Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గజ్వేల్ జేజేలు

సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో పోటీచేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేల కోట్లు పంపిస్తున్నారు. ఎలాగైనా ఇక్కడ 20 నుంచి 25 సీట్లు గెలిచి టీఆర్‌ఎస్ డైరెక్టుగా అధికారంలోకి రావొద్దని కుట్రలు చేస్తున్నారు.

-ఆంధ్రోళ్లకు సామంతులుగా ఉందామా? -స్వతంత్రులమవుదామా?.. ప్రజలే తేల్చుకోవాలి – భూదాన్ భూముల కోసమే టీడీపీ, బీజేపీ పొత్తు.. – అధికారంలోకి రాగానే ఆ లక్ష ఎకరాలను కక్కిస్తాం – తెలంగాణలోని సెటిలర్లకు మేం వ్యతిరేకం కాదు.. – చంద్రబాబు మనిషే అయితే ఆప్షన్లపై వైఖరేమిటో చెప్పాలి: కేసీఆర్ – రైతులకు లక్ష వరకు పంటరుణాలు మాఫీ చేస్తాం – గజ్వేల్‌లో రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం.. – ఇజ్రాయెల్ టెక్నాలజీతో వ్యవసాయ పరిశోధన కేంద్రం, తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం – గజ్వేల్ సభలో టీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్

KCR in Gajwel Meeting 19-04-14

కాంగ్రెస్‌కు ఓటేస్తే వాళ్లు సీమాంధ్ర నేతల దగ్గర చేతులు కట్టుకుంటరని.. ఆంధ్రోళ్లకు సద్దులు కడ్తరని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు విమర్శించారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ ఎంపీలందరినీ గెలిపించుకోవాలని, అప్పుడే ఢిల్లీ మెడలు వంచి మన వాటా మనం సాధించుకోవచ్చని అన్నారు. హైదరాబాద్‌లో కబ్జా చేసిన భూములు కాపాడుకోవడానికే టీడీపీ-బీజేపీ దోస్తీ కట్టాయని విమర్శించారు. శుక్రవారం మెదక్ జిల్లా గజ్వేల్‌లో నిర్వహించిన టీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

సామంతులుగానే ఉందామా..? ఇన్నేళ్లు సీమాంధ్రుల పాలనలో మగ్గినతర్వాత కూడా ఆంధ్రా పార్టీలు మనకు అవసరమా..? అని కేసీఆర్ ప్రశ్నించారు. ఆంధ్రా పార్టీల కింద ఇంకా సామంతులుగా ఉందామా..? స్వతంత్రులుగా ఉందామా తెలంగాణ 10 జిల్లాల ప్రజలు తేల్చుకోవాల్సి ఉందన్నారు. 1969 తెలంగాణ ఉద్యమంలో 400 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వేలాదిమంది విద్యార్థుల లాఠీదెబ్బలు తిన్నారు. 2001లో టీఆర్‌ఎస్ ప్రారంభించిన నుంచి 2009లో నేను ఆమరణ దీక్షకు దిగే వరకు.. తెలంగాణరాష్ట్ర ఏర్పాటు అయ్యే పనేనా..? అని చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. అసెంబ్లీలో తెలంగాణ పేరునే నిషేధించిన సందర్భం నుంచి 14 ఏళ్ల ఉద్యమం తరువాత తెలంగాణను సాధించుకున్నాం అని పేర్కొన్నారు.

