రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ సభ్యత్వాల నమోదు జోరు కొనసాగుతున్నది. గడపగడపకూ టీఆర్ఎస్ చేరుతున్నది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పార్టీ సభ్యత్వాలు తీసుకుంటూ తెలంగాణ రాష్ర్టాన్ని సాధించడంతోపాటు రాష్ర్టాభివృద్ధికి అహర్నిషలు కృషి చేస్తున్న సీఎం కేసీఆర్‌కు, టీఆర్ఎస్ పార్టీకే మద్దతు పలుకుతామని స్పష్టం చేస్తున్నారు.

ఆదివారం గ్రేటర్ హైదరాబాద్ డబీర్‌పురాలో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, లాలాపేటలో మంత్రి పద్మారావు, కరీంనగర్లో మంత్రి ఈటల రాజేందర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు, నిజామాబాద్ జిల్లా సాలంపాడ్‌లో మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, కొత్తగూడెంలో మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ఎమ్మెల్యే జలగం వెంకటరావు, సూర్యాపేట జిల్లా కోదాడలో మంత్రి జగదీశ్‌రెడ్డి, పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ పెద్ది సుదర్శన్‌రెడ్డి, వనపర్తిలో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి సభ్యత్వ నమోదులో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోని కాచిగూడ ఇన్చార్జి ఎక్కాల కన్నా ఆధ్వర్యంలో నింబోలిఅడ్డాలోని ఏకే భవన్లో ఏర్పాటు చేసిన సభ్యత్వ నమోదులో నగర మేయర్ బొంతు రామ్మోహన్, ఎమ్మెల్సీ మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తెలంగాణలో పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలు పడుతున్న కష్టాలు తెలిసిన దేవుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. కష్టాలు తీరడానికి ప్రజలు దేవునికి మొక్కి ముడుపులు చెల్లిస్తే.. మొక్కులు చెల్లించకుండానే ప్రజల కష్టాలను తెలుసుకొని తీర్చుతున్న దేవుడే సీఎం కేసీఆర్ అని ఆయన పేర్కొన్నారు. నగరానికి ఇంకా 30 లక్షల మంది వలస వచ్చినా తాగునీటికి ఎలాంటి కష్టం ఉండదన్నారు.

