Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గోయల్‌.. తెలంగాణకు క్షమాపణ చెప్పు..

-మా మంత్రులు రాష్ట్ర రైతుల ప్రతినిధులు
-మంత్రులు, ఎంపీలకు అవమానం దారుణం
-ఆరుగురు మంత్రుల కన్నా పెద్ద బృందం ఉంటదా?
-మేం ఢిల్లీకొచ్చింది.. బిచ్చమడిగేందుకు కాదు
-మీ బాధ్యతను మీకు గుర్తు చేసేందుకే వచ్చినం
-తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తున్నారు
-రైతుల ఓట్లు కావాలె కాని.. వాళ్ల వడ్లు వద్దా?
-వడ్లు కొనబోమన్న తొలి కేంద్ర సర్కారు మీదే
-మాట తప్పింది మీరు.. రాజకీయం చేస్తున్నదీ మీరే
-ధాన్యం కొనుగోళ్లు కేంద్రం పరిధిలోని అంశమే
-కేంద్రానికి రాష్ట్రం నుంచి ఏడు లేఖలు రాశాం
-కేంద్ర మంత్రి గోయల్‌పై మంత్రి హరీశ్‌ ఆగ్రహం

ఢిల్లీ పర్యటనకు వెళ్లిన రాష్ట్ర మంత్రులు, ఎంపీలనుద్దేశించి కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ చేసిన వ్యాఖ్యలపై ఆర్థిక మంత్రి టీ హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు కోట్ల ప్రజల తరఫున, 70 లక్షల రైతు కుటుంబాల తరఫున ప్రజాప్రతినిధులుగా వచ్చిన ఎంపీలను ‘మీకేం పనిలేదా?’ అని అవమానించడం దారుణమన్న హరీశ్‌రావు.. ఆ వ్యాఖ్యలు చేయడం ద్వారా యావత్‌ తెలంగాణ ప్రజలను గోయల్‌ అవమానపరిచారని మండిపడ్డారు.

ఈ వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకొని తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. బుధవారం మంత్రులు తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, వీ శ్రీనివాస్‌గౌడ్‌, విప్‌ గువ్వల బాలరాజు, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌, ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్‌, ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్య, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో కలిసి మంత్రి హరీశ్‌ మీడియాతో మాట్లాడారు. గోయల్‌ ఒక కేంద్రమంత్రిగా హుందాగా వ్యవహరించకుండా ఫక్తు రాజకీయనేతగా ప్రవర్తించారని హరీశ్‌ విమర్శించారు. ఒక రాష్ర్టానికి సంబంధించి ఆరుగురు మంత్రులు రావడం కంటే.. పెద్ద డెలిగేషన్‌ ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రతినిధుల బృందాన్ని ముందుగా కలువకుండా.. ముందుగా పార్టీ నేతలను పిలిపించుకొని మాట్లాడటం వెనుక మతలబేమిటని నిలదీశారు. అబద్ధాలు, అభాండాలు, గోబెల్స్‌ ప్రచారాలతో కేంద్ర ప్రభుత్వం రాజకీయం చేస్తున్నదని మండిపడ్డారు.

రైతుల ప్రయోజనాలే మా ప్రాధాన్యం

తెలంగాణ ప్రభుత్వం.. మంత్రులు, ఎంపీల మొదటి ప్రాధాన్యం రాష్ట్ర ప్రజల సంక్షేమం, రైతుల ప్రయోజనాలేనని మంత్రి హరీశ్‌రావు స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రం రాజకీయమే ప్రాధాన్యంగా ఉన్నదని విమర్శించారు. వానకాలంలో కేంద్రం ఇచ్చిన టార్గెట్‌ 40 లక్షల టన్నుల సేకరణ పూర్తయిందని.. మరో పది లక్షలు అదనంగానే సేకరించామని.. ఇంకా అదనంగా 30 లక్షల టన్నులు వచ్చేలా ఉన్నదని పేర్కొన్నారు. ఈ ధాన్యాన్ని కొంటారా? కొనరా? అని అడగడానికి వచ్చిన మంత్రులను అవమానిస్తారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

