Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గ్రామజ్యోతి వెలిగిద్దాం

పల్లెల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన గ్రామజ్యోతి పథకం సోమవారం నుంచే ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఉదయం 11 గంటలకు వరంగల్ జిల్లా గంగదేవిపల్లిలో ఈ పథకానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇదే సమయానికి అన్ని జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు తాము దత్తత తీసుకున్న గ్రామాల్లో గ్రామజ్యోతి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలను పార్లమెంటు, అసెంబ్లీలో కాకుండా ఊరి నడిబొడ్డున ప్రజల సమక్షంలో గ్రామ సభల ఆమోదంతో రూపొందించడమే ఈ పథకం విశిష్టత. ప్రజల సంఘటిత శక్తిని వారికి తెలియపరిచి గ్రామాభివృద్ధిలో వారిని సంపూర్ణ భాగస్వాములను చేయడం పథకం ఉద్దేశం.

Gramajyothi-KCR

– నేడే గ్రామజ్యోతికి శ్రీకారం .. ముహూర్తం: ఉదయం11 గంటలకు – పథకాన్ని ప్రారంభించనున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు – సింగారించుకున్న గంగదేవిపల్ల్లి – గ్రామ స్వరాజ్యమే లక్ష్యం: సీఎం సందేశం – దత్తత గ్రామాల్లో కార్యక్రమాల్లో పాల్గొననున్న మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు – మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్‌కు మంత్రి కేటీఆర్ – భూరి విరాళాలతో ముందుకు వస్తున్న దాతలు మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తెలంగాణ గ్రామాల్లో సాధించేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని, ఈ మహత్తర ఆశయంలో భుజం భుజం కలిపి ముందుకు రావాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామజ్యోతి సందర్భంగా విడుదల చేసిన సందేశంలో ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ బృహత్ కార్యక్రమానికి చేయూతనివ్వడానికి ఇప్పటికే పలువురు దాతలు ముందుకు వస్తున్నారు. యశోదా వైద్యసంస్థల సంస్థాపకులు, ఫార్మా కంపెనీ అధినేతలు భారీ విరాళాలు అందించనున్నారు. వేలాది గ్రామాల్లో ప్రజలు తమ గ్రామాన్ని బాగు చేసుకునేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు.

నిధులన్నీ ఒకే గొడుగు కిందికి.. గ్రామపంచాయతీలకు వివిధ శాఖల నుంచి వచ్చే నిధులన్నింటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి, ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజల భాగస్వామ్యంతో ప్రతి రెండు నెలలకు ఒకసారి గ్రామసభలను నిర్వహించి, రాబోయే నాలుగేండ్లకు గ్రామ అవసరాలకు అనుగుణంగా గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించడం ఈ పథకంలో ముఖ్యాంశం.

విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశుద్ధ్యం, సామాజిక భద్రత, పేదరిక నిర్మూలన, మౌలిక వసతుల కల్పన.. వంటి ప్రధాన రంగాలకు సంబంధించి ప్రతి పంచాయతీలో గ్రామస్థాయి కమిటీలు ఏర్పాటు చేసి, వాటి ద్వారా నిధులు కేటాయించి నిర్దేశించిన లక్ష్యాలు, ఫలితాల సాధనను ఎప్పటికప్పుడు పర్యవేక్షించనున్నారు.

గ్రామజ్యోతి కార్యక్రమం కింద ఒక్కో గ్రామానికి సుమారు రెండు నుంచి ఏడుకోట్ల రూపాయలు అందనున్నాయి. పంచాయతీరాజ్ శాఖ మంత్రి కే తారకరామారావు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం అజీజ్‌నగర్ గ్రామంలో జరిగే గ్రామజ్యోతి పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

ఇదీ సీఎం టూర్.. సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి 10:30 గంటలకు వరంగల్ జిల్లా గీసుకొండ మండలం గంగదేవిపల్లికి చేరుకుంటారు. గంగదేవిపల్లిలో గ్రామజ్యోతి పథకాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు.

మధ్యాహ్నం గంగదేవిపల్లిలోనే భోజనం చేస్తారు. మధ్యాహ్నం 1గంటకు గంగదేవిపల్లి నుంచి బయలుదేరి 1:10 గంటలకు గీసుకొండ మండలం రాంపూర్, మేడిపల్లికి చేరుకుంటారు. అనంతరం 2గంటలకు రాంపూర్-మేడిపల్లి గ్రామాల్లో నిర్వహించే గ్రామజ్యోతి సభల్లో పాల్గొంటారు. గ్రామజ్యోతి పథకానికి రూ.50 లక్షల విరాళం ఇవ్వనున్న రాంపూర్ గ్రామానికి చెందిన యశోదా దవాఖానల అధిపతి గోరుకంటి సురేందర్‌రావును అభినందిస్తారు. అనంతరం సాయంత్రం 3:45 గంటలకు రాంపూర్-మేడిపల్లి నుంచి బయలుదేరి హైదరాబాద్ చేరుకుంటారు.

