Trs party logo

Telangana Rashtra Samithi

telangana talli img

గ్రామాలకు నిరంతర వైద్యసేవలు

-ఆరోగ్య తెలంగాణ సాధించుకుంటాం -ఉప ముఖ్యమంత్రి రాజయ్య స్పష్టీకరణ -వైద్య రంగానికి సర్కార్ పెద్దపీట: హోంమంత్రి నాయిని -గాంధీని నిమ్స్ తరహాలో అభివృద్ధి చేయాలి: ఎంపీ దత్తాత్రేయ -ఘనంగా గాంధీ మెడికల్ కాలేజీ వజ్రోత్సవ వేడుకలు

DR-Rajaiah

తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాలకు నిరంతర ప్రభుత్వ వైద్య సేవలందిస్తామని, ఇందుకోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను పటిష్ఠ పరుస్తామని ఉప ముఖ్యమంత్రి, వైద్యారోగ్యశాఖ మంత్రి తాటికొండ రాజయ్య తెలిపారు. మండల కేంద్రాల్లో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆధునీకరించి 24 గంటలపాటు వైద్య సేవలను అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని చెప్పారు. సికింద్రాబాద్‌లోని గాంధీ మెడికల్ కాలేజీ 60వ వార్షికోత్సవం సందర్భంగా ఆదివారం వజ్రోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. ఉప ముఖ్యమంత్రి రాజయ్య, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి,భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు, ఎంపీలు కే కేశవరావు, బూరనర్సయ్యగౌడ్, బండారు దత్తాత్రేయ, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఈ వేడుకలను ప్రారంభించారు. గాంధీ దవాఖానా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తెలంగాణ జాతిపిత ప్రొఫెసర్ జయశంకర్‌సార్ విగ్రహాన్ని రాజయ్య ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా రాజయ్య మాట్లాడుతూ.. సీమాంధ్ర పాలనలో వివక్షకు గురైన వైద్యారోగ్యశాఖను పటిష్ఠ పరిచేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ చూపిస్తున్నారని తెలిపారు. మండలంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను, నియోజకవర్గంలో 100 పడకల దవాఖానాను, ప్రతి జిల్లాలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలతో వైద్య కళాశాలను ఏర్పాటుచేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. అవసరమైన మేరకు వైద్యులను, వైద్య సిబ్బందిని భర్తీ చేస్తామన్నారు. సమాజంలో వైద్య వృత్తికి చాలా గౌరవముందని, వైద్యో నారాయణ హరి అని ప్రజలు కొలుస్తారని చెప్పారు. ఉప ముఖ్యమంత్రి పదవి కంటె పిల్లల వైద్యుడిగా తన జీవితం ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు. ప్రైవేటు దవాఖానాలకు రోగులు రావాలని అక్కడి వైద్యులు కోరుకుంటే.. ప్రభుత్వ వైద్యులు మాత్రం దవాఖానాలకు రోగులు రావద్దని కోరుకుంటున్నారని చురకలంటించారు. వైద్యవృత్తిలో సహనం, నిబద్ధతలేనివారు ప్రజా వైద్యులు కాలేరని పేర్కొన్నారు. జూనియర్ వైద్యులు గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే విషయమై మినహాయింపు కోరడం సమంజసం కాదన్నారు.

గ్రామీణ ప్రాంతాల్లో ఉచిత వైద్య శిబిరాలకు బదులుగా ఉచిత వైద్య ఆరోగ్య అవగాహన శిబిరాలను ఏర్పాటుచేస్తే ప్రజలు ప్రాథమిక దశలోనే రోగాలను బారిన పడకుండా చూడవచ్చునని పేర్కొన్నారు. తద్వారా ఆరోగ్య తెలంగాణను సాధించుకోవచ్చునన్నారు. సీమాంధ్ర పాలకుల నిర్లక్ష్యం వల్ల తెలంగాణ 200 మెడికల్ సీట్లను కోల్పోయిందని, వచ్చే ఏడాది వాటిని తిరిగి తెచ్చుకునేందుకు ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని చెప్పారు. రాష్ట్ర సాధన ఉద్యమంలో వైద్యుల పాత్ర చాలా కీలకమన్నారు. బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అహర్నిశలు శ్రమిస్తున్నారని, వైద్యారోగ్యశాఖను తెలంగాణ ప్రభుత్వానికి మణిహారంగా నిలబెట్టేందుకు వైద్యులు, సిబ్బంది తోడ్పాటునందించాలని రాజయ్య కోరారు. జయశంకర్‌సార్ జీవిత కాలమంతా తెలంగాణ సాధన కోసం ధారపోశారు. ఆరో తరగతి చదవే వయసులోనే పాఠశాలలో నిజాంకు అనుకూలంగా గేయం పాడకుండా.. వందేమాతర గీతం పాడిన మహానుభావుడు. అనేక సందర్భాల్లో తెలంగాణ అస్తిత్వాన్ని చాటిచెప్పారు అని రాజయ్య కొనియాడారు.

