-గ్రామజ్యోతిపై అవగాహన సదస్సులో మంత్రి ఈటల రాజేందర్ -ఎంపీటీసీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ

గ్రామస్తుల అభిప్రాయాల మేరకే గ్రామజ్యోతిలో అభివృద్ధి ప్రణాళికలు తయారు చేయాలని ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్ సూచించారు. గ్రామసభ ఆమోదంతో సమస్యలను పరిష్కరించాలని, అప్పుడు ప్రజలకు విశ్వాసం పెరుగుతుందన్నారు. గురువారం కరీంనగర్‌లోని పద్మనాయక కల్యాణ మండపంలో గ్రామజ్యోతిపై నోడల్ అధికారులు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు, ఎంపీపీలకు రెండు విడుతలుగా అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ ప్రజల భాగస్వామ్యంతోనే గ్రామాల సమగ్రాభివృద్ధి సాధ్యమని, అందరినీ భాగస్వాములను చేస్తూ ప్రభుత్వం గ్రామజ్యోతిని రూపొందించిందన్నారు. ప్రజల సంఘటిత శక్తితో ఏదైనా సాధించవచ్చని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేసి విజయవంతం చేయాలన్నారు. నిధులు, విధులు కేటాయించాలంటూ జెడ్పీటీసీ, ఎంపీటీసీలు మంత్రికి విన్నవించారు. ఎంపీటీసీలకు గౌరవం కల్పించాలన్న ఉద్దేశంతోనే ఇప్పటికే ప్రభుత్వం గౌరవ వేతనాలు పెంచిందన్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో చీఫ్‌విప్ కొప్పుల ఈశ్వర్, జెడ్పీ చైర్పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్యేలు గంగుల కమలాకర్, మనోహర్‌రెడ్డి, బొడిగె శోభ, కలెక్టర్ నీతూప్రసాద్, ఏజేసీ నాగేంద్ర పాల్గొన్నారు.