Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గ్రామీణాభివృద్ధికి పిడికిలి బిగిద్దాం

-గ్రామాలు బాగుచేసుకుందాం.. కలిసికట్టుగా బంగారు తెలంగాణను నిర్మించుకుందాం -కేశవరం, లక్ష్మాపూర్ గ్రామసభల్లో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు -తెలంగాణలో ఇక రైతే పంట ధర నిర్ణయిస్తాడు -వచ్చే ఏడాదికి గోదావరి నీళ్లు.. బంగారు తెలంగాణను కండ్ల్లారా చూస్తాను -రైతు సంఘాల ఏర్పాటుకు సహకరించండి.. ప్రతి ఇంట్లో మొక్కలు నాటండి -ఆరు మొక్కలు సంరక్షిస్తే రెండు పాడిపశువులు.. లక్ష్మాపూర్ గ్రామస్థులకు సీఎం హామీ

గ్రామాల అభివృద్ధికి ప్రజలు కలిసికట్టుగా పిడికిలి బిగించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. తలరాతను మార్చుకునేందుకు కలిసికట్టుగా ముందుకు సాగుదామని అన్నారు. స్వరాష్ట్రం సాధించిన తర్వాత నీళ్లు, నిధులు, కరెంటుకు ఇబ్బందేమీ లేదని, అయితే వాటి ఫలితంగా ప్రజల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు సమిష్టిగా కృషిచేయాలని అన్నారు. పార్టీలు, రాజకీయాలు ఎన్నికలకే పరిమితం కావాలని, గ్రామాభివృద్ధిలో అంతా ఒకే తాటిమీదికి రావాలని అన్నారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రజల బాగుకోసం ప్రభుత్వం పాటుపడుతున్నదని, ప్రజలు ముందుకు వచ్చి పథకాలను సద్వినియోగపరుచుకొని బంగారు తెలంగాణ కోసం సహకరించాలని అన్నారు. మేడ్చల్ జిల్లా శామీర్‌పేట మండలం కేశవరం, లక్ష్మాపూర్ గ్రామాల్లో శుక్రవారం నిర్వహించిన గ్రామసభల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా రెండు గ్రామాల ప్రజలు తమ తమ సమస్యలను ప్రస్తావిస్తూ నిధుల మంజూరు కోరగా.. వారు అడిగిన వాటితో పాటు అదనంగా మరిన్ని సంక్షేమ అవసరాలకు సైతం సీఎం అక్కడికక్కడే నిధులు మంజూరు చేశారు. లక్ష్మాపూర్ ప్రజలతో మాట్లాడుతూ ఇంటిలో కనీసం ఆరు మొక్కలను నాటి జనవరిలో అధికారులు పర్యటించే వరకూ పరిరక్షించిన కుటుంబాలకు ఇంటికి రెండు పాడి పశువులను ఇస్తానని వాగ్దానం చేశారు.రానున్న రెండున్నరేండ్ల కాలంలో అందరూ సుఖసంతోషాలు, ఐష్టెశ్వర్యాలతో తులతూగే బంగారు తెలంగాణ తప్పకుండా సాధ్యపడుతుంది. ప్రజలు సంతోషంగా ఉండటాన్ని నేను కండ్లారా చూస్తాను.

పంటధరను రైతే నిర్ణయిస్తాడు.. పండించిన పంటకు రైతే ధరను నిర్ణయించే వ్యవస్థకు రూపకల్పన చేస్తున్నామని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తెలిపారు. ప్రపంచమంతా రైతు దీనస్థితిలోనే మగ్గుతున్నాడని, అభివృద్ధి చెందినవని చెప్పుకొనే పారిస్, లండన్‌లో కూడా రైతుల ఆలుగడ్డలకు ధరలేక రోడ్లపై పారబోసే పరిస్థితి ఉందని ఆయన చెప్పారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోనే మొదటిసారిగా ప్రభుత్వం తరఫున పటిష్టమైన రైతుసంఘాలను తెలంగాణలో ఏర్పాటు చేస్తున్నామని, ఆ ప్రక్రియ పూర్తయితే రైతులు నిర్ణయించిన ధరనే వ్యాపారులు చెల్లించే పరిస్థితి ఏర్పడుతుందని ఆయన తెలిపారు. రైతుకు రైతే శత్రువు కాకుండా ఉండేందుకు రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా పంటల సాగును చేపట్టేందుకు క్రాప్‌కాలనీలు ఏర్పాటుచేస్తామని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లాకు కూడా గోదావరి జలాలు తరలివస్తున్నాయని అన్నారు. వచ్చే సంవత్సరంనుంచి రైతులకు ఎకరానికి రూ.8వేలు పెట్టుబడి ఇస్తున్నామని, త్వరలో గ్రామానికి వచ్చే అధికారులకు రైతులు వాస్తవ వివరాలు ఇచ్చి సహకరించాలని కోరారు.

సీఎం కేసీఆర్ ప్రసంగం ఆయన మాటల్లోనే..బంగారు తెలంగాణను చూస్తాను రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను అమలుచేస్తూ ప్రజల బాగుకోసం పాటుపడుతున్నాం. పేద, మధ్యతరగతి స్త్రీలు గర్భిణులుగా ఉన్న సమయంలో పనిచేయకుండా రూ.12వేల ఆర్థిక సాయం, తల్లీబిడ్డ ఆరోగ్యానికి 16 వస్తువులతో కూడిన కేసీఆర్ కిట్ అందిస్తున్నాం. రూ.1000 పింఛన్ ఇస్తుండటంతో తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే కొడుకులు, కోడళ్లు తిరిగి ఇంటికి తెచ్చుకుంటున్నరు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్, హాస్టళ్లలో సన్నబియ్యం, తెల్లకార్డు అర్హులకు ఒక్కొక్కరికి 6 కేజీల బియ్యంతో ప్రజలకు మేలు జరుగుతున్నది. ఇట్ల ఇంకెన్నో చేసుకోబోతున్నాం. రానున్న రెండున్నరేండ్ల కాలంలో అందరూ సుఖ సంతోషాలు, ఐష్టెశ్వర్యాలతో తులతూగే బంగారు తెలంగాణ తప్పకుండా సాధ్యపడుతుంది. ప్రజలు సంతోషంగా ఉండటాన్ని రాబోయే కాలంలో నేను కండ్లారా చూస్తాను.

సమైక్య సమస్యలను పారదోలినం.. సమైక్య రాష్ట్రంలో ఏర్పడిన సమస్యలను తొలిగించుకుంటూ ముందుకు పోతున్నాం. 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. ప్రాజెక్టుల ద్వారా నీళ్లు ఇస్తున్నాం. హరితహారంతో పచ్చదనాన్ని పెంపొందిస్తున్నాం. విద్యావ్యవస్థలో గురుకులాలను ఏర్పాటు చేసుకుంటున్నాం. తెలంగాణలో ఉన్న కరెంట్ దరిద్రాన్ని పారదోలాం. ఇప్పటికే మూడు జిల్లాల్లో విజయవంతంగా 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. త్వరలో అన్ని జిల్లాలకు వస్తుంది. రైతులు ఆటోమేటిక్ స్టార్టర్లను తొలిగించాల్సిన అవసరం ఉంది.

లెక్కలు బరాబర్ కావాలి వచ్చే మే నాటికి ఎకరానికి రూ.8వేలు ఇచ్చి తీరుతాం. డబ్బులు ఇవ్వడానికి కొదువ లేదు. రైతుల ఖాతాల వివరాలు సమగ్రంగా లేకపోవడమే ఇబ్బంది. కేశవరం గ్రామం తీసుకుంటే వ్యవసాయ అధికారుల సర్వేలో 318 ఖాతాలు ఉంటే, రెవెన్యూ అధికారులు చేసిన సర్వేలో 976 ఖాతాలు ఉన్నాయని లెక్క తేలింది. ఇప్పుడు పైసలు 318 ఖాతాలకు వేయాల్నా? 976 ఖాతాలకు వేయాల్నా? ఇట్ల తప్పుడు లెక్కలతో రైతులకే నష్టం. రైతులు ఇమాన్‌దార్లు. అన్నదాత తప్పుడు లెక్క చెప్పడు. కొన్ని కారణాల వల్ల తప్పుడు లెక్కలు వస్తున్నయి. అధికారులు మళ్లీ సర్వే చేసి, రెవెన్యూ రికార్డు సరి చేస్తరు. నిజమైన రైతులను గుర్తించి ఎరువుల కొనుగోలు కోసం డబ్బులు ఇచ్చేందుకు గ్రామ రైతు సంఘాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాం. ఇందులో సభ్యులుగా సాగు చేస్తున్న రైతులే ఉంటారు. రైతులు అధికారులతో కలిసి నిజమైన లబ్ధిదారులను గుర్తించాలి.

