Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గెలిస్తే భేష్.. లేదంటే ట్రాష్!

-ఈవీఎంలపై ఇదీ చంద్రబాబు వైఖరి
-ఏపీలో గెలుపెవరిదో ప్రజలకు అర్థమైంది
-2014లో బాబు ఈవీఎంలతోనే కదా గెలిచింది? -అధికారులను బదిలీచేస్తే ఎన్నికల్లో పార్టీలు ఓడిపోతాయా?
-ఓట్ల గల్లంతుపై ఈసీ సమాధానం చెప్పాలి
-పాలనలో సంస్కరణలను ఉద్యోగులు కూడా స్వాగతిస్తారు
-అనుకున్న విధంగానే ఫలితాలు.. 16 ఎంపీ సీట్లు మావే
-కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావు
-పరిషత్ ఎన్నికల తర్వాత పరిపాలన, పార్టీ సంస్థాగతంపై దృష్టి
-మీడియాతో ఇష్టాగోష్ఠిగా టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

ఎన్నికల్లో గెలిస్తే ఈవీఎంలు మంచివి.. లేకుంటే కావా? ఢిల్లీలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు చేస్తున్న వీధినాటకాలు చూస్తున్న ప్రజలకు ఏపీలో ఎవరు గెలువబోతున్నారో అర్థమయిందని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. అధికారులను బదిలీచేస్తే ఎన్నికల్లో పార్టీలు ఎలా ఓడిపోతాయని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలో ఓట్ల గల్లంతుపై ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాలని, ఎన్నికల విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాల్సి ఉన్నదని అన్నారు. ప్రభుత్వశాఖల్లో సంస్కరణలను ఉద్యోగులు తప్పకుండా స్వాగతిస్తారని తెలిపారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీకి పలుచోట్ల డిపాజిట్ కూడా దక్కదని, టీఆర్‌ఎస్ 16 సీట్లు గెలుచుకుంటుందని స్పష్టంచేశారు. స్థానిక ఎన్నికలు ముగియగానే ఇటు పాలనపై.. అటు పార్టీపై దృష్టి సారిస్తామని చెప్పారు. ఆదివారం తెలంగాణభవన్‌లో కేటీఆర్ మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. సమకాలీన రాజకీయఅంశాలపై మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఆయన మాటల్లోనే..

2014లో బాబు ఈవీఎంలతోనే కదా గెలిచింది?
స్థానిక సంస్థల ఎన్నికలు బ్యాలెట్ పేపర్ ద్వారా జరుగుతాయి. శాసనసభ, పార్లమెంట్ ఎన్నికలు ఈవీఎంల ద్వారా జరుగుతాయి. దేశానికి ఐటీని తెచ్చానని చెప్పుకునే చంద్రబాబు ఈవీఎంలకు వ్యతిరేకంగా మాట్లాడటం బాధాకరం. 2014లో ఆయన గెలిచింది ఈవీఎంల ద్వారా జరిగిన ఎన్నికల్లోనే కదా? గెలిస్తే ఈవీఎంలు మంచివి.. లేకుంటే కాదా? ఇదేం పద్ధతి. చంద్రబాబు మాట తీరుచూస్తుంటే నాకే కాదు.. సామాన్య టీడీపీ కార్యకర్తకు కూడా ఆయనకు ఓటమి తప్పదని అర్థమవుతున్నది. ఓటమికి కుంటిసాకులు వెతుక్కుంటున్నారని అనుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభు త్వం ఉన్నది. ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ గెలిచింది. తెలంగాణలో టీఆర్‌ఎస్ గెలిచింది. నిజంగా ఈవీఎంలను టాంపరింగ్ చేసి ఉంటే ఇది ఎలా సాధ్యమైతది. బీజేపీనే గెలిచేదికదా? చంద్రబాబు చిల్లరమల్లర వాదనలు ఆయన గౌరవానికి, ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. 42వేల ఈవీఎంల్లో 300 ఈవీఎంలు పనిచేయకుంటే 30శాతం పనిచేయడంలేదని మాట్లాడటం ముఖ్యమంత్రిగా ఆయన స్థాయికి తగనిది. ఎన్నికల్లో రాజకీయపార్టీలు ప్రజల తిరస్కారానికి అవసరమైతే సంసిద్ధంగా ఉండాలి. టీఆర్‌ఎస్ కూడా 2009లో ఓడిపోయింది. 2008 ఉపఎన్నికల్లో ఎదురుదెబ్బలు తిన్నాం. ధీరోదాత్తంగా ఒప్పుకున్నాం.. తప్పుకున్నాం. ఒకవేళ 2018 ఎన్నికల్లో ఓడిపోయి ఉంటే ప్రజల తీర్పును గౌరవించేవాళ్లం. ప్రజాస్వామ్యంలో ఆ హుందాతనం ఉండాలి.

ప్రపంచమంతా ఏకమై ఓడించారంటారు.. 130 సీట్లొస్తాయంటారు?
అధికారులను బదిలీచేస్తే ఎన్నికల్లో పార్టీలు ఓడిపోతాయా? 2009లో అప్పటి డీజీపీ ఎస్‌ఎస్‌పీ యాదవ్‌ను మారిస్తే వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ఓడిపోలేదు కదా? చంద్రబాబు ఒకవైపు ఈవీఎంల మీద ఆరోపణలు, మరోవైపు ప్రపంచమంతా ఏకమై నన్ను ఓడించేందుకు యత్నించారంటారు. అయినా 130 సీట్లు వస్తాయని ఆయనే అంటారు. ప్రజలు అనుకూలంగా ఉంటే ఇంత అరుపులు పెడబొబ్బలు ఎందుకు? ఢిల్లీలో వీధి నాటకాలు ఎందుకు? అధికారులు నీకు తొత్తులుగా పనిచేయాల్నా? ఏ ఒక్క పథకంతోనే ఏ పార్టీ అధికారంలోకి రాదు. అది రైతుబంధు అయినా.. పసుపు కుంకుమ అయినా అంతే. అధికారంలోకి రావాలన్నా.. తిరిగి అధికారాన్ని కైవసం చేసుకోవాలన్నా ఎన్నో కారణాలు, ఎన్నో కోణాలు ఉంటాయి. ప్రజలు ఒక్కొక్కరు ఒక్కో కారణంతో ఓటేస్తారు. అందరికీ సంతృప్తికరస్థాయిలో సంక్షేమ, అభివృద్ధి ఫలాలు అందాయా లేదా చూస్తారు. తెలంగాణ ఉద్యమ సమయం లో ఆంధ్రజ్యోతి పత్రికలో జాహ్నవి అనే మారుపేరుతో తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాసాలు రాసింది ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ వెంకటేశ్వర్‌రావు కాదా? ఒక ప్రాంతానికి, ఒక కులానికి తొత్తుగా వ్యవహరించే వ్యక్తి అధికారిగా తగునా? దానికి ఫిర్యాదు చేస్తే తప్పు? ఇవి ఎత్తి చూపితే బాధ.

ఏపీలో ఎవరు గెలువబోతున్నారో అర్థమైంది..
ఏపీలో ఎవరు గెలువబోతున్నారో చంద్రబాబు వీధి నాటకాలతో ప్రజలకు, ప్రపంచానికి అర్థమైంది. చంద్రబాబు.. కేసీఆర్, జగన్‌ను మోదీ పెంపుడు కుక్కలు అంటాడా? బుద్ధిఉందా? ఎవరు ఎవరి పెంపుడు కుక్క. నాలుగేండ్లు మోదీ సంకనాకినవా అని మేము కూడా అనొ చ్చు? నేను ఏదైనా మాట్లాడుతా? ఇంకోడు ఏం అనకూడదు అంటే ఎలా? ఆయన ఎన్నిమాటలన్నా జగన్, కేసీఆర్ ఒక్కమాటైనా అన్నారా? ఈ రకంగా మాట్లాడటం చంద్రబాబు కుసంస్కారానికి, ఆయనలో అసహనానికి నిదర్శనం. వంగివంగి దండాలు పెట్టడం, ఆయన నక్క వినయాన్ని చూశాకే ఎన్నికల్లో ప్రజలు తీర్పుఇచ్చారు. ఒకవేళ చంద్రబాబు గెలిస్తే కుట్రలను ఛేదించి గెలిచానని అంటాడేమో?

