-94 నుంచి 104 సీట్లు ఖాయం -అన్ని సర్వేల్లోనూ తేలింది ఇదే -దుబ్బాకలోనూ మనదే గెలుపు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 94 నుంచి 104 సీట్ల వరకు గెలుస్తుందని సీఎం కేసీఆర్ ధీమా వ్యక్తంచేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై ఇప్పటికే నాలుగు సర్వేలు చేశామని, అన్ని సర్వేల్లో ఇదే విషయం తేలిందని చెప్పారు. హైదరాబాద్‌లో గత ఆరేండ్లలో మనం ఏం చేశామో ఆ పనులు చెప్పుకుంటే చాలన్నారు. దుబ్బాక ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌దే విజయమని చెప్పారు. సోమవారం తెలంగాణభవన్‌లో టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, ఎమ్మెల్యేలు ఈ పనులను ప్రజలకు వివరించాలని సూచించారు.
దుబ్బాకలో ఘన విజయం మనదే… దుబ్బాక శాసనసభ్యుడు సొలిపేట రామలింగారెడ్డి మృతికి టీఆర్‌ఎస్‌ఎల్పీ సంతాపం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. అనంతరం మాట్లాడుతూ సొలిపేట రామలింగారెడ్డి తన కుటుంబసభ్యుడిగాలాగా ఉండేవాడన్నారు. చిన్న వయస్సులో ఆయన చనిపోవడం నిజంగా బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన చేసిన సేవలకు గుర్తుగా దుబ్బాక నియోజకవర్గంలో ఒక దానికి ఆయన పేరు పెట్టుకుందామని తెలిపారు. దుబ్బాక ఉపఎన్నికల్లో టీఆర్‌ఎస్ లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు.