ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని రాష్ట్ర హోంశాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి శిక్షణ పూర్తి చేసుకున్న మహిళా కానిస్టేబుళ్లకు ఉద్బోధించారు. పోలీసు శాఖపై ప్రజలకు విశ్వాసం పెరిగిననాడే రాష్ట్రంలో నేరాలను పూర్తిస్థాయిలో అదుపు చేయవచ్చునని అన్నారు. పోలీసులు ఫ్రెండ్లీ పోలీసింగ్ వాతావరణం కల్పించేందుకు కృషి చేయాలని, తద్వారా క్రైమ్‌రేటును అదుపు చేయాలని సూచించారు.

– మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్‌లో హోంమంత్రి నాయిని -తెలంగాణలో మొదటి నియామక పాసింగ్ పరేడ్: డీజీపీ అనురాగ్ శర్మ -త్వరలోనే తెలంగాణ పోలీస్ అకాడమీ: డైరెక్టర్ మాలకొండయ్య శుక్రవారం రాజబహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమానికి నాయిని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శాంతి భద్రతల కోసం సేవ చేసేందుకు ముందుకు వచ్చిన మహిళా కానిస్టేబుళ్లను, వారిని వెన్నుతట్టి ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు.
ప్రతిష్ఠాత్మకమైన జాతీయ స్థాయి అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకొని వృత్తి జీవితంలోకి అడుగుపెడుతున్న ప్రతి మహిళా కానిస్టేబుల్ నీతి నిజాయితీ, నిబద్ధతతో పనిచేయాలని మంత్రి పిలుపు నిచ్చారు. పోలీస్ శాఖమీద ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిస్థాయి విశ్వాసం పెట్టుకున్నారని దాన్ని నిలుపుకునేందుకు అందరూ బాధ్యతా యుతంగా పనిచేయాలని కోరారు.
సమాజంలో శాంతి భద్రతలు బాగుంటే అభివృద్ధి నల్లేరు మీద నడకలాగ సులువుగా ఉంటుందని స్పష్టం చేశారు. నేరాల అదుపు, నేరస్తులపై నిఘా, రికార్డుల అనుసంధానం, పోలీస్ వ్యవస్థ ఆధునీకరణపై దృష్టి పెట్టి మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ రావల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల రాలేకపోయారని, శిక్షణ పూర్తిచేసుకున్న ప్రతి మహిళా కానిస్టేబుల్‌కు అభినందనలు తెలియచేయమని తనతో సందేశం పంపించారని చెప్పారు. మహిళా కానిస్టేబుళ్ల పాసింగ్ ఔట్ పరేడ్ గౌరవ వందనాన్ని హోంమంత్రి స్వీకరించారు.

తెలంగాణలో మొదటి బ్యాచ్… తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత పోలీస్ శాఖలో పాసింగ్ చేసుకుంటున్న మొదటి బ్యాచ్‌లో 486 మంది మహిళా కానిస్టేబుళ్లు ఉండడం సంతోషంగా ఉందని డీజీపీ అనురాగ్ శర్మ అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీస్ శాఖకు ఎనలేని ప్రాధాన్యంను ఇస్తున్నారని, మహిళలు, బాలికలు, వృద్ధులందరి రక్షణపై ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. ఇప్పటికే మహిళా భద్రత కమిటీ నియామకంతోపాటు ప్రత్యేకమైన భద్రతా చర్యలు సైతం తీసుకున్నారని తెలిపారు. సివిల్ పోలీస్ నియామకాల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కూడా కల్పించాలని సీఎం సంకల్పించారని చెప్పారు.
లక్షమందికి శిక్షణ ఇవ్వడం గర్వకారణం రాజ బహదూర్ వెంకట్రామిరెడ్డి పోలీస్ అకాడమీలో రాష్ట్ర పోలీస్ సిబ్బంది మాత్రమే కాక వివిధ రాష్ర్టాల సిబ్బంది, అధికారులకు సైతం శిక్షణ ఇస్తున్నామని అకాడమీ డైరెక్టర్ మాలకొండయ్య చెప్పారు. 1986లో ఏర్పాటయిన ఈ అకాడమీ ద్వారా నేటి వరకు 1,32,365 మంది అధికారులు, సిబ్బంది శిక్షణ పూర్తి చేసుకోవడం గర్వంగా ఉందన్నారు.
దేశ చరిత్రలో ఇంత మంది అధికారులకు ట్రైనింగ్ ఇచ్చిన అకాడమీలు లేవన్నారు. ఈ బ్యాచ్‌లో 486 మంది మహిళా కానిస్టేబుళ్లకు 9 నెలల పాటు కఠోరమైన శిక్షణ ఇచ్చామని, శిక్షణలో ఉంటూనే ఈ ఏడాది జరిగిన ఎంపీటీసీ, సాధారణ ఎన్నికలు, గణేష్ బందోబస్తు, బోనాల పండుగ, బతుకమ్మ, చలో అసెంబ్లీ లాంటి కార్యక్రమాల్లో విధులు నిర్వర్తించారని మాలకొండయ్య తెలిపారు. రాజ బహదూర్ వెంకట్రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ పోలీస్ అకాడమీ త్వరలోనే రాజ బహదూర్ వెంకట్రామిరెడ్డి తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీగా మారుతున్నదని మాలకొండయ్య వెల్లడించారు.
ప్రతిభ కనబర్చిన మహిళా కానిస్టేబుళ్లు.. బెస్ట్ ఆల్‌రౌండర్- నాగజ్యోతి, నల్గొండ బెస్ట్ ఇన్ ఔట్‌డోర్- నాగజ్యోతి నల్గొండ బెస్ట్ ఇన్ ఇన్‌డోర్- బీ సంధ్య, హైదరాబాద్ బెస్ట్ ఫైరింగ్-జీ రాజేశ్వరి, రంగారెడ్డి బెస్ట్ ఔట్ డోర్(సివిల్)-సీహెచ్ రాధిక, వరంగల్ బెస్ట్ ఇన్‌డోర్-కేహెచ్ జున్సీసా బేగం, వరంగల్ బెస్ట్ ఫైరింగ్-వై రేణుక, మహబూబ్‌నగర్ బెస్ట్ ఆల్‌రౌండర్, ఫైరింగ్, ఇన్‌డోర్(ఏఆర్)-కే మంజుల, రంగారెడ్డి బెస్ట్ ఇన్ ఔట్‌డోర్- బీ జ్యోతి, హైదరాబాద్ పరేడ్ కమాండర్ ట్రోఫీ- ఆర్ కీర్తన, సివిల్, రంగారెడ్డి