Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గొలుసుకట్టే ఆయువుపట్టు!

-ఒక్కో గొలుసుకట్టులో 20-70 చెరువులు -త్రిముఖ వ్యూహంతో చెరువుల అనుసంధానం -ప్రణాళికాబద్ధంగా ఒక్కో చెరువు నింపాలి -ప్రాజెక్టుల నీరు చుక్క కూడా వృథా కావొద్దు -ఏడాదంతా నిండుకుండల్లా చెరువులు -మండలాలవారీగా ఇరిగేషన్ మ్యాపులు -చెరువులు నింపేందుకు ఏడాదిలో కాల్వలు -సమగ్ర అవగాహనకు ఇంజినీర్లతో త్వరలో భేటీ -ప్రాజెక్టుల కాల్వల ద్వారా గొలుసుకట్టు చెరువుల -అనుసంధానంపై సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష

కాకతీయుల కాలం నుంచి వారసత్వంగా వచ్చిన అద్భుతమైన గొలుసుకట్టు చెరువులను ఆయువుపట్టుగా మార్చుకొని తెలంగాణలోని సాగునీటిని సద్వినియోగం చేసుకోవాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ భూభాగంనుంచి ఒక్క చుక్కనీరు కూడా జారిపోకుండా, ఎక్కడికక్కడ ఒడిసిపట్టి చెరువులకు మళ్లించాలన్నారు. 365 రోజులపాటు తెలంగాణలోని అన్ని చెరువులు నిండుకుండలను తలపిస్తూ కళకళలాడాలని చెప్పారు. భారీ, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టుల కాల్వలద్వారా గొలుసుకట్టు చెరువుల అనుసంధానం అనే అంశంపై ప్రగతిభవన్‌లో శనివారం సీఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, భారీ, మధ్యతరహా ప్రాజెక్టుల కాల్వలు, వర్షం, పడబాటు (రీజనరేటెడ్) నీళ్లద్వారా.. త్రిముఖ వ్యూహంతో చెరువులను నింపే ప్రణాళిక ఖరారుచేయాలని చెప్పారు. నేషనల్ రిమోట్ సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్నార్‌ఎస్‌ఏ), ఇస్రోద్వారా చేయించిన గొలుసుకట్టు చెరువుల మ్యాపింగ్‌పై ఇరిగేషన్ అధికారులు పవర్‌పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు.

గొప్ప వారసత్వ సంపద మనది గొలుసుకట్టు చెరువుల రూపంలో మనకు గొప్ప వారసత్వ సంపద ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. 1974లోనే బచావత్ ట్రిబ్యునల్ తెలంగాణలోని చెరువులకు 265 టీఎంసీలను కేటాయించిందంటే అంత పెద్దమొత్తంలో నీటిని నిల్వ సామర్థ్యమున్న గొప్ప సంపద మనకు చెరువుల రూపంలో ఉన్నది. కానీ సమైక్యపాలనలో చెరువులు ధ్వంసమయ్యాయి. తెలంగాణ వచ్చిన వెంటనే మిషన్ కాకతీయతో చెరువులను పునరుద్ధరించుకున్నాం. వ్యయప్రయాసలకోర్చి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నాం. ఆ ప్రాజెక్టులద్వారా తీసుకున్న నీరు ఒక్కచుక్క కూడా వృథాకాకుండా చెరువులకు మళ్లించాలి. గొలుసుకట్టు చెరువులు రాష్ట్రవ్యాప్తంగా ఉన్నాయి. ఒక్కో గొలుసు కట్టులో 20-70 చెరువులున్నాయి. వాటిలో మొదటి చెరువును గుర్తించి, దానిని ప్రాజెక్టు కాల్వకు అనుసంధానించాలి. మొదటి చెరువు నింపుకొంటూపోతే కింది చెరువులూ నిండుతాయి. దీనికోసం కట్టుకాల్వ (ఫీడర్ చానల్), పంటకాల్వ (క్రాప్ కెనాల్)లను సిద్ధంచేయాలి. ప్రతి మండల ఏఈ దగ్గర ఆ మండల చెరువుల మ్యాపులుండాలి. ఏ కెనాల్ ద్వారా ఏ చెరువు నింపాలో వ్యూహం ఖరారుచేయాలి. ఏ చెరువు అలుగుపోస్తే ఏ చెరువుకు నీరు పారుతుందో తెలిసుండాలి. ప్రాజెక్టు కాల్వల నుంచే కాకుండా, వేల సంఖ్యలో నిర్మిస్తున్న చెక్‌డ్యాంలు, పడబాటు, వర్షంద్వారా వచ్చే ప్రతి నీటి బొట్టును చెరువులకు మళ్లించాలి. తెలంగాణలో నీళ్లు పరిగెత్తకూడదు. మెల్లగా నడిచి వెళ్లాలి. అప్పుడే నీటిని సమర్థంగా, సంపూర్ణంగా వినియోగించుకోగలుగుతాం. నదులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెక్‌డ్యాంలు, చెరువులు.. ఇలా అన్నింట్లో నిండా నీళ్లుంటే తెలంగాణ వాతావరణమే మారిపోతుంది. వర్షాలు కూడా కురుస్తాయి. భూగర్భజలాలు పెరుగుతాయి అని సీఎం అన్నారు.

రెండు నెలల్లో వ్యూహం ఖరారు కావాలి… రాబోయే రెండునెలల్లో గొలుసుకట్టు చెరువులన్నీ నింపే వ్యూహం ఖరారుచేయాలని, ఏడాదిలో అన్ని చెరువులు నింపడానికి అవసరమైన కాల్వల నిర్మాణం చేపట్టాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. దీనికి నిధులు వెంటనే విడుదలచేస్తామని చెప్పారు. వచ్చే ఏడాది జూన్‌నుంచి కాళేశ్వరం నీళ్లు పుష్కలంగా వస్తాయని, ఆ నీటిని సద్వినియోగం చేసుకోవాలంటే చెరువుల అనుసంధానం పూర్తికావాలన్నారు. దీన్ని అత్యంత ముఖ్యమైన పనిగా నీటిపారుదలశాఖ గుర్తించాలని కోరారు. చెరువులు, కట్టుకాల్వ, పంటకాల్వలను పునరుద్ధరించడంతోపాటు అవి కలకాలం బాగుండేలా చర్యలు తీసుకోవాలన్నారు. గతంలో ఆయకట్టుదారులే కాల్వ లు, తూముల మరమ్మతులు చేసుకునేవారని, ఎండాకాలంలో చెరువుల్లో ఎప్పటికప్పుడు పూడిక తీసేవారని చెప్పారు. మళ్లీ ఆ పాత రోజులు రావాలని, దీనికోసం గ్రామాల ప్రజల్లో అవగాహన, చైతన్యం కలిగించాలని చెప్పారు.

చెరువుల అనుసంధానంపై సమగ్ర అవగాహన కల్పించేందుకు త్వరలోనే నీటిపారుదల ఇంజినీర్లతో సమావేశం నిర్వహించనున్నట్లు సీఎం ప్రకటించారు. నేల విడిచి సాము చేయడం మంచి పద్ధతికాదు. వాస్తవిక దృక్పథంతో వ్యవహరించాలి. ప్రాధాన్యాలను గుర్తించాలి. వాటి ఆధారంగా పనిచేసుకుపోవాలి. రాష్ట్రంలో 65% వ్యవసాయరంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరే మనకు ప్రధానం. ఇంతవరకు వ్యవసాయాన్ని అప్రాధాన్యరంగంగా చూశారు. అది దురదృష్టకరం. యూరప్, అమెరికా దేశాల్లో రైతుకు, ఉత్పత్తి.. ఉత్పాదకత పెంచడానికి అధిక ప్రాధాన్యం ఇస్తారు. మన దగ్గర, ముఖ్యంగా సమైక్య పాలనలో రైతులు దారుణ వంచనకు గురయ్యారు. తెలంగాణ వచ్చిన తర్వాత రైతు సంక్షేమం, వ్యవసాయాభివృద్ధి కోసం అనేక చర్యలు తీసుకుంటున్నాం. రైతుబంధు కార్యక్రమానికి దేశవ్యాప్తంగా ప్రశంసలు వస్తున్నాయి. ఆర్థికవేత్తలు అభినందిస్తున్నారు. రైతుబంధును పథకాన్ని ఒక మార్గదర్శకంగా అరవింద్ సుబ్రమణ్యం అభివర్ణించారు. వాస్తవిక దృక్పథంతో ఆలోచించబట్టే ఇంత మంచి పథకాల రూపకల్పన జరిగింది అని సీఎం చెప్పారు.

సంపూర్ణంగా వాటా వినియోగానికి చర్యలు నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరిచేందుకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చామని, గోదావరి, కృష్ణా నదుల్లో మన వాటాను సంపూర్ణంగా వినియోగించుకునేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని సీఎం అన్నారు. ఇంకా ఎక్కడెక్కడ నీటిని సమర్థంగా వినియోగించుకోవడానికి అవకాశం ఉందో గుర్తించాలన్నారు. అక్కడ అవసరమైన లిఫ్టులు, కెనాల్స్, రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణం చేపట్టాలని, కడెంకు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా ఉండే కుప్టి ప్రాజెక్టుకు వెంటనే టెండర్లు పిలవాలని ఆదేశించారు. దీనిద్వారా కుంటాల జలపాతానికి కూడా నీటి వనరు ఏర్పడుతుందన్నారు. కృష్ణాలో కూడా కావాల్సినంత నీరు ఉందని, ఈ నీటినీ సమర్ధంగా వినియోగించుకునే వ్యూహం అమలుచేయాలని చెప్పారు. సమావేశంలో డిప్యూటీ సీఎంలు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు కే కేశవరావు, బీ వినోద్‌కుమార్, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్‌రెడ్డి, ఏనుగు రవీందర్‌రెడ్డి, గువ్వల బాలరాజు, దివాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్, నీటిపారుదల శాఖ ఈఎన్సీ మురళీధర్‌రావు, సీఈలు, ఎస్‌ఈలు పాల్గొన్నారు.

గొలుసుకట్టులోనే 25,948 చెరువులు ఒక చెరువు అలుగుపోస్తే కింద చెరువుకు నీళ్లొస్తాయి. అదీ అలుగుపోస్తే దాని కింద ఉన్న చెరువు.. ఇలా సుమారు 125 చెరువులు ఒకదానికొకటి అనుసంధానంగా ఉంటే! అవే తెలంగాణలోని గొలుసుకట్టు చెరువులు. కాకతీయులు, రెడ్డిరాజులు, కుతుబ్‌షాహీలు, అసఫ్‌జాహీల నుంచి వారసత్వంగా వచ్చిన వ్యవస్థ. ఇలా 25వేలకు పైగా చెరువులు ఒకదానికొకటి అనుసంధానంగా ఉన్నాయి. ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షాసమావేశంలో కాడా కమిషనర్ డాక్టర్ మల్సూర్ ఇచ్చిన ప్రజెంటేషన్‌లో ఇలాంటి ఆసక్తికర అంశాలెన్నో ఉన్నాయి. రాష్ట్రం ఏర్పడేనాటికి తెలంగాణలో సుమారు 46,500 చెరువులు బతికి బట్టకట్టినట్టు నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. వర్షాధారంగా కాకుండా ఏడాది పొడవునా ఇవి జలకళ సంతరించుకునేందుకు భారీ, మధ్యతరహా ప్రాజెక్టులతో అనుసంధానం చేయాలనేది సీఎం ఆలోచన. కొన్నిరోజుల కిందటే నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు గొలుసుకట్టు చెరువుల వ్యవస్థ ముఖచిత్రాన్ని అధికారులు రూపొందించారు.

ప్రాజెక్టుల పరిధిలో 16,700 చెరువులు రాష్ట్రంలో ఇప్పటివరకు కాల్వల వ్యవస్థ పూర్తయిన భారీ, మీడియం ప్రాజెక్టుల కమాండ్ ఏరియాలో 16,700 చెరువులున్నట్టు సర్వేలో తేలింది. ఆయా ప్రాజెక్టుల ద్వారా వీటన్నింటినీ నింపేందుకు అవకాశం ఉన్నదన్నమాట. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి, డిండి, సీతారామ వంటి ప్రాజెక్టులు పూర్తయితే వీటి సంఖ్య అనూహ్యంగా పెరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని చెరువులనూ నింపవచ్చని అధికారి ఒకరు తెలిపారు.

తెలంగాణలో నీళ్లు పరుగెత్తకూడదు. అవి మెల్లగా నడిచి వెళ్లాలి. అప్పుడే నీటిని సమర్థంగా, సంపూర్ణంగా వినియోగించుకోగలుగుతాం. నదులు, కాల్వలు, రిజర్వాయర్లు, చెక్‌డ్యాంలు, చెరువులు.. ఇలా అన్నింట్లో నిండా నీళ్లుంటే తెలంగాణ వాతావరణమే మారిపోతుంది. వర్షాలు కూడా కురుస్తాయి. భూగర్భజలాలు పెరుగుతాయి. – ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.