-పదవీ విరమణ వయస్సు 61 ఏండ్లకు పెంపు -ఎన్నికల హామీని నెరవేర్చిన సర్కార్ -ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల వేతనాలు భారీగా పెంపు -ఔట్సోర్సింగ్, కాంట్రాక్ట్, ఇతర ఉద్యోగులకూ వర్తింపు.. ఆరున్నరేండ్లలో 73% పెంపు -9,17,797 మంది సకల ఉద్యోగులకు లబ్ధి -ఈ ఏడాది ఏప్రిల్ ఒకటి నుంచి పెరిగిన వేతనాలు -కేజీబీవీల్లోని మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు -కరోనా విపత్తు, ఆర్థిక లోటుతో పీఆర్సీ జాప్యం -సుదీర్ఘ సంప్రదింపుల తర్వాత వేతనసవరణ -శాసనసభలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన -కరోనా వేళ ఫిట్మెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం -10,000 కోట్ల లబ్ధి -12 నెలల వేతన సవరణ బకాయిల చెల్లింపు -రిటైర్మెంట్ బెనిఫిట్లతోపాటే బకాయిల చెల్లింపు -ఈహెచ్ఎస్ కొత్త విధానాలకు స్టీరింగ్ కమిటీ -ఉమ్మడి జిల్లాలవారీగా టీచర్లకు ప్రమోషన్లు, బదిలీలు -భార్యాభర్తలకు వెంటనే అంతర్జిల్లా బదిలీలు -అదనపు పెన్షన్ వయోపరిమితి 70 ఏండ్లకు తగ్గింపు -ప్రాథమిక పాఠశాలలకు పదివేల హెచ్ఎం పోస్టులు -గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి 16 లక్షలకు పెంపు -సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ -ఇప్పటికే 80శాతం ఉద్యోగులకు ప్రమోషన్లు పూర్తి -త్వరలో మిగతా వారికి పదోన్నతుల ప్రక్రియ ప్రారంభం -పదోన్నతులు పూర్తికాగానే.. ఖాళీల భర్తీ ప్రక్రియ -ఏపీకి చెందిన ఉద్యోగులు అక్కడికి వెళ్లిపోవచ్చు -మరింత అంకిత భావంతో పనిచేస్తారని ఆశిస్తున్నా -పీఆర్సీని ప్రకటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశాభావం

ఫిట్మెంట్ 30% ఫిట్మెంట్ ప్రకటనపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలియజేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్, వీ మమత, ఏనుగుల సత్యనారాయణ,పీ శ్రీపాల్‌రెడ్డి, కమలాకర్, మాధవరం నరేందర్, టీచర్స్ ఎమ్మెల్సీ కాటేపల్లి జనార్దన్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, గడ్డం జ్ఞానేశ్వర్. చిత్రంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ కూడా ఉన్నారు.
ఉద్యమంలో తనతో కలిసి.. తనవెంట నడిచినవారికి.. తోడుగా నేనున్నానంటూ సీఎంకేసీఆర్ మరోసారి నిలబడ్డారు. కష్టమంటే ఏమిటో తెలంగాణ ఉద్యోగులకు తెలుసు. కడలిలా కమ్ముకొచ్చే కష్టాల కెరటాల్లో ఎదురీది గెలవటమూ తెలుసు. గెలిచి తెచ్చుకొన్న రాష్ర్టాన్ని దేశానికే దివిటీగా చెయ్యెత్తి చూపించడమూ తెలుసు. అటువంటి ఉద్యోగులను, ఉపాధ్యాయులను కడుపున పెట్టుకొని కాచుకోవడం ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాత్రమే తెలుసు. మన రాష్ట్రం.. మన పాలన వచ్చిన తర్వాత ఏరోజూ ఉద్యోగులకు తక్కువ చేయలేదు. స్పెషల్ ఇంక్రిమెంట్, పదో