-45 రోజులు కీలకం -పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై కేటీఆర్ వ్యూహం -రెండు సీట్లలో కారును గెలిపించే దిశగా అడుగులు -ఎప్పటికప్పుడు కిందిస్థాయి నాయకులకు దిశానిర్దేశం
రాష్ర్టానికి ప్రపంచస్థాయి కంపెనీలు, పారిశ్రామిక ప్రోత్సాహం, హైదరాబాద్ మహానగర అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన తదితర అంశాలపై దృష్టిపెడుతూ వస్తున్న టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు దృష్టి ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై పడింది. ప్రతిపక్షాలను దీటుగా ఎదుర్కొనేలా, అభివృద్ధి మంత్రంతో ప్రజల్లోకి వెళ్లే వ్యూహాలకు పదును పెడ్తున్నారు. త్వరలో జరుగనున్న హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్, నల్లగొండ-వరంగల్- ఖమ్మం స్థానాల్లో గులాబీ జెండాను రెపరెపలాడించేలా ముందుకు సాగుతున్నారు.
అర్హులైనవారందరికి ఓటు హక్కు కల్పించాలి.. ఓటర్లను చైతన్యపరిచి పోలింగ్‌బూత్‌కు తీసుకురావాలి.. టీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని ప్రజల కండ్లముందుంచా లి.. మ్రొత్తంగా ఎన్నికల రేస్‌లో మరోసారి కారు జోరు కొనసాగాలి. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మంత్రి కేటీఆర్ చేస్తున్న దిశానిర్దేశం ఇది. వచ్చే మార్చిలో జరుగనున్న హైదరాబాద్- రంగారెడ్డి- మహబూబ్‌నగర్, నల్లగొండ-వరంగల్- ఖమ్మం ఎమ్మెల్సీ స్థానాల్లో విజయం సాధించేలా ఆయన పకడ్బందీ వ్యూహం రచించారు. అక్టోబర్ ఒకటి నుంచి 45 రోజులపాటు ప్రత్యేక కార్యాచరణను అమలుచేయనున్నారు. ఈ స్థానాల నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, బీజేపీ నేత ఎన్ రాంచందర్‌రావు పదవీకాలం మార్చి నెలాఖరుతో ముగియనున్నది. ఇప్పటికే ఆరు ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలతో వేర్వేరుగా సమావేశమైన కేటీఆర్.. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకుంటూ పార్టీ గెలుపుకోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు.
వార్డుస్థాయి నుంచి టీఆర్ఎస్కు నెట్వర్క్ ఉందని.. మరే పార్టీకి ఇంతటి నెటవర్క్ లేదని, పార్టీ అభ్యర్థుల గెలుపు తథ్యమని నేతలను ఉత్సాహపరుస్తున్నారు. గ్రామస్థాయి నుంచి అర్హులైన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయించాలని, నియోజకవర్గాలవారీగా ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ఓటరు నమోదుపై అవగాహన తీసుకురావాలని సూచించారు. ఉమ్మడి ఆరు జిల్లాల్లోని 77 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సమావేశాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. గ్రేటర్ పరిధిలోని కార్పొరేటర్లతో మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి ప్రత్యేకంగా ఎమ్మెల్సీ ఓటర్ల నమోదుపై సమావేశమయ్యారు. నగరంలో పెద్దఎత్తునఉండే పట్టభద్రులందరినీ ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. ప్రణాళికలో భాగంగా.. ఓటర్ల నమో దు, ఓటర్లలో చైతన్యం తీసుకువచ్చేలా చర్యలు చేపట్టనున్నారు.
అన్నీ తానై.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఘనవిజయం సాధించేలా కేటీఆర్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఇప్పటికే రెండు స్థానాల్లోని పార్టీ ఎన్నికల ఇంచార్జిలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ ముఖ్యులు తదితర నాయకులతో మాట్లాడారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. ఇకనుంచి తరచుగా వీరితో టెలికాన్ఫరెన్స్‌లు నిర్వహించనున్నారు. కేటీఆర్ ఆదేశాలతో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ గ్రామ, మండల నియోజకవర్గాల వారీగా నియమించిన ఓటరు నమోదు ఇంచార్జిలు తమ పనులు మొదలుపెట్టారు.
గెలుపే లక్ష్యంగా.. వరంగల్-నల్లగొండ- ఖమ్మం పట్టభద్రుల స్థానంలో మొదటి నుంచి టీఆర్ఎస్ గెలుస్తూ వస్తున్నది. ఇప్పటికే హ్యాట్రిక్ కొట్టగా నాలుగోసారీ గెలవాలని ఉవ్విళ్లూరుతున్నది. అభివృద్ధి ఎజెండా, 1.5 లక్షల ఉద్యోగాల భర్తీ, మరో 15 లక్షల మందికి ఉపాధి కల్పించిన విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా కేటీఆర్ ప్రణాళిక రచించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి, రైతుబంధు, రైతు బీమా, 24 గంటల కరెంటు, సాగునీటి రంగం, పంటల కొనుగోలు, ఇంటింటికి తాగునీరు, కొత్త మండలాలు, జిల్లాల ఏర్పాటు, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్యకు పరిష్కారం, పచ్చగా మారిన పాలమూరు.. తదితర విజయాల్లో టీఆర్ఎస్ పాత్రను వివరించనున్నారు. మొత్తంగా పార్టీ గెలుపే లక్ష్యంగా కేటీఆర్ ముందుకు సాగుతున్నారు.