సెటిలర్లకు వ్యతిరేకం కాదు.. తెలంగాణ కల సాకారమైనా.. ప్రజలు ఆశించిన తెలంగాణ ఏర్పాటు కాలేదు. ఇంకా వెలితి ఉన్నది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉండడం మన ఖర్మ. అందుకే ఆంక్షలతో కూడిన తెలంగాణను బలవంతంగా మనమీద రుద్దారు. అయిష్టమైనప్పటికీ ఇచ్చిన తెలంగాణను స్వీకరించాం అని కేసీఆర్ పేర్కొన్నారు. ఏఐసీసీ, సీడబ్ల్యూసీ తీర్మాణంలో తెలంగాణపై ఎన్నో ఆంక్షలు పెట్టారని పేర్కొంటూ.. సీమాంధ్రకు జాతీయ ప్రాజెక్టు ఇచ్చి మనకు మొండిచేయ్యి చూపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు పంచుతామంటే కుదరని చెప్పాం. ఇప్పుడున్న సెక్రటేరియట్లో 100కు 90శాతం మంది ఆంధ్రా ఉద్యోగులే ఉన్నారు. జనాభా ప్రాతిపదికన అంటే మనవాళ్లు 10శాతమే ఉంటారు. అందుకే ఉద్యోగులకు ఆప్షన్లు లేవని, సీమాంధ్ర ఉద్యోగులు ఆ ప్రాంతానికి వెళ్లిపోవాల్సిందే అని కేసీఆర్ పునరుద్ఘాటించారు. టీడీపీ అధినేత చంద్రబాబు నిజంగా మనిషే అయితే.. ఆప్షన్లపై వైఖరేంటో చెప్పాలని డిమాండ్ చేశారు. పోలవరం డిజైన్ మార్పుతోపాటు తెలంగాణాకు జాతీయ ప్రాజెక్టు గురించి చంద్రబాబు వివరణ ఇవ్వాలని అన్నారు. కాగా, 40 నియోజకవర్గాల్లో సెటిలర్లు ఉన్నారని.. వారి ఓట్లు మాకే అని కాంగ్రెస్ నాయకులు అంటున్నారని పేర్కొంటూ.. సెటిలర్లకు మేం ఎన్నడూ వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. జిద్దుగా మాట్లాడితే ఎక్కడినుంచి వచ్చినవారైనా ఇక్కడివారికే ఓటు వేయాలన్నారు.

టీడీపీ జెండా మనకెందుకు..? మన రాష్ట్రంలో ఇతర పార్టీల జెండాలు ఇంకా అవసరమా..? టీడీపీ జెండా మనకెందుకు..? అని కేసీఆర్ ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు, బీజేపీ నేత వెంకయ్యనాయుడులు కుదిర్చిన బీజేపీ, టీడీపీ పొత్తు వెనుక పెద్ద కుట్ర ఉన్నదన్నారు. నగరం చుట్టూ భూదాన యజ్ఞంలో భూదాన రాంచంద్రారెడ్డి దానంగా ఇచ్చిన లక్షా 14వేల ఎకరాల భూముల్లో లక్ష ఎకరాలను చంద్రబాబు, వెంకయ్యనాయుడు అల్లుడు సహా ఆంధ్రావాళ్లు కబ్జాచేశారని కేసీఆర్ ఆరోపించారు. ఆ భూములు బుక్కపెట్టడానికే దోస్తీ కట్టారన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ భూములను లాక్కుని పేదలకు పంచుతామని కేసీఆర్ స్పష్టం చేశారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన టీడీపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలంగాణలో పోటీ చేస్తున్న ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు వేల కోట్లు పంపిస్తున్నారు.

ఎలాగైనా 20నుంచి 25 సీట్లు గెలిచి టీఆర్‌ఎస్ డైరెక్టుగా అధికారంలోకి రాకుండా కుట్రలు చేస్తున్నారు అని పేర్కొన్నారు. సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేవీపీ ఆశీస్సులతో పొన్నాల లక్ష్మయ్య టీపీసీసీ అధ్యక్ష పదవి తెచ్చుకున్నారని విమర్శించారు. కేవీపీ స్వయంగా తెలంగాణలో పోటీచేస్తున్న కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులకు డబ్బులు పంపిస్తున్నారని ఆరోపించారు.

