Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గమనంలో అదే విశ్వాసం

అది 2009. కార్యక్షేత్రం ఢిల్లీ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ప్రకటన కోసం కేంద్రంపై తీవ్రమైన యుద్ధం చేస్తున్న తరుణం. మిత్రులతో కలిసి కేసీఆర్‌ను కలిసేందుకు ఢిల్లీ వెళ్లాం. దీర్ఘాలోచనలో ఉన్న ఆ ఉద్యమ రథసారథి ‘తెలంగాణ అత్యంత తొందరలోనే వస్తుంది. మనం మన ప్రజలకు అద్భుత పాలన అందించాలి. తెలంగాణ రాష్ట్రం ప్రకటించిన తక్షణం ప్రతి గ్రామానికీ ‘మిలిటరీ’ని దింపాలి. ఒక్కో ఇంట్లో నివసిస్తున్న ప్రతి ఒక్కరి స్థితిగతులు సర్వే చేసి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే పాలన మొదలుపెట్టాలి’.. ఇలా అన్నా రు. ఆ అధినాయకుని మాటలు వింటున్న నేను ఆనందాశ్చర్యాల్లో మునిగిపోయాను. తనపై తనకు ఎంత నమ్మకం! తన సారథ్యంలో సాగుతున్న ఉద్యమంపై ఎంతటి విశ్వాసం!! తనపై విశ్వాసం ఉంచిన తన ప్రజలపై ఎంతటి బాధ్యత!!!.

రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాలనా పగ్గాలు చేపట్టిన మరుక్షణమే కార్యరంగంలోకి దుమికారు కేసీఆర్‌. ప్రజల తక్షణావసరాలు తీర్చే సంక్షేమం, దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే అభివృద్ధి… ఈ జోడెడ్ల బండిని పరుగులు తీయించారు. 2014లో కేసీఆర్‌ నాయకత్వంలో మొట్టమొదటి ప్రభుత్వం ఏర్పడినాక ఏడాది కాలానికి తెలంగాణలో సమర్థులైన నాయకుల్లేరు. ప్రత్యేక రాష్ట్రం ప్రకటిస్తే పాలించడం చేతకాదన్న నోళ్లే కేసీఆర్‌ పాలనా తీరును పొగడటానికి క్యూ కట్టాయి.

ప్రజలతో, ప్రజల కోసం ఎన్నుకోబడిన పాలకులు తమ పాలన ప్రజలకు అందుబాటులో ఉండాలనే సోయి లేకుండా ప్రభుత్వాలు నడిపారు. ఇలాంటి పాలనా వ్యవస్థలోనే విప్లవాత్మక మార్పు లు తీసుకురావాల్సిన అవసరం ఉందని గ్రహించిన కేసీఆర్‌ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు.

రేషన్‌ కార్డు, ఇంటి పట్టాల కోసం ఉన్నతాధికారులను కలిసేందుకు కష్టనష్టాలకోర్చి వందల కిలోమీటర్ల దూరం వెళ్లినా, సంబంధిత అధికారి కలుస్తాడనే నమ్మకం ఉండేది కాదు. అందుకే రాష్ట్రం వచ్చిన వెంటనే ముందుగా పాలన ప్రజలకు అందుబాటులోకి తేవాలని సంకల్పించారు. అందుకుగాను ప్రజల స్థితిగతులు తెలుసుకోవడానికి దేశంలో ఏ ప్రభుత్వం చేయనివిధంగా ప్రజా కోణంలో ఆలోచించి ‘సమగ్ర కుటుంబ సర్వే’ను నిర్వహించారు. ‘సమగ్ర కుటుంబ సర్వే’ ఫలితంగా తెలంగాణలో పాలనా సంస్కరణలకు, విప్లవాత్మకమైన ఆలోచనకు తొలి అడుగువేసినట్లయింది.

