Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గోదావరి జలాల ఎత్తిపోత వచ్చే వానకాలం నుంచే ప్రతి ఎకరాకు నీరందాలి..

గోదావరి జలాల ఎత్తిపోత వచ్చే వానకాలం నుంచే ప్రతి ఎకరాకు నీరందాలి.. వాయువేగంతో పనులు సాగాలి: సీఎం

-ప్రాజెక్టుల పరిశీలన మంచి అనుభవం -105 మీటర్ల ఎత్తుకు నీటిని తరలించడమే కీలక ఘట్టం -రైతులకు రాళ్లవాన కష్టాలు లేకుండా చూడాలి -రోహిణిలోనే నాట్లు.. మార్చిలోపే యాసంగి పంట ముగియాలి -2020 నాటికి ఎన్టీపీసీ మొదటి యూనిట్ -అధికారులకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం -విద్యుత్‌శాఖకు రుణపడి ఉన్నామని వ్యాఖ్య -సీఎం గోదావరి ప్రాజెక్టుల పరిశీలన విజయవంతం -నేడు ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష

రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా మిగులకుండా మొత్తం వ్యవసాయ యోగ్య భూమికి సాగునీటి వసతికల్పించే లక్ష్యంతో ప్రాజెక్టులకు రూపకల్పనచేశామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఇక భవిష్యత్‌లో వర్షానికి ఎదురుచూసే పరిస్థితి రాకుండా సాగునీటి ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వర్షాకాలంనుంచే వీలైనంత ఎక్కువగా గోదావరి జలాలను తీసుకునేందుకు కావాల్సిన అన్ని పనులను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. ఇందుకోసం వాయువేగంతో పనులు జరుగాలని దిశానిర్దేశం చేశారు. ఇదే సమయంలో ఎన్టీపీసీలో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రెండు యూనిట్లను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆదేశించారు.

ప్రాజెక్టుల క్షేత్రస్థాయి పర్యటన వల్ల మరింత అవగాహన పెరిగిందన్న ముఖ్యమంత్రి.. కాళేశ్వరం ఎత్తిపోతల పనులను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు శనివారం ప్రగతిభవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పరిశీలనకోసం ముఖ్యమంత్రి కేసీఆర్ రెండ్రోజులపాటు నిర్వహించిన క్షేత్రస్థాయి పర్యటన శుక్రవారం సాయంత్రంతో ముగిసింది. తొలి రోజైన గురువారం జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో గోదావరిపై నిర్మిస్తున్న మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌లతోపాటు పంప్‌హౌజ్ పనులను సీఎం పరిశీలించిన సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం రామగుండం ఎన్టీపీసీలో రాష్ట్ర ప్రభుత్వం 800 మెగావాట్ల చొప్పున నిర్మిస్తున్న రెండు యూనిట్ల విద్యుత్ ప్లాంట్ పనులను ముఖ్యమంత్రి పరిశీలించారు. అనంతరం పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారం వద్ద ఆరో ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న సొరంగ మార్గాలను, పంప్‌హౌజ్‌లను, సర్జ్ పూల్స్, సబ్‌స్టేషన్లను పరిశీలించారు. తదుపరి కరీంనగర్ జిల్లా రామడుగు మండలం లక్ష్మీపూర్ వద్ద 8వ ప్యాకేజీ పనులను పరిశీలించారు. ఇక్కడే భోజనం చేసిన ముఖ్యమంత్రి.. అనంతరం కొద్దిసేపు అధికారులతో మాట్లాడారు. అక్కడినుంచి బయల్దేరి.. జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్ వద్ద శ్రీరాంసాగర్ పునర్జీవ పథకంకింద సాగుతున్న పంపుహౌస్ పనులను పరిశీలించారు. రాజన్న-సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు ప్రాజెక్టును విహంగ వీక్షణం చేసి, అక్కడి నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారు.