నవ తెలంగాణ, బంగారు తెలంగాణను సాధిస్తేనే జయశంకర్‌సార్ ఆశయం నెరవేర్చినట్లవుతుందన్నారు. హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. పోరాడి సాధించికున్నా తెలంగాణను అన్ని వర్గాలు కలిసికట్టుగా అభివృద్ధి చేసుకుందామన్నారు. హైదరాబాద్‌లోని సనత్‌నగర్‌లో అత్యాధునిక సూపర్ స్పెషాలిటీ దవాఖానా నిర్మాణానికి క్యాబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్‌ను ఒప్పిస్తానని హామీనిచ్చారు. సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ..తెలంగాణలో ఎయిమ్స్‌లాంటి అత్యాధునిక ఆస్పత్రి నిర్మాణానికి కేంద్రం అంగీకరించిందన్నారు. తెలంగాణ ఉద్యమానికి అడ్డగా నిలిచిన గాంధీ దవాఖానాను నిమ్స్ తరహాలో ఆధునీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్, రాజ్యసభ సభ్యులు కే కేశవరావు మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం ఆరోగ్యానికి పెద్దపీట వేస్తున్నదన్నారు. ఎంపీ బూరనర్సయ్యగౌడ్ మాట్లాడుతూ.. గాంధీ దవాఖానాను అత్యున్నత మెడికల్ కేంద్రంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి గాంధీ వైద్య కళాశాల పూర్వ విద్యార్థి, అర్గ్గనైజింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ లింగయ్య అధ్యక్షత వహించగా, డీఎంఈ పుట్టా శ్రీనివాస్, అన్వర్ ఉల్ ఉలూమ్ విద్యాసంస్థల కార్యదర్శి మహబూబ్ ఆలంఖాన్, గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీలత, దవాఖానా సూపరింటిండెంట్ డాక్టర్ అశోక్‌కుమార్, కళాశాల వైస్‌ప్రిన్సిపాల్ మహేశ్‌చంద్ర, అర్‌ఎంవో-1 డాక్టర్ ప్రమీల, టీజీడీఏ గాంధీ యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రవణ్‌కుమార్, డాక్టర్ సిద్దిపేట రమేశ్, అనస్థీషియా అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఉపేందర్‌గౌడ్, స్థానిక కార్పొరేటర్ ఏసూరి సావిత్రి, అలుమిని కో చైర్మన్ డాక్టర్ ప్రభాకర్‌శర్మ, కార్యనిర్వహక కార్యదర్శి డాక్టర్ రమేష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ విద్యార్థులు జయ జయహే తెలంగాణ గీతాన్ని ఆలపించి ఆహూతులను అలరించారు. అంతకుముందు గాంధీ ఆవరణలోనే డిప్యూటీ సీఎం రాజయ్య అలుమిని విద్యా కేంద్రాన్ని ప్రారంభించారు. డాక్టర్ టీ యాదయ్య స్మారక హాలు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

విద్యార్థులకు బంగారు పతకాల ప్రదానం గాంధీ మెడికల్ కాలేజీలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను బంగారు పతకాలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. 2009 బ్యాచ్ విద్యార్థులైన తడక సాయికుమార్ (జనరల్ మెడిసిన్), తిరుమణిశెట్టి ప్రత్యూష (జనరల్‌సర్జరీ), సాగిలి సుస్మిత (ఓబీజీ), కాకుమాను హరిప్రియ (పీడియాట్రిక్), 2010లో ప్రవేశం పొందిన పొట్లూరి అన్విత (ఈఎన్‌టీ), బీ శ్రేయ (అఫ్తమాలాజీ), సబిహనాజ్ (ఎస్‌పీఎం), 2011లో చేరిన విద్యార్థులైన గద్ద వెంకటమహిసుధ (పార్మాకాలజీ), మేఘనరెడ్డి (మైక్రోబయలాజీ), అమ్రీన్ (పాథాలాజీ), అమ్రీన్(ఫోరెన్సిక్ మెడిసిన్), ఎంబీఎంసీ మొదటి సంవత్సరం విద్యార్థులైన జువ్వాడి నైనిక (అనాటమీ), సైదాసరా (ఫిజీయాలాజీ), పువ్వాడ ప్రశాంత్ (బయోకెమిస్ట్రీ)లకు బంగారు పతకాలు అందజేశారు. పతకాలు అందించేందుకు కాలేజీ పూర్వ విద్యార్థులు, పలువురు వైద్యుల సహకారం అందించారు. అత్యధిక మార్కులు సాధించిన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మెరిట్ పేరిట గోల్డ్‌మోడల్‌ను వచ్చే ఏడాది నుంచి తాను ప్రదానం చేయనున్నట్టు అలుమిని చైర్మన్ డాక్టర్ లింగయ్య ప్రకటించారు.

MAKE A DONATION NOW

Every contribution you make can make a difference.

Please contribute generously to the TRS Party.