Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గిరిజన కోటా 10 శాతం..

-జీవో 33 జారీ.. నేటి నుంచే అమలు
-తెలంగాణలో ప్రత్యేక పరిస్థితి.. గిరిజనులు అధికం
-రిజర్వేషన్‌ పెంచాలంటూ చెల్లప్ప కమిటీ సిఫారసు
-ఆరేండ్ల క్రితమే అసెంబ్లీలో బిల్లు.. కేంద్రం నాన్చివేత
-ప్రత్యేక సందర్భాల్లో 50 శాతం దాటొచ్చన్న సుప్రీం
-అయినా స్పందించని నరేంద్ర మోదీ సర్కార్‌
-4 శాతం పెంచుతూ కేసీఆర్‌ సంచలన నిర్ణయం
-3,146 తండాలు, గూడేలకు గ్రామ పంచాయతీ హోదా
-స్థానిక ప్రజా ప్రతినిధులుగా 27,682 మందికి అవకాశం
-విద్యాభివృద్ధి కోసం 92 ఎస్టీ ప్రత్యేక గురుకులాల ఏర్పాటు
-యువ గిరిజన పారిశ్రామిక వేత్తలకు సీఎంఎస్‌టీఈ పథకం
-హైదరాబాద్‌లో కుమ్రం భీం, సంత్‌ సేవాలాల్‌ భవనాలు
-మేడారం జాతరకు అధికారిక హోదా.. సమ్మక్క మ్యూజియం

తెలంగాణ రాష్ట్ర జనాభా
(2011 జనాభా లెక్కల ప్రకారం) మొత్తం : 3.5 కోట్లు
ఎస్టీలు : 31.78 లక్షలు (9.08%)
తెగలు: 32 (4 పీవీటీజీలు సహా)

తెలంగాణ చేసిందిదీ!
గిరిజన అభివృద్ధి కోసం ప్రత్యేక నిధి:
కేటాయింపు : 75,450 కోట్లు
వ్యయం : 47,258 కోట్లు

అసాధారణ సందర్భాలకు.. అసాధారణ నిర్ణయాలే అవసరమవుతాయి. ప్రత్యేక పరిస్థితులకు ప్రత్యేక చర్యలే అనివార్యమవుతాయి. చరిత్రే కాదు.. అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కూడా చెప్పిన సత్యమిది.

తెలంగాణ వలస పాలనలోకి వెళ్లడం ఒక అసాధారణ సన్నివేశం.. వలసవాదుల దశాబ్దాల దోపిడీ ఒక ప్రత్యేక సందర్భం.. తెలంగాణలోని సబ్బండ వర్ణాలతో పాటు గిరిజన సోదరుల అణచివేత ఒక అసాధారణ సన్నివేశం..

కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ ఉద్యమం ఒక ప్రత్యేక సందర్భం.. రాష్ట్ర ఏర్పాటు ఒక అసాధారణ సన్నివేశం.అసాధారణ సన్నివేశాల వెన్నంటే అసాధారణ సందర్భాలూ వస్తుంటాయి. తెలంగాణలో గిరిజనుల సంఖ్య ఎక్కువ. ఫలితంగా జనాభా దామాషాలో వారి శాతమూ అధికం. ఇదొక అసాధారణ సన్నివేశం.. ప్రత్యేక పరిస్థితుల్లో రిజర్వేషన్‌ 50 శాతం దాటవచ్చని సుప్రీంకోర్టు తన కోటా తీర్పులోనే పేర్కొన్నది. తమిళనాడు 1994లోనే ఆ పరిమితిని దాటింది. కేంద్రం దానికి రాజ్యాంగ రక్షణా కల్పించింది.

తెలంగాణ రాష్ట్రం కావడం, గిరిజనుల సంఖ్య అధికంగా ఉండడం.. చెల్లప్ప కమిషన్‌ కోటా పెంపునకు సిఫారసు చేయడం.. గతంలో ఇలా చేసిన ప్రత్యేక సందర్భాలుండటం.. అనే అసాధారణ సన్నివేశాల నడుమ తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుక్రవారం అసాధారణ నిర్ణయం తీసుకున్నారు. గిరిజనుల రిజర్వేషన్లను 6 నుంచి 10 శాతానికి పెంచుతూ జీవో జారీ చేశారు. నేటి నుంచే అమలు అవుతుందని ప్రకటించారు. గిరిజన సోదరులకు దసరా కానుకను ప్రకటించారు. విజయ దశమికి ముందే పండుగ చేశారు.

ఎస్టీలకు రిజర్వేషన్‌ పెంచాలని ఆరేండ్లుగా అనేక సార్లు మొత్తుకున్నా, అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేసినా పట్టించుకోని కేంద్ర ప్రభుత్వం మొద్దు నిద్ర వదిలించేలా ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడిక కేంద్రం వంతు. పేద గిరిజ నులకు మద్దతుగా మోదీ సర్కారు ఇకనైనా స్పందిస్తుందా? తీర్పులు, నియమాలు, కోటా రూల్స్‌, కాకరకాయలు అని కథలు చెప్తుందా?

అడిగి అడిగి విసిగిపోయాం.. ఇక వేచిచూసేది లేదు.. రాష్ట్రంలో గిరిజనులకు రిజర్వేషన్లు 10 శాతానికి పెంచుతున్నాం.. వారంలో దీనిపై జీవో జారీ చేస్తాం.. మోదీ మా జీవోను గౌరవించి అమలు చేయించు.

– మోదీ పుట్టిన రోజైన సెప్టెంబర్‌ 17న ముఖ్యమంత్రి కేసీఆర్‌ విన్నపం

కేసీఆర్‌ ఎంత చెప్పినా మోదీ సర్కారు ఉలకలేదు.. పలకలేదు.. సీఎం కేసీఆర్‌ తాను అన్నమాట ప్రకారం ముందుకెళ్లారు.. గిరిజనుల కోటా పెంపుపై జీవో జారీ చేశారు.

షెడ్యూల్డ్‌ తెగల (ఎస్టీ)లకు రిజర్వేషన్లు పెంచుతామన్న హామీని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పరిపూర్ణం చేశారు. జనాభా దామాషా ప్రకారం ఎస్టీలకు 10 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ప్రభుత్వం శుక్రవారం అర్ధరాత్రి జీవో నంబర్‌ 33 జారీ చేసింది. దీంతో రాష్ట్రంలో గిరిజనులకు శనివారం నుంచి కొత్త రిజర్వేషన్లు అమలులోకి వచ్చాయి. ఎస్టీలకు రిజర్వేషన్లు పెంచుతామని కేసీఆర్‌ సీఎంగా బాధ్యతలు చేపట్టిన కొత్తలో ప్రకటించారు. సెప్టెంబర్‌ 17వ తేదీన ఆదివాసీ, బంజారా భవనాలు ప్రారంభించిన సందర్భంగా ఈ అంశంపై మరోసారి విస్పష్ట ప్రకటన చేశారు. గత ఎన్నికల సమయంలో, తెలంగాణ ఉద్యమ సమయంలో సైతం గిరిజనులకు దామాషా ప్రకారం రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన విషయం తెల్సిందే. టీఆర్‌ఎస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో సైతం దీనిపై హామీ ఇచ్చారు. రిజర్వేషన్ల పెంపు అధ్యయనానికి విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎస్‌ చెల్లప్ప నేతృత్వంలో కమిషన్‌ కూడా వేశారు. ఈ కమిషన్‌ ఇచ్చిన నివేదికను 2017లో ఏప్రిల్‌ 15న రాష్ట్ర మంత్రి వర్గం ఆమోదించింది. ఆ తర్వాతి రోజే శాసనసభలో తీర్మానం కూడా చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఏండ్లు గడిచినా కేంద్రం నాన్చివేత ధోరణి ప్రదర్శించటంతో స్వయంగా రిజర్వేషన్లు పెంచుతూ సీఎం సాహసోపేత నిర్ణయం తీసుకొన్నారు.

ఎస్టీ రిజర్వేషన్ల పెంపు ఆవశ్యకం..
తెలంగాణలో ఇతర రాష్ర్టాలకంటే గిరిజనుల సంఖ్య ఎక్కువ. జనాభాలో వారి శాతం కూడా ఎక్కువే. తెలంగాణ జనాభాలో గిరిజనులు 6 నుంచి 10 శాతానికి పెరిగారు. ఉమ్మడి రాష్ట్రంలో అన్ని వర్గాలతోపాటే గిరిజనులు కూడా అణచివేతకు, ఆర్థిక వెనుకబాటుకు గురయ్యారు. దీని దృష్ట్యా తెలంగాణ రాష్ట్రం ఏర్పడగానే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం గిరిజనులకు ప్రత్యేక నిధి ఏర్పాటుచేసి భారీగా నిధులు కేటాయించింది. నిధులివ్వటంతో ఆగకుండా వాటిని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఖర్చు చేయాలని, ఒకవేళ ఖర్చు చేయలేకపోతే తర్వాతి సంత్సరానికి బదిలీ (క్యారీ ఫార్వర్డ్‌) చేయాలని నిర్ణయించి అమలు చేసిం ది. ఎస్టీలకు గురుకులాలు ఏర్పాటుచేసి వారి విద్యాభివృద్ధికి కృషిచేసింది. అనేక ఇతర సౌకర్యాలు, భరోసా కల్పించినప్పటికీ విద్య, ఉద్యోగాల్లో వెనకబడిపోయిన గిరిజనులకు రిజర్వేషన్ల పెంపు అంశం అలాగే ఉండిపోయింది. ఎస్టీల సామాజిక, ఆర్థిక స్థితి దారుణంగా ఉన్నదని అనేక అధ్యయనాలు తేల్చాయి. గిరిజన సంఘాల డిమాండ్‌ మేరకు ఎస్టీల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2015లోనే విశ్రాంత ఐఏఎస్‌ అధికారి ఎస్‌ చెల్లప్ప కమిటీని ఏర్పాటుచేసింది. ఆ కమిటీ రాష్ట్రమంతా పర్యటించి వేలమంది అభిప్రాయాలు సేకరించింది. అత్యంత వెనుకబడి ఉన్న గిరిజనులకు ఒకమెట్టు పైకి తీసుకురావటానికి రిజర్వేషన్లు పెంచటమే ఏకైక మార్గమని స్పష్టంచేసింది.

ప్రత్యేక సందర్భంలో 50% మించొచ్చు..
ఇందిరా సాహ్ని కేసులో రిజర్వేషన్లు 50 శాతం మించరాదని సుప్రీంకోర్టు చెప్తూనే కొన్ని ప్రత్యేక సందర్భాల్లో పరిమితి దాటొచ్చని 1992లో పేర్కొన్నది. ఈ విషయంలో లోతైన అధ్యయనం చేసి ఆచితూచి, జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఇక్కడ తెలంగాణలో అణచివేత ఒక సందర్భం. గిరిజనుల వెనుకబాటుతనం ఒక సందర్భం. గిరిజనుల సంఖ్య ఎక్కువగా ఉండటం మరో ప్రత్యేక సందర్భం. వాళ్లకు రిజర్వేషన్‌ కోటా పెంచాలని చెల్లప్ప కమిటీ సూచించటం ఇంకో ప్రత్యేక సందర్భం. సుప్రీంకోర్టు తీర్పులోని ‘ప్రత్యేక సందర్భం’ అనే మాటకు రాష్ట్రంలోని ఈ ప్రత్యేక సందర్భాలు కచ్చితంగా సరిపోలుతున్నాయి. 1994లో తమిళనాడులో రిజర్వేషన్లను 50 శాతానికి మించి అమలు చేస్తే, అప్పటి కేంద్ర ప్రభుత్వం ఆ చట్టాన్ని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చి రాజ్యాంగ రక్షణ కల్పించింది. 28 ఏండ్లుగా అక్కడ 69 శాతం రిజర్వేషన్లు నిరాఘాటంగా అమలవుతున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీం తీర్పులోని ‘ప్రత్యేక’ వెసులుబాటు ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం ఆరేండ్ల క్రితమే గిరిజనుల రిజర్వేషన్‌ పెంపు బిల్లును శాసనసభలో ఆమోదించి కేంద్రానికి పంపింది. కానీ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దానిపై నిర్ణయం తీసుకోకుండా ఇంకా నాన్చుతూనే ఉన్నది. ఆ బిల్లును ఆమోదించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహా రాష్ట్ర మంత్రులు, గిరిజన సంఘాల నేతలు అనేకసార్లు కేంద్రానికి విన్నవించారు. పార్లమెంటులోనూ టీఆర్‌ఎస్‌ నేతలు గిరిజన రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్‌ చేశారు. అయినా కేంద్రం స్పందించలేదు. దీంతో రాష్ట్రప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను పెంచుతూ శుక్రవారం జీవో జారీచేసింది. శనివారం నుంచే ఇది అమల్లోకి వస్తున్నది.

ప్రత్యేక పరిస్థితుల్లో ప్రత్యేక నిర్ణయం

భారతదేశంలో తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేకత ఉన్నది. భౌగోళికంగా, రాజకీయంగా, ఆర్థికంగా, జనాభాపరంగా, సంస్కృతి, సంప్రదాయాల పరంగా ఇతర ప్రాంతాలకంటే తెలంగాణ భిన్నంగా, ప్రత్యేకంగా ఉంటుంది. అయితే, రాజరిక పాలన మొదలు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కలిసిన తర్వాత ఆరు దశాబ్దాలపాటు తెలంగాణ ప్రాంతం అనేక అణచివేతలకు, అవమానాలకు గురైంది. ఈ అణచివేతలను ఎదిరిస్తూ స్వేచ్ఛకోసం అనేక ఉద్యమాలు పుట్టుకొచ్చాయి. చివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ప్రత్యేక సందర్భంలో జరిగింది. దశాబ్దాల వలస పాలన, అణచివేత, నిధుల దోపిడీలకు వ్యతిరేకంగా కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నాయకత్వంలో తెలంగాణ ప్రజలంతా ఒక్కటై ఉద్యమం చేసి స్వరాష్ట్రం సాధించుకొన్నారు. ఇదో ప్రత్యేక సందర్భం. ఈ సందర్భంలో తెరపైకి వచ్చిన ప్రత్యేక అంశాల్లో గిరిజన రిజర్వేషన్ల పెంపు ఒకటి .

హోరెత్తిన సంబురాలు

విద్య, ఉద్యోగ రంగాల్లో గిరిజనులకు ప్రత్యేకంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడంపై శుక్రవారం రాత్రి రాష్ట్రవ్యాప్తంగా సంబురాలు హోరెత్తాయి. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మంత్రుల నివాస సముదాయంలో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ ఆధ్వర్యంలో గిరిజన నాయకులు, ఆదివాసీలు పటాకులు కాల్చారు. తమ సంప్రదాయ నృత్యాలు చేస్తూ మిఠాయిలు పంచుకున్నారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. తెలంగాణ భవన్‌, బంజారా, ఆదివాసీ భవనాల్లో కోలాహలం నెలకొన్నది. జయహో కేసీఆర్‌ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేషన్‌ చైర్మన్లు రామచంద్రనాయక్‌, వాల్యానాయక్‌, టీఆర్‌ఎస్‌ కార్యదర్శి, బంజారా నేత రూప్‌సింగ్‌, సంజయ్‌నాయక్‌, వందలాది మంది గిరిజన నాయకులు పాల్గొన్నారు.

ప్రత్యేక సందర్భం అంటే.?
ఇందిరా సాహ్నీ వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా (1993) కేసులో సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల ధర్మాసనం రిజర్వేషన్లు 50 శాతానికి మించి కల్పించాల్సిన సందర్భాన్ని స్పష్టంగా నిర్వచించింది. ప్రత్యేక సందర్భం (ఎక్స్‌ట్రా ఆర్డినరీ సిచ్యువేషన్‌)లో రిజర్వేషన్లు 50 శాతం మించవచ్చిని పేర్కొన్నది. ఆ ప్రత్యేక సందర్భాలను కూడా స్పష్టంగా తెలిపింది. ‘రిజర్వేషన్లు 50 శాతం మించరాదన్న నియమం పెట్టుకొన్నప్పటికీ అనేక భిన్నత్వాలు, జాతుల ప్రజలు ఉన్న మన దేశంలో కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. మారుమూల ప్రాంతాల్లో అస్థిరంగా ఉండేవారు, ప్రధాన జనజీవన శ్రవంతికి దూరంగా ఉండేవారు, విచిత్రమైన పరిస్థితుల్లో నివసించేవారు, ఇతరులకంటే ప్రత్యేక లక్షణాలున్న ప్రజలు, సాధారణ ప్రజలకంటే భిన్నంగా పరిగణించాల్సినవారికి ఈ కఠిన నియమం నుంచి సడలింపు ఉండాలి. అయితే, ప్రత్యేక పరిస్థితులు అనేదానిని ఎంతో అధ్యయనం చేసి, చాలా జాగ్రత్తగా నిర్ణయించాలి’ అని ధర్మాసనం స్పష్టంచేసింది. ఇందిరా సాహ్నీ కేసులో చెప్పినట్టు రిజర్వేషన్లకు 50 శాతం సీలింగ్‌ తప్పనిసరి ఏమీ కాదని ఈడబ్ల్యూఎస్‌ కోటా కేసులో సెప్టెంబర్‌ 7న నరేంద్రమోదీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో వాదించింది.

సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం హర్షం
రాష్ట్ర ప్రభుత్వం ఎస్టీలకు 10శాతం రిజర్వేషన్ల కల్పనపై సచివాలయ ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వంకుడోత్‌ సైదా హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీ, ఉద్యోగులు, నిరుద్యోగుల తరఫున సీఎం కేసీఆర్‌కు ఆయన ప్రత్యేక ధన్యావాదాలు తెలిపారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.