నిర్దిష్ట గడువులోపు విద్యుత్ ప్లాంట్లు పూర్తికావాలి రెండవరోజు పర్యటనలో శుక్రవారం ముందుగా రామగుండం ఎన్టీపీసీలో ప్రభుత్వం 800 మెగావాట్ల చొప్పున నిర్మిస్తున్న రెండు యూనిట్ల పనులను సీఎం పరిశీలించారు. రాష్ట్రంలో ప్రాజెక్టుల నిర్మాణాలు, వాటికి అవసరమయ్యే విద్యుత్ వంటి విషయాలను అధికారులకు వివరించారు. ప్రాజెక్టుల పనులు వేగంగా సాగుతున్న నేపథ్యంలో విద్యుత్ ప్లాంట్ల పనులు అదేస్థాయిలో ముందుకు వెళ్లాలని సూచించారు. నిర్దిష్ట గడువులోపు రెండు యూనిట్లు పూర్తి అవుతాయా? అని ప్రశ్నించారు. ఎన్టీపీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దూబే స్పందిస్తూ.. 2020 మే వరకు మొదటి యూనిట్ పనులు పూర్తిచేస్తామని, మరో ఆరు నెలల తరువాత రెండో యూనిట్ పూర్తవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న విద్యుత్ అవసరాల దృష్ట్యా నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని, నిర్దేశించిన లక్ష్యంలోగా పూర్తిచేయాలని బీఎచ్‌ఈఎల్ అధికారులను ఆదేశించారు. విద్యుత్ ప్లాంట్ల్ నిర్మాణం, విద్యుత్ సంస్థల అనుసంధానం తదితర అంశాలను జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సీఎంకు వివరించారు. పవర్ ప్లాంట్ల నిర్మాణం, నిర్వహణకు అవసరమైన నీరు అందించడంతోపాటు ఇతర సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి అధికారులకు తెలిపారు.

వచ్చే వానకాలం నుంచే గోదావరి జలాలు తీసుకోవాలి వచ్చే వానకాలం నుంచే వీలైనంత ఎక్కువగా గోదావరి జలాలను తీసుకునేలా అన్ని పనులు సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్టీపీసీలో విద్యుత్ ప్లాంట్ పనులు పరిశీలన అనంతరం పెద్దపల్లి జిల్లాలోని ధర్మారం మండలం నందిమేడారంవద్ద కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఆరో ప్యాకేజీ పనులను పరిశీలించారు. ఇక్కడ నిర్మాణంలో ఉన్న సొరంగ మార్గాలను, పంప్‌హౌజ్‌లను, సర్జ్‌పూల్స్, సబ్‌స్టేషన్లను పరిశీలించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో భాగంగా మేడిగడ్డ నుంచి గోదావరి జలాలు అన్నారం, సుందిళ్ల మీదుగా ఎల్లంపల్లి ప్రాజెక్టుకు చేరుకుంటాయి. ఎల్లంపల్లి నుంచి 9.53 కిలోమీటర్ల సొరంగమార్గం ద్వారా మేడారం గ్రామ పరిధిలోని భూగర్భ సర్జ్‌పూల్‌కు చేరుతాయి. 9.53 కిలోమీటర్ల టన్నెల్‌ను పది కిలోమీటర్ల మేరకు ఆంగ్ల అక్షరం డీ ఆకారంలో నిర్మిస్తున్నారు. మేడారం సర్జ్‌పుల్‌లోకి చేరిన గోదావరిజలాలను మేడారం చెరువులోకి పంపడానికి 124.5మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఏడు మోటర్లు అవసరమని ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు సీఎంకు వివరించారు. స్థానికంగా కొండలు, గుట్టలు ఉన్నందున 400మెగావాట్ల సామర్థ్యం కలిగిన నాలుగు సబ్‌స్టేషన్లను భూగర్భంలోనే నిర్మిస్తున్నట్లు తెలిపారు.

ఈ మెటార్ల బిగింపు బాధ్యత తీసుకున్న బీఎచ్‌ఈఎల్ అధికారులతో ముఖ్యమంత్రి వాటి సామర్థ్యం పనితీరు, ఇతర అంశాలపై చర్చించారు. మోటర్ల బిగింపు ఎప్పటిలోపు పూర్తి అవుతుందని ఆరా తీశారు. మొత్తం ఏడు పంపు సెట్లలో వచ్చే జూన్ నాటికి రెండు, డిసెంబర్ నాటికి మొత్తం పంపుసెట్లు బిగిస్తామని బీఎచ్‌ఈఎల్ జీఎం సుందర్‌రాజన్ తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కన్నెపల్లి పంపుహౌజ్ నుంచి నీటిని అన్నారం, సుందిళ్ల, ఎల్లంపల్లి నుంచి మేడారం వరకు మొత్తం 105మీటర్ల ఎత్తుకు నీటిని తరలించడమే కీలక ఘట్టమని సీఎం అన్నారు. వచ్చే ఎండాకాలం లోగా పనులను పూర్తి చేసి నీటిని ఎత్తిపోయడానికి సిద్ధంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. వచ్చే వానకాలంనుంచి గోదావరి నుంచి సాధ్యమైనంత నీటిని తీసుకోవాలని చెప్పారు. ఇందుకు కావాల్సిన అన్ని పనులను సమాంతరంగా ముందుకు తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు. రోజుకు రెండు టీఎంసీల నీటిని గోదావరి నుంచి తీసుకొని ఒక టీఎంసీ నీటిని ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద వరదకాల్వ ద్వారా శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎత్తిపోయాలని, మరో టీఎంసీ నీటిని మిడ్‌మానేరుకు తరలించడానికి కావాల్సిన పనులు పూర్తిచేయాలని సూచించారు. అనంతరం మేడారం నుంచి హెలికాప్టర్‌లో కరీంనగర్ జిల్లా రామగుండం మండలం లక్ష్మీపూర్‌కు చేరుకున్నారు. ఇక్కడ 8వ ప్యాకేజీ పనులను కొంతసేపు విహంగ వీక్షణం చేశారు. ఆ తదుపరి లక్ష్మీపూర్‌వద్ద పంప్‌హౌస్, 400 కేవీ విద్యుత్తు ఉపకేంద్రం పనులను పరిశీలించారు. ఈ పనుల వివరాలను నీటి పారుదలశాఖ మంత్రి టీ హరీశ్‌రావు, శాఖ ఈఎన్సీ మురళీధర్, సీఈ వెంకటేశ్వర్లు సీఎంకు వివరించారు.

ఇక్కడ నీటిని లిఫ్ట్ చేయడానికి 139 మెగావాట్ల సామర్ధ్యం కలిగిన ఏడు పంపులు నడిపించేందుకు అవసరమైన 973 మెగావాట్ల విద్యుత్‌ను అందించేందుకు ఏర్పాట్లుచేస్తున్నట్టు సీఎంకు ట్రాన్స్‌కో సీఎండీ తెలిపారు. లక్ష్మీపూర్ నుంచి ఎత్తిపోసిన నీటిని వరద కాల్వ 99వ కిలోమీటరు వద్ద కలుపాలని సీఎం అధికారులకు సూచించారు. ప్రతి రోజు రెండు టీఎంసీల నీటిని పంప్ చేయడానికి ఏర్పాట్లు చేయాలని చెప్పారు. పంపుహౌస్ వద్ద నిర్మించిన కెనాల్ దగ్గరున్న మట్టిని తొలిగించాలని ఆదేశించిన ముఖ్యమంత్రి.. గ్రావిటీద్వారా నీళ్లు సజావుగా వెళ్లడానికి కావాల్సిన సీసీ లైనింగ్ చేయాలని సూచించారు. ప్రాజెక్టుల వద్దకు అధికారులు త్వరగా చేరుకునేందుకు రోడ్డు నిర్మించాలన్నారు. అనంతరం భోజనం చేసిన సీఎం.. కొద్దిసేపు అధికారులతో మాట్లాడారు.

