Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడుతాం

గోదావరి, కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులను కాపాడి తీరుతామని నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు స్పష్టం చేశారు. భేషజాలు, పంతాలు, పట్టింపులు తమకు లేవనీ, తెలంగాణ భవిష్యత్తు నీటి అవసరాలను తీర్చడమే తమ ప్రభుత్వ లక్ష్యాలని పేర్కొన్నారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ అనుమతులు తీసుకువచ్చినట్లుగా రుజువుచేస్తే తాను రాజీనామా చేస్తానని సవాలు విసిరారు. ఇందుకు కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. అసత్యప్రచారాల తీరును కాంగ్రెస్ నేతల విజ్ఞతకే వదిలివేస్తున్నానని అన్నారు. ఆదివారం శాసనమండలిలో ప్రాణహిత-చేవెళ్ల నీటిపారుదల ప్రాజెక్టు రీడిజైనింగ్, సీతారామ ఎత్తిపోతల పథకం నిర్మాణంపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సుదీర్ఘ వివరణ ఇచ్చారు.

Harish-Rao-addressing-on-irrigation-in-assembly

-ప్రాజెక్టులపై భేషజాలు, పంతాలు లేవు -తెలంగాణ ప్రజల ఆకాంక్షలకే ప్రాధాన్యం -కాంగ్రెస్ హయాంలో ప్రాణహితకు ఒక్క అనుమతి రాలేదు -వచ్చినట్లు రుజువు చేస్తే రాజీనామాకు సిద్ధం -త్వరలో తెలంగాణ, మహారాష్ట్ర సీఎంల సమావేశం -శాసనమండలిలో మంత్రి హరీశ్‌రావు

2007-14 వరకు ఉమ్మడి రాష్ట్రంలో అధికారంలో కొనసాగిన కాంగ్రెస్ ప్రాణహిత-చేవెళ్లపై మహారాష్ట్రతో నాలుగుసార్లు చర్చలు జరిపినా ఎలాంటి ఒప్పందాలు కుదుర్చుకోలేకపోయిందని అన్నారు. జాతీయహోదా విషయంలో పోలవరం ప్రాజెక్టుపై ఇచ్చిన స్పష్టత కేంద్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్లపై ఇవ్వలేదన్నారు. విమర్శలకోసం కాకుండా, గతంలో జరిగిన సంఘటనలు ప్రజలకు తెలవాలనే ఉద్దేశంతోనే అన్ని వివరాలు చెబుతున్నామని అన్నారు. త్వరలో తెలంగాణ-మహారాష్ట్ర ముఖ్యమంత్రుల సమావేశం జరుగనున్నదని, ప్రాజెక్టులకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు జరుగనున్నాయని వివరించారు. కాంగ్రెస్ సభ్యులు షబ్బీర్ అలీ, ఎం రంగారెడ్డి, టీఆర్‌ఎస్ సభ్యులు పల్లా రాజేశ్వర్ రెడ్డి, బోడకుంటి వెంకటేశ్వర్లు తదితరులు అడిగిన ప్రశ్నలకు మంత్రి హరీశ్‌రావు ఓపికగా సమాధానాలు చెప్పారు.

ప్రాణహిత- చేవెళ్ల ప్రాజెక్టుకు కాంగ్రెస్ హయాంలోనే 18 అనుమతులు వచ్చాయని కాంగ్రెస్ సభ్యుడు ఎం రంగారెడ్డి పేర్కొనడంతో మంత్రి హరీశ్‌రావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆ అనుమతులు వచ్చినట్లుగా రుజువుచేస్తే తన పదవికి రాజీనామా చేస్తానని, ఇందుకు మీరు సిద్ధమేనా అని రంగారెడ్డికి సవాలు విసిరారు. ఇంతలో మండలిలో కాంగ్రెస్‌పక్ష నేత షబ్బీర్ అలీ జోక్యం చేసుకుని అంతపెద్ద సవాళ్లు వద్దని, తెలంగాణ ప్రజలకు న్యాయం జరగాలనే ప్రయత్నంతోనే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని అన్నారు.

మహారాష్ట్రతో ఒప్పందాలేవి? మహారాష్ట్రలో చాలా గ్రామాలు ముంపునకు గురవుతాయన్న ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆందోళనలను గమనించి తమ్మిడిహట్టి వద్ద ఎఫ్‌ఆర్ స్థాయిని 148 మీటర్లకు తగ్గించాల్సివచ్చిందని, మేడిగడ్డ నుంచి ఎల్లంపల్లి బ్యారేజీకి నీటిని పంపించడానికి ప్రాణహితసంగమ స్థానం సమీపంలో గోదావరినదిపై బ్యారేజీ నిర్మాణాన్ని ఖరారు చేశామని మంత్రి హరీశ్‌రావు వివరించారు. గతంలో ఎలాంటి ఒప్పందాలు లేకుండా రూ. 17 వేల కోట్లు వ్యయం చేశారని, రంగారెడ్డి జిల్లాలో కాల్వలు తవ్వారని అన్నారు. ఇంద్రావతి వద్ద మాత్రమే 300 రోజులు నీటి లభ్యత ఉన్నందున 160 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునేందుకు, 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశామని, తెలంగాణ జిల్లాల్లో కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే సంకల్పంతో, ప్రతినీటిచుక్కనూ సద్వినియోగం చేయాలనే ఆశయంతో ప్రాజెక్టుల రీడిజైనింగ్ చేశామని చెప్పారు. మహారాష్ట్రతో ఒప్పందాలపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

పల్లం నుంచి నీటిని పైకి పంపాలి.. పల్లపు ప్రాంతం నుంచి 400 మీటర్ల ఎత్తులో ఉన్న తెలంగాణ ప్రాంతాలకు నీళ్లు అందించాలంటే తక్కువ ఖర్చుతో, ఎక్కువ ప్రయోజనం పొందేలా తెలంగాణ ఇంజినీర్లు చాలా శ్రమించారని మంత్రి పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణలో ఎత్తైన ప్రాంతంలో ఉన్న ఆదిలాబాద్‌లోని లక్షా 50 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలనే సంకల్పంతో రీడిజైనింగ్‌లో చాలా అంశాలను పొందుపరిచామని, నిజాంసాగర్, శ్రీరాంసాగర్, మిడ్ మానేరు, ఎల్లంపల్లి, సింగూరు వంటి ప్రాజెక్టులలో ఇప్పటికీ స్థిరీకరించిన ఆయకట్టుకు నీటికష్టాలు లేకుండా చేయాలని, గ్రావిటీద్వారా మంచినీటి సమస్యలను తీర్చాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు. నీటికోసం తండ్లాడిన తెలంగాణను సస్యశ్యామలం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.

 

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.