Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

ఘనంగా కాళోజీ జయంత్యుత్సవాలు

-ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహణ -వరంగల్‌లో కాళోజీ కల్చరల్ కాంప్లెక్స్‌ను నిర్మిస్తాం -ఆయన జీవితచరిత్రను పాఠ్యాంశంలో చేరుస్తాం: కేసీఆర్

KCR 02 జీవితమంతా తెలంగాణ కోసమే పరితపించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు జయంత్యోత్సవాలను ఇకనుంచి రాష్ట్ర ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. సెప్టెంబర్ 9న కాళోజీ జయంతి సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, పాఠశాలల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. గురువారం సచివాలయంలో సీఎంతో వరంగల్ కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు సమావేశమయ్యారు.

కాళోజీ జయంతి ఉత్సవాల నిర్వహణ, కాళోజీ జీవితచరిత్ర -రచనలు, పాఠ్యపుస్తకాల రూపకల్పన తదితర అంశాలపై ఆయనతో చర్చించారు. ప్రభుత్వ సలహాదారు కేవీ రమణాచారి, బీవీ పాపారావు, ఎంపీ కడియం శ్రీహరి, కాళోజీ ఫౌండేషన్ ప్రతినిధులు అంపశయ్య నవీ న్, బీ నర్సింగరావు, నాగిళ్ల రామశాస్త్రి, నందిని సిధారెడ్డి, పొట్లపల్లి శ్రీనివాసరావు, పీ అశోక్‌కుమార్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ కాళోజీ శతజయంతి సందర్భంగా వరంగల్ జిల్లాలో రవీంద్రభారతి కన్నా గొప్పగా నిర్మించబోయే కాళోజీ కల్చరల్ సెంటర్‌కు తానే స్వయంగా శంకుస్థాపన చేస్తానని చెప్పారు.

ఈ భవనంలో కాళోజీ రచనలు, ఆయన జ్ఞాపకాలు భద్రపర్చాలని కోరారు. సెప్టెంబర్ 9న సాయంత్రం హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో అధికారికంగా నిర్వహించబోయే కాళోజీ జయంతి ఉత్సవాల్లోనూ తాను పాల్గొంటానని ప్రతినిధులకు హామీ ఇచ్చారు. వరంగల్ నగరానికే వన్నె తెచ్చేవిధంగా కాళోజీ కల్చరల్ సెంటర్‌ను రూపొందిస్తామన్నారు. కాళోజీ శతజయంతి సందర్భంగా హైదరాబాద్‌తోపాటు వరంగల్ నగరంలో ప్రధాన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.

విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాళోజీ జీవిత చరిత్ర, రచనలను పాఠ్యాంశాల్లో చేరుస్తామన్నారు. కాళోజీతోపాటు ఇతర తెలంగాణ విశిష్ట వ్యక్తుల జీవిత చరిత్రను కూడా భావితరాలకు అందజేస్తామన్నారు. సీమాంధ్ర పాలకులు తెలంగాణకు చెందిన చిహ్నాలను చెరిపివేశారని, వారి చిహ్నాలు మనపై రుద్దారని అన్నారు. మన వాళ్ల గురించి మన విద్యార్థులకు చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదన్నారు. సీఎం ఆదేశాల మేరకు కాళోజీ జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభు త్వం ఉత్తర్వులు జారీచేసింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.