-పేదల పక్షాన నిలబడిన టీఆర్ఎస్ ప్రభుత్వం -కుల, మత, ప్రాంతీయ బేధాలు చూపని పాలన -వనస్థలిపురం బహిరంగ సభలో మంత్రి ఈటల
రానున్న గ్రేటర్ ఎన్నికల్లో 80నుంచి 100స్థానాల్లో గెలిచి జీహెచ్ఎంసీపై గులాబీ జెండా ఎగురవేస్తామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకుడు, ఎఫ్‌సీఐ కాలనీ అధ్యక్షుడు ఆర్ వెంకటేశ్వర్‌రెడ్డి 20 కాలనీ సంక్షేమ సంఘాలు, 500ల మంది కార్యకర్తలతో సోమవారం టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వెంకటరమణ కాలనీలో నిర్వహించిన బహిరంగ సభలో ఈటల వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందేలా కేసీఆర్ పాలన సాగుతున్నదన్నారు. నగరంలో రెప్పపాటు కరెంటు కోత లేకుండా సరఫరా చేస్తున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. తెలంగాణ వస్తే విద్యుత్ కోతలుంటాయని చెప్పిన నాయకులు ఇప్పుడు పత్తాలేకుండా పోయారని అన్నారు. ఉగాది నుంచి రైతులకు పగటిపూట 9గంటల విద్యుత్ సరఫరాకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని, 2018 నుంచి రైతులకు కూడా 24గంటల విద్యుత్ అందజేస్తామన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పేదలకు డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి చరిత్ర సృష్టించామన్నారు. నగరంలో నివసిస్తున్న అన్ని ప్రాంతాల ప్రజల మధ్య ప్రేమలు వెల్లివిరుస్తున్నాయని, ఎలాంటి ద్వేషాలకు ఈ ప్రభుత్వం తావివ్వలేదన్నారు. ఎవరి మద్దతు, సహకారం లేకుండా కేవలం ప్రజా బలంతోనే ఎన్నికల్లో పోటీ చేస్తున్నామని, టీఆర్ఎస్ అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి బంగారు తెలంగాణలో ప్రజలంతా భాగస్వాములు కావాలన్నారు.

విశ్వనగర నిర్మాణమే టీఆర్ఎస్ లక్ష్యం: మంత్రి నాయిని హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్ది ప్రపంచస్థాయి పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్య సంస్థలను నెలకొల్పి, యువతకు ఉపాధి కల్పించేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసిఆర్ పక్కా ప్రణాళికతో పని చేస్తున్నదని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అన్నారు. నగరంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలకు దిక్కు తోచని పరిస్థితి ఉందన్నారు. ప్రజలంతా టీఆర్ఎస్ బాటపడుతున్నారని, ఎల్బీనగర్ నియోజకవర్గంలోని 11స్థానాల్లో విజయం సాధించి తీరుతామన్నారు. 18నెలల పాలనలో తమ శక్తిసామర్థ్యాలను నిరూపించకున్నామన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్చార్జి ముద్దగౌని రామ్మోహన్‌గౌడ్, ఓయూ జేఏసీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, టీఆర్ఎస్ వనస్థలిపురం డివిజన్ అధ్యక్షుడు గడ్డం మల్లేశ్‌గౌడ్, హస్తినాపురం డివిజన్ అధ్యక్షుడు సూదిని మహేందర్ తదితరులు పాల్గొన్నారు.