Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గడీల పాలనా? అదెక్కడ?

-నాకు చరిత్ర లేదా? నేను దొరనా? -తెలంగాణ ఆత్మగౌరవం మా ప్రాధాన్యం..డబ్బు దోచుకోవడం మీ ప్రాధాన్యం -ఆంధ్ర పార్టీలపై నిప్పులు చెరిగిన కేసీఆర్ -రెండు ఓట్లూ కారు గుర్తుకే వేయాలని పిలుపు -మెదక్ లోక్‌సభ, గజ్వేల్ అసెంబ్లీ స్థానాలకు నామినేషన్లు -కోనాయపల్లి వెంకటేశ్వరాలయంలో ప్రత్యేక పూజలు

మా ప్రాధాన్యతలు వేరు. మీ ప్రాధాన్యతలు వేరు.. మా ప్రయారిటీ తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో బతకడం. మీ ప్రయారిటీ డబ్బులు సంపాదించుకోవడం, కాంట్రాక్టర్లకు కమీషన్లు దోచిపెట్టడం. ఇది మీ చరిత్ర చెబుతున్న సత్యం అని టీఆర్‌ఎస్ అధినేత కే చంద్రశేఖర్‌రావు అన్నారు. మెదక్ లోక్‌సభ, గజ్వేల్ శాసనసభ స్థానాలకు కేసీఆర్ బుధవారం నామినేషన్లు దాఖలు చేశారు. అంతకు ముందు తన ఆరాధ్య దైవం, సెంటిమెంట్ అయిన మెదక్ జిల్లా నంగనూరు మండలం కోనాయపల్లి వెంకటేశ్వరాలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఉదయం 8గంటల ప్రాంతంలో కేసీఆర్ జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి హెలికాప్టర్‌లో కోనాయపల్లికి వెళ్లారు.

KCR-Nomination 10-04-14

అక్కడ పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తరువాత హెలికాప్టర్‌లోనే జిల్లా కేంద్రమైన సంగారెడ్డికి బయల్దేరారు. సంగారెడ్డి కలెక్టరేట్‌లో కేసీఆర్ మెదక్ లోక్‌సభ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ పత్రాన్ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ స్మితా సబర్వాల్‌కు అందజేశారు. నామినేషన్ దాఖలు సందర్భంగా కలెక్టర్ స్మితా సబర్వాల్ కేసీఆర్‌తో ప్రమాణం చేయించారు. కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి శేరీ సుభాష్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఆర్ సత్యనారాయణలు నామినేషన్‌లో సంతకాలు చేశారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లోనే గజ్వేల్‌కు వెళ్ళి అసెంబ్లీ స్థానానికి నామినేషన్ దాఖలు చేశారు.

KCR- Pooja 12

ఈ సందర్భంగా కోనాయపల్లి, గజ్వేల్‌లో మీడియాతో కేసీఆర్ మాట్లాడారు. గడీలపాలన వస్తుందంటూ కాంగ్రెస్, టీడీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ఏమన్నా అంటే.. కేసీఆర్ దొర అంటరు. కులం పేరు పెట్టి కేసీఆర్ దొర, గడీల పాలన అంటరు. ఎక్కడి గడీల పాలనో నాకర్థం కాదు. గుణం ముఖ్యం, కులం కాదు. నేను దొరలాగనే ఉన్ననా? నాకు చరిత్ర లేదా? సిద్దిపేటలో ఇరవై ఏండ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న. ఎక్కడైనా దొరలాగా ప్రవర్తించానా? నేను కూడా సలాకలు, తట్టలు మోసుకుంటా వాగు గెట్ల పొంట, గ్రామాల్లో రాత్రుళ్లు పడుకోలేదా? సిద్దిపేట నియోజకవర్గంలో బహుశా నాకు తెలిసి, నేను పడుకోని గ్రామమే ఉండదు. ప్రజల మధ్య వారితో కలిసి ఉండి పని చేసినం తప్ప నేను ఎన్నడు దొరలాగ పని చెయ్యలేదు అని చెప్పారు.

ఇద్దరు నాయుళ్ల కుట్ర వెంకయ్యనాయుడు, చంద్రబాబునాయుడు.. ఈ ఇద్దరు నాయుళ్ల కథ ఏంది? స్థానిక బీజేపీ వద్దంటుంటే కూడా జబర్దస్తీగా ఎందుకు పొత్తు కడుతుండ్రు? తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి రావద్దు. కచ్చితంగా ఈడ పదో, ఇరవైయో, ముప్పయ్యో సీట్లు సంపాదించి ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టయినా సరే ఇక్కడ అడ్డం తిరగాలన్నదే వాళ్ల ఉద్దేశం. ఆంధ్రాకు అనుకూలమైన నిర్ణయాలు చేయించాలి. ఇదీ వాళ్ల కుట్ర అని అన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తమనేది నేనుచెప్పిన.. కేసీఆర్ ఆరచేతిలో వైకుంఠం చూపిస్తుండంటున్నడని టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అంటున్నడు. ఆ అవసరం నాకు అవసరం లేదు. తెలంగాణ తెచ్చిన కీర్తి వెయ్యి జన్మలకు సరిపోతది. తరతరాలు చరిత్రలో నిలుస్తది. దాని ముందు పదవులు ఓ లెక్క కాదు అని చెప్పారు.

