Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

సమగ్ర అభివృద్ధే ఫెడరల్ ఫ్రంట్ లక్ష్యం

-మాది రైతులు, ప్రజల కూటమి -దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో విఫలమైన కాంగ్రెస్, బీజేపీ -గుణాత్మకమార్పుకే ప్రత్యామ్నాయం -నచ్చిన పార్టీలు ఫ్రంట్‌లో చేరవచ్చు -కావేరి వివాదానికి కారకులెవరు? -దేశంలో పుష్కలంగా నీరు.. అయినా నీటి యుద్ధాలు -బెంగళూరులో సీఎం కేసీఆర్ -జేడీఎస్ నేత దేవెగౌడతో భేటీ -తెలంగాణ పథకాలు భేష్: దేవెగౌడ

దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు దాటినా అనేక సమస్యలను కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాలు పరిష్కరించలేక ఘోరంగా విఫలమయ్యాయని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. దేశంలో 65 ఏండ్లపాటు బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని, మిగిలిన ఐదారేండ్లు మాత్రమే మొరార్జీదేశాయ్, వీపీ సింగ్, దేవెగౌడ, చంద్రశేఖర్ తదితరులు ప్రధానులుగా ఉన్నారని గుర్తుచేశారు. గొప్ప యువశక్తి ఉన్నా దేశం వెనుకబడి ఉందని ఆవేదన వ్యక్తంచేశారు. దేశంలో గుణాత్మక మార్పుకోసం కొత్త ప్రయత్నాన్ని ప్రారంభించామని కేసీఆర్ చెప్పారు. దేశ ప్రజల సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయనున్నామని ప్రకటించారు. ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా శుక్రవారం మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడతో బెంగళూరులోని ఆయన నివాసంలో కేసీఆర్ సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో దేవెగౌడ కుమారుడు, మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి కూడా పాల్గొన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు, దేశ రాజకీయ పరిణామాలపై వారు చర్చించారు. సమావేశం అనంతరం దేవెగౌడ, కుమారస్వామి, సినీనటుడు ప్రకాశ్‌రాజ్‌తో కలిసి కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ, తమది ఆషామాషీ రాజకీయాలకోసం ఏర్పడుతున్న ఫ్రంట్ కాదని, దేశప్రజల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని చెప్పారు. బంద్‌లు నిర్వహించి, ప్రధానికి నల్ల జెండాలు చూపి నిరసన తెలుపాల్సిన పరిస్థితి ఎందుకు తలెత్తుతున్నదని ప్రశ్నించారు. ఈ పరిస్థితికి కాంగ్రెస్, బీజేపీల పాలనా వైఫల్యమే కారణమని స్పష్టంచేశారు. చాలాకాలం తరువాత కేంద్రంలో అధికార పార్టీకి ప్రజలు పూర్తి మెజార్టీ కల్పించారు. అయినా సరైన పాలన ఎందుకు అందించలేకపోతున్నది? అని ఆయన నిలదీశారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు ప్రజలు జేడీఎస్‌కు మద్దతివ్వాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. దేవెగౌడ, కుమారస్వామి కోరినచోట జేడీఎస్ తరఫున ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధంగా ఉన్నానని కేసీఆర్ ప్రకటించారు.

తమ్ముడిలా ఆదరించారు

ఫెడరల్ ఫ్రంట్ విషయంలో సానుకూలంగా స్పందించిన దేవెగౌడ.. తనను తమ్ముడిలా ఆదరించి, ముందుకెళ్లాల్సిందిగా సూచించారని కేసీఆర్ చెప్పారు. దేవెగౌడ చెప్పినట్టు చర్చల తర్వాత అందరి అభిప్రాయాలను క్రోడీకరించి, ఒక అజెండా రూపొందించి ప్రజల ముందుకు తెస్తామని తెలిపారు. ఆ ఎజెండాను టీఎంసీ, టీడీపీ, టీఆర్‌ఎస్, జేడీఎస్, సీపీఐ, సీపీఎం అనే తేడాలేకుండా ఏ పార్టీ అనుసరించాలని నిర్ణయించినా ఫ్రంట్‌లో భాగస్వామి కావచ్చన్నారు. ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తామని, ఇది కేవలం దేశ ప్రయోజనంకోసం తీసుకున్న నిర్ణయమని స్పష్టంచేశారు. దేవెగౌడ ఇప్పటికే ప్రధాని అయ్యారు. అంతకంటే పెద్ద పదవి ఏముంటుంది? నా స్వప్నమైన ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటికే నాకు 64ఏండ్లు. ఇంకా నేను అశించేది ఏముంటుంది? కూటమి అనేది సొంత రాష్ట్రాల అభివృద్ధికి మాత్రమే కాదు.. దేశవ్యాప్తంగా గుణాత్మక మార్పుకోసమే. దేశాభివృద్ధికి ఎవరైనా మాతో కలసిరావొచ్చు. మాది సామాన్య ప్రజలు, రైతులకోసం ఏర్పడుతున్న కూటమి. 2019 ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తుంది అని కేసీఆర్ చెప్పారు.

