Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గోదావరి నీళ్లతో కాళ్లు కడిగి దుబ్బాక రుణం తీర్చుకుంటా

-సవాలు చేస్తే.. ముఖం చాటేశారు
-గతంలో నీళ్లు లేని బోర్లు
-నేడు కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ఏడాదికి రెండు పంటలు
-కేంద్రం తెచ్చిన మూడు వ్యవసాయ బిల్లులపై దేశమంతా ఆగ్రహం
-ఎవరి ఇంటి అడుగులో వారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు
-బాయిలకాడ మోటరుకు మీటరు పెడ్తామన్న వారిని ఓడించాలి
-చేగుంట రైతు బహిరంగ సభలో మంత్రి తన్నీరు హరీశ్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 27న నూతన వ్యవసాయ బిల్లు నమూనా రాష్ర్టాలకు పంపింది. ఎవరికీ సబ్సిడీపై కరంట్‌ ఇవ్వొద్దు.. ఉచిత కరంట్‌ ఇయ్యద్దు.. ఎంత కరంట్‌ కాలుస్తరో లెక్క తీయాలె.. బిల్లు చేతిలో పెట్టాలె.. అని అందులో రాసింది . బాయిలకాడ మీటర్లు పెడితే మీకు లెక్కస్తది.. ఇగో మీరు లెక్క తీయుండ్రి.. సబ్సిడీ లేకుండా రైతు చేతిలో బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వం మన తెలంగాణకు పంపించిన బిల్లు అది.

మే 17న కేంద్రం మళ్లా ఇంకో ఉత్తరం రాసింది. మేము చెప్పినట్టు బాయిలకాడ మీటర్లు పెట్టే పనిచేస్తే.. తెలంగాణ రాష్ర్టానికి రూ.2,500 కోట్లు ఇస్తమని లేఖ రాసింది.
‘మనం ఎటు దిక్కు ఉందాం.. మీటర్లు వద్దనుకునేటోళ్లందరూ బీజేపీని పాతర పెట్టాలె.. మనం 300 ఫీట్లు వేస్తే బోరు పడ్తది. గా బోర్లకాడ మీటర్లు పెడుతామంటే 300 మీటర్ల లోతుకు బీజేపీని పాతర పెట్టి మళ్లా మీటర్ల ముచ్చట మాట్లాడకుంట చెయ్యాలె.. ఇగ కాంగ్రెసోళ్లు కూడా ఓటెయ్యాలని వస్తున్నరు. ఒక్కసారి అక్కాచెల్లెండ్లు యాది చేసుకోవాలె.. మీ భర్త లు ఎప్పుడు కరంట్‌ వస్తదో, ఏ దొంగరాత్రి వస్తదో అని బాయిలకాడ పిట్టకు ఎదురుచూసినట్టు ఎదురుచూసిన్రు. గా కాంగ్రెస్‌కు ఓటేస్తమా? గతంలో మోటర్లకు రూ.10 వేలు, ట్రాన్స్‌ఫార్మర్లు కాలితే రూ.30 వేలు ఖర్చయ్యేది. ఇయ్యాల కాలుతున్నయా మోటర్లు? యాసంగిలో ఒక్క గుంటనన్న ఎండిందా? ఇయ్యాల మన సీఎం కేసీఆర్‌ 24 గంటలు కరంట్‌ ఇస్తున్నడు’ అని ఆర్థికశాఖ మంత్రి టీ హరీశ్‌రావు పేర్కొన్నారు. దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా చేగుంటలో బుధవారం టీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో రైతు బహిరంగ ర్యాలీ నిర్వహించారు. వడియారం నుంచి కిలోమీటరు పొడవున నిర్వహించిన ర్యాలీలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు బండ ప్రకాశ్‌, ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, అభ్యర్థి సోలిపేట సుజాత, ఎమ్మెల్సీ ఫారూఖ్‌ హుస్సేన్‌, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి, జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత తదితరులతో కలిసి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. రైతులను కడుపులో పెట్టుకొని చూసుకునేది సీఎం కేసీఆర్‌ అని చెప్పారు. ఇంట్లో నల్లా తిప్పితే మిషన్‌ భగీరథ నీళ్లు వస్తాయని, రేపు పొలంలోకి గోదావరి నీళ్లొస్తాయని తెలిపారు. గతంలో ఎండాకాలం వచ్చిందంటే బోర్లకు ఫుల్‌ గిరాకీ ఉండేదని, 10-15 బోర్లు వేసినా నీరు వచ్చేది కాదని అన్నారు. బొంబాయి, దుబాయి పోయి సంపాదించిన పైసలు, మన అక్కాచెల్లెళ్ల పెయి మీదున్న బంగారమంతా బోరు బాయిలల్లనే పోసినామని హరీశ్‌రావు గుర్తుచేశారు. ఇప్పుడు బోర్లు అవసరం లేదని, కాళేశ్వరం కాల్వతో రెండు పంటలు పండించుకోవచ్చని చెప్పారు. ఇది టీఆర్‌ఎస్‌ పార్టీతోనే సాధ్యమైందని అన్నారు. చంద్రబాబు పాలనలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే.. ఇదే బీజేపీ నేతలు తిన్నది అరుగక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారని, వ్యవసాయం దండుగ అని మాట్లాడారని, కానీ సీఎం కేసీఆర్‌ వ్యవసాయాన్ని పండుగచేసి చూపించారని పేర్కొన్నారు. బీజేపీ 17 రాష్ర్టాల్లో, కాంగ్రెస్‌ 4 రాష్ర్టాల్లో అధికారంలో ఉన్నదని ఎక్కడా రైతుకు పెట్టుబడి కింద వానకాలం రూ.5వేలు, యాసంగికి రూ.5వేలు ఇస్తున్నరా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు.

