-ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చొరవతో సొంతిల్లు
-నిర్మించి ఇస్తానని ముందుకొచ్చిన టీఆర్ఎస్ నేత కర్నాటి విద్యాసాగర్
నల్లగొండ ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి సొంతింటి కల నెరవేరబోతున్నది. ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు చూపిన చొరవ మరో ఇంట వెలుగులు నింపనున్నది. ఇప్పటికే సెలూన్ ఏర్పాటుతో స్వామికి జీవనోపాధి కల్పించిన కేటీఆర్.. ఇప్పుడు నీడ కోసం గూడు నిర్మాణానికి చేయూతనిచ్చారు. ఫ్లోరైడ్ బాధితుడు అంశాల స్వామి శుక్రవారం ప్రగతిభవన్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్.. స్వామి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. అతనికి డబుల్బెడ్రూం ఇల్లు మంజూరుచేయాలని నల్లగొండ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించారు. మంత్రి కేటీఆర్ సూచనతో గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా టీఆర్ఎస్ నేత కర్నాటి విద్యాసాగర్.. స్వామికి ఇల్లు నిర్మించి ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ సందర్భంగా విద్యాసాగర్‌ను కేటీఆర్ అభినందించారు. గతంలో పెద్ద మనసుతో జీవనోపాధి కల్పించిన మంత్రి కేటీఆర్.. ప్రస్తుతం సొంతింటి కలను నెరవేర్చుతున్నారని స్వామి సంతోషం వ్యక్తంచేశారు. ఆయనకు ఏమిచ్చినా రుణం తీర్చుకోలేనని పేర్కొంటూ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మిషన్ భగీరథ ద్వారా ఫ్లోరైడ్ సమస్య నుంచి క్రమంగా విముక్తి లభిస్తున్నదని, ఫ్లోరైడ్ పీడను దూరంచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌కు చేతులెత్తి మొక్కుతామని స్వామి పేర్కొన్నారు.