరా ఏ స్టేట్‌లో లేదు. ఒక్క తెలంగాణలోనే ఉన్నది. నీటితీరువాను రద్దుచేసి, బకాయిలు మొత్తం మాఫీచేసి వ్యవసాయానికిచ్చే నీళ్లు హండ్రెడ్ పర్సంట్ ఫ్రీగా ఇస్తున్నం. పాలిహౌజ్ కల్టివేషన్ కావొచ్చు, గ్రీన్‌హౌజ్ కల్టివేషన్ కావొచ్చు. 95 శాతం సబ్సిడీ ఎస్సీ, ఎస్టీలకు.. 75% మిగతా అందరికీ అందజేస్తున్నాం. మైక్రో ఇరిగేషన్‌లో కూడా 90 పర్సెంట్ సబ్సిడీ ఇతరులకు, ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం సబ్సిడీని ఇస్తున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ. వ్యవసాయ యాంత్రీకరణలో భాగంగా వేలకొద్దీ ట్రాక్టర్లు, హార్వెస్టర్లను ఇండియాలో ఏ రాష్ట్రం కూడా సబ్సిడీరేట్ల మీద పంచిపెట్టలేదు. వేలకొద్దీ పాడి పశువులు పంపిణీచేశాం. పాడిరైతులందరికీ లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకాన్ని అందిస్తున్నం. ఇది కూడా ఇతర రాష్ట్రాల్లో ఇంత పెద్దఎత్తున లేదు.
2604 రైతు వేదికల నిర్మాణం అధునాతన పద్ధతుల్లో.. ఒక నియంత్రణ విధానంలో పంటలు పండించడం కోసం విప్లవాత్మకమైన చర్యలకు ప్రభుత్వం శ్రీకారంచుట్టింది. అందులో భాగంగా ఐదువేల ఎకరాలకు చొప్పున 2,604 వ్యవసాయ క్లస్టర్లను ఏర్పాటుచేశాం. ప్రతి క్లస్టర్‌కు ఏఈవోని నియమించింది. వాళ్లంతా యాక్టివ్‌గా పని చేస్తున్నారు. గతంలో ఉన్నటువంటి ఎరువులు, విత్తనాల కొరతను అధిగమించి సకాలంలో వాటిని సరఫరా చేస్తున్నాం. కల్తీ విత్తన వ్యాపారుల మీద పీడీ యాక్టు పెట్టి కఠిన చర్యల్ని తీసుకుంటున్నాం. ఈసారి బడ్జెట్‌లో 2,604 క్లస్టర్లలో రైతు వేదికల నిర్మాణం కోసం రూ.350 కోట్లను కేటాయించడం జరిగింది. రానున్న ఆరు నెలల్లో ఈ వేదికల నిర్మాణం పూర్తిచేయాలని ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చాం. ఇలాంటి చర్యల వల్లనే ఎవరూ ఊహించనివిధంగా వరి దిగుమతి కానీ, ఇతర పంటల దిగుమతి కానీ సాధ్యమవుతున్నది. అందువల్లనే 90 లక్షల టన్నుల బియ్యాన్ని ఈ ఏడాది ఎఫ్‌సీఐకి తెలంగాణ ఇవ్వగలిగింది. ఇది చాలా పెద్ద విప్లవాత్మక మార్పు. దిస్ ఈజ్ ఆల్‌టైమ్ రికార్డు. ఏనాడు యాభై లక్షల టన్నులు దాటలేదు. ఫస్ట్ టైమ్ ఇన్ హిస్టరీ.. ఈ రోజు అద్భుతం చేశాం. కరోనా వచ్చిన సందర్భంలో ఇండియాలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతులు పండించిన మొత్తం ధాన్యాన్ని కొంటలేరు. కానీ, ఇక్కడ ప్రభుత్వమే కొంటున్నది. ఇది యావత్ దేశానికి తెలుసు. ప్రపంచానికి తెలుసు. ఈ పద్ధతుల్లో చేస్తూ పోతుంటే ఫలితాలు వస్తున్నాయి.
పంటలు ఇలా వేద్దాం –పత్తి: 70 లక్షల ఎకరాల్లో –వరి: 40 లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనా 10 లక్షల ఎకరాలు –మక్కలు: యాసంగిలో మాత్రమే –కంది: 15 లక్షల ఎకరాల్లో –కూరగాయలు: 2 లక్షల ఎకరాల్లో –పసుపు: 1.20 లక్షల ఎకరాల్లో –మిర్చి: 2 లక్షల ఎకరాల్లో –సోయాబీన్: 3 లక్షల ఎకరాల్లో