KCR-Nomination 11

ఎందుకు పోటీ చేస్తున్నమంటే.. ఈ పద్నాలుగేళ్ల కాలంలో పది జిల్లాల్లో మూల మూల తిరిగినప్పుడు అనేక అనుభవాలు, పాఠాలు నేర్చుకున్నం. కచ్చితంగా సమైక్యవాదశక్తులు, ఆంధ్రశక్తులు ఇంక కూడా మనల్ని పట్టి పీడిస్తయి. ఆ పీడ మనకు పోలే. ఇన్ని రోజులు కాంగ్రెస్సోల్లు చెయ్యలే, టీడీపోల్లు చెయ్యలే.. కేసీఆర్ ఎట్ల చేస్తడంటే.. వాళ్లకు తెలివి లేదు మనకు తెలివున్నది. వాళ్లకు నీతి లేదు, నిజాయితీ లేదు, హృదయం లేదు, ప్రజలకు మంచి చెయ్యాలన్న తపనలేదు. మేం చెప్పినవన్నీ చేస్తామని కచ్చితంగా చెబుతున్నా అన్నారు. టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రణాళికలో ఏ విషయాలైతే చెప్పినమో, మూడు లక్షల రూపాయలతో రెండు బెడ్‌రూములు, ఒక హాలు, కిచెనుతో ఇల్లు కట్టించడం, రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ, ఆటో రిక్షా కార్మికులకు రవాణా పన్ను మినహాయింపు.. వీటన్నింటినీ తు.చ. తప్పకుండా అమలు చేయిస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారు. విమర్శలకు సమాధానం కోసం తాను ఈ మాటలు చెప్పడం లేదని స్పష్టం చేశారు.

స్వామి దయతోనే తెలంగాణ పద్నాలుగేళ్లక్రితం నేను ఇదే వెంకటేశ్వరస్వామి ఆలయంలో పూజచేసి, ఆశీర్వాదం తీసుకొని వెళ్లాను. అప్పటినుంచి ఏ కార్యంలోనూ ఫెయిల్ కాలేదు. స్వామి దీవెన ఉంటే తెలంగాణ సాధిస్తానని చెప్పిన. ఆ స్వామి దయతోనే ఈ రోజు తెలంగాణ కల సాకారమైంది. సంకల్పం, చిత్తశుద్ధి, పట్టుదల, ధైర్యం, నిజాయితీ ఉంటే ప్రపంచంలో సాధించలేనిది ఏదీ లేదని తెలంగాణ సాధనతో రుజువైంది అని చెప్పారు. ఇదేవిధమైన పట్టుదల, సంకల్పసిద్ధితో తెలంగాణ రాష్ర్టాన్ని బంగారు తునకగా మార్చుకుంటామని చెప్పారు. దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అలా జరగాలంటే రాజకీయ అవినీతి అంతం కావాలని పునరుద్ఘాటించారు.

ఇంత అవినీతి ఎక్కడైన ఉంటదా? ఇన్నాళ్లు మనల్ని పాలించిన ప్రభుత్వాలు అనేక విధాలైన అవినీతికి పాల్పడిన చరిత్ర పేపర్లల్ల చూసినం. ఇట్ల దేశంలో ఎక్కడన్న జరుగుతదా? మంత్రులు, ఐఏఎస్‌లు, ఎంపీలు, పెద్దపెద్ద వ్యాపారస్తులు జైళ్లలో పడతరా? ఎందుకు వచ్చింది ఈ దుస్థితి? అని గతాన్ని గుర్తు చేశారు. స్వామి వారి ముందు చెప్తున్నా. ప్రజలకు మంచి జరగాలంటే మంచి పాలన ఉండాలి. మంచి పాలన ఉండాలంటే రాజకీయ అవినీతి అంతం కావాలి. రాజకీయ అవినీతి లేకపోతే, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రులకు కమీషన్ బొక్కే ఆలోచన లేకపోతే కచ్చితంగా మంచే జరుగుతది అని కేసీఆర్ స్పష్టం చేశారు. నేను మొదట్లో ఎమ్మెల్యే అయినప్పుడు చూసిన. కాంట్రాక్టర్ అనేవాడు ఎస్‌సీ అఫీసుకే అప్పుడప్పుడు పోయేవాడు. ఈఈ ఆఫీసుకైతే ఎప్పుడో ఒక్కసారి పోయేవాడు.

ఈ రోజు కాంట్రాక్టర్లు ముఖ్యమంత్రి కార్యాలయంలో కనిపిస్తున్నారు అని కేసీఆర్ చెప్పారు. కాంట్రాక్టర్లు సీఎం కార్యాలయంలో ఉంటే ఈఈలు, ఎస్‌ఈలు, అధికారులెందుకని ఆయన ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వంలో నేతలు తిన్న అవినీతి సొమ్మును కక్కించాలి. ఆ పని తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం చేస్తది. వందలు, వేల కోట్లు సంపాదించే దుష్ట సంస్కృతి ఏదైతే ఉందో దానికి చరమగీతం పాడాలి అని కేసీఆర్ పిలుపునిచ్చారు.

