Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఫెడరల్‌వైపు అడుగులు

-సీఎం కేసీఆర్ ఆలోచనావిధానంతో ఏకీభవిస్తున్న ప్రాంతీయపార్టీలు
– ఫ్రంట్ ఎజెండాను అన్ని పార్టీలకూ వివరిస్తాం
-బీజేడీ, వైసీపీ, బీఎస్పీ, ఎస్పీ మా వెంటే: టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్

జాతీయ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్‌వైపు అడుగులు పడుతున్నాయి. కేంద్రంలో బీజేపీ, కాంగ్రెసేతర ప్రభుత్వాన్ని ఏర్పాటుచేయడమే లక్ష్యంగా తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రతిపాదించిన ఫెడరల్ ఫ్రంట్‌లో చేరేందుకు బీజేడీ, వైసీపీ, బీఎస్పీ, సమాజ్‌వాదీ పార్టీలు సిద్ధంగా ఉన్నాయన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే పలు ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ అనుసరిస్తున్న అణచివేత విధానాలకు వ్యతిరేకంగా గళమెత్తుతున్నాయి. తాజాగా బీఎస్పీ అధినేత్రి మాయావతి ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీలు అరాచకపాలన కొనసాగిస్తున్నాయని, అమాయకులను వేధిస్తున్నాయని మండిపడ్డారు. ఈ రెండు పార్టీల మధ్య పెద్దగా వ్యత్యాసం లేదనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. రాష్ర్టాలకు కాంగ్రెస్, బీజేపీ చేస్తున్న అన్యాయాలను గుర్తించిన నేతలు వచ్చే ఎన్నికల్లో ఫెడరల్ ఎజెండా వైపు మొగ్గుచూపుతున్నారు.

రాష్ర్టాలు యాచించే స్థితి నుంచి శాసించే స్థితికి చేరినప్పుడే అభివృద్ధి సాధ్యమని ఆయా పార్టీలు గుర్తించాయని, ప్రాంతీయ పార్టీలు ఏకమైతేనే ఇది సాధ్యమవుతుందన్న సీఎం కేసీఆర్ ఆలోచనా విధానంతో ఏకీభవిస్తున్నాయని టీఆర్‌ఎస్ ఎంపీ బీ వినోద్‌కుమార్ పేర్కొన్నారు. సమాఖ్య స్ఫూర్తిని ప్రతిఫలిస్తున్న ఫెడరల్ ఫ్రంట్‌లో చేరేందుకు ఆయా పార్టీల అధినేతలు సుముఖంగా ఉన్నారన్నారు. గురువారం పార్లమెంట్ సమావేశాల అనంతరం ఎంపీ వినోద్‌కుమార్ పీటీఐతో మాట్లాడారు. కాంగ్రెస్, టీఎంసీ తదితర పార్టీలు బుధవారం సమావేశమై సంయుక్త ఎజెండా, కూటమి ఏర్పాట్లపై చర్చించాయన్న ప్రశ్నకు బదులిస్తూ.. త్వరలో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఇలాంటి చర్చలు, సమావేశాలు సహజమేనన్నారు. ఎవరి ప్రణాళిక వారికి ఉంటుందని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీ మాత్రం ఫెడరల్ ఎజెండాతోనే ముందుకు సాగుతుందని స్పష్టంచేశారు.

ప్రాంతీయ శక్తితోనే పాలన
జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ప్రతీసారి ప్రాంతీయ పార్టీల బలంతోనే కేంద్రంలో అధికారంలోకి వస్తున్నాయని , తిరిగి ఆ రాష్ర్టాలపైనే కర్రపెత్తనం చేస్తున్నాయని వినోద్‌కుమార్ పేర్కొన్నారు. యూపీఏ-1 హయాంలో కాంగ్రెస్ పార్టీ కేవలం 147 స్థానాలను మాత్రమే సాధించిందని, ప్రాంతీయ పార్టీలతో కూటమిని ఏర్పాటుచేసుకొని అధికారంలోకి వచ్చిందని గుర్తుచేశారు. ఐదేండ్లపాటు తిరిగి ప్రాంతీయ పార్టీలను అణగదొక్కేందుకే ప్రయత్నించిందని మండిపడ్డారు. కాబట్టి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలు ఏకమై జాతీయ పార్టీలకు వ్యతిరేకంగా గళమెత్తాలని, సొంత ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.

సమాఖ్య స్ఫూర్తే మా ఆలోచన విధానం
ప్రాంతీయ పార్టీలన్నీ ఏకం కావడం, సమాఖ్య స్ఫూర్తితో ఒకరికొకరు సహకరించుకోవడం, జాతీయ పార్టీలతో చర్చించి తమ డిమాండ్లను సాధించుకోవడం టీఆర్‌ఎస్ పార్టీ విధానమని వినోద్‌కుమార్ వివరించారు. తమ ఆలోచనను టీఆర్‌ఎస్ మాదిరిగా తటస్థంగా ఉన్న ప్రాంతీయ పార్టీలతోపాటు ఎన్డీఏ, యూపీఏ కూటమిలో భాగస్వాములుగా ఉన్న పార్టీలతోనూ పంచుకుంటామని, ఫెడరల్ ఫ్రంట్‌లోకి ఆహ్వానిస్తామని వెల్లడించారు. నవీన్ పట్నాయక్ నేతృత్వంలోని బీజేడీ, జగన్‌మోహన్‌రెడ్డి సారథ్యంలోని వైసీపీ, మాయావతి నేతృత్వంలోని బీఎస్పీ, అఖిలేశ్‌యాదవ్ సారథ్యంలోని ఎస్పీ.. ఫ్రంట్‌లో చేరుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఫెడరల్ ఫ్రంట్ భావజాలం ప్రభావం లోక్‌సభ ఎన్నికల తర్వాత ప్రస్ఫుటం అవుతుందన్నారు.

మా పద్ధతిలోనే రిటర్న్ గిఫ్ట్
సీఎం కేసీఆర్ ప్రకటించినట్టుగా ఏపీ సీఎం చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ అందిస్తామని వినోద్‌కుమార్ స్పష్టంచేశారు. ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి టీఆర్‌ఎస్ మద్దతు అవసరం లేదని, వైసీపీకి సొంతగా తగినంత ప్రజాదరణ ఉన్నదని చెప్పారు. టీఆర్‌ఎస్ పార్టీకి ఏపీలో కార్యకర్తలు లేరని, కనీసం శాఖ కార్యాలయం లేదని, ఎలాంటి కార్యకలాపాలు లేవని, ఇలాంటి పరిస్థితుల్లో తాము మద్దతు ఇచ్చినా పెద్దగా మార్పు ఉండదని పేర్కొన్నారు. అయితే తమ పద్ధతిలోనే చంద్రబాబుకు తప్పకుండా రిటర్న్ గిఫ్ట్ ఇస్తామన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.