Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గెల్లు.. కేసీఆర్‌ విల్లు

-పక్కా ఉద్యమకారుడికే టీఆర్‌ఎస్‌ పట్టం
-కేసీఆర్‌ ఉద్యమ బాణం

ఉద్యమనేత కేసీఆర్‌ ఇచ్చిన పిలుపుమేరకు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ తెలంగాణ పోరాటంలో బాణంలా దూసుకుపోయారు. 2010 హుజూరాబాద్‌ ఉప ఎన్నికల సందర్భంగా ప్రజాచైతన్య బస్సుయాత్ర నిర్వహించారు. 2011 మార్చి 1 మౌలాలీ స్టేషన్‌ అప్పటి ఉద్యమకారుడు, ప్రస్తుత టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌తో కలిసి 48 గంటల రైల్‌రోకోలో పాల్గొన్నారు. 2011 మార్చి 10న చరిత్రాత్మక మిలియన్‌ మార్చ్‌లో భాగస్వామి అయ్యారు. 2011 జులై 21న అమరవీరుడు యాదిరెడ్డి ఆత్మాహుతికి నిరసనగా ఓయూ నుంచి ర్యాలీ నిర్వహించినందుకు అప్పటి ప్రభుత్వం గెల్లును అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు పంపింది. 2011 నవంబర్‌ 1న ఏపీ అవతరణ దినోత్సవాన్ని నిరసిస్తూ ‘చలో గన్‌ పార్‌’ నిర్వహించారు. 2011 నవంబర్‌ 16-22న కేటీఆర్‌తో కలిసి ‘వికారాబాద్‌- కుత్బుల్లాపూర్‌ పాదయాత్ర’లో పాల్గొన్నారు. 2011 నవంబర్‌లో తార్నాక ఫె్లైఓవర్‌ వద్ద చంద్రబాబు వరంగల్‌ జిల్లా పాలకుర్తిలో జరిపిన రైతుయాత్ర’కు నిరసనగా ఆందోళనచేయడంతో 20 రోజుల పాటు చర్లపల్లి జైలులో పోలీసులు నిర్బంధించారు. 2012 సెప్టెంబర్‌ 30న సాగరహారం కార్యక్రమంలో మహార్యాలీ చేశారు. 14 ఎఫ్‌ క్లాజ్‌ను తొలగించాలని ఆందోళన నిర్వహించారు. 2012లో చలో సెక్రటేరియట్‌ పేరుతో సకలజనుల సమ్మెకు మద్దతుగా ర్యాలీ నిర్వహించారు. 2013 సెప్టెంబర్‌ 7న ఏపీ ఎన్జీవోల ‘సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌’ మీటింగ్‌కు వ్యతిరేకంగా ఆందోళన చేసి అరెస్టు అయ్యారు.

జిల్లా చరిత్రలో యాదవబిడ్డకు అరుదైన గౌరవం..
హుజూరాబాద్‌ అభ్యర్థిగా గెల్లు ఎంపిక.. కరీంనగర్‌ ఉమ్మడి జిల్లా చరిత్రలో యాదవ బిడ్డకు దక్కిన అరుదైన గౌరవంగా భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లా చరిత్రలోనే ఇప్పటి వరకు ప్రధాన పార్టీలు.. తమ అభ్యర్థిగా యాదవ బిడ్డను బరిలోకి దింపిన దాఖలాల్లేవు. నిజానికి ఉమ్మడి జిల్లాలో వారి జనాభా సుమారు 15 నుంచి 20 శాతం ఉన్నా.. ఇన్నాళ్లూ వారిని ఓటు బ్యాంకుగానే వాడుకున్నారే తప్ప.. ఏనాడూ వారికి ప్రాతినిథ్యం కల్పించే దిశగా ఏ రాజకీయ పార్టీ ఆలోచన చేయలేదు. కానీ, సీఎం కేసీఆర్‌.. గొల్లకురుమలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సబ్సిడీపై గొర్రెలను ఇస్తున్నారు. ఒకనాడు పాలేర్లుగా ఉన్న ఎంతోమంది నేడు యజమానులుగా మారారు. ఈ నేపథ్యంలో గెల్లు శ్రీనివాసయాదవ్‌కు టికెట్‌ ఇవ్వటం.. యాదవ సామాజిక వర్గానికి మరింత చేయూతనిచ్చినట్లయిందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఉస్మానియా వర్సిటీలో ఉద్యమ పాఠాలు
-టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు

గెల్లు శ్రీనివాస్‌.. తెలంగాణ విద్యార్థి ఉద్యమాల్లో ఈ పేరు తెలియని విద్యార్థులుండరు. ఉన్నత విద్యావంతుడు. ఉద్యమసారథి, నేటి సీఎం కేసీఆర్‌ పిలుపు మేరకు వీరోచితంగా పోరాడిన ఉద్యమకారుడు. సమైక్యపాలనలో పదుల సంఖ్యలో పోలీసు కేసులను ఎదుర్కొన్నవాడు. అందుకు 36 రోజులపాటు జైలుజీవితం అనుభవించినవాడు. వందల లాఠీదెబ్బలు తిన్న హుజూరాబాద్‌ బిడ్డ. 120 కేసులు నమోదైనా వెన్నుచూపని నాయకుడు. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ది హుజూరాబాద్‌ నియోజకవర్గ పరిధిలోని వీణవంక మండలం హిమ్మత్‌నగర్‌ గ్రామం. తండ్రి మల్లయ్య యాదవ్‌ 1985 నుంచి క్రియాశీల రాజకీయాల్లో ఉన్నారు. మండల స్థాయిలో 1985 నుంచి టీడీపీలో చురుకైన పాత్ర పోషించారు. గెల్లు మల్లయ్య అఖిల భారత యాదవ మహాసభ కన్వీనర్‌గా, కొండపాక ఎంపీటీసీ సభ్యుడిగా, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల ఉపాధ్యక్షుడిగా పనిచేశారు. ఉమ్మడి రాష్ట్రంలోనే జిల్లా యాదవ సహకార సంస్థ డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రస్తుతం పీఏసీఎస్‌ డైరెక్టర్‌గా, రైతుబంధు సమితి కోఆర్డినేటర్‌ (కొండపాక)గా పనిచేస్తున్నారు. గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ తల్లి లక్ష్మి హిమ్మత్‌నగర్‌ గ్రామ సర్పంచ్‌గా (టీఆర్‌ఎస్‌) సేవలందించారు. ఇప్పుడు గెల్లు శ్రీనివాస్‌ హుజూరాబాద్‌ అభ్యర్థిగా టీఆర్‌ఎస్‌ తరఫున పోటీచేస్తున్నారు.

ఉన్నత విద్యావంతుడు.. ఉద్యమకారుడు
గెల్లు శ్రీనివాస్‌ బీసీ వసతిగృహంలో ఉంటూ ఉన్నత విద్యనభ్యసించారు. బీఏ చదువుకొనే రోజుల్లో బీసీ విద్యార్థుల సమస్యలపై పోరాడారు. హాస్టల్‌ విద్యార్థి నాయకుడిగా పనిచేశారు. ఏవీ కాలేజీలో చదువుకొంటున్నప్పుడు ఉద్యమనేత కేసీఆర్‌ ప్రసంగాలకు ఆకర్షితుడై టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగంలో పనిచేశారు. 2003-2006 మధ్య ఏవీ కాలేజీ టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా ఉన్నారు. ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా ఉద్యమా న్ని నడిపి అరెస్టయ్యారు. అదే సమయంలో టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం హైదరాబాద్‌ పట్టణ కార్యదర్శిగా పనిచేశారు. 2003-04లో విద్యార్థుల స్కాలర్‌షిప్పుల కోసం ఇందిరాపార్కు వద్ద జరిగిన ఆందోళనలో పాల్గొన్నారు. నాటి సీఎం చంద్రబాబుకు వ్యతిరేకంగా అనేక ఆందోళనల్లో పాల్గొన్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ హయాంలో స్కాలర్‌షిప్‌ బకాయిలను విడుదల చేయాలని, స్కాలర్‌షిప్‌ మొత్తాన్ని పెంచాలని కోరుతూ నాటి ఆర్థిక మంత్రి రోశయ్య ఇంటిని ముట్టడించి, ధర్నా చేసి అరెస్టయ్యారు. 2006-2007 మధ్యన తెలుగు యూనివర్సిటీ టీఆర్‌ఎస్‌ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేశారు. తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిన సమయంలో సెప్టెంబర్‌ 19, 2006న సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో నాటి విజయవాడ ఎంపీ, తెలంగాణ వ్యతిరేకి లగడపాటి రాజగోపాల్‌ ప్రెస్‌కాన్ఫరెన్స్‌ను నిరసిస్తూ ప్రదర్శన నిర్వహించి అరెస్ట్‌ అయ్యారు. 2006లో కేసీఆర్‌ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసినందుకు మద్దతుగా భవన్స్‌ కాలేజీ విద్యార్థులతో నారాయణగూడలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించి కాంగ్రెస్‌ నేతల దిష్టిబొమ్మలను దహనంచేశారు. 2009లో కేసీఆర్‌ అరెస్టును నిరసిస్తూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం బిల్లు పెట్టాలని డిమాండ్‌ చేస్తూ ఉస్మానియాలో ఉద్యమం చేశారు. 2010 జనవరి 18వ తేదీన ‘తెలంగాణ విద్యార్థి మహా పాదయాత్ర’లో పాల్గొన్నారు. ఉస్మానియా నుంచి కాకతీయ వర్సిటీ వరకు 650 కిలోమీటర్లు సాగిన ఆ పాదయాత్ర.. వేల మంది విద్యార్థులు తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములు అయ్యేందుకు స్ఫూర్తినిచ్చింది. పలు నియోజకవర్గాల్లో జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ విజయానికి కృషిచేశారు. హుజురాబాద్‌లో టీఆర్‌ఎస్‌ గెలుపునకు కీలకంగా పనిచేశారు.