రైతు సంఘాలే భవిష్యత్ నిర్దేశకులు సాధారణంగా ఒక రైతు పండించిన పంటకు ధర వస్తే మిగతా రైతులు అదే వేస్తున్నారు. తద్వారా అందరూ నష్టపోతున్నరు. రైతుకు రైతే శత్రువు అయితున్నడు. ఇది మనదగ్గరే కాదు. ప్రపంచం అంతటా ఉంది. బీబీసీ లండన్ వాళ్లు చూపించిన ఒక డాక్యుమెంటరీలో పారిస్, లండన్‌లో రైతుల ఆలుగడ్డలకు ధరలేక రోడ్లపై పారబోస్తున్న పరిస్థితిని చూపించారు. భారతదేశంలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే మన దగ్గర సమగ్రమైన విధానం లేదు. మన రాష్ట్రంలో కూడా మన ప్రజలకు ఏం కావాలి? మన రైతులు ఏం పండిస్తరు? అనే స్పష్టత లేదు. గత పాలకులు పాలన గురించి ఎన్నో మాటలు చెప్పిండ్రు కానీ సమగ్ర సమాచారం ఎందులోనూ లేదు. ఈ ప్రపంచంలో అందరూ తమ ఉత్పత్తికి ధర నిర్ణయించుకుంటున్నారు. కానీ ఒక్క రైతుకే ఆ అవకాశం లేదు. ధర దక్కుతలేదు. దళారులు మోసం చేస్తున్నరు. మన ధరను మనం నిర్ణయించుకోవాంటే రైతు సంఘాలు ఏర్పడాలి. క్రాప్ కాలనీలు కావాలి. ప్రపంచంలోనే మొట్టమొదట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంఘాలకు శ్రీకారం చుట్టింది. గ్రామం-మండలం-జిల్లా- రాష్ట్రస్థాయి సంఘాలు ఏర్పాటు చేస్తాం. రాష్ట్ర సమాఖ్యకు బడ్జెట్‌లో రూ.500 కోట్లు ఇస్తం. బ్యాంకులకు గ్యారెంటీ ఇస్తం. మండల సమాఖ్య పంట ధర చెప్తుంది. వ్యాపారులు ఇస్తే రైతు అమ్ముతడు. లేకుంటే రాష్ట్ర రైతు సమాఖ్యనే కొంటుంది. ధాన్యాన్ని మిల్లింగ్ చేసి ఇతర రాష్ర్టాల్లో అమ్మేందుకు అవకాశం ఇస్తాం. రైతులు ఏకం అయితరు కాబట్టి కొద్దోగొప్పో ధరకు కొనడం కాదు.. ఎమ్మార్పీ కంటే ఎక్కువకు కొంటామని దళారులు ముందుకు వస్తరు. రైతులకు మేలు జరుగుతుంది. ఒకవేళ ధర లేకపోతే రాష్ట్ర సంఘాలు కొంటాయి. ఉత్పత్తికి అపుడు ధర లేకపోతే గోదాంలలో ఉంచి ధర వచ్చినప్పుడు అమ్ముతారు.

ప్రతి ఇంటికీ ఆరు మొక్కలు నాటాలి ఒకప్పుడు హైదరాబాద్‌లో ఫ్యాన్లు లేకుండే. ఇప్పుడు 48 డిగ్రీల ఉష్ణోగ్రత అయింది. వర్షాలు పడుతలేవు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, సీఎం నిధులు ఇస్తరు. కానీ అన్నీ వాళ్లే చేయరు. మన ఇల్లు మనమే ఊడ్చుకోవాలి. పక్కింటి వాళ్లు చేయరు. అలాగే మన గ్రామాన్ని మనమే బాగు చేసుకోవాలి. చెట్లు ఉన్న గ్రామం మీదుగా వెళ్లే మేఘం తప్పకుండా వర్షిస్తుంది. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం నిదర్శనం. రాష్ట్రమంతా వర్షాలు లేకున్నా ప్రతిరోజు అక్కడ వర్షాలు పడుతున్నాయి. గుజరాత్‌లోని సూరత్‌లో రూ.500 కోట్ల నుంచి రూ.1000 కోట్ల ఆస్తులు ఉన్న వజ్రాల వ్యాపారులు ఉన్నారు. ఒకసారి అక్కడ ప్లేగు వ్యాధి ప్రబలి 2వేల మంది చనిపోయారు. ఆస్తులన్నింటినీ వదిలి ప్రత్యేక విమానాల్లో వ్యాపారులంతా పారిపోయారు. అంటే ఎంత ఆస్తి ఉంటే ఏమి అక్కరకు వచ్చింది? మన తాత, ముత్తాతలు చేసినట్టు మొక్కలు పెంచి, భవిష్యత్ తరాలకు బతుకునివ్వాలి. మన బిడ్డలకు ఎంత సంపాదించి పెట్టినా ఇక్కడే అనుభవించే పరిస్థితి లేకపోతే వృథానే కదా! వర్షం కోసం మొగులు మొకం చూడవద్దంటే.. మొక్కలు పెంచడం ఒక్కటే మార్గం.