పీఆర్సీలో 43% ఫిట్మెంట్తో దేశంలోనే మరే ముఖ్యమంత్రి తీసుకోని అపూర్వ నిర్ణయాన్ని ఉద్యోగుల కోసం సీఎం తీసుకొన్నారు. తెలంగాణలో తొలి పీఆర్సీ వేయడంలోనూ జాప్యంచేయలేదు. మాయదారి మహమ్మారి కరోనా మొత్తం ప్రపంచాన్నే అతలాకుతలంచేసి, ఆర్థిక వ్యవస్థలను విధ్వంసం చేసింది. ఇందుకు తెలంగాణ కూడా మినహాయింపు కాలేదు. అదే క్రమంలో పీఆర్సీ కూడా ఆలస్యమైంది. అయితేనేం.. ఉద్యోగులు కాలరెగరేసేలా 30% ఫిట్‌మెంట్‌ను సీఎం కేసీఆర్ ప్రకటించారు. గత ఏడు దశాబ్దాలలో ఏ పీఆర్సీ కూడా పట్టించుకోని దాదాపు ఆరు లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులకు కూడా అంతే ఫిట్‌మెంట్‌ను ప్రకటించడం బహుశా దేశంలో ఇదే మొదటిసారేమో! వీటికి తోడు పదవీవిరమణ వయస్సు పెంపు.. టీచర్ల ప్రమోషన్లు, బదిలీలు.. ప్రసూతి సెలవులు, సీపీఎస్ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్.. ఖాళీల భర్తీ.. ఇలా కేసీఆర్ వరాల జాబితా చాంతాడంత! బంగారు తెలంగాణ సాధకుడు కేసీఆర్.. ఆ పసిడి తెలంగాణ చోదకులు ఉద్యోగులు! ఇది ఉద్యోగులకు పండుగ.. ఉపాధ్యాయులకు వేడుక.. తాత్కాలిక ఉద్యోగులకైతే కేరింత!!
ఫిట్మెంట్ 30% మాటిచ్చానంటే నిలబెట్టుకొని తీరుతానని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మరోసారి రుజువుచేశారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఊహించిన దానికంటే ఎక్కువగా ఫిట్‌మెంట్‌ను ప్రకటించి వారిపట్ల తనకున్న ఆదరాన్ని నిజం చేశారు. రెగ్యులర్ ఉద్యోగులకే పరిమితం కాకుండా.. ఆరు లక్షలకు పైగా ఉన్న ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు, ఆశ, అంగన్వాడీ, హోంగార్డులు.. ఇలా అన్ని వర్గాల ఉద్యోగులకు కూడా గౌరవప్రదమైన ఫిట్‌మెంట్‌ను ప్రకటించారు. సోమవారం శాసనసభ వేదికగా ఉద్యోగులు, ఉపాధ్యాయులకు 30% వేతన సవరణ (పీఆర్సీ) ఇస్తున్నట్టు సీఎం ప్రకటించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు.
12 నెలల బకాయిలను కూడా చెల్లిస్తామన్నారు. వీటిని రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తో పాటు ఇస్తామని చెప్పారు. దీంతోపాటే గత ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగ, ఉపాధ్యాయుల పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచుతున్నట్లు ప్రకటించారు. అనుభవజ్ఞులైన ఉద్యోగుల సేవలు వినియోగించుకోవాలనే లక్ష్యంతో వయోపరిమితి పెంపును ప్రకటిస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం తక్షణం అమల్లోకి వస్తుందన్నారు. టీచర్ల ప్రమోషన్ల ప్రక్రియకు ఆమోదం తెలిపారు. తాజా ఫిట్మెంట్తో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యోగులకు 73% వేతనాలు పెరిగినట్టయింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ శాసనసభలో చేసిన ప్రసంగం ఆయన మాటల్లోనే..