మన మక్కలు ఎవలు బుక్కాలె?
‘బీజేపోళ్లు మన పిల్లలకు సీసలిస్తరట.. గా సీసలతో బతుకుతమా? కాళేశ్వరం నీళ్లు జీవితాంతం వస్తయి.. మన బతుకులు మారుతయి. గోదావరి నీళ్లు తెచ్చి మీ కాళ్లు కడిగి రుణం తీర్చుకుంటా’ అని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ‘బీజేపీ వాళ్లు విదేశీ మక్కలు తెచ్చి మన కోళ్లకు పోస్తరట. మరి మన చేగుంట మక్కలు ఎవలు బుక్కాలె? ఫారిన్‌ మక్కలొస్తే మన మక్కలకు గిరాకీ ఉంటదా? మన మక్కలు పండించే రైతు నోట్లో మట్టి గొట్టే బీజేపీకి ఓటేద్దామా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మార్కెట్లను ప్రైవేటుపరం చేస్తున్నదని, రైతుకు మద్దతు ధరలేకుండా కొత్త బిల్లు తెచ్చారని మంత్రి చెప్పారు. ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ దేశమంతా రైతులు అగ్గి మీద గుగ్గిలం అయితన్నరని తెలిపారు. ఏ కారణంతోనైనా రైతు చనిపోతే 10 రోజుల్లో రూ.5 లక్షల చెక్కును ఇంటికి పంపుతున్నది టీఆర్‌ఎస్‌ ప్రభుత్వమన్నారు. వడ్లు, మక్కలు ఎండబోసుకోవడానికి కల్లాలు కట్టిస్తున్నామన్నారు.

కాంగ్రెస్‌ పుర్రె గుర్తును, బీజేపీ జీఎస్టీని తెచ్చింది
‘బీడీ కార్మికులకు కాంగ్రెస్‌ పార్టీ పుర్రె గుర్తు ఇచ్చింది. బీజేపీ జీఎస్టీ తెచ్చింది. నెలకు 15 రోజులు బీడీల ఆకు దొరుకతలేదు. పని దొరుకకుండా చేసిన్రు. కానీ మన సీఎం కేసీఆర్‌ అక్కాచెల్లెళ్లకు రూ.2016 ఇచ్చి కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నరు’ అని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ‘దవాఖానకు కాన్పుకు పోతే కేసీఆర్‌ కిట్‌.. రూ.12 వేలు ఇస్తున్నరు. ఆటో కిరాయి లేకుండా ఇంటికాడా దించిపోతున్నం.. ‘బీజేపీవి అన్ని ఝూటా మాటలు. కేసీఆర్‌ కిట్‌లో మా పైసలు ఉన్నయి అంటున్నరు. బీడీల పెన్షన్‌లో మా పైసలు ఉన్నయి అంటున్నరు.. కాగితాలు తీసుకొని రండి అంటే వచ్చిన్రా? ముఖం చాటేసిన్రు? అబద్ధాల పునాదుల మీద నాలుగు ఓట్లు సంపాదించుకోవాలని చూస్తున్నరు’ అని హరీశ్‌రావు విమర్శించారు.

బంజరు భూముల్లో బంగారు పంటలు
ఆనాడు తెలంగాణలో కరంటు, నీళ్లు లేక భూములన్నీ పడావులుగా మారాయని, ఇవాళ కరంట్‌, కాళేశ్వరం నీళ్లతోని బంగారు భూములుగా మారాయని చెప్పారు. కొద్దిరోజుల్లో ఎవరి ఇంటి అడుగులో వారికి డబుల్‌ బెడ్‌రూం ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. మోసం చేయాలని చూసే కాంగ్రెస్‌, బీజేపీలకు గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. చేగుంటలో సుజాతకు పెద్ద మెజార్టీ ఇవ్వాలని మంత్రి హరీశ్‌రావు కోరారు. ఎండను సైతం లెక్క చేయకుండా చేగుంట మండలంలోని వివిధ గ్రామాల నుంచి రైతులు పెద్దఎత్తున తరలివచ్చారు. కొంతమంది రైతులు గులాబీ కండువాను తలకు చుట్టుకొని వచ్చారు. వివిధ వేషధారణలతో వచ్చిన ప్రజలతో చేగుంట గులాబీమయంగా మారింది.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.