మంత్రులను అవమానించడమంటే.. తెలంగాణ ప్రజలను, రైతులను అవమానించినట్టేనని మండిపడ్డారు. ఇంతకంటే హేయమైన చర్య మరొకటి ఉండదన్నారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాల కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని.. అందుకే తమ మంత్రులు ఢిల్లీ వెళ్లారని తెలిపారు. ‘మాట తప్పింది మీరు.. మాట మార్చింది మీరు.. రాజకీయం చేస్తున్నదీ మీరే’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఒక ఓటు రెండు రాష్ర్టాల పేరుతో కాకినాడ తీర్మానం చేసి వెనక్కి తగ్గింది బీజేపీ కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటగలిపేలా చేసిన వ్యాఖ్యలను గోయల్‌ వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణ చెప్పాలని హరీశ్‌రావు డిమాండ్‌చేశారు.

రైతుల ఓట్లు కావాలి కానీ.. వాళ్లు పండించిన ధాన్యం వద్దా?
రైతుల ఓట్లు కావాలి కానీ.. వాళ్లు పండించిన ధాన్యం వద్దా? అని మంత్రి హరీశ్‌ బీజేపీని ప్రశ్నించారు. ఓట్లు వేయించుకొని.. రైతులను రోడ్డు పైకి తేవడం బీజేపీ కుటిలనీతికి నిదర్శనమని విమర్శించారు. ధాన్యం సేకరణ విషయంలో దేశం మొత్తం ఒకే విధానం ఉండాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్తు సరఫరా, సాగునీరు రాష్ర్టాల బాధ్యత అని.. వాటిని తాము వందశాతం నెరవేరుస్తున్నామని చెప్పారు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు, రైతుబంధు కింద ఏడాదికి రూ.14 వేల కోట్ల పెట్టుబడి సాయం, సాగునీరు, రైతుబీమా అందించామని, గోదాములు నిర్మించి, మార్కెట్లను అభివృద్ధి చేశామని గుర్తుచేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రం పరిధిలోనిదన్న హరీశ్‌రావు.. ఇప్పుడు ఆ బాధ్యతను విస్మరిస్తున్నదని మండిపడ్డారు. పంటల సేకరణ, ఎగుమతులు, దిగుమతుల బాధ్యతలను నిర్వహించడం చేతకాకపోతే రాష్ర్టాలకు అధికారాలు బదిలీ చేయాలని సూచించారు. కేంద్రం చేతులెత్తేస్తే రైతులే గుణపాఠం చెప్తారని పేర్కొన్నారు.

కేంద్ర మంత్రులది అసత్య ప్రచారం..
వానకాలం ధాన్యం కొనుగోలు, వచ్చే యాసంగి సేకరణ గురించి మాట్లాడకుండా గత వానకాలం, యాసంగి బియ్యాన్ని తెలంగాణ ఇవ్వలేదంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా.. వ్యాగన్లు, గోదాములు ఇవ్వడం లేదని రాష్ట్ర మంత్రులు చెప్తే.. ‘మీరు ఒక లేఖ అయినా రాశారా’ అని కేంద్రమంత్రి ప్రశ్నించడం పట్ల అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ విషయంలో తాము పది లేఖలు రాశామని చెప్తూ.. వాటిని మీడియాకు చూపించారు. ‘బియ్యం ఇస్తాం మహాప్రభో తీసుకో.. హమాలీలు, టెక్నికల్‌ పర్సన్‌ల సంఖ్యను పెంచుకో, గోదాములు లీజుకు తీసుకో’ అని చెప్తే పట్టించుకోలేదన్నారు.

పార్లమెంట్‌ సాక్షిగా పచ్చి అబద్ధాలు
పార్లమెంట్‌ సాక్షిగా దొంగే.. దొంగ.. దొంగ అన్నట్టు కేంద్ర మంత్రులు పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తాము కేంద్రం దగ్గర బిచ్చం ఎత్తుకోవడానికి రాలేదని స్పష్టంచేశారు. కేంద్రం బాధ్యతను గుర్తు చేసేందుకు వచ్చామన్నారు. దేశంలో మొట్టమొదటిసారిగా ప్రస్తుత బీజేపీ సర్కారే వడ్లు కొనడంలేదని.. గతంలో ఏ ప్రభుత్వమున్నా ధాన్యం కొన్నదని గుర్తుచేశారు. ఇప్పుడు ఎందుకు సమస్య సృష్టిస్తున్నారో అర్థం కావడంలేదని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఎంతో కష్టపడి రైతులకు భరోసా కల్పిస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతుల జీవితాలతో ఆడుకొంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పుడు ఉన్న ధాన్యాన్ని సేకరించకుండా వాళ్ల బాధ్యతారాహిత్యాన్ని తెలంగాణ ప్రభుత్వంపై నెట్టాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు. దీన్ని తెలంగాణ రైతులు, ప్రజలు అర్థం చేసుకొని బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని హరీశ్‌రావు కోరారు.