రెవెన్యూ వ్యవస్థను నాటి పాలకులు భ్రష్టుపట్టించిన తీరు, ప్రజలను పీల్చిపిప్పి చేసేలా ఉన్న చట్టాలను గతంలో ఏ నాయకుడూ పట్టించుకోలేదు. అందుకే రైతులు, పేదలు గుంట భూమి కొని తమ పేరుతో పట్టా చేసుకోవాలంటే, రికార్డులో దొర్లిన తప్పులు సరిచేసుకోవాలంటే నానా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. రైతులకు ఆ సమస్యలు లేకుండా చేసేందుకే కొత్త రెవెన్యూ చట్టాన్ని తెచ్చిందీ ప్రభుత్వం. కొత్త రెవెన్యూ చట్టాల పట్ల యావత్‌ తెలంగాణ ప్రజానీకం సంతృప్తి వ్యక్తం చేస్తున్నది. అందుకే కేసీఆర్‌కు పాలాభిషేకాలు చేస్తూ మద్దతు ప్రకటిస్తున్నారు.

ప్రజానుకూల పాలనకు, అప్రజాస్వామిక అడ్డంకులే అసలు సమస్య. ఈ అడ్డంకులు ఇటీవలి కాలంలో ఇటు స్థానికంగాను, అటు కేంద్ర స్థాయిలోనూ గతంలో లేనివిధంగా శ్రుతిమించుతున్నాయి ఇవాళ. కేంద్రీకృత ఆధిపత్యం కోసం అర్రులు చాస్తున్న కేంద్ర పాలకులు రాష్ర్టాల హక్కులను హరించివేస్తూ, ఆర్థిక సంక్షోభాన్ని సృష్టిస్తున్నారు. రాష్ర్టాలను మున్సిపాలిటీల స్థాయికి దిగజార్చి అధర్మ పెత్తనం కోసం అనేక కుట్ర లు పన్నుతున్నారు. ప్రధాన వనరులు, నిర్ణయాధికారాలు కేంద్ర పాలకుల చెంత కొలువుదీరిన పరిస్థితి. ఇప్పుడు కష్టాలమయమైన కాషాయ పాలనలో కేంద్రాధిపత్యం వెర్రితలలు వేస్తున్నది. రాష్ట్ర పాలకునిపై రాజకీయ కక్ష సాధించేదుకు రాష్ట్ర ప్రజలను ఆర్థికంగా రాచిరంపాన పెడుతున్నది. అంతిమంగా తెలంగాణ ప్రజలకు తీరని ద్రోహం చేస్తున్నది కేంద్ర ప్రభుత్వం.

స్వలాభ, విద్వేష, విభజన, వ్యాపార రాజకీయాలు నడిపే ప్రత్యర్థులందరూ ఏకమై చుట్టు ముట్టినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా బెదిరే క్యారెక్టర్‌ కాదు కేసీఆర్‌ది. శత్రుమూక చిన్నదేమీ కాదు. వారి శక్తిసామర్థ్యాలూ సామాన్యమైనవి కావు. వాస్తవానికి ఈ శతృమూకకు గనుక చిత్తశుద్ధి ఉంటే, ప్రజల ఎడల కనీస ప్రేమానురాగాలు ఉండి ఉంటే, మన రాష్ట్రం ఇప్పుడు సాధించిన అభివృద్ధి కన్నా పది రెట్లు అభివృద్ధి సాధించి ఉండేది.

అనంతమైన ఈ అభివృద్ధి పయనంలో అడ్డంకులు సహజం. అయితే, ఈ అడ్డంకులు అపజయాలై మనల్ని వెక్కిరించకూడదు. మన బిడ్డల బంగారు భవిష్యత్తుకు శరాఘాతం కాకూడదు. అలా కాకుండా ఉండాలంటే ప్రజలపై ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ గుంటనక్కలపై అణుక్షణం ఒక కన్నేసి ఉండాలి. తోడేళ్ల పన్నాగాలను ఎప్పటికప్పుడు ప్రజల ముందుంచాలి. ప్రజా వ్యతిరేకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ప్రజా పాలనకు ఎప్పటికప్పుడు అండగా నిలవాలి. సమస్య మన బతుకుల్లో ఉంటే పరిష్కారం మన చేతుల్లోనే ఉందని ప్రజానుకూలురంతా ఒక్కటై నిరూపించాలి.

-చంటి క్రాంతి కిరణ్
ఆందోల్ ఎమ్మెల్యే

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.