కుటుంబ సభ్యుల పేర్లతో మొక్కలు ఇంటికి ఆరు మొక్కలు నాటాలి. పెద్దగా పెరిగే మొక్కలు వేప లాంటివి రెండు, మూడు, మిగతావి మీరు కోరుకున్నవి అధికారులు ఇస్తారు. కుటుంబ యజమాని, యజమానురాలు, కొడుకు, కూతురు, ఒకవేళ ఇంట్లో ఎవరైనా చనిపోయి ఉంటే వారి పేరుమీద మొక్కలు నాటి సంరక్షించాలి. ప్రతిరోజూ నీటిని మొక్కలకు అందించాలి. రానున్న రెండేండ్ల కాలంలో ఈ గ్రామంలో ఇండ్లు కాకుండా అన్నీ చెట్లే కనిపించాలి. లకా్ష్మపూర్‌లో ఆరు మొక్కలను నాటి వాటిని పరిరక్షించిన వారి గురించి జనవరిలో అధికారులు వచ్చి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తరు. అలా మొక్కలను కాపాడిన వాళ్లకు ఇంటికి రెండు పాడి పశువులు కొనిస్తాను. బర్రె అంటే బర్రె… ఆవు అంటే ఆవు ఇప్పిస్తాను లక్ష్మాపూర్ లో లక్ష్మీదేవి తాండవించాలి.

మీరే రావాలంటే వచ్చా.. గురువారం కేశవరం, లక్ష్మాపూర్ గ్రామాల్లో ఆగి ప్రజల మంచి చెడుల గురించి అడిగి వెళ్తుంటే ఒకాయన వచ్చి సారూ ప్రతి సంవత్సరం శామీర్‌పేట చెరువు నింపాలి అని అడిగాడు. రేపే మీ ఎమ్మెల్యే, ఎంపీని పంపిస్తా అంటే సారూ మీరే రావాలి.. మీ అంత ప్రేమగా ఎవరూ మాట్లాడరు అన్నరు. అందుకే షెడ్యూల్‌లో లేకపోయినా తెల్లవారంగనే వచ్చిన. ఒక్క శామీర్‌పేట చెరువే కాదు మేడ్చల్, శామీర్‌పేట, కీసర, ఘట్‌కేసర్ మండలాల్లో ఉన్న 374 చెరువులు, కుంటలను నింపి, సాగునీటిని అందిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 60-70 వేల ఎకరాల సాగుకు నీరు వస్తది. 620 మీటర్ల ఎత్తులో ఉన్న గజ్వేల్ నియోజకవర్గంలోని పాములపర్తి నుంచి 530 నుంచి 550 మీటర్ల ఎత్తులో ఉన్న నియోజకవర్గానికి నీళ్లు ఇబ్బంది లేకుండా వస్తాయి.

ప్రజలు పెట్టిన కిరీటాలవి.. ప్రజల వద్దకు వెళ్లి మాట్లాడితే మీలాగా ఏ ప్రజాప్రతినిధి ప్రేమగా, అప్యాయంగా మాట్లాడటం లేదని చెప్తున్నరు. సీఎం, పీఎం, ఎంపీ, ఎమ్మెల్యే ఏదైనా అన్నీ ప్రజలు పెట్టిన కిరీటాలని గుర్తించాలి. ప్రజలతో అప్యాయంగా మాట్లాడి, వారు చెప్పింది విని, ఉన్న వనరులు, నిధులతో సమస్యలను వేగవంతంగా పరిష్కరించాలి. పనులు చేయలేని పరిస్థితి ఉంటే అర్థమయ్యే విధంగా చెప్పాలి.

మూడుచింతలపల్లి మీద ప్రేమ ఎక్కువ నాకు మూడు చింతలపల్లి అంటే ప్రేమ ఎక్కువ. ఎందుకంటే అక్కడ తెలంగాణ ఉద్యమ యోధులు ఉన్నారు. 1969 నాటి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన మాజీ మంత్రి వెంకట్రాంరెడ్డి, వీరారెడ్డిలను కన్న గొప్ప గడ్డ. వారు చూపిన బాటలో తెలంగాణను సాధించుకున్నాం.