కొత్త రాష్ట్రమన్న ఆలోచన లేదు. దశాబ్దాలపాటు వ్యవసాయం దెబ్బతిని ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్నదన్న ధ్యాస లేదు. ఒకప్పుడు ఆత్మహత్యలతో అతలాకుతలమయ్యారన్న సానుభూతి లేదు. ఆదుకుందామన్న ఆర్తి అంతకంటే లేదు. ఎకసెక్కం మాటలు. ఎత్తిపొడుపు చేష్టలు. తెలంగాణ- రైతుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఆటలు. వచ్చే యాసంగి వడ్లు కొనబోమని తేల్చిచెప్పిన కేంద్రం, ఈ వానకాలం ధాన్యం ఎంత తీసుకుంటారని అడిగితే, మొత్తం తీసుకుంటామన్నది. అదే విషయాన్ని రాసివ్వాలంటే మాత్రం రాసివ్వదు. రేపు చెప్తామని మంగళవారం మాట ఇచ్చిన కేంద్ర మంత్రి గోయల్‌ మళ్లీ మాట తప్పారు. మిల్లుల నుంచి వచ్చిన ధాన్యాన్ని నిల్వచేసుకునే గోదాముల్లేక, తరలించుకునేందుకు రైల్వే ర్యాకుల్లేక, విషయంపై అవగాహన లేక చేతు లెత్తేసిన కేంద్రం ఎదురుదాడినే ఏకైక మంత్రంగా ఎంచుకున్నది. ప్రాజెక్టుల్లో అవినీతిపై విచారణ – రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు అంటూ అసలు సమస్యను పక్కదోవ పట్టించేందుకు సోషల్‌మీడియాలో వంతపాడుతున్నది. కేంద్రం ఏదో ఒకటి తేల్చేదాకా ఢిల్లీలోనే ఉండి ఒత్తిడి తేవాలని, ప్రధాని మోదీని కలిసేందుకు కూడా ప్రయత్నించాలని రాష్ట్ర మంత్రులు భావిస్తున్నారు.

ముందే చెప్పిన కేసీఆర్‌
వానకాలం వడ్లు కొంటారా.. కొనరా అంటే సమాధానం లేదు. కానీ యాసంగిలో వరి వేయాలని మాత్రం రైతులను ప్రోత్సహిస్తామంటే ఏం కావాలె? వీళ్ల నీతి ఏంది? వడ్లు కొనాలె.. కానీ కొనరు. ఈడ బజార్ల పోయాలే.. దాని మీద రాజకీయ నాటకం ఆడాలే. ఇదేనా నాటకం?

తెలంగాణ రైతులను బీజేపీ ఏం చేయనుందో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నవంబర్‌ 7నే చెప్పారు. బీజేపీ నేతల వ్యాఖ్యలు దీన్నే రుజువు చేయడం లేదూ!
రైతన్నలారా పారాహుషార్‌…

మీకేం పనిలేదా? ఎందుకు ఊర్కే ఢిల్లీకి వస్తారు?
మీరు ఢిల్లీకి వచ్చినప్పుడల్లా మేం కలవాల్నా?
తెలంగాణ నుంచి ఇప్పటికే ఎక్కువ ధాన్యం కొన్నం!
ఒత్తిడి తెచ్చినా యాసంగి ధాన్యం కొనే ప్రసక్తే లేదు!
ఇదీ తెలంగాణ రైతుల కోసం ఢిల్లీకి వెళ్లిన మంత్రులు

– ఎంపీల బృందంపై కేంద్ర మంత్రుల తీరు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.