రెండు ఓట్లూ కారు గుర్తుకే దేశంలో సంకీర్ణయుగం నడుస్తుంది. ఒక్క ఓటు అటు వేస్తం, ఒక ఓటు ఇటు వేస్తం అంటే మునిగిపోతం. కేంద్రంలో అధికారం ఉండాలంటే, మన ప్రాజెక్టులకు క్లియరెన్సు రావాలంటే, అనుమతులు తెచ్చుకోవాలంటే తప్పనిసరిగా శాసనసభలో మనమే ఉండాలి. కేంద్రంలోను మన ఎంపీలు ఉండాలి అని కేసీఆర్ ఉద్ఘాటించారు. పదహారు, పదిహేను ఎంపీ సీట్లు గెలుచుకొని ఢిల్లీ ప్రభుత్వాన్ని శాసించే విధంగా ఉండాలని పిలుపునిచ్చారు.

కొత్తగా తెలంగాణ రాష్ర్టాన్ని తెచ్చుకున్నం. మన బతుకు దెరువు ఏంటో మనం తేల్చుకోవాలి. కత్తి ఒకనికి ఇచ్చి యుద్ధం ఇంకొకన్ని చెయ్యమంటే ఎట్ల? వేరోల్లను ఎంపీలు చేసి అడక్కతినడంకంటే మన వాళ్లనే ఎంపీలుగా ఎన్నుకోవడం మంచిది అని కేసీఆర్ చెప్పారు. ఓటు వేసేటప్పుడు ఏమరుపాటుగా ఉంటే ఆగమైపోతం. టీడీపీ, కాంగ్రెస్ ప్రభుత్వాలు మనం చూడనియి కావు. ఏం చేసిండ్రో ఇన్నేళ్లుగా చూసినం. ఇప్పుడు కొత్త మేస్త్రీకి పగ్గాలు ఇవ్వాలి. కోటి ఎకరాలకు నీళ్లు తెచ్చుకోవాలి. వీళ్లు చెయ్యలేరు. ఆంధ్రా నాయకులకు ఢిల్లీ నుంచి ఫోన్లు వస్తే ఆ.. మంచిది.. అని మెడలు ఊపుతరు తప్ప నిలదీయలేరు అని కేసీఆర్ పేర్కొన్నారు. 1996లో సింగూరు రైతుల దుస్థితిని చూసి చలించిపోయా. దోపిడీకి, అణచివేతకు గురవుతున్న తెలంగాణ సమాజానికి అండగా నిలవాలని ఆనాడే నిశ్చయించుకున్నా. అన్యాయం, దోపిడీ, అణచివేత ఉన్న ప్రాంతాల్లో తిరుగుబాటు పుట్టుకు వస్తుంది. ఈ క్రమంలోనే తెలంగాణ ఉద్యమం పట్టింది. రాష్ర్టాన్ని సాధించుకున్నది అని చెప్పారు.

ప్రాణహిత డిజైన్ మార్పుతో 6 లక్షల ఎకరాలకు నీరు ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ను మారిస్తే జిల్లాలోని 3 డివిజన్లలో 6 లక్షల ఎకరాలకు సాగునీటి సౌకర్యం ఒనగూరుతుందని కేసీఆర్ అన్నారు. పొన్నాల లక్ష్మయ్య చేస్తున్న ప్రసంగాల్లో పసలేదు. జలయజ్ఞం ద్వారా తెలంగాణ ప్రాంతానికి ఒరగబెట్టిందేమీలేదు అని కేసీఆర్ విమర్శించారు. బలహీన వర్గాలకు ఇళ్లు కట్టిస్తున్నట్లు చెబుతున్న కాంగ్రెస్.. బాత్‌రూంల నిర్మాణాలకు అయ్యే ఖర్చు కూడా లబ్ధిదారునికి సమకూర్చకపోతే అది ఇంటి నిర్మాణం ఎలా అవుతుందని ప్రశ్నించారు. 125 గజాల స్థలంలో మధ్యతరగతి జీవితం గడిపే వీలుగా కనీసం రూ.3లక్షలకు పైగా వెచ్చిస్తేనే ఇప్పటి ధరల ప్రకారం ఇంటి నిర్మాణం జరుగుతుందన్నారు.

గజ్వేల్ నియోజకవర్గం సస్యశ్యామలం కోసం టీఆర్‌ఎస్ పెద్ద పీట వేస్తుందని కేసీఆర్ హామీ ఇచ్చారు. గజ్వేల్ పట్టణాన్ని శాటిలైట్ టౌన్‌షిప్‌గా ఏర్పాటు చేస్తామని, అన్ని హంగులతో అభివద్ధికి బాటలు వేస్తామని స్పష్టం చేశారు. ఈ సభలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు, మాజీ డీజీపీ పేర్వారం రాములు, రమణాచారిలతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు భూంరెడ్డి పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.