నేడు ప్రగతి భవన్‌లో సమావేశం కాళేశ్వరం ప్రాజెక్టు పనులపై శనివారం ఉదయం ప్రగతిభవన్‌లో పూర్తిస్థాయిలో సమీక్ష నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. క్షేత్రస్థాయిలోప్రాజెక్టు పనులను గురు, శుక్రవారాలలో విస్తృతంగా పర్యటించి పరిశీలించిన సీఎం.. అక్కడి అధికారులతో కాసేపు మాట్లాడారు. ఈ పర్యటనలో తన దృష్టికి వచ్చిన అంశాలను శనివారం నాటి సమీక్షలో చర్చిస్తారని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. లక్ష్మీపూర్ వద్ద పనుల పరిశీలన అనంతరం కొద్దిసేపు అధికారులు, నిర్మాణ ఏజెన్సీలతో సీఎం మాట్లాడారు. ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించి ఏమైనా భూసేకరణ సమస్యలు, ఇతర సమస్యలు ఉన్నాయా అని అధికారులను అడిగారు. ఎటువంటి సమస్యలు లేవని అధికారులు బదులిచ్చారు. తుపాకులగూడెం నుంచి లక్ష్మీపూర్‌వరకు నిర్మాణం జరుగుతున్న పనులు, పంపుహౌస్‌లు, బరాజ్‌ల పనులపై ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించాల్సి ఉందన్నారు. వాస్తవానికి షెడ్యూలు ప్రకారం శుక్రవారం లక్ష్మీపూర్ వద్దే సమీక్షా సమావేశాన్ని నిర్వహించాల్సి ఉన్నా.. సమయాభావంతో సమావేశాన్ని శనివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో నిర్వహించనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. క్షేత్రస్థాయి ప్రాజెక్టుల సందర్శనవల్ల తనకు మంచి అవగాహన వచ్చిందని, ఇప్పటివరకు సాగిన పనులు, ఇంకా చేపట్టాల్సినవి, వీటికోసం ఏ విధంగా ముందుకు వెళ్లాలో శనివారం ఉదయం 11.00 గంటలకు ప్రగతి భవన్‌లో నిర్ణయించుకుందామని అధికారులకు తెలిపారు.

ఈ సమావేశానికి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల కలెక్టర్లతోపాటు నీటి పారుదల శాఖ సీఈలు, ఎస్‌ఈలు, ఈఈలు, బీహెచ్‌ఈఎల్, జెన్కో, ట్రాన్స్‌కో, అటవీశాఖల అధికారులతోపాటు నిర్మాణ ఏజెన్సీలైన ఎల్‌అండ్‌టీ, నవయుగ, అఫ్కాన్, మెఘా వంటి కంపెనీల ప్రతినిధులు రావాలని సీఎం కోరారు. నాలుగైదు గంటలపాటు చర్చించుకుంటే ప్రాజెక్టులపై మరింత అవగాహన పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. రెండ్రోజులపాటు సాగిన ముఖ్యమంత్రి ప్రాజెక్టుల పర్యటన విజయవంతం కావడంపై హర్షం వ్యక్తంఅవుతున్నది. రెండో రోజు పర్యటనలో ముఖ్యమంత్రి వెంట నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్, ప్రభుత్వ చీఫ్ విఫ్ కొప్పుల ఈశ్వర్, కరీంనగర్, పెద్దపల్లి ఎంపీలు వినోద్‌కుమార్, బాల్క సుమన్, చొప్పదండి ఎమ్మెల్యే బొడిగె శోభ, పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు వివేక్, ఐడీసీ చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్‌హుస్సేన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జోగినపల్లి సంతోష్‌కుమార్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్, డీజీపీ మహేందర్‌రెడ్డి, నీటిపారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఎస్‌కే జోషి, సీఎంవో అదనపు కార్యదర్శి స్మితాసబర్వాల్, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ఆయా జిల్లాల వివిధ ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.

ప్రతి ఎకరాకు సాగునీరు లక్ష్మీపూర్ నుంచి జగిత్యాల జిల్లా మల్యాల మండలం రాంపూర్‌కు వెళ్లిన సీఎం.. అక్కడ ఎస్సారెస్పీ పునర్జీవ పథకం కింద సాగుతున్న పంపుహౌస్ పనులను పరిశీలించారు. వరదకాల్వ, కెనాల్, పంపుహౌస్ బెడ్స్ లెవల్స్‌ను నిశితంగా చూశారు. ఇక్కడి నుంచి నీటిని ఎత్తిపోసేందుకు అమర్చుతున్న మోటర్లు, వాటి సామర్థ్యం ఇతర వివరాలపై అధికారులతో మాట్లాడారు. రాంపూర్ పంపుహౌస్ వద్ద ఒక సూయిజ్ (తూము) ఏర్పాటుచేసి పరిసర ప్రాంతంలో వ్యవసాయానికి సాగునీరు ఇచ్చే అంశాన్ని కూడా పరిశీలించాలని, అందుకు సంబంధించిన డీపీఆర్ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ఒక్క ఎకరా కూడా మిగులకుండా మొత్తం వ్యవసాయ యోగ్య భూమికి సాగునీటి వసతి కల్పించే లక్ష్యంతో సాగునీటి ప్రాజెక్టులకు రూపకల్పన చేశామని తెలిపారు. రాష్ట్రంలో రైతులు ఇక భవిష్యత్‌లో వర్షానికి ఎదురుచూసే పరిస్థితి లేకుండా సాగునీటి ప్రాజెక్టులతో ప్రతి ఎకరాకు సాగునీరు అందించేలా ప్రణాళిక రూపొందించాలని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావును, అధికారులను సీఎం ఆదేశించారు. రోహిణి కార్తెలోనే నాట్లు పడేలా ఉండాలని, మార్చి లోపే యాసంగి పంటల ప్రక్రియ పూర్తి ఆయ్యే విధంగా రైతులకు సాగునీటిని అందించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