కరోనా విపత్తుతో కొంత ఆలస్యం కరోనా విపత్తు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కుదిపేసింది. అనూహ్య ఆర్థికలోటుతో 11వ వేతన సవరణ కొంత ఆలస్యమైంది. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నది. ఇలాంటి సందర్భంలో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ వర్తించేలా మెరుగైన రీతిలో వేతన సవరణ చేస్తున్నాం. 30% ఫిట్మెంట్ ప్రకటిస్తున్నాననే విషయం చెప్పేందుకు సంతోషిస్తున్నాను. ఉద్యోగుల వేతన సవరణ అనేది మన రాష్ట్రంలో ఐదేండ్లకు ఒకసారి ఇస్తున్నాం. ఈసారి తీవ్రమైన ఆర్థిక మాంద్యం, కరోనా పరిస్థితుల వల్ల కొంత ఆలస్యమైంది. పీఆర్సీ కమిటీని నియమించాం. ఆ కమిటీ ఇచ్చిన నివేదికపై మంత్రివర్గంలో చర్చించిన తర్వాత సీఎస్ అధ్యక్షతన ఆర్థికశాఖ కార్యదర్శి రామచంద్రరావు, నీటిపారుదల కార్యదర్శి రజత్‌కుమార్‌తో త్రిసభ్య కమిటీని ప్రభుత్వం నియమించింది. చాలాసార్లు, అన్ని సంఘాలతో త్రిసభ్య కమిటీ పీఆర్సీపై లోతుగా చర్చించింది. ఉద్యోగులు కూడా చురుకుగా పనిచేస్తేనే పనులన్నీ సజావుగా సాగేందుకు అవకాశముంటుంది. కాబట్టి వారు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న వేతనసవరణను ఈ రోజు ప్రకటిస్తున్నాం.
తాత్కాలిక ఉద్యోగులకూ ఫిట్మెంట్ వేతనసవరణ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు చేసే పద్ధతిగా గత ప్రభుత్వాలు వ్యవహరించాయి. తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు వేతన సవరణ చేస్తూనే, క్షేత్రస్థాయిలో సేవలందిస్తున్న ఇతర చిరుద్యోగుల అవసరాలను, స్థితిగతులను దృష్టిలో పెట్టుకొని, మానవీయకోణంలో వారి వేతనాలను కూడా పెంచింది. ఈసారి కూడా ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూనే, ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న ఇతర కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశవర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యావాలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీఆర్ఏలు, వీఏవోలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ వర్క్ చార్జ్డ్, డెయిలీ వే జ్ తదితర ఉద్యోగులందరికీ పీఆర్సీని అమలుచేస్తున్నాం. అన్ని రకాల ఉద్యోగులు కలిపి 9,17,797 మందికి వేతనాల పెంపు వర్తింపజేయాలని నిర్ణయించాం.
వందశాతం ప్రమోషన్లు.. త్వరలోనే ఖాళీల భర్తీ రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సంప్రదించిన తర్వాత వారు కోరినట్టే ప్రభుత్వం ప్రమోషన్లను చేపట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో 80% ఉద్యోగుల ప్రమోషన్ల ప్రక్రియ పూర్తయింది. మిగతా ఉద్యోగులతోపాటు అర్హులైన ఉపాధ్యాయులకు ప్రమోషన్ల ప్రక్రియను ప్రభుత్వం సత్వరమే ప్రారంభిస్తుంది. ఇది పూర్తయ్యాక రాష్ట్రంలోని వందశాతం అర్హులైన ఉద్యోగులందరు ప్రమోషన్లు పొందుతారు. ప్రమోషన్ల తర్వాత ఏర్పడే ఖాళీలను భర్తీని త్వరలోనే ప్రారంభిస్తుంది.
అన్ని సంఘాలతో వ్యక్తిగతంగా చర్చించా పీఆర్సీపై కమిటీ నివేదిక ఇవ్వగానే ఆర్థిక మంత్రి, కార్యదర్శితో చర్చించిన. తర్వాత ఒక సబబైన పద్ధతిలో ముందుకు సాగుదామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులను బేరీజు వేసుకొని ఉద్యోగ సంఘాల నాయకులతో నేను కూడా పలు దఫాలు మా ట్లాడాను. టీజీవో అధ్యక్షురాలు మమత, కార్యదర్శి సత్యనారాయణ, టీఎన్జీవో సంఘం అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్, కార్యదర్శి ప్రతాప్, సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు, కార్యదర్శి షేక్ యూసుఫ్‌మియా, ఉపాధ్యాయ సంఘం పీఆర్టీయూ అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‌రెడ్డి, కార్యదర్శి కమలాకర్‌రావు, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్‌తోపాటు ఎమ్మెల్సీలు కాటేపల్లి జనార్దన్‌రెడ్డి, కూర రఘోత్తంరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ తదితరులందరితో వ్యక్తిగతంగా మాట్లాడాను. సాధ్యాసాధ్యాలపై చర్చించాను. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం అనుసరించిన విశాల దృక్పథానికి అనుగుణంగా ప్రతిస్పందించి ఉద్యోగులు కూడా విధి నిర్వహణలో మరింత అంకితభావంతో నిమగ్నులవుతారని, ప్రజాసేవలో ఏ లోటు రాకుండా పూర్తి నిబద్ధతతో పనిచేస్తారని ప్రభుత్వం ఆశిస్తున్నది.
