Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గవర్నర్ పాలనకు కుట్ర!

-బాబు లాబీయింగ్‌కు తలొగ్గుతున్న కేంద్రం.. -గవర్నర్ అధికారాల పేర రాష్ర్టానికి సర్క్యులర్ -సీమాంధ్రుల పరోక్ష పాలనకు రంగం సిద్ధం? -సినీ, రాజకీయ పెద్దల చీకటి సమావేశం.. హైదరాబాద్‌ను యూటీ చేయాలని పట్టు -కేంద్రానికి లేఖ రాసిన చంద్రబాబు.. భూ పరిపాలన గవర్నర్‌కు ఇవ్వాలని డిమాండ్ -రాష్ర్టానికి అందిన కేంద్రం సర్క్యులర్ -రెండు కమిషనరేట్లు, రంగారెడ్డి పోలీసింగ్ గవర్నర్‌కు -హైదరాబాద్‌కు జనాభా దామాషాలో సీమాంధ్ర పోలీసులు -ఉమ్మడి పోలీస్ సర్వీస్ బోర్డు ప్రతిపాదన -తీవ్రంగా వ్యతిరేకించిన సీఎం కేసీఆర్ -ప్రతిపాదనలకు దీటైన జవాబు పంపడానికి సిద్ధం

babu

తెలంగాణవాసుల నెత్తురు మరిగే అంశం.. హైదరాబాద్‌ను యూటీచేసే పథకం.. అవును.. సరిగ్గా అదేకుట్ర మళ్లీ ముందుకు వస్తున్నది. కాకపోతే గవర్నర్ పాలన ముసుగులో.. మరో రూపంలో. ఆరు దశాబ్దాలుగా తాము కట్టుకున్న అక్రమ సామ్రాజ్యాలను తెలంగాణవాడు బద్దలుకొడుతుంటే.. గురుకుల్, గోకుల్, ఎన్‌కన్వెన్షన్, ఎఫ్‌డీసీ.. ఇలా ఒక్కటొక్కటిగా చేజారిపోతుంటే గుండెజారిన సీమాంధ్రబాబులు, అక్రమ రియల్టర్లు, సినీ, మీడియా, పెట్టుబడిదారులు రహస్య సమావేశాలుపెట్టి పథకాలు పన్నుతున్నారు. అలుపెరుగని ఉద్యమం, పన్నెండు వందల మంది బలిదానాలతో సాధించిన స్వరాష్ట్రం గుండెలమీద సీమాంధ్రులు రాజ్యం సాగించే కుట్రచేస్తున్నారు. సందేహం లేదు.. ఈ చీకటి కుట్రకు కథానాయకుడు మళ్లీ చంద్రబాబే. స్వాతంత్య్రం సాధించిన ఆనందం తెలంగాణవాసుల ముఖంమీద తాజాగా ఉండగానే కండ్ల ముందే దాన్ని కబళించే కుట్రకు ఆయనే తెరతీశారు. గవర్నర్‌కు మరిన్ని అధికారాలు ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ మీదకు ఉసిగొల్పుతున్నారు. ఈ విపత్కర స్థితిలో తెలంగాణ సమాజానికి అప్రమత్తత అవసరం. తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ రాష్ట్రంపై మళ్లీ సీమాంధ్ర కుట్రలు మొదలయ్యాయి. హైదరాబాద్‌ను దొంగదారిలో ఏలేందుకు పచ్చమూకలు కుట్రలకు పాల్పడుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం అక్రమ కబ్జాలపై యుద్ధం ప్రకటించడంతో బెంబేలెత్తిన సీమాంధ్ర శక్తులు నగరంలో తెలంగాణ సర్కారే లేకుండా చేయాలని పథకం రచించాయి. ఈ కుట్రలకు ఆజ్యం పోస్తూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గవర్నర్ అధికారాలు పెంచాలని, కీలకమైన రెవెన్యూ భూపరిపాలన కూడా గవర్నర్‌కే అప్పగించాలంటూ కేంద్రానికి లేఖ రాశారు. శాంతిభద్రతలు పూర్తిగా గవర్నర్ చేతిలో పెట్టాలని, నగరంలోని ఇద్దరు కమిషనర్లు సహా డీఎస్‌పీలు, సీఐలుకూడా గవర్నర్ అధీనంలోనే ఉండాలని అందులో డిమాండ్ చేశారు. ఈ మేరకు కేంద్రం వద్ద బలమైన లాబీయింగ్ జరిపారు.

ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్ర గవర్నర్‌కు అనేక అధికారాలు కట్టబెట్టే ప్రతిపాదనలున్న 12 అంశాలతో కూడిన ఒక సర్క్యులర్‌ను కేంద్రం రాష్ర్టానికి పంపింది. ఇందులోని అంశాలే కనుక అమలు చేస్తే తెలంగాణ రాజధానిలో తెలంగాణ ప్రభుత్వమే ఉండదు. హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి జిల్లాలను గవర్నర్ చేతికి అప్పగించాల్సి వస్తుంది. రాజధానిపై తెలంగాణ మంత్రివర్గం తీసుకునే నిర్ణయాలు కూడా గవర్నర్ రద్దు చేయవచ్చునంటూ ఇందులో పొందుపరిచిన ఒక్క నిబంధనే చాలు.. ఈ సర్క్యులర్ ఎవరికోసం..ఎందుకోసం రెక్కలు కట్టుకుని వాలిందో…! ఈ ప్రయత్నాలపై సీఎం కేసీఆర్ యుద్ధం ప్రకటించారు. రాజ్యాంగంలోని ఫెడరల్ స్ఫూర్థికి విరుద్ధంగా చేసిన ప్రతిపాదనలకు కేంద్రానికి దీటైన జవాబు పంపడానికి సంసిద్ధమయ్యారు. ఆదివారం పార్టీ ఎంపీలతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై పార్లమెంటులో పోరాడాలని ఆ పోరాటం దేశమంతా ప్రతిధ్వనించాలని పిలుపునిచ్చారు.

అసలు కథ ఏంటి? తెలంగాణ భూములు అడ్డంగా కబ్జా చేసి కోట్లు కొల్లగొట్టిన సినీ పరిశ్రమ పెద్దలు, సీమాంధ్ర పెట్టుబడిదారులు, రెండు ముఖ్య పార్టీల రాజకీయ పెద్దలు ఇటీవలే ఓ రహస్య సమావేశం ఏర్పాటు చేశారు. ఈ విషయాన్ని నిఘావర్గాలు కూడా ధృవీకరించాయి. ఈ సమావేశంలో ఇటీవల తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భూముల స్వాధీనం అంశాన్ని ప్రముఖంగా చర్చించారు. ప్రభుత్వం ఇంకా పలు కబ్జాలపై దృష్టి సారించనున్న నేపథ్యంలో వీటిని అడ్డుకోవాలంటే రాజధానిని యూటీగా మార్చేలా ఒత్తిడి చేయాలన్న అభిప్రాయం వ్యక్తమైంది.

సాధ్యపడని పక్షంలో విభజన చట్టంలో ఉన్న వెసులుబాటును ఉపయోగించి గవర్నర్ చేతికి హైదరాబాద్ పాలన అప్పగించేలా లాబీయింగ్ చేయాలని నిర్ణయించారు. తద్వారా తమ అక్రమ ఆస్తులు రక్షించుకోవడంతో పాటు పదేళ్ల పాటు హైదరాబాద్ మీద పెత్తనం చెలాయించవచ్చునని అభిప్రాయపడ్డారు. ఈ చీకటి సమావేశానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరయ్యారని నిఘా వర్గాల సమాచారం. తర్వాత ఈ కుట్రదారులంతా కేంద్రం పెద్దలను కలిసినట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిని యూటీగానీ ఆ తరహా విధానం కానీ అమలు చేయాలని, తెలంగాణ ప్రభుత్వాన్ని నామమాత్రంగా మార్చాలని వీరంతా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి చేసినట్టు తెలిసింది. ఈ కుట్రకు లాబీయింగ్ జరిపిన వారిలో సినీ హీరో పవన్ కల్యాన్, నాగార్జున వంటి వారు కూడా ఉన్నట్టు తెలిసింది.