మున్సిపల్ మినహా అన్ని ఎన్నికలు పూర్తి
మే 20 కల్లా పరిషత్ ఎన్నికలు పూర్తయ్యే అవకాశం ఉన్నది. దీంతో ఒక్క మున్సిపల్ మినహా దాదాపు అన్ని ఎన్నికలు పూర్తయినట్టే. కొత్త మున్సిపల్ చట్టం తీసుకురావాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. సామాన్యులను లంచమనే జాఢ్యం వెంటాడుతున్నది. దీనిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. అవినీతి బాధ ఉండకూడదనే పటుత్వంతో కొత్త మున్సిపల్ చట్టాన్ని పటిష్ఠంగా తీసుకొస్తాం. జీహెచ్‌ఎంసీకి ప్రత్యేక చట్టం కొనసాగుతది.

ఇక పరిపాలన, పార్టీ సంస్థాగతంపై దృష్టి
పరిషత్ ఎన్నికలు ముగియగానే పరిపాలనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాలనేది సీఎం కేసీఆర్ ఆలోచన. ఎన్నికల కోడ్ పరిపానలకు అడ్డురాకుండా ఉంటుంది. వరుస ఎన్నికలను పాజిటివ్ కోణంలో చూడాలి. ఇక నాలుగున్నరేండ్లపాటు ఎలాంటి ఎన్నికలు ఉండవు.. కోడ్‌లు ఉండవనే విషయాన్ని గుర్తించాలి. కేసీఆర్ పరిపాలన చూసుకుంటారు. పార్టీపరంగా సభ్యత్వ నమోదు, కమిటీలు, శిక్షణ శిబిరాలు, నూతన కార్యాలయాల నిర్మాణంలాంటివి మేం చూస్తాం. సంస్థాగతంగా పూర్తిస్థాయిలో నిర్మాణంపై దృష్టిపెడతాం. పరిషత్ ఎన్నికలు ఉన్నందున పార్టీ ఆవిర్భావ దినోత్సవ నిర్వహణపై సీఎం కేసీఆర్ ఇంకా ఏ నిర్ణయం తీసుకోలేదు. తెలంగాణలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరిగిన తీరే మా పరిపాలనకు తార్కాణం. రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతుంటే చార్మినార్ దగ్గర పిల్లలు క్రికెట్ అడుకుంటున్నారు. అంత ప్రశాంతంగా ఎన్నికలు జరిగాయి. కానీ పక్క రాష్ట్రం ఏపీలో కొట్టుకుచస్తున్నారు. హత్యల దాకా పోయింది అక్కడ పరిస్థితి.

మెదక్‌లోనే అత్యధిక మెజార్టీ
పార్లమెంట్ ఎన్నికల్లో ముందు అనుకున్నట్లుగానే 16 సీట్లు గెలుచుకుంటాం. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అచరణ కూడా ప్రారంభించాం. కొత్త జిల్లాలు, మండలాలు ఏర్పాటుచేశాం. అసరా పింఛన్లకు సంబంధించి బడ్జెట్‌లో కేటాయింపులు జరిపాం. రైతు రుణమాఫీ, రైతుబంధుకు సంబంధించి పెంచిన మొత్తాన్నీ బడ్జెట్‌లో పెట్టాం. దీంతో కేసీఆర్ ప్రభుత్వం హామీలను నిలబెట్టుకుంటుందనే విశ్వాసం ప్రజల్లో కలిగింది. టీఆర్‌ఎస్‌కు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలోనే అత్యధిక మెజార్టీ వస్తుంది. ఆ తరువాతి స్థానంలో వరంగల్ ఉండే అవకాశం ఉన్నది. మెదక్‌లో వార్‌వన్ సైడ్ నడస్తుంది. కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ప్రచారం బంద్‌చేసి కూర్చున్నరు. అ రెండుపార్టీలకు కూడా రావు. రాష్ట్రంలో కాంగ్రెస్ కొన్నిచోట్ల మూడోస్థానానికి పడిపోయింది. ఈ పరిస్థితి ఎందుకొచ్చిందో వారే ఆత్మవిమర్శచేసుకోవాలి. కొన్నిచోట్ల కాంగ్రెస్, మరికొన్నిచోట్ల బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతు కాబోతున్నాయి. నిజామాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ పార్లమెంట్‌లో కాంగ్రెస్‌శ్రేణులు బీజేపీకి ఓటు వేయించాయి. అభ్యర్థులు దొరక్క ఓడిపోయినవారిని పోటీకి పెట్టారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఖాయం. తెలంగాణ సమాజం బీజేపీని ఆదరిస్తదని అనుకోను. ఎందుకంటే తెలంగాణలో మొదటినుంచీ తిరుగుబాటుతత్వం ఉంటది. ఛాందసవాదాన్ని ఆమోదించే స్వభావం ఇక్కడలేదు. ఆ పార్టీ ఉన్న ఒక్క ఎంపీ సీటు కూడా ఓడిపోబోతున్నది.