ఏర్పాట్లు పూర్తి… ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో వరంగల్ జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లలో తలమునకలైంది. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి, మహబూబాబాద్ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్, నర్సంపేట నియోజకవర్గ ఇన్‌చార్జి పెద్ది సుదర్శన్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్లపల్లి రవీందర్‌రావుతోపాటు జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ, వరంగల్ రేంజ్ డీఐజీ మల్లారెడ్డి, నగర పోలీసు కమిషనర్ సుధీర్‌బాబు, రూరల్ ఎస్పీ అంబర్ కిషోర్ ఝా తదితరులు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్న గ్రామాలను సందర్శించి ఏర్పాట్లు పరిశీలించారు. మేడిపల్లిలో సీఎం పాల్గొనే గ్రామజ్యోతి కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లను ఆదివారం ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి స్వయంగా పర్యవేక్షించారు.

అవగాహన సదస్సులు.. గ్రామజ్యోతి పథకానికి సంబంధించి ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా జిల్లాల్లో ఆయా జిల్లాలకు చెందిన మంత్రులు అవగాహన సదస్సులు నిర్వహించారు. కరీంనగర్ జిల్లాలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్, మెదక్ జిల్లాల్లో భారీ నీటి పారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు, నల్లగొండ జిల్లాలో విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, నిజామాబాద్‌లో వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్‌చైర్మన్ నిరంజన్‌రెడ్డి, ఖమ్మం జిల్లాలో రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రంగారెడ్డి జిల్లా రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులతో అవగాహన సదస్సులు నిర్వహించి గ్రామజ్యోతి కార్యక్రమ లక్ష్యాలు, ఉద్దేశాలను వివరించారు.

మహాత్ముని ఆశయ సాఫల్యమే లక్ష్యం సీఎం కేసీఆర్ సందేశం భారత దేశ ఆత్మ గ్రామాల్లోనే ఉంది.. గ్రామాల అభివృద్ధితోనే దేశ భవిష్యత్ ముడిపడి ఉన్నది. అన్న మహాత్మాగాంధీ ఆశయాన్ని నిజం చేసే దిశగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం త్రికరణ శుద్ధితో తలపెట్టిన ప్రయత్నమే గ్రామజ్యోతి అని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ఈ మేరకు గ్రామజ్యోతి సందేశాన్ని సీఎం విడుదల చేశారు. దేశంలో పంచాయతీరాజ్ పరిపాలనకు పునాదులు వేసిన మహానీయుడు ఎస్‌కే డే స్ఫూర్తితో స్థానిక సంస్థలను పునరుజ్జీవింపజేసి, బలోపేతం చేయడం ద్వారా పల్లె సీమల్లో నూతన కాంతులు నింపేందుకు తెలంగాణ ప్రభుత్వం గ్రామజ్యోతిని వెలిగిస్తున్నదని ఆయన పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి ప్రణాళికలను పార్లమెంటు, అసెంబ్లీల్లో కాకుండా గ్రామాల్లో ప్రజల సమక్షంలో గ్రామసభల్లో రూపొందిస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు వారి సంఘటిత శక్తి ఎంత గొప్పదో తెలియజేసి గ్రామాభివృద్ధిలో భాగస్వాములను చేస్తామన్నారు. సామూహిక కార్యాచరణతో గ్రామీణ ప్రాంతాల్లో నెలకొన్న సమస్యలన్నింటినీ పరిష్కరించడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు. గ్రామజ్యోతి పథకం గ్రామ పంచాయతీలను క్రియాశీలం చేసి ప్రజలకు జవాబుదారీగా మారుస్తుందన్నారు. సమష్టి నిర్ణయాలతో పారదర్శకంగా సంక్షేమ ఫలాలను ప్రజలందరికీ అందించడం, అభివృద్ధి ఫలాలను అట్టడుగు వర్గాల వరకు అందజేయడం కోసం ఆగస్టు 17 నుంచి 23వ తేదీ వరకు గ్రామజ్యోతిలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పారిశుద్ధ్యం, సాంఘిక భద్రత, పేదరిక నిర్మూలన, మరియు మౌలిక వసతుల కల్పన వంటి ఏడు అంశాల్లో పురోభివృద్ధికి ప్రభుత్వ శాఖలన్నింటినీ సమన్వయ పరుస్తున్నామని తెలిపారు.

73,74 వ రాజ్యాంగ సవరణల స్ఫూర్తితో నిధులు, విధులు, సిబ్బంది బదలాయింపులు గ్రామజ్యోతి కార్యక్రమం ద్వారా అమలవుతాయని తెలిపారు. అధికార వికేంద్రీకరణ, సమష్టి నిర్ణయాలు, పారదర్శకత, జవాబుదారీతనం, సాధికారత, ప్రోత్సాహకాలు, ప్రజల భాగస్వామ్యంతో ప్రాధాన్య అంశాల నిర్ణయం, సమ్మిళిత సమీకృత అభివృద్ధి గ్రామజ్యోతి కార్యక్రమం వల్ల ప్రజలు పొందే ఫలాలని ఆయన వివరించారు. సమగ్రంగా అభివృద్ధి చెందిన గ్రామాలు ఇంద్రధనస్సులై వెల్లివిరిసి బంగారు తెలంగాణ ఆవిష్కృతమవుతుందని సీఎం తన సందేశంలో ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ మహోన్నత ప్రయత్నంలో ప్రతి ఒక్కరం భాగస్వాములమవుదామని ప్రజలకు సీఎం పిలుపునిచ్చారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.