మాది ఆషామాషీ ఫ్రంట్ కాదు..

తమది ఆషామాషీ రాజకీయాల ఫ్రంట్ కాదని, దేశప్రజల సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని కేసీఆర్ ఉద్ఘాటించారు. దేశంలో ఏర్పాటు చేయబోయే ఫ్రంట్ రెండు, మూడు పార్టీల కూటమి కాదు. ఇద్దరుముగ్గురు నాయకులు వచ్చి, రాజకీయ నాటకాలు ఆడి పారిపోయే కూటమికాదు. మేము ఏర్పాటు చేసేది తృతీయఫ్రంట్ కాదు.. దేశ ప్రజలందరినీ ఒకే తాటిపైకి తెచ్చే ప్రజల ఫ్రంట్ అని కేసీఆర్ స్పష్టంచేశారు. రైతులకోసం పెద్ద ఎజెండాతో ముందుకు పోతున్నామని, 2019 ఎన్నికలకు ముందే దీన్ని ప్రకటిస్తామని తెలిపారు. ఈ ఎజెండాపై అందరితో చర్చిస్తున్నామన్నారు. కాంగ్రెస్, బీజేపీ వలలో చిక్కుకున్న రాజకీయ పార్టీలన్నీ ఇప్పటికైనా అందులో నుంచి బయటపడాలని కోరారు. అందరం కలిసి దేశాన్ని, భారతమాతను, న్యాయంకోసం చూస్తున్న రైతులను, పేదలను, మహిళలను కాపాడుకుందామని, దేశానికి సమర్థపాలన అందిద్దామని పిలుపునిచ్చారు.

తమాషా చూస్తున్న కేంద్రం

కృష్ణాజలాల పంపిణీపై 2004లో బ్రిజేశ్ ట్రిబ్యునల్‌ను నియమిస్తే.. ఇంతవరకు తీర్పు ఇవ్వలేదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రాల మధ్య జలవివాదాలను సృష్టించి, కేంద్రం తమాషా చూస్తున్నదని విమర్శించారు. ట్రిబ్యునల్ ఉత్తర్వులు వచ్చాక దానిపై ఎవరో కోర్టుకు వెళ్తారు. కోర్టు తీర్పు వచ్చేవరకు దశాబ్దాలు గడిచిపోతాయి. తరాలు మారిపోతాయి. ప్రజల పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. వీటన్నింటినీ కేంద్రం పట్టించుకోవడంలేదు అని చెప్పారు. ఇలాంటి సమస్యలను ఆరునెలలు లేదా ఏడాదిలో పరిష్కరించాలని ట్రిబ్యునల్‌కు కాలపరిమితి విధించే అధికారం కేంద్రానికి లేదా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీజేపీ సమర్థపాలన అందించడంలో విఫలమయ్యాయనడానికి ఇదో ఉదాహరణ అన్నారు.

తెలంగాణ ఉద్యమానికి దేవెగౌడ మద్దతిచ్చారు

తెలంగాణ ఉద్యమానికి మద్దతు కూడగట్టే సమయంలో బెంగళూరు వచ్చి దేవెగౌడను కలిశాను. అప్పట్లో పది పదిహేను లక్షలమందితో వరంగల్‌లో జరిగిన భారీ బహిరంగసభలో దేవెగౌడ పాల్గొని, ప్రజకు నైతికైస్థెర్యం ఇచ్చారు అని కేసీఆర్ చెప్పారు. రాష్ట్రం ఆవిర్భవించిన నేపథ్యంలో ప్రజల తరఫున ధన్యవాదాలు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.