పుట్టిన ప్రాంతంపై పట్టు..శ్రీనివాస్‌కు హుజూరాబాద్‌
నియోజకవర్గంపై మంచి పట్టుంది. ఉద్యమ సమయంలో అనేక ప్రాంతాలు తిరిగారు. అంతేకాదు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇప్పటికే ఈ ప్రాంతంలోని అనేక సమస్యల పరిష్కారంలో తనవంతు పాత్ర పోషిస్తున్నారు. హుజూరాబాద్‌ నుంచి దవాఖానల పనుల మీద వెళ్లే అనేక మందికి ఒక అన్నలా అండగా నిలిచారు. విద్యార్థుల సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.

తెలంగాణ కోసం లాఠీదెబ్బలు తిన్నడు..
నా బిడ్డ చిన్నప్పుడు వీణవంకలనే చదివిండు. పెద్ద సదువుల కోసం పట్నం పోయిండు. హాస్టల్లో ఉన్నడు. మస్తు కష్టపడ్డడు. తెలంగాణ కోసం కొట్లాడిండు. లాఠీ దెబ్బలు తిన్నడు. ఆ నాడు పోలీసులు బాగా కొట్టిన్రు. అయినా నా కొడుకు వెనక్కివోలే. ఇంత దూరమచ్చిండు. ఇప్పుడు నా బిడ్డకు కేసీఆర్‌ సారు ఎమ్మెల్యే టికెట్‌ ఇచ్చిండు. నేను కలలో కూడా అనుకోలె. టికెట్‌ ఇచ్చినందుకు కేసీఆర్‌కు దండం పెడుతున్న. అందరికీ రెండు చేతులా దండం పెట్టి చెప్తున్న. నా బిడ్డకు ఓటేసి గెలిపియ్యాలి. పేదోళ్లకు నాయం చేస్తడు నా కొడుకు.
-లక్ష్మి, గెల్లు శ్రీనివాసయాదవ్‌ తల్లి

అసెంబ్లీకి మరో విద్యార్థి నాయకుడు
హుజూరాబాద్‌ ఉప ఎన్నికకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా టీఆర్‌ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ను ప్రకటించడం సంతోషంగా ఉన్నది. ఆయనకు నా అభినందనలు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న మరో విద్యార్థి నాయకుడు ప్రజాశీర్వాదంతో అసెంబ్లీలో అడుగుపెడతారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను.

–కే తారకరామారావు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

ఉద్యమధీరుడు
గెల్లు శ్రీనివాస్‌ యాదవ్‌ రాష్ట్ర సాధన ఉద్యమంలో అవిశ్రాంత పోరాటం చేసిన గొప్ప ఉద్యమధీరుడు. బీసీ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడి, బీసీల అభ్యున్నతికి కృషి చేసిన యువ కెరటం. ఆయన్ను హుజూరాబాద్‌ ఉప ఎన్నిక అభ్యర్థిగా ఎంపికచేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు. శ్రీనివాస్‌ యాదవ్‌ను అఖండ మెజారిటీతో గెలిపించాలని హుజూరాబాద్‌ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను.

-బాల్క సుమన్‌, ప్రభుత్వ విప్‌

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.