Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఫిబ్రవరిలో సభ్యత్వ నమోదు

-పార్టీ బలోపేతానికి త్వరలో జిల్లాల పర్యటన
-పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లు కైవసం చేసుకోవడమే లక్ష్యం
-త్వరలో తెలంగాణభవన్‌లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు
-టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటన

టీఆర్‌ఎస్ సభ్యత్వ నమోదును ఫిబ్రవరిలో చేపట్టనున్నట్టు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వెల్లడించారు. త్వరలో జిల్లాల్లో పర్యటిస్తానని, సంస్థాగతంగా పార్టీని బలోపేతంచేసేందుకు అందరూ సహకరించాలని కోరారు. వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లను కైవసం చేసుకోవాలన్న టీఆర్‌ఎస్ లక్ష్యసాధనకు పార్టీ శ్రేణులంతా రెట్టించిన ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణభవన్‌లో శనివారం కేటీఆర్ అధ్యక్షతన టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. పార్టీ ప్రధాన కార్యదర్శి కే కేశవరావుతోపాటు పలువురు ముఖ్యనాయకులు హాజరైన ఈ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఈనెల 26 నుంచి జరిగే ఓటర్ల జాబితా సవరణలో టీఆర్‌ఎస్ కార్యకర్తలంతా పాల్గొని అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు లభించేలా చూడాలన్నారు. టీఆర్‌ఎస్‌ను పటిష్ఠం చేసేందుకు రెండు సబ్‌కమిటీలను ఏర్పాటుచేయాలని నిర్ణయించామని, దేశంలోని వివిధ రాజకీయ పార్టీల సంస్థాగత నిర్మాణంపై అధ్యయనంచేసి ఉన్నత విధానాలతో నివేదిక సమర్పించాల్సిందిగా ఈ సబ్‌కమిటీలకు సూచించామని చెప్పారు. టీఆర్‌ఎస్ అనుబంధ సంఘాల్లో ఖాళీలను భర్తీచేయడంతోపాటు పూర్తిస్థాయి కార్యవర్గాలను నియమించుకోవాలని, అత్యాధునిక వసతులతో పార్టీకి అన్ని జిల్లాల్లో సొంత కార్యాలయాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించామని కేటీఆర్ తెలిపారు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు మాట్లాడుతూ.. ఇకమీదట జాతీయ రాజకీయాలపై దృష్టిసారించాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిర్ణయించారని, దీన్ని దృష్టిలో ఉంచుకొని స్థానికంగా పార్టీ నాయకులతోపాటు కార్యకర్తలకు అందుబాటులో ఉండేందుకు కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించారని అన్నారు. అందరం కలిసి టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేద్దామని, కేసీఆర్ నాయకత్వంలో రాష్ర్టాన్ని అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.

తెలంగాణభవన్‌లో గ్రీవెన్స్ సెల్

ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను టీఆర్‌ఎస్ ప్రధాన కార్యదర్శి పల్లా రాజేశ్వర్‌రెడ్డి.. బండా ప్రకాశ్, బీ వెంకటేశ్వర్లు, నారదాసు లక్ష్మణ్‌రావు, రావుల శ్రవణ్‌రెడ్డి, తక్కిళ్లపల్లి రవీందర్‌రావు, కార్యదర్శి ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, కిషన్‌రావు, తాడూరి శ్రీనివాస్‌తో కలిసి మీడియాకు వెల్లడించారు. పార్టీ కమిటీల్లో ఉండి ఎమ్మెల్యేలుగా ఎన్నికైన మైనంపల్లి హనుమంతరావు, పట్నం నరేందర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, సుంకే రవిశంకర్, ముఠా గోపాల్‌ను కార్యవర్గం ఏకగ్రీవంగా అభినందించిందని చెప్పారు. నియోజకవర్గాలకు ఎక్కువ సమయం కేటాయించేందుకు వీలుగా తమను రిలీవ్ చేయాలని ఈ ఐదుగురు విజ్ఞప్తి చేయడంతో వారిని రాష్ట్ర కమిటీల నుంచి రిలీవ్‌చేసి కొత్తవారిని నియమించాలని నిర్ణయించినట్టు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలకు టీఆర్‌ఎస్ శ్రేణులను సమాయత్తం చేసేందుకు రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ నియోజకవర్గంలో ఒక ప్రధాన కార్యదర్శిని, ఇద్దరు లేదా ముగ్గురు కార్యదర్శులు, సహాయ కార్యదర్శులను ఇంచార్జీలుగా నియమించాలని, తెలంగాణభవన్‌లో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు వివరించారు.

టీఆర్‌ఎస్‌కు మరింత బలిమి

-యువరక్తంతో మరింత జోరుగా ముందుకు -పార్టీ పటిష్ఠతపై వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టి రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో వరుసగా రెండోసారి విజయభేరి మోగించిన తెలంగాణ రాష్ట్ర సమితి ఇక యువరక్తంతో మరింత జోరుగా పరుగు తీయనున్నది. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితులైన కే తారకరామారావు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై దృష్టిసారించారు. గతంలో విభజన సమస్యలు, అధికారుల కేటాయింపులు, పరిపాలన, ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, రాష్ట్ర అభివృద్ధి తదితర కారణాల వల్ల పార్టీ పటిష్ఠతపై సరిగా దృష్టిసారించలేకపోయిన టీఆర్‌ఎస్ నాయకత్వం ఇప్పుడు వీటన్నింటినీ అధిగమించింది. ఇటీవల ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీతో మరోసారి అధికారంలోకి రావడం, పరిపాలనపై పట్టు పెరుగడంతో టీఆర్‌ఎస్‌ను సంస్థాగతంగా బలోపేతంచేయాలని భావించిన అధినేత కేసీఆర్.. పార్టీ భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఇప్పటినుంచే యువతను ప్రోత్సహించాలని నిర్ణయించారు. అందులో భాగంగా సమర్థుడైన కేటీఆర్‌ను వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమించిన కేసీఆర్.. టీఆర్‌ఎస్‌లో యువతతోపాటు సీనియర్లు సమపాళ్లలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని, పార్టీ బలోపేతానికి సీనియర్లుసహా అందరి సేవలను వినియోగించుకోవాలని యోచిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర రాజకీయాలకు పరిమితమైన సీఎం కేసీఆర్.. ఇకమీదట జాతీయ రాజకీయాలపై దృష్టిసారించనున్నట్టు ప్రకటించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో పార్టీని పటిష్ఠం చేసేందుకు కేటీఆర్ పూర్తిస్థాయి సమయాన్ని కేటాయించనున్నారు. టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా సోమవారం బాధ్యతలు స్వీకరించనున్న కేటీఆర్.. తెలంగాణభవన్‌లో పార్టీ శ్రేణులకు నిత్యం అందుబాటులో ఉండేలా ప్రణాళిక రూపొందించుకొంటున్నారు.

ఢిల్లీని యాచిద్దామా? శాసిద్దామా?

-టీఆర్‌ఎస్‌ను 16 ఎంపీ సీట్లలో గెలిపిస్తే కేంద్రాన్ని శాసించేది మనమే: కేటీఆర్ -టీఆర్‌ఎస్‌లో చేరిన వైరా ఎమ్మెల్యే రాములునాయక్ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడం లేదని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా, బయ్యారంలో ఉక్కు కర్మాగారం కోసం ప్రయత్నిస్తే.. మందబలం ఉన్నదన్న అహంకారంతో ఆ రెండు పార్టీలు పట్టించుకోవడంలేదని విమర్శించారు. తెలంగాణ హక్కుల సాధన కోసం ఢిల్లీని యాచించాలో శాసించాలో రాష్ట్ర ప్రజలే తేల్చుకోవాలని అన్నారు. 16 ఎంపీ స్థానాలను సీఎం కేసీఆర్ చేతిలోపెట్టి ఢిల్లీలో ఎవరు కూర్చోవాలో నిర్ణయించే అవకాశాన్ని కల్పించాలని సూచించారు. వైరా నుంచి గెలిచిన స్వతంత్ర ఎమ్మెల్యే రాములునాయక్, ఆయన అనుచరులు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో శనివారం తెలంగాణభవన్‌కు వచ్చి కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రాములునాయక్ కోరినట్టుగా, ఖమ్మంలోని అన్ని నియోజకవర్గాలను అభివృద్ధిచేస్తామని, ముఖ్యంగా వైరాపై ప్రత్యేక దృష్టిసారిస్తామని హామీ ఇచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.