Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

జీహెచ్‌ఎంసీపై గులాబీ జెండా ఎగరాలి

-పీజేఆర్ తనయ విజయారెడ్డి చేరిక సభలో కవిత పిలుపు

Keshava Rao గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పార్టీ గెలుపుకోసం గులాబీ జెండా ఎగిరేలా పట్టుదలతో పనిచేయాలని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత టీఆర్‌ఎస్ శ్రేణులకు సూచించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి తన అనుచరులతో కలిసి టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. పార్టీ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు విజయారెడ్డికి టీఆర్‌ఎస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పీజేఆర్ ప్రజానాయకుడని, ప్రజల కష్టాలే తన కష్టాలుగా జీవితాంతం రాజకీయాల్లో పని చేశారని పేర్కొన్నారు.

పదవులను తోసిరాజని ప్రజాసేవ చేసిన గొప్ప వ్యక్తి పీజేఆర్ అని అభివర్ణించారు. మాటమీద నిలబడే వ్యక్తిగా పీజేఆర్ పేద ప్రజల గుండెల్లో నిలిచిపోయారని అన్నారు. పీజేఆర్ పౌరుషం, పట్టుదల, పంతం విజయారెడ్డికి ఉందని, ఇదే స్ఫూర్తితో ఖైరతాబాద్‌లో పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. విజయారెడ్డి చేరిక ఆరంభం మాత్రమేనని, ఇక గ్రేటర్ హైదరాబాద్‌లోని అన్ని పార్టీల నుంచి చేరికలు ఉంటాయని తెలిపారు. సర్వేపై టీడీపీ, కాంగ్రెస్ పార్టీలు అవాస్తవాలు ప్రచారం చేసాయని, ప్రజలు సర్వేకు సహకరించి ఆ పార్టీలకు బుద్ధి చెప్పారని అన్నారు. ఆంధ్రోళ్ళను గుర్తించడానికి సర్వే చేపట్టారని ఆరోపణలు చేయడం దారుణమన్నారు. ఆంధ్రోళ్లను గుర్తించాలంటే సర్వే చేయాలా? అని ఆమె ప్రశ్నించారు. కొంతమంది సినిమా వాళ్లు సర్వే వద్దన్నారట, వారు మనుషుల జాబితాలో లేరేమోనని కవిత వ్యాఖ్యానించారు.

అద్భుతంగా సర్వే: కేకే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే అద్భుతంగా జరిగిందని రాజ్యసభ సభ్యుడు కే కేశవరావు పేర్కొన్నారు. పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పార్టీలో చేరడాన్ని హర్షిస్తున్నానని అన్నారు. పీజేఆర్ తెలంగాణ వాది అన్నారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని విజయారెడ్డికి సూచించారు.

హైదరాబాద్ హమారా: డిప్యూటీ సీఎం మహమూద్ అలీ హైదరాబాద్ తెలంగాణ ప్రజలదని డిప్యూటీ సీఎం మహమూద్ అలీ వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని అన్నారు. ప్రపంచంలో ఇటువంటి సమగ్ర సర్వే జరగలేదని అన్నారు. కాంగ్రెస్, టీడీపీ పాలనలో అక్రమాలు ఈ సర్వేద్వారా బహిర్గతమవుతాయని అన్నారు.

త్వరలో కాంగ్రెస్, టీడీపీల నుంచి భారీగా చేరికలు: నాయిని హైదరాబాద్ నగరంలోని కాంగ్రెస్, టీడీపీ సహా ఇతర పార్టీల్లో పని చేస్తున్న పలువురు నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెలిపారు. వారం రోజుల్లో ఇందుకు ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. రేవంత్‌రెడ్డి వంటి బచ్చా నేతలు సర్వేపై అబద్ధాలు ప్రచారం చేసినా తెలంగాణ ప్రజలందరు సర్వేలో పాల్గొని చెంపదెబ్బ కొట్టారని అభిప్రాయపడ్డారు.

టీఆర్‌ఎస్ కంచుకోటగా ఖైరతాబాద్: విజయారెడ్డి ఖైరతాబాద్ నియోజకవర్గాన్ని టీఆర్‌ఎస్‌కు కంచుకోటగా మలుస్తానని విజయారెడ్డి అన్నారు. తన తండ్రి పీజేఆర్ స్ఫూర్తితో కేసీఆర్ నాయకత్వం పట్ల విశ్వాసంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. కేసీఆర్ నాయకత్వంలో పేదలకు, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి కృషిచేస్తానని తెలిపారు. పార్టీలో చేరడానికి ముందు విజయారెడ్డి ఖైరతాబాద్‌లో పీజేఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక మహంకాళి ఆలయంలో పూజలు చేసి తెలంగాణ భవన్‌కు ర్యాలీగా వచ్చారు. మంత్రి పద్మారావు ఈ ర్యాలీని ప్రారంభించగా, ఒంటెలు, గుర్రాలు, ద్విచక్ర వాహనాలు, కార్లలో పెద్ద ఎత్తున కార్యకర్తలతో కలిసి తెలంగాణ భవన్‌కు చేరుకున్నారు. ఆమెతోపాటు కాంగ్రెస్ నాయకురాలు లతామహేందర్‌రెడ్డి, వందలాది మంది పీజేఆర్ అనుచరులు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.