కాళేశ్వరం ప్రాజెక్టులోని పంపుహౌస్‌లు అన్ని పూర్తికాగానే వచ్చే జూన్ నుంచి గోదావరి బేసిన్‌లోని అన్ని జిల్లాల్లో ఉన్న చెరువులు, కుంటలను యుద్ధ ప్రాతిపదికన నింపడానికి సిద్ధంగా ఉండాలని సూచించారు. ఎక్కడా సాగునీరు అందని భూములను లేకుండా గోదావరి బేసిన్‌లోని నదులు, కాల్వలపై చెక్‌డ్యాంల ఏర్పాటుకు అంచనాలు తయారు చేయాలని అదేశించారు. మానేరు రివర్‌లో నాలుగు నుంచి ఐదు, మూలవాగు రివర్‌లో రెండు నుండి మూడు వరకు, ఇంకా అవసరం ఉన్న చోట చెక్ డ్యాంల నిర్మాణానికి ప్రణాళిక తయారుచేయాలన్నారు. ముందుగా దీనికి అవసరమయ్యే సర్వే చేయాలని అధికారులను అదేశించారు. దేవాదుల నుంచి వరంగల్ జిల్లా మొదలుకొని తుంగతుర్తి, సూర్యాపేట, కోదాడ వరకు సాగునీటిని అందించాలన్నారు. వ్యవసాయం తరువాత అతిపెద్ద వ్యాపారంగా చేపల పెంపకం నిలుస్తుందని సీఎం అన్నారు. తెలంగాణలోని రైతులు రాళ్లవాన కష్టాలు పడకుండా యాసంగి పంట సాగును మార్చి 20లోపే పూర్తియ్యేలా సాగునీరు ఇవ్వాలని ముఖ్యమంత్రి సూచించగా.. అక్కడ ఉన్న ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు మార్చిలోపు యాసంగి పంటలు పూర్తి అయితే విద్యుత్‌శాఖకు చాలా మేలు అన్నారు. దీంతో.. సీఎం జోక్యం చేసుకుంటూ అవును.. ప్రతిచోటా మీ పవర్ ఉండాల్సిందేనా అనడంతో అక్కడ నవ్వులు విరిశాయి. ఏమైనా మీకు (విద్యుత్‌శాఖ)కు రుణపడి ఉన్నామని సీఎం చెప్పారు. జగిత్యాలలో వందశాతం రికార్డుల ప్రక్షాళన పూర్తిచేసినట్లుగా ఆ జిల్లా కలెక్టర్ శరత్ ముఖ్యమంత్రికి రాంపూర్ వద్ద వివరించారు. జిల్లాలో 4,52,920 తప్పులను సవరించి రికార్డులను శుద్ధిచేసినట్టు తెలిపారు. ఈ సందర్భంగా మల్యాల మండలం రాంపూర్ గ్రామ భూముల వివరాలు, నక్షాతో రూపొందించిన చేతిరాత పహాణీని ముఖ్యమంత్రి అవిష్కరించారు. భూ రికార్డుల ప్రక్షాళన వంద శాతం పూర్తిచేసినందుకు కలెక్టర్‌ను, రెవెన్యూ అధికారులను అభినందించారు. తదుపరి రాజన్న-సిరిసిల్ల జిల్లాలో ఉన్న మధ్యమానేరు ప్రాజెక్టును విహంగ వీక్షణం చేసి, హైదరాబాద్ వెళ్లిపోయారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.