-నాగోల్ నుంచి పొడిగింపునకు డీపీఆర్‌లు
-ఎల్బీనగర్-మియాపూర్ మెట్రో వచ్చేనెల సీఎం కేసీఆర్ చేతులమీదుగా ప్రారంభం
-ఎల్బీనగర్ ఎస్సార్డీపీ పనులు వచ్చే ఏడాది జూలైకి పూర్తి
-మూసీ సుందరీకరణ పనులకు ఆగస్టులో శ్రీకారం
-పట్టణ భూరికార్డుల ప్రక్షాళన యోచనలో ప్రభుత్వం
-పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత
-జవహర్‌నగర్‌లో వ్యర్థాలతో 20 మెగావాట్ల విద్యుత్ ప్లాంటు
-మననగరం కార్యక్రమంలో పురపాలకశాఖ మంత్రి కేటీఆర్
రాష్ట్ర రాజధాని నగర సమగ్రాభివృద్ధికి వెన్నుదన్నుగా మెట్రో విస్తరణ చేపట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. నాగోలు నుంచి ఫలక్‌నుమా వరకు మెట్రోరైలు ప్రాజెక్టు పొడిగింపునకు సంబంధించిన సమగ్ర ప్రాజక్టు నివేదికలు (డీపీఆర్‌లు) రూపొందిస్తున్నట్టు పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు వెల్లడించారు. గురువారం నాగోలులోని దేవకీ ఫంక్షన్‌హాలులో ఏర్పాటుచేసిన ఎల్బీనగర్ నియోజకవర్గ మన నగరం కార్యక్రమంలో మంత్రి పాల్గొని నగరాభివృద్ధికి, ముఖ్యంగా ఎల్బీనగర్ పరిధిలో చేపట్టిన అభివృద్ధి పథకాలను వివరించారు. ఎల్బీనగర్-అమీర్‌పేట్-మియాపూర్ మార్గంలో మెట్రోరైలు పనులను వచ్చేనెల చివరికల్లా పూర్తిచేసి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేతులమీదుగా ప్రారంభిస్తామని చెప్పారు. ఎస్సార్డీపీ పథకంలో భాగంగా ఎల్బీనగర్ నియోజకవర్గం పరిధిలో రూ.448 కోట్లతో చేపట్టిన ైఫ్లెఓవర్లు, అండర్‌పాస్‌ల నిర్మాణ పనులు వచ్చే ఏడాది జూన్‌నాటికి పూర్తవుతాయని పేర్కొన్నారు. రూ.1600 కోట్లు వ్యయంకాగల మూసీనది సుందరీకరణ పనులను వచ్చే ఆగస్టు మాసంలో ప్రారంభిస్తామని చెప్పారు.
ఎల్బీనగర్లో రూ.3100 కోట్ల వ్యయంతో అంతర్గత రోడ్లు, స్మార్ట్ వాటర్డ్రైన్లు, సీవరేజి పైప్లైన్లు తదితర మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అంతేకాకుండా రూ.రెండువేల కోట్లతో ఇంటింటికీ మంచినీటి కనెక్షన్లు ఇచ్చే కార్యక్రమం కూడా కొనసాగుతున్నదని చెప్పారు. సీనియర్ సిటిజన్ డేకేర్ కేంద్రాల గ్రాంటును రూ.3 వేల నుంచి ఆరువేలకు పెంచనున్నట్టు ప్రకటించారు. గ్రామీణ ప్రాంతాల్లో చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన విజయవంతమైందని పేర్కొంటూ, అదేవిధంగా పట్టణ ప్రాంతాల్లోని భూరికార్డులను కూడా ప్రక్షాళన చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని చెప్పారు. నాలుగున్నరగంటలపాటు సాగిన ఈ కార్యక్రమంలో మంత్రి ప్రజల నుంచి వచ్చిన విజ్ఞప్తులను సావధానంగా వింటూ వాటి పరిష్కారానికి అధికారులకు తగిన ఆదేశాలు జారీచేశారు. ఎల్బీనగర్లో భూసంబంధిత సమస్యల పరిష్కారానికి వచ్చే సోమవారం ఎల్బీనగర్ జోనల్ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని, అందులో తాను కూడా పాల్గొంటానని మంత్రి హామీ ఇచ్చారు. బీఎన్‌రెడ్డినగర్‌లో రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
మన నగరం రాజకీయం కోసం కాదు తాను రాజకీయం చేయడానికో, వచ్చే ఎన్నికల్లో లబ్ధిపొందే ఉద్దేశంతోనే ఇక్కడికి రాలేదని కేటీఆర్ స్పష్టంచేశారు. క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తెలుసుకొని వాటిని పరిష్కరించాలనే ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని చెప్పారు. అధికార వికేంద్రీకరణ ద్వారా పాలనను ప్రజలవద్దకు చేర్చాలన్న ముఖ్యమంత్రి ఆకాంక్షల ప్రకారం రాష్ట్రంలో 31 జిల్లాలు ఏర్పాటు చేసినట్టే జీహెచ్ఎంసీ సర్కిళ్లను కూడా 30 నుంచి 50కి, జోన్లను 6 నుంచి 10కి పెంచాలని నిర్ణయించామని తెలిపారు.
భరోసాతో పెట్టుబడుల వెల్లువ భద్రత విషయానికొస్తే, నగరవ్యాప్తంగా 10 లక్షల సీసీ కెమెరాలను ఏర్పాటుచేయాలని లక్ష్యంగా పెట్టుకొని ఇప్పటికే మూడులక్షలు ఏర్పాటు చేసినట్టు మంత్రి కేటీఆర్ తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు ద్వారా నగరాన్ని సేఫ్‌సిటీగా మార్చేందుకు కృషిచేస్తున్నామని, ఆ నమ్మకంతోనే నగరానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయన్నారు. నాణ్యమైన జీవన ప్రమాణాల్లో (క్వాలిటీ ఆఫ్ లివింగ్) వరుసగా నాలుగేండ్లు నగరానికి దేశంలోనే ప్రథమస్థానం దక్కిందని గుర్తుచేశారు. ప్రపంచ నగరాల్లో టాప్‌టెన్‌లో స్థానం సంపాదించడం మన లక్ష్యం కావాలని, ఆ దిశగా కృషిచేయాలని చెప్పారు.
నాలాల్లో పూడికతప్ప అన్నీ వస్తున్నాయి నాలాల్లో పూడికతప్ప అన్ని వ్యర్థాలూ వెలువడుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. ప్లాస్టిక్ బాటిళ్లే కాకుండా బ్లాంకెట్లు కూడా వేస్తున్నారని పేర్కొంటూ నాలాల్లో బయటపడుతున్న వ్యర్థాల ఛాయాచిత్రాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో సభికుల ముందుంచారు. ఇంతమాత్రం ఇంగితజ్ఞానం లేకుంటే ఎలా? అని మంత్రి ప్రశ్నించారు. మన ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటామో, అదే తరహాలో వీధులు, కాలనీలు, నాలాలు తదితర వాటిని కూడా సక్రమంగా నిర్వహించుకోవాలని సూచించారు. భూగర్భజలాల పెంపునకు ఉద్దేశించి జలం-జీవం కార్యక్రమాన్ని చేపట్టినట్టు గుర్తుచేశారు. ఇంకుడుగుంతను నిర్మించుకుంటే ఆస్తిపన్నులో ఐదుశాతం రాయితీ కూడా ఇస్తున్నట్టు తెలిపారు. భూగర్భజలాలు పెంచుకోకుంటే భవిష్యత్తులో నీటికి ఇబ్బందులు తప్పవని, ఇప్పటికే పలు ప్రాంతాల్లో 2000 అడుగుల వరకు బోర్లు వేయాల్సివస్తున్నదని చెప్పారు.