రాజకీయ అవినీతిని బొందపెట్టాలి.. రాష్ట్రంలో రాజకీయ అవినీతి పెరిగిపోతున్నదని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. మంత్రులు సీబీఐ కేసులు ఎదుర్కోవడం, జైళ్లకు వెళ్లడం ఎప్పుడైనా చూశామా..? అని ప్రశ్నించారు. టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డిపై సీబీఐ కేసులున్నాయి. మరో మాజీ మంత్రి గీతారెడ్డిపై ఆరోపణలున్నాయి. ఐఏఎస్‌లు జైళ్లలో ఉంటున్నారు. ఇంత దుర్మార్గమా..? మంచి రోజులు రావాలి. మంచి పరిపాలన ప్రజలకు అందాలి. రాజకీయ అవినీతిని బొందపెట్టిన రోజునే రాజకీయ విలువలు పెరుగుతాయని కేసీఆర్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవినీతికి పాల్పడితే రక్త సంబంధీకులైనా జైళ్లకు పంపిస్తామని పునరుద్ఘాటించారు.

పంపకాలింకా అయిపోలేదు.. ఆంధ్రోళ్లతో పంచాయతీ ఇంకా ముగియలేదని కేసీఆర్ అన్నారు. జూన్ 2 నుంచి నీళ్లు, ఉద్యోగాలు, అస్తులు, అప్పులు పంపకం ఉంటుందని, మన వాటా కోసం నిలబడి కొట్లాడాల్సి ఉందన్నారు. కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించుకుంటే వాళ్లు సీమాంధ్ర నేతల వద్ద చేతులు కట్టుకుంటారు.. ఆంధ్రోళ్లకు సద్దులు కడతరని విమర్శించారు. తెలంగాణాలో టీఆర్‌ఎస్ ఎంపీలందరినీ గెలిపించుకోవాలని.. అప్పుడే ఢిల్లీ మెడలు వంచి మన వాటా సాదించుకోవడం సాధ్యమైతుందన్నారు. ఈ విషయంలో ఏమరపాటుగా ఉండొద్దని.. రెండు ఓట్లు టీఆర్‌ఎస్ కారు గుర్తుకే వేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు.

డబ్బు సంచులు పంపిస్తున్నారు..: ఈటెల తెలంగాణ ప్రాంతంలో టీఆర్‌ఎస్ అభ్యర్థులను ఓడించే లక్ష్యంతో సీమాంద్ర ప్రాంతానికి చెందిన సంపన్న రాజకీయ నాయకులు వేలకోట్ల రూపాయల డబ్బు సంచులు పంపిస్తున్నారని టీఆర్‌ఎస్ నేత ఈటెల రాజేందర్ అన్నారు. మద్యం ఏరులై పారిస్తున్నారని, డబ్బు సంచులు పంపుతున్నారని ఈటెల నిప్పులు చెరిగారు. ప్రధానంగా సిద్దిపేట, హూజురాబాద్, గజ్వేల్, మెదక్ స్థానాలకు ఈ సంచులు వస్తున్నాయన్నారు. తెలంగాణ ఏర్పడకుండా చివరి క్షణం వరకు అడ్డుపడిన చంద్రబాబు అత్యంత దుర్మార్గుడని విమర్శించారు.

అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలంగాణాకు రూపాయి ఇవ్వనని అసెంబ్లీ సాక్షిగా మాట్లాడితే తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు దామోదర, గీతారెడ్డి, ఎమ్మెల్యేలు నర్సారెడ్డిలు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఎందరో విద్యార్థులు ఆత్మబలిదానాలకు పాల్పడినా స్పందించిన చంద్రబాబు నాయుడు విజయవాడలో సారాతాగి ఒకరు మృతి చెందితే హెలిక్యాప్టర్‌లో వెళ్లి పరామర్శించారని గుర్తు చేశారు. తెలంగాణలో జరుగుతున్నది ధర్మానికి, అధర్మానికి మధ్య పోరాటమని టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించుకోవాలని ఈటెల పిలుపునిచ్చారు.

తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర లేదా..?: హరీశ్‌రావు తెలంగాణా ఏర్పాటులో కేసీఆర్ పాత్ర లేదంటూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా పేర్కొనడం విచిత్రంగా ఉన్నదని టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. సకల జనుల సమ్మె, కేసీఆర్ ఆమరణ దీక్ష అబద్ధమా..? అని ప్రశ్నించారు. పదవులను గడ్డిపోచలా వదులుకుని, కేసీఆర్ ఆమరణ దీక్షతో దిగివచ్చిన కేంద్రమంత్రి చిదంబరం కేసీఆర్ దీక్ష విరమించమని కోరడం అబద్ధమా..? అని ప్రశ్నించారు. కాంగ్రెస్, టీడీపీ నాయకులు పూటకో మాట మాట్లాడుతున్నారని, నోట్ల కట్టలు, లిక్కర్ బాటిళ్లతో ఓటర్ల మనసు మార్చాలనుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఎన్ని చేసినా తెలంగాణ ఓటర్ల మనసు మార్చలేరని పేర్కొన్నారు. గజ్వేల్‌లో కేసీఆర్ లక్ష ఓట్ల మెజార్టీతో విజయం సాధిస్తారని హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధిస్తారన్నారు. ఇంకా కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి రమణాచారి, పార్టీ జిల్లా ఇన్‌చార్జి రాజయ్యయాదవ్, జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, రామలింగారెడ్డి, నాయకులు చింత ప్రభాకర్, మదన్‌రెడ్డి, గజ్వేల్ నియోజకవర్గ ఇన్‌చార్జి భూంరెడ్డి నాయకులు ఎలక్షన్‌రెడ్డి , మాదాసు శ్రీనివాస్ పాల్గొన్నారు.

గజ్వేల్‌పై కేసీఆర్ వరాలజల్లు గజ్వేల్ నుంచి పోటీచేయాలని తనకు తానుగా నిర్ణయించుకోలేదని, ప్రజాభీష్టం మేరకు.. పార్టీలకతీతంగా అందరూ ఇక్కడినుంచి బరిలో దిగాలని ఆహ్వానించారని కేసీఆర్ చెప్పారు. భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. తాను పోటీ చేస్తున్న గజ్వేల్‌కు ఏదీ కావాలంటే అది చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రిగా ఉన్నప్పుడే మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైను మంజూరు చేయించానని, అప్పటి ముఖ్యమంత్రి దుర్మార్గుడైన వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ల్యాండ్ సర్వే చేయకుండా అడ్డుపడ్డాడని గుర్తు చేశారు.

ప్రతి సంవత్సరం రూ.40 కోట్లు మంజూరు అవుతున్నా సర్వే పనులు సాగడం లేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైల్వేలైను పనులు పూర్తి చేయిస్తానని, గజ్వేల్ నియోజకవర్గంలోని రెండున్నర లక్షల ఎకరాలకు సాగునీరందిస్తామని హామీ ఇచ్చారు. మిడ్‌మానేరు నుంచి సిద్దిపేట మీదుగా తుర్కపల్లికి కాలువల ద్వారా నీళ్లు రప్పించి అక్కడ 30 టీఎంసీల సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మిస్తామని, అక్కడి నుంచి బూర్గుపల్లి, తిప్పారం నుంచి కాలువల ద్వారా పాములపర్తికి నీళ్లు తరలిస్తామని కేసీఆర్ చెప్పారు. ఇజ్రాయిల్ టెక్నాలజీతో గజ్వేల్‌లో వ్యవసాయ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేస్తామన్నారు. తెలంగాణ సీడ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి విత్తనాలు ఉత్పత్తి చేసి వివిధ దేశాలకు సరఫరా చేస్తామని కేసీఆర్ వెల్లడించారు.

రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కల్పిస్తామని, 80 శాతం సబ్సిడీపై గ్రీన్‌హౌస్ కల్టివేషన్ సౌకర్యం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రాంతంలో పంటల కాలనీలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతులకు లక్ష రూపాయల పంట రుణాలను మాఫీ చేస్తామని, డ్వాక్రా మహిళల రుణపరిమితిని రూ.8 లక్షలకు పెంచుతామని, రూ3 లక్షలతో డబుల్ బెడ్‌రూం నిర్మించి ఇస్తామన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పోలీస్ శాఖలో ఎపీఎస్పీ, ఏఆర్, సివిల్ ఇలా రకరకాల వ్యవస్థలు ఉండబోవని అన్నింటిని ఒకే గొడుకు కిందకు తెస్తామని కేసీఆర్ వెల్లడించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.