సంస్కరణలను ఉద్యోగులు కూడా స్వాగతిస్తారు..
రాష్ట్రంలో అవినీతిరహిత పాలన అందించేందుకు సంస్కరణలు తేవాలి. ఉద్యోగులు కూడా వాటిని స్వాగతిస్తారనే అనుకుంటున్న. ప్రజలతోటి ప్రభుత్వం ఎందుకు తిట్లుపడాలి అని కేసీఆర్ అన్నారు. అధికారులు అందరూ చెడ్డవారు కారు. కొందరి వల్ల అందరికీ చెడ్డపేరు ఎందుకు రావాలి. పరిపానలలో సంస్కరణలు, పారదర్శకత తీసుకువస్తే ప్రజలకు ఇక్కట్లు తగ్గుతాయి. మార్పుఅనేది అత్యంత సహజమైన విషయం. కాలానుగుణంగా అది జరుగాలి. ఇందుకు ఉద్యోగులు సహకరిస్తారనే అనుకుంటున్నాం. రెవెన్యూ ఉద్యోగుల్లో కూడా సింహభాగం మంచి వాళ్లు ఉన్నరు. నాలుగుకోట్ల మంది ప్రజల సంక్షేమమే ముఖ్యం.

ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి
ఎన్నికల సంఘం విధుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ఓటర్ల జాబితా సవరణలో కూడా. అయితే, ఓటుహక్కు వినియోగించుకునే సమయంలో ఓటర్లు అనేకమంది తమ ఓటులేదంటూ ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఇది ఎందుకు జరుగుతుందనేది ఎన్నికల సంఘమే సమాధానం చెప్పాలి. ప్రభుత్వాల జోక్యం, ప్రమేయం లేకుండా ఎన్నికల అధికారులే ఓటరు జాబితా తయారుచేస్తున్నారు. ప్రతి ఎన్నికల్లోనూ ఓట్ల గల్లంతుపై దేశవ్యాప్తంగా చర్చజరుగాలి. ఒకరికి ఒక్కచోటే ఓటు ఉండాలి. కానీ కొద్దిమందికి మూడు నాలుగు చోట్ల ఓట్లు ఉంటున్నాయి. ప్రజలు ఓటువేయడానికి రాకపోవడానికి కారణంపై రాజకీయపార్టీలు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ప్రజలు అనాసక్తిగా ఎందుకు ఉన్నారో ఆలోచించాలి. సెల్ఫ్‌చెక్కు మీద బీజేపీ రూ.8 కోట్లు బ్యాంక్‌లో డ్రా చేసింది. రూ.40 వేలు ఇవ్వాలంటే సామాన్యుడిని నానా తిప్పలు పెట్టే బ్యాంకులు ఒకేసారి రూ.8 కోట్లు ఎలా ఇస్తాయి?

కొత్త మున్సిపల్ చట్టం తీసుకురావాలని సీఎం కేసీఆర్ యోచిస్తున్నారు. సామాన్యులను లంచమనే జాడ్యం వెంటాడుతున్నది. దీనిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయాలని సీఎం పట్టుదలతో ఉన్నారు. అవినీతి బాధ ఉండకూడదనే పటుత్వంతో కొత్త మున్సిపల్ చట్టాన్ని పటిష్ఠంగా తీసుకొస్తాం. జీహెచ్‌ఎంసీకి ప్రత్యేక చట్టం కొనసాగుతది.

టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.