కేంద్రానికి చంద్రబాబు లేఖ… ఈ సమావేశాలు, లాబీయింగ్ తర్వాత ఉమ్మడి రాజధానిలో గవర్నర్ పాత్ర, అధికారాలపై ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. హైదరాబాద్ పరిపాలన గవర్నర్ చేతికి అప్పగించాలని అందులో కోరారు. నగరంలో శాంతి భద్రతల పరిరక్షణ మొత్తం గవర్నర్‌కే అప్పగించాలని, ఉమ్మడి రాజధానిలో ఇరు ప్రాంతాల పోలీస్ సిబ్బందిని నియమించాలని చంద్రబాబు ఆ లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి రాజధాని స్ఫూర్థి నిలపాలంటే రాజధానికి సంబంధించిన రెవెన్యూ, భూ పరిపాలన అంశాలు కూడా గవర్నర్‌కే అప్పగించాలని ఆయన అందులో కోరారు. హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు, రంగారెడ్డి జిల్లా ఎస్పీలు తెలంగాణ ప్రభుత్వంతో పనిలేకుండా నేరుగా గవర్నర్‌కే రిపోర్ట్ చేసేలా సిఫారసు చేయాలని చంద్రబాబు ఆ లేఖలో డిమాండ్ చేశారు.

కేంద్ర హోంశాఖ నుంచి లేఖ… ఇదిలా ఉంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు ఉమ్మడి గవర్నర్‌గా ఉన్న నరసింహన్ పదేళ్ల ఉమ్మడి రాజధానిలో తన పాత్ర, అధికారాల పరిధిపై కేంద్ర హోంశాఖను కొన్ని వివరాలు గతంలో అడిగారు. అపుడు సమాధానం పంపని కేంద్రం చంద్రబాబు లేఖ అందగానే గవర్నర్ లేఖను సాకుగా చూపుతూ కేంద్ర హోంశాఖ పేరు మీద తెలంగాణ ప్రభుత్వానికి ఒక సర్క్యులర్ పంపింది. రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్ 8 ప్రకారం ఉమ్మడి రాజధాని పోలీస్ వ్యవస్థలో కామన్ పోలీస్ బోర్డు ఏర్పాటు చేసి, అందులో ఇరు రాష్ర్టాల పోలీస్ అధికారులకు స్థానం కల్పిస్తామని ప్రతిపాదించింది. ఇంకా అందులో పేర్కొన్న ప్రతిపాదనల ప్రకారం…హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి ఎస్పీలు శాంతి భద్రతల నివేదికలు నేరుగా గవర్నర్‌కే సమర్పిస్తారు. తీవ్రమైన అంశాల్లో గవర్నర్ ఆదేశాల మేరకే రక్షణ వ్యవస్థ పనిచేయాలి. పోలీసు సర్వీస్ బోర్డు ఏర్పాటు చేయాలి. ఇందులో తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు ఉంటారు. వీటి పరిధిలోని పోలీసుల బదిలీలన్నింటిపైనా అధికారం గవర్నర్‌దే. రాజధాని అంతా జనాభా ప్రాతిపదికన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ పోలీసు అధికారులను నియమిస్తారు. తెలంగాణ ఇతర జిల్లాల్లో కూడా అవసరమైతే శాంతి భద్రతలకు సంబంధించి నివేదికలను గవర్నర్ నేరుగా అడగవచ్చు. మొత్తంగా రాజధానిని సీమాంధ్ర పోలీసులతో నింపడం. తెలంగాణ ప్రభుత్వానికి అధికారం అనేదే లేకుండా చేయడం ఈ సర్క్యులర్ ప్రధాన లక్ష్యంగా కన్పిస్తోంది.