సీఎం రాకతో వెల్లివిరిసిన ఆనందోత్సాహాలు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా తమ గ్రామానికి వచ్చి సమస్యలు పరిష్కరించడం పట్ల రెండు గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. తాము ప్రతిపాదించిన అంశాలకు పూర్తి స్థాయిలో నిధులు కేటాయించడమే కాకుండా పలు అంశాలను ప్రత్యేకంగా సీఎం ప్రస్తావించి మరీ నిధులు మంజూరు చేయడం సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు. తనంత తానుగా ఆగి తమతో ముచ్చటించడమే కాకుండా తెల్లవారే తమ గ్రామానికి రాష్ట్ర స్థాయి అధికారులను వెంటబెట్టుకొని వచ్చి మరీ సమస్యలు పరిష్కరించడం వారిని ఆనందంలో ముంచెత్తింది. ఈ సందర్భంగా కేశవరం గ్రామసర్పంచ్ సీఎం కేసీఆర్‌కు రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్‌రెడ్డి, ఎంపీ మల్లారెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌రాజు, కూకట్‌పల్లి ఎమ్మెల్యే కృష్ణారావు, జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, మైనింగ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ శేరి సుభాష్‌రెడ్డి, గ్రామ సర్పంచ్‌లు మంజులారెడ్డి, శ్యామల, ఎంపీపీ చంద్రశేఖర్‌యాదవ్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు, సీఎం కార్యదర్శి స్మిత సబర్వాల్, హరితహారం రాష్ట్ర కో ఆర్డినేటర్ ప్రియాంకవర్గీస్, జేసీ ధర్మారెడ్డి, డీఈవో ఉషారాణి, డీఆర్వో సురేందర్‌రావు, ఇరిగేషన్ ఈఎన్‌సీ సురేందర్, మేడ్చల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ సత్యనారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు బాలేశ్, టీఆర్‌ఎస్ నాయకులు నక్క ప్రభాకర్‌గౌడ్, కమలాకర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు విష్ణుగౌడ్, సర్పంచ్‌లు శ్రీనివాస్, రవీందర్, మల్లేశ్, సుశీల, ఎంపీటీసీ సభ్యులు వీరప్ప, సక్రి, మల్లేశ్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

రూ.27 కోట్లు మంజూరు ఈ పర్యటనలో కేశవరం, లక్ష్మాపూర్ గ్రామాల్లో అభివృద్ధి పనులకు సీఎం కేసీఆర్ రూ.27 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కేశవరానికి వివిధ అభివృద్ధి పనుల నిమిత్తం రూ.12 కోట్లు, లకా్ష్మపూర్‌కు రూ.15 కోట్లు ఇస్తున్నట్టు ప్రకటించారు. కేశవరంలో సీసీ రోడ్లకు రూ.1.40 కోట్లు, డ్రైనేజీకి రూ.1.65 కోట్లు, పంచాయతీ రోడ్లు నిర్మాణానికి రూ.1.80 లక్షలు, శ్మశాన వాటికకు రూ.38 లక్షలు, మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌కు రూ.50 లక్షలు, గ్రంథాలయం, ఎల్‌ఈడీ దీపాలు, స్మృతివనం, ట్రాన్స్‌ఫార్మర్లు, గ్రామ పంచాయతీ భవన నిర్మాణం, విద్యుత్ స్తంభాలు, ప్రహరీగోడ, అంగన్‌వాడీ భవనం, డంపింగ్‌యార్డు, చెత్త సరఫరా వాహనాలు తదితర వాటి కోసం రూ.12 కోట్లు మంజూరు చేశారు. లకా్ష్మపూర్‌లో మల్టీపర్సన్ హాల్‌కు రూ.50 లక్షలు, మహిళా భవనానికి రూ.10లక్షలు, విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్, లక్ష్మాపూర్-మూడుచింతపల్లి, లక్ష్మాపూర్-కోట్యాల్ రోడ్ల నిర్మాణం, విద్యుత్ దీపాలు తదితర అభివృద్ధి పనులు కోసం రూ.15 కోట్లను ప్రకటించారు. వీటితో పాటు రెండు గ్రామాలకు 100 చొప్పున డబుల్ బెడ్‌రూం ఇండ్లను మంజూరు చేశారు. రెండు రోజుల్లో అభివృద్ధి పనులకు సంబంధించిన జీవోలు, ఉత్తర్వులు విడుదలవుతాయని, వెంటనే పనులు ప్రారంభించాలని సీఎం అధికారులు, ప్రజాప్రతినిధులకు సూచించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.