Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గాంధీ తర్వాత కలామే..

-జీవితాంతం దేశంకోసమే తపించిన వ్యక్తి -మాజీ రాష్ట్రపతి సేవలు అందరికీ ఆదర్శం -పేదల గురించి ఆలోచించటమే కలాంకు ఘన నివాళి -డీఆర్‌డీఎల్‌లో కలాం జయంతివేడుకల్లో సీఎం కేసీఆర్ -కలాం మిసైల్ కాంప్లెక్స్‌గా డీఆర్‌డీఎల్‌కు నామకరణం -కలాం విగ్రహాన్ని ఆవిష్కరించిన సీఎం

CM KCR addressing at the Unveiling of Dr APJ Abdul Kalam statue at DRDO

నిరుపేద కుటుంబం నుంచి వచ్చి అత్యున్నతమైన రాష్ట్రపతి పదవిని అలంకరించిన ఏపీజే అబ్దుల్ కలాం దేశ ప్రజలందరికీ ఆదర్శప్రాయుడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. ఆయన జీవితాంతం దేశాభివృద్ధి కోసం తపించారని కొనియాడారు. ఒక్క నిమిషం పేదల గురించి ఆలోచించగలిగితే కలాంకు ఘన నివాళి అర్పించినట్లేనని పేర్కొన్నారు. అబ్దుల్ కలాం 84వ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ కంచన్‌బాగ్‌లోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబొరేటరీస్ (డీఆర్‌డీఎల్) ఎదుట ఏర్పాటుచేసిన అబ్దుల్ కలాం విగ్రహాన్ని సీఎం కేసీఆర్ గురువారం ఆవిష్కరించారు. అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో సీఎం ప్రసంగించారు.

కలాం విగ్రహాన్ని ఆవిష్కరించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. భారత్ గొప్పతనాన్ని ప్రపంచానికి తెలియజెప్పిన మహోన్నత వ్యక్తి కలాం అని కీర్తించారు. హైదరాబాద్‌లోని డీఆర్‌డీఎల్‌లో అయిదు రకాల క్షిపణులు తయారుచేసి ఆయన మిసైల్ మ్యాన్‌గా గుర్తింపు పొందారని అన్నారు. ఇస్రోలో ముఖ్యపాత్ర పోషించిన కలాం అక్కడి నుంచి హైదరాబాద్ డీఆర్‌డీఎల్‌కు డైరెక్టర్‌గా వచ్చి పదేండ్లపాటు పనిచేశారని గుర్తుచేశారు. ఇక్కడ పనిచేసినంతకాలం ఒక చిన్న గదిలో సాదాసీదా జీవితం గడిపారని, రాష్ట్రపతి పదవి దక్కినా పేదలపట్ల ఆదరణ భావాన్ని చూపారన్నారు.

విగ్రహావిష్కరణకు ముందు డీఆర్‌డీఎల్‌లో అబ్దుల్ కలాం నివసించిన ఇంటిని సీఎం సందర్శించారు. హైదరాబాద్ వేదికగా క్షిపణి ప్రయోగాలు చేపట్టి నగరానికి కలాం ఎంతో ఘనకీర్తి తెచ్చిపెట్టారని సీఎం కేసీఆర్ కొనియాడారు. మన స్వాతంత్య్రాన్ని కోల్పోవద్దు, ఇతరుల స్వాతంత్య్రాన్ని హరించొద్దు అనే సూక్తిని కలాం జీవితాంతం ఆచరించారని శ్లాఘించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంకోసం ఉద్యమం ఉధృతంగా సాగిన సమయంలో యూపీఏ కనీస ఉమ్మడి కార్యక్రమం ఆధారంగా తెలంగాణ రాష్ర్టాన్ని ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రపతి అబ్దుల్ కలాం అని సీఎం చెప్పారు. కలాం చనిపోయే ముందు ఆయన సంతకంతో ఓ పుస్తకాన్ని తనకు పంపారని తెలిపారు. దేశ చరిత్రలోనే కాకుండా తన గుండెల్లో కలాం నిలిచి ఉన్నారని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.

గాంధీ తర్వాత కలామే.. అబ్దుల్ కలాం స్మారకార్థం అసెంబ్లీ సమావేశాల ప్రారంభం రోజున ఆయనకు నివాళులు అర్పించడమే కాకుండా డీఆర్‌డీఎల్‌కు కలాం మిసైల్ కాంప్లెక్స్‌గా నామకరణం చేయాలని తీర్మానించామని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. ఇందుకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం కూడా పేరు మార్పునకు అనుమతించడం ఆనందంగా ఉందన్నారు. దేశ స్వాతంత్య్రం కోసం అహింసామార్గంలో ఉద్యమించిన జాతిపిత గాంధీజీ అంతటి మహోన్నత వ్యక్తి అబ్దుల్ కలాం అని కేసీఆర్ కొనియాడారు. ఒకవేళ తన జీవిత చరిత్ర రాస్తే అందులో కలాం చరిత్రను తెలియజెప్పేలా కొన్ని పేజీలుంటాయని పేర్కొన్నారు.

వ్యక్తిగతంగా ఆయన కోరుకోకపోయినా దేశం మొత్తం ఏకగ్రీవంగా కలాం రాష్ట్రపతి కావాలని కోరుకున్నదని అన్నారు. హైదరాబాద్ దవాఖానల్లో గుండెజబ్బులకు స్టెంట్లు వేయించుకోలేక అనేకమంది రోగులు ప్రాణాలు కోల్పోయే వారని, అటువంటి పరిస్థితుల్లో పేదలకు అందుబాటులో ఉండేలా తక్కువ ధరకు స్టెంట్లు తయారు చేయించారని తెలిపారు. అంతేకాకుండా డెంటల్ సర్జరీలో ప్రధానమైన డెంటల్ కిట్లను కూడా తక్కువ ధరలో అందించేలా తయారు చేయించిన ఘనత కలాంకు దక్కిందని కేసీఆర్ చెప్పారు. తాను సియాటిల్ వెళ్లినపుడు క్షిపణి ప్రయోగాలకు ఉపయోగించే పరికరాలు అధికశాతం హైదరాబాద్ నుంచే వస్తున్నాయని అక్కడివారు చెప్పడం హైదరాబాద్‌కు గర్వకారణంగా భావిస్తున్నానన్నారు.

ప్రపంచంలో ఎక్కడ రాకెట్‌ను ప్రయోగించినా అందులో కంచన్‌బాగ్ డీఆర్‌డీఎల్ పరికరాలుంటాయన్నారు. ప్రయోగాలకోసం అతి సున్నితమైన క్షిపణులు, రాకెట్ భాగాలను అందిస్తున్న డీఆర్‌డీఎల్ శాస్త్రవేత్తలు, ఉద్యోగులను సీఎం అభినందించారు. కలాం విగ్రహాన్ని తయారుచేసిన శిల్పి పీవై రాజును సీఎం కేసీఆర్ సన్మానించారు. కేసీఆర్‌ను డీఆర్‌డీఎల్ డైరెక్టర్ కే జయరామన్, సంస్థ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఎల్, డీఆర్‌డీఓ అధికారులు వైవీ రత్నప్రసాద్, భట్టాచార్య, శాస్త్రవేత్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.