సీఎం కేసీఆర్ యుద్ధ ప్రకటన… ఈ సర్క్యులర్‌లోని అంశాలపై సీఎం కేసీఆర్ తీవ్రంగా మండిపడ్డారు. తెలంగాణ ఉజ్వల భవిష్యత్తు కోసం హైదరాబాద్‌ను విశ్వనగరంగా మార్చే ప్రభుత్వ ప్రయత్నాలకు ఇది తీవ్ర విఘాతమని ఆయన భావిస్తున్నారు. ఆదివారం జరిగిన ఎంపీల సమావేశంలో ఈ అంశంపై ఆయన విస్తృతంగా చర్చ జరిపారు. దేశంలోని 28 రాష్ర్టాల్లో ఎక్కడా అమల్లో లేని వ్యవస్థను తెలంగాణ రాష్ట్రంలో అమలుచేయాలనడం చూస్తే కేంద్రం కక్షకట్టినట్లే అవుతుందని అన్నట్లు సమాచారం. ఫెడరల్ స్ఫూర్తిగా పూర్తిగా విరుద్ధమైన అంశాలతో కేంద్ర పంపిన సర్క్యూలర్‌కు దీటైన సమాధానం పంపిస్తామని, సర్క్యూలర్‌లోని అంశాలను ఎట్టిపరిస్థితుల్లో అంగీకరించేది లేదని కేసీఆర్ స్పష్టం చేసినట్లు సమాచారం.

తెలంగాణ పోలీసుల్లో అలజడి… ఇదిలాఉంటే హైదరాబాద్, సైబరాబాద్, రంగారెడ్డి పోలీస్ వ్యవస్థను గవర్నర్‌కే అప్పగిస్తే పరిస్థితి ఏమిటన్న దానిపై తెలంగాణ పోలీసుల్లో అలజడి మొదలైంది. 60 ఏళ్లుగా పోలీస్ శాఖలో ఏకపక్షనిర్ణయాలతో తెలంగాణ పోలీసులను తీవ్ర ఇబ్బందులు గురిచేసిన వైనాలు పునరావృతమవుతాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ అధికారులను మార్చి, వారికి సీమాంధ్రకు అనుకూలంగా వ్యవహరిస్తున్న ఈశాన్య రాష్ట్ర ఐపీఎస్‌లను ఆ పోస్టుల్లో నియమించేందుకే గవర్నర్ పాలనకు తెరదీస్తున్నారని ఉన్నతాధికారులు సైతం భయపడుతున్నారు.

సర్క్యులర్‌లోని అంశాలు…. -ఉమ్మడి రాజధాని పరిధిలో తీసుకునే నిర్ణయాలతో పాటు, తెలంగాణ రాష్ట్ర క్యాబినెట్ తీసుకునే నిర్ణయాలను కూడా సమీక్షించడానికి గవర్నర్‌కు అధికారం ఉంటుంది. -హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు, రంగారెడ్డి ఎస్పీలు శాంతిభద్రతలకు సంబంధించిన నివేదికలను గవర్నర్‌కే అందించాలి -తీవ్రమైన, అత్యంత తీవ్రమైన అంశాల్లో గవర్నర్ ఇచ్చే అదేశాల మేరకే రక్షణ వ్యవస్థ పనిచేయాలి -ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ర్టాలకు చెందిన ప్రజల మధ్య విద్వేషాలు (హేట్‌క్రైమ్) పెరిగినప్పుడు నిరోధించేందుకు ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేయాలి. దీనికి ఐజీస్థాయి ర్యాంకు అధికారి బాధ్యుడిగా ఉంటారు. హేట్‌క్రైమ్ విషయంలో సత్వర చర్యల అధికారం గవర్నర్‌దే -అంతర్గత భద్రత విషయంలో కూడా స్పెషల్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. దీనికి కూడా ఐజీస్థాయి అధికారి బాధ్యుడిగా ఉంటారు. -పోలీస్ సర్వీస్‌బోర్డును ఏర్పాటు చేయాలి. ఇందులో తెలంగాణ డీజీపీ, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్లు ఉంటారు. ఈ రెండు కమిషనరేట్ల పరిధిలోని డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌ఓల బదిలీల అధికారం గవర్నర్‌దే -రెండు కమిషనరేట్ల పరిధిలో జాయింట్ ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలి. రాష్ర్టాల ఫేర్‌షేర్ ప్రకారం డీసీపీ, ఏసీపీ, ఎస్‌హెచ్‌వోలు ఉండాలి -గవర్నర్ అవసరం అనుకుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను అదనపు బలగాలను అడుగవచ్చు -శాంతిభద్రతలకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుండి కూడా నివేదికలను కోరవచ్చు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.