జీవనయోగ్యమైన నగరమే లక్ష్యం
అన్ని పనులూ సవ్యంగా జరిగిపోతే ఎవ్వరూ పట్టించుకోరని, రెండురోజులు చెత్త ఎత్తకపోతే అందరూ తిడుతారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పరిశుభ్రత ప్రతిఒక్కరి బాధ్యత అన్నారు. ఎవరో వచ్చి ఏదో చేస్తారనే భావన వీడి బాధ్యతగల పౌరులుగా వ్యవహరించాలని సూచించారు. చెత్తవేయకుంటే శుభ్రం చేయాల్సిన అవసరమే ఉండదని పేర్కొంటూ జపాన్ రాజధాని టోక్యో నగర పరిశుభ్రతపై తన అనుభవాన్ని వివరించారు. రోడ్లు బాగుండటం, పరిశుభ్రత, కరంటు, మంచినీటి సరఫరా, మురుగునీటి పారుదల వ్యవస్థ, భద్రత, పిల్లలు, మహిళల రక్షణ, పార్కులు, చెరువులు కబ్జాకు గురికాకుండా పరిరక్షించడం, మెరుగైన రవాణా వ్యవస్థ తదితర కనీస చర్యలే ప్రజలు తమనుంచి ఆశిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. నగరం లివెబుల్ సిటీ (జీవనయోగ్యమైన నగరం)గా ఉండాలనే ప్రతి ఒక్కరూ కోరుకుంటారని చెప్పారు.
ఆస్తిపన్ను సకాలంలో చెల్లించి నగరాభివృద్ధికి సహకరించాలని కోరారు. నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపడుతున్నట్టు చెప్పారు. తడి, పొడి చెత్తను విడివిడిగా వేయాలనే ఉద్దేశంతో 21 లక్షల ఇండ్లకు రెండుచొప్పున చెత్త బుట్టలు ఇస్తే, వాటిని బియ్యం, పప్పులు పోసేందుకు ఉపయోగిస్తున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. ఒక్కోమనిషి సగటున 500 గ్రాముల చొప్పున నగర జనాభా రోజుకు ఐదువేల టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నారన్నారు. తడిచెత్తను ఎరువు తయారీకి, పొడిచెత్తను విద్యుత్ తయారీకి వాడటం ద్వారా నగరాన్ని జీరోవేస్ట్ నగరంగా తీర్చిదిద్దవచ్చని, ఆ దిశగా ప్రతిఒక్కరూ కృషిచేయాలని కోరారు. ఎవరికివారు ఇండ్లలో కూడా తడిచెత్తతో కంపోస్ట్ ఎరువు తయారుచేసుకొని ఇండ్లలోని మొక్కలు, కూరగాయల చెట్లకు వాడుకోవచ్చన్నారు. ప్రస్తుతం నగర వ్యర్థాలతో జవహర్‌నగర్ డంపింగ్‌యార్డులో రోజుకు 1200 టన్నుల కంపోస్ట్ ఎరువును తయారుచేస్తున్నామని వివరించారు. పొడిచెత్తతో జవహర్‌నగర్‌లో 20 మెగావాట్ల విద్యుత్ తయారీప్లాంటును కూడా ఏర్పాటుచేస్తున్నామని తెలిపారు. నగరంలోని పొడివ్యర్థాల ద్వారా 75 మెగావాట్ల విద్యుత్‌ను తయారుచేసే ఆస్కారముందని చెప్పారు.
బల్దియా 108 వినూత్నవిధానాలు! జీహెచ్ఎంసీ అమలుచేస్తున్న వినూత్నవిధానాలపై ప్రత్యేకంగా రూపొందించిన సావనీర్‌ను గురువారం హైదరాబాద్ నాగోల్‌లో నిర్వహించిన మన నగరం కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. జీహెచ్ఎంసీలో అమలుచేసిన పారిశుద్ధ్య నిర్వహణ, వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజల భాగస్వామ్యం అంశాలకు సంబంధించి కమిషనర్ డాక్టర్ బీ జనార్దన్‌రెడ్డి ఆలోచనలతో రూపుదిద్దుకున్న 108 వినూత్న ఆవిష్కరణలను ఇందులో పొందుపరిచారు. ఇందులో చాలా అంశాలు దేశంలోని ఇతర నగరాలకు ఆదర్శంగా నిలువడం, దేశవ్యాప్తంగా ప్రముఖుల ప్రశంసలను అందుకోవడం విశేషం. మున్సిపల్ రంగంలోని ప్రతి అధికారికి ఈ విధానాలు విధినిర్వహణ సందర్భంగా నిత్యం అవసరమవుతాయని కమిషనర్ పేర్కొన్నారు.