ఉద్యోగ, ఉపాధ్యాయులపై ముఖ్యమంత్రి వరాలు 1.ఉద్యోగ ఉపాధ్యాయులందరికీ 30% ఫిట్మెంట్. 2021 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి.. 2.ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంపు. తక్షణం అమల్లోకి. 3.రిటైర్మెంట్ గ్రాట్యుటీ రూ.12 లక్షల నుంచి రూ.16 లక్షలకు పెంపు 4.కరోనా వల్ల రాబడి తగ్గి, రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక లోటులో కూరుకుపోయింది. రాష్ట్రం ఆర్థికంగా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వానికి ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పీఆర్సీకి సంబంధించి 12 నెలల బకాయిలను చెల్లిస్తాం. వీటిని రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తోపాటు కలిపి పొందే అవకాశం కల్పించాం. 5.కేజీబీవీల్లోని మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం కల్పించాలని నిర్ణయించాం. 6.గతంలోని ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన యాజమాన్యాలవారీగా అర్హులైన ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ. 7.ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులతోపాటు, ఆ సంఖ్య పదివేలకు చేరేలా అదనపు ప్రధానోపాధ్యాయ (స్కూల్ అసిస్టెంట్ల సమానస్థాయి) పోస్టుల మంజూరు. 8.వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేసేందుకు వీలుగా వెంటనే అంతర్ జిల్లా బదిలీల ప్రక్రియ. 9.తెలంగాణలో పనిచేస్తున్న ఏపీకి చెందిన ఉపాధ్యాయులు వారి రాష్ర్టానికి తిరిగి వెళ్లేందుకు ప్రభుత్వం అనుమతి ఇస్తుంది. 10.పీఆర్సీ సూచనల మేరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం నూతన విధివిధానాలను నిర్ణయించేందుకు ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో స్టీరింగ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటుచేస్తుంది. 11.ఉద్యోగ విరమణ చేసిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 15% ఇచ్చే అదనపు పెన్షన్‌కు ఉన్న వయోపరిమితిని 75 ఏండ్ల నుంచి 70 ఏండ్లకు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 12.విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విధానాన్ని వర్తింపజేస్తాం.
చిరుద్యోగులకూ వేతన పెంపు వేతనసవరణ అంటే కేవలం ప్రభుత్వ ఉద్యోగులకు చేసే పద్ధతిగా గత ప్రభుత్వాలు వ్యవహరించాయి. తెలంగాణ ప్రభుత్వం గతంలో ప్రభుత్వోద్యోగులకు వేతన సవరణ చేస్తూనే, క్షేత్రస్థాయిలోని ఇతర చిరుద్యోగుల వేతనాలను కూడా పెంచింది. ఈసారి కూడా రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులకు, పెన్షనర్లకు వేతన సవరణ చేస్తూనే, ప్రభుత్వ యంత్రాంగంలో భాగమై పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, హోంగార్డులు, అంగన్వాడీలు, ఆశావర్కర్లు, సెర్ప్ ఉద్యోగులు, విద్యా వలంటీర్లు, కేజీబీవీ, సర్వశిక్షా అభియాన్ ఉద్యోగులు, వీఆర్ఏలు, వీఏవోలు, గ్రాంట్ ఇన్ ఎయిడ్ వర్క్ చార్జ్డ్, డెయిలీ వేజ్ తదితర ఉద్యోగులందరికీ పీఆర్సీని అమలుచేస్తున్నాం. రాష్ట్రంలోని అన్ని రకాల ఉద్యోగులందరూ కలిపి 9,17,797 మందికి వేతనాలు పెంచుతున్నాం.
-ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు