Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గిరిజన పంచాయతీలు

-3,214 గ్రామాల్లో వారిదే పెత్తనం
-ప్రగతిబాట పట్టనున్న గ్రామాలు
-ఎస్సీలకూ పెరుగనున్న 2 శాతం రిజర్వేషన్లు
-తొలి ఏడాది రూ.3 లక్షల నుంచి రూ. 20 లక్షలు

ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన గిరిజనుల కల నెరవేరింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పంచాయతీ చట్టంతో వారికి రాజయోగం పట్టుకుంటున్నది. ఇక నుంచి తమ గ్రామాలను తామే పరిపాలించుకునే సమయం ఆసన్నమైనది. ఇన్ని రోజులు అభివృద్ధికి దూరంగా ఉన్న తండాల్లో త్వరలోనే కొత్త పాలకవర్గం కొలువుదీరనున్నది. దీంతో ఆయా గ్రామాల్లో కంకర, మట్టి తేలిన రోడ్లు మాయం కానున్నవి. అభివృద్ధిలో అగ్రభాగాన నిలువనున్నవి.

తెలంగాణ నూతన పంచాయతీ చట్టంతో రాష్ట్రంలో మొత్తం 12,751 గ్రామాలు ఏర్పాటయ్యాయి. వీటిలో 4,383 గ్రామాలు కొత్తగా ఆవిర్భవించాయి. 100శాతం గిరిజన జనాభా ఉన్న 1,326, మరో 1,308 షెడూల్డ్ గ్రామాలు, మైదాన ప్రాంతాల్లో 508 పంచాయతీలు వీరికి దక్కనున్నాయి. దీంతో మొత్తం 3,214 గ్రామ పంచాయతీల్లో వారికే పెత్తనం దక్కనున్నది. ఇప్పటి వరకు అభివృద్ధికి నోచుకోని తమ పల్లెలను ఇక తామే పరిపాలించుకునే అవకాశం వచ్చింది.

పట్టువదులని సీఎం కేసీఆర్
ఊరికి దూరంగా.. అడవులకు దగ్గరగా.. రోడ్డు మార్గాలకు నోచుకోని తండాలు.. గుక్కెడు తాగు నీటి కోసం గిరిజనుల అవస్థలు. మురుగు నీటి కాల్వలు ఏర్పాటుకు నోచుకోక అస్తవ్యస్తంగా ఉన్న పారిశుద్ధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ వారి పల్లెల్లో గడిపారు. తండావాసులతో కలిసి గ్రామాల సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించారు. గిరిజన తండా లు, గూడెంలకు మంచి రోజులు తీసుకురావాలని ఆనాడే నిర్ణయం తీసుకున్నారు. అధికారంలోకి రాగానే మూడేండ్ల నుంచి ఆ దిశగా దృష్టిపెట్టారు. ఇటీవల అసెంబ్లీ సమావేశంలో నూతన పంచాయతీరాజ్ చట్టం-2018 ఆమోదించి తన నిబద్ధతను చాటారు. ఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే చరిత్ర సృష్టించింది.

ఎస్సీలకు 2శాతం రిజర్వేషన్లు పెరిగే అవకాశం
పంచాయతీ ఎన్నికల్లో 2013లో ఎస్సీలకు 18 శాతం రిజర్వేషన్లు వర్తించగా ఈసారి జనాభా ప్రాతిపదికన దాదాపు రెండు శాతం పెరుగనున్నది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఎస్సీలు 35,84,772 మంది ఉన్నట్టు తేలింది. దీని ప్రకారం వారికి 20.46 శాతం రిజర్వేషన్లు వర్తించనున్నాయి. అంటే ఎస్సీలకు 2,070 గ్రామాల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం రానున్నది. మహిళలకు కూడా 50 శాతం రిజర్వేషన్లు కల్పించడంతో వారికి రాజకీయావకాశాలు మెరుగవుతున్నాయి. ఇక బీసీలకు 34 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు కల్పించారు.

ఇదీ జనాభా
కొత్త చట్టంతో ఎస్టీల జనాభా లెక్క తేలింది. 1,308 ఏజెన్సీ గ్రామాల్లో 18,68,968 మంది ఉండగా 100 శాతం గిరిజనులున్న 1,326 గ్రామాల్లో 9,07,700 మంది గిరిజనులు ఉన్నారు. ఈ లెక్కన రాష్ట్రంలో మొత్తం గిరిజన జనాభా 27,76,668 మంది ఉన్నట్టు అధికారులు నిర్ధారించారు. 10,117 మైదాన పంచాయతీల్లో జనాభా ప్రాతిపదికన 5.73 శాతం రిజర్వేషన్లు కల్పించనున్నారు. ఈ లెక్కన 508 గ్రామాలు వారికి కేటాయించాల్సి ఉంటుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వారికి 3,214 పంచాయతీల్లో ప్రాతినిధ్యం దక్కనున్నది.

ఇక ప్రగతి పంచాయతీలు
ఇంతకాలం అభివృద్ధికి దూరంగా ఉన్న గిరిజన గ్రామపంచాయతీలు ఇప్పుడు ప్రగతి బాట పడుతున్నాయి. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం జనాభా ప్రాతిపదికన తొలి ఏడాది ప్రతి గ్రామానికి రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు నిధులు దక్కనున్నాయి. వీటితో మౌలిక సదుపాయాలు, కొత్త పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, పాఠశాలలు రూపుదిద్దుకోనున్నాయి. ఆర్థిక సంఘం నుంచి కూడా నిధులు రావడంతో గిరిజన గ్రామాలు అభివృద్ధి బాటపట్టనున్నాయి. నూతన పంచాయతీరాజ్ చట్టం ప్రకారం 17 మంది గ్రామస్థాయి ఉద్యోగులు నియామకం కానున్నారు. అభివృద్ధిలో గ్రామస్థాయి ఉద్యోగుల పాత్ర కీలకమంటూ ఈ నిర్ణయం తీసుకున్నారు.

రూ. 5 వేల కోట్లతో రోడ్లు
కొత్తగా ఏర్పాటైన 4,383 గ్రామాలకు రోడ్ల కనెక్టివిటీ కింద రూ.5 వేల కోట్లను ప్రభుత్వం వెచ్చిస్తున్నది. వీటిలో గిరిజన గ్రామ పంచాయతీలే అధికం. ఇప్పటి వరకు వీటికి రోడ్ల సౌకర్యం సరిగా లేకపోవడంతో కొత్తగా రోడ్లు నిర్మించి అభివృద్ధి పథం వైపు నడిపించనున్నారు. కొన్ని గ్రామాల్లో సీసీరోడ్లు, అంతర్గత రోడ్ల కోసం ప్రభుత్వం రూ.2,500 కోట్ల ను వెచ్చించింది. ప్రస్తుతం అన్ని గ్రామాలు, మండలాలకు లింక్ రోడ్